ఆపరేషన్ సిందూర్ : పార్లమెంట్‌లో జరిగిన చర్చలో రాజ్‌నాథ్ ఏం చెప్పారు, విపక్షాలు ఏమన్నాయి?

ఫొటో సోర్స్, Sansad TV
పహల్గాం దాడి, 'ఆపరేషన్ సిందూర్'పై పార్లమెంటు వర్షకాల సమావేశాలలో సోమవారం చర్చ మొదలైంది.
చర్చను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ మనసులోని అపోహలను 'ఆపరేషన్ సిందూర్' తొలగించిందన్నారు.
అంతకుముందు బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల నినాదాల మధ్య సభాకార్యకలాపాలు వాయిదాపడ్డాయి.


ప్రభుత్వం పహల్గాం దాడి, 'ఆపరేషన్ సిందూర్' గురించి చర్చించాలనుకోవడం లేదని, దేశానికి నిజం చెప్పాలనుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు.
అయితే మధ్యాహ్నం లోక్‌సభలో పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చ మొదలైంది. ప్రభుత్వం తరపున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు.
ఈ చర్చలోపాల్గొన్న ముఖ్య నేతలు ఏం మాట్లాడారు?

''పాకిస్తాన్‌తో ఎటువంటి ఘర్షణ లేదు. ఇది నాగరికతకు, ఆటవికతకు మధ్య ఘర్షణ. మన సార్వభౌమత్వానికి హాని తలపెట్టాలని చూసేవారికి సరైన సమాధానమిస్తాం.
మనం యుద్ధాన్ని కోరుకోం. మనది బుద్ధుడి మార్గం. ఈరోజుకీ పాకిస్తాన్ సుసంపన్నంగా ఉండాలనే కోరుకుంటున్నాం. చర్చలు, ఉగ్రవాదం ఒకే ఒరలో ఇమడలేవు. దీనిపై నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉంది.
పాకిస్తాన్‌తో శాంతి నెలకొల్పడానికి మా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు, 2025లో ఆపరేషన్ సిందూర్ తరువాత శాంతి స్థాపనకు మేం మరో మార్గాన్ని ఎంచుకున్నాం.
పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం అనేది.. పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగం. ఇది పాకిస్తాన్, దాని సంస్థలు అనుసరించే ఓ సాధనం'' అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sansad TV

''మేం ప్రభుత్వానికి శత్రువులం కాము. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో ఈరోజుకీ మేం ప్రభుత్వంతోనే ఉన్నాం, కానీ నిజమేమిటో బయటకు రావాలి. హోం మంత్రి నైతిక బాధ్యత తీసుకుంటారని, ప్రధానమంత్రి ఈ సంఘటనకు సంబందించి పూర్తి సమాచారం ఇస్తారని ఆశించాం.
మేమంతా ఐక్యంగా ప్రధాని మోదీకి మద్దతు ఇచ్చాం. దేశం మొత్తం మోదీతో ఉంది. కానీ మే 10న కాల్పుల విరమణ జరిగినట్టు వార్తలు వచ్చాయి. అలా ఎందుకు జరిగింది? ముందుగా 21 లక్ష్యాలను ఎంపిక చేసుకుని తరువాత తొమ్మిదింటిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు?
నిజంగానే పాకిస్తాన్ మోకాళ్లపై కూర్చోవడానికి సిద్ధపడితే మీరేందుకు ఆపేశారు. ఎందుకు తలవంచారు, ఎవరికి లొంగిపోయారు?
యుద్ధాన్ని ఆపేశామని అమెరికా అధ్యక్షుడు 26సార్లు చెప్పారు. ఐదారు జెట్లను కూల్చివేశారని ట్రంప్ చెప్పారు. ఎన్ని జెట్లను కూల్చివేశారో చెప్పగలరా?’’ అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.

ఫొటో సోర్స్, Sansad TV

''క్రికెట్‌లో ఓ ఆటగాడు 90 పరుగులపై ఉన్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ అలా ఇన్నింగ్స్ ముగించేయమని ఎవరైనా చెప్పారు అంటే అది మోదీజీ తప్ప మరెవరూ అలాంటి పని చేయలేరు. మోదీజీ దయచేసి క్రికెట్ మ్యాచ్‌లో జోక్యం చేసుకోకండి.
140 కోట్లమంది ప్రజలు యుద్దం చేయమని చెబుతుంటే.. మీరు యుద్ధం ఆపేశారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు.
ప్రధానమంత్రి జీ... మీ 'ఎక్స్' ఖాతాలో ఒక్కసారికూడా '' మిస్టర్ ప్రెసిడెంట్ మీరు చెప్పింది తప్పు'' ఎందుకు రాయలేదు.
అందుకు మీకు ధైర్యం సరిపోలేదా? అమెరికా అధ్యక్షుడికి ఎందుకు అంతగా భయపడుతున్నారు, చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు.
మీరు అన్నిచోట్లా బ్రాండింగ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు 'ఆపరేషన్ సిందూర్' అనే బ్రాండింగ్ చేశారు''
అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు.

