నోరు తెరుచుకుని ఎందుకు నిద్రపోతారు, ఇది ఏదైనా వ్యాధికి సంకేతమా?

నిద్ర, ఆరోగ్యం, వ్యాధి, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చందన్ కుమార్ జజ్వారె
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనకి వివిధ రకాల నిద్ర అలవాట్లు ఉంటాయి. కొంతమంది తల కింద మందపాటి దిండు పెట్టుకుని నిద్రపోతే, ఇంకొందరు సన్నని దిండు పెట్టుకుని నిద్రపోతారు.

వాతావరణం ఎలా ఉన్నా, కొందరికి దుప్పటి కప్పుకోకపోతే నిద్రపట్టదు, లేదంటే దుప్పటి లేకుండా పడుకోవడానికి వారు ఇష్టపడరు.

అయితే నిద్రలోకి జారుకున్నతర్వాత, మనకి తెలియకుండానే కొన్ని పనులు చేస్తాం.

వీటిలో నోరు తెరుచుకుని నిద్రపోవడం కూడా ఒకటి. నిద్రపోతున్నప్పుడు మీ నోరు తెరిచి ఉంటుందా? నోరు తెరిచి నిద్రపోతున్నారని మీకు ఎవరైనా చెప్పారా?

అయితే, ఈ స్టోరీలో నోరు తెరిచి నిద్రపోవడం దేనికి సంకేతం, ఇది ఏవైనా ఆరోగ్య ప్రమాదాలను కూడా సూచిస్తుందా? అన్న విషయాలు తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిద్ర, ఆరోగ్యం, వ్యాధి, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సాధారణంగా కొంతమంది పిల్లలు నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఉంచుతారు. దీని వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)

నోరుతెరిచి నిద్రపోవడం

చాలాసార్లు శ్రమతో కూడిన లేదా బరువైన పనులు చేస్తున్నప్పుడు మనుషులకి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. దీని కోసం నోరు, ముక్కు రెండింటి ద్వారా గాలి పీల్చుకుంటారు.

పరిగెడుతున్నప్పుడు లేదా ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడేప్పుడు మనుషులు నోటి ద్వారా గాలి పీల్చుకుంటూ ఊపిరి తీసుకోవడం కనిపిస్తుంది.

సాధారణంగా నిద్రపోతున్నప్పుడు, మన కళ్లతో పాటు నోరు కూడా మూసుకుపోతుంది.

మనం నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారానే గాలి పీల్చుకుంటాం. ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటాం కాబట్టి వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు.

కానీ, చాలా మంది నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచే ఉంచుతారు. నిజానికి, ఆ సమయంలో వారు నోటి ద్వారానే శ్వాస తీసుకుంటారు.

దీని వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్)లోని పల్మనరీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ విజయ్ హడ్డాతో బీబీసీ మాట్లాడింది.

"నోరు తెరిచి నిద్రపోవడం సాధారమైన విషయం. చాలా మంది ఇలాగే నిద్రపోతారు. ఇది ఏ వ్యాధికీ సంకేతం కాదు" అని డాక్టర్ విజయ్ హడ్డా వివరించారు.

"ముక్కులో ఏదైనా సమస్య ఉన్నా లేదా ముక