ఫొటో సోర్స్, Sansad TV

''గౌరవ్ గొగోయ్ ప్రసంగం విన్నాను. ఆయన ఒక్క ఉపయోగకరమైన పదం కూడా మాట్లాడలేదు. ఆయన ఒక్కసారి కూడా మన సాయుధ బలగాలను పొగడలేదు.
మీరు దేశభక్తి గురించి మాట్లాడతారు. ఎన్ని విమానాలు పడ్డాయి, ఎన్ని క్షిపణులు పడ్డాయో చర్చిస్తున్నారు. మీ దృష్టిలో ఈ దేశ సైనికులకు ప్రాముఖ్యం లేదా?
మీరు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారు, మోదీ దేశం కోసం రాజకీయాలు చేస్తారు, ఇదీ తేడా. మే 6, 7 తేదీల్లో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను చూసి పాకిస్తాన్ నివ్వెరపోయింది'' అన్నారు జేడీయూ ఎంపీ లలన్ సింగ్.

ఫొటో సోర్స్, Sansad TV

'నేను కొన్ని రోజులు మంత్రిగా ఉన్నాను. ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించడానికి నేను కశ్మీర్ వెళ్లాను. ఆ రోజు, సాయుధ సైనికులు ప్రతిచోటా ఉన్నారు.
కానీ ఆరోజు ఏం జరిగింది? ఆ రోజు పహల్గాంలో సాయుధ సైనికులెవరూ లేరు. మన టూరిస్టులు వచ్చేచోట కనీసం పోలీసులు కూడా లేరా? అక్కడ సైనికులు ఉండకూడదని ఎవరు ఆదేశించారు? అక్కడి నుంచే విచారణ ప్రారంభించాలి.
అక్కడి నుంచి పాకిస్తాన్ ఎంత దూరంలో ఉంది, ఈ ఉగ్రవాదులు నేపాల్ నుంచి అక్కడికి వెళ్లారా?
జైషే -ఎ - మహమ్మద్ పుల్వామాలో చేసిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు, దీనిపై ఈరోజు దాకా ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ఇప్పటి వరకు వారిని పట్టుకోలేదు.
దాన్ని 'సిందూర్' అని పిలుస్తూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. ఎవరి సిందూరాన్ని లాక్కుపోయారు, అది మా సోదరీమణుల నుంచి లాక్కున్నారు. సిందూరాన్ని అపహరించిన వారిని ఇప్పటి వరకు మీరు పట్టుకోలేకపోయారు’’ అన్నారు శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్.

ఫొటో సోర్స్, Sansad TV

''పహల్గాం దాడి తర్వాత స్పష్టమైన, బలమైన, సాహసోపేతమైన సందేశాన్ని పంపడం చాలా ముఖ్యం. హద్దులు దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేయాల్సి వచ్చింది.
తొలి అడుగుగా ఏప్రిల్ 23న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా విరమించుకునే వరకు 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రాథమిక చర్యలు తీసుకున్నప్పటికీ, పహల్గాం దాడిపై భారత్ ప్రతిస్పందన ఇక్కడితో ఆగిపోదని స్పష్టమైంది. దౌత్య, విదేశాంగ విధాన కోణంలో పహల్గాం దాడి గురించి ప్రపంచానికి సరైన సమాచారం అందించడమే మా పని.
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాద చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశాం. పాకిస్తాన్‌లో ఉగ్రవాద చరిత్రను, జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, భారత ప్రజల్లో మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ఈ (పహల్గామ్) దాడి ఎలా జరిగిందో వివరించాం'' అన్నారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.

ఫొటో సోర్స్, Sansad TV

''ఈ రోజు నేనీ సభలో కోపం, బాధ, అవమానంతో నిల్చున్నాను. కాల్పుల విరమణ ఉత్తర్వులు తమ దేశ ప్రధాని నుంచి కాకుండా విదేశీయుడి నుంచి అందుకునేలా సైనికులను అవమానించారు.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల బాధ, పహల్గాంలో ఉగ్రవాదులను పట్టుకోలేకపోయిన ప్రభుత్వం, వారి గురించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరు దేశభక్తితో కూడుకున్నదిగా అనిపించినా వాస్తవానికి అది ప్రభుత్వం మీడియాలో చేసిన తమాషా మాత్రమే.
ఈ ఆపరేషన్ లో ఏం సాధించారో ఎవరూ చెప్పడం లేదు. ఎంతమంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు, మన యుద్ధ విమానాల్లో ఎన్ని కూల్చివేశారు, ఎవరి తప్పు, బాధ్యులెవరు, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.
ఈ ప్రభుత్వం ఏ ప్రశ్నలూ వినడానికి ఇష్టపడటం లేదు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయకుల చితి దేశ ప్రధాని బీహార్ లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించడానికి వెళ్లినప్పుడు కూడా చల్లారలేదు'' అన్నారు కాంగ్రెస్ ఎంపీ పరిణితీ సుశీల్‌కుమార్ శిందే.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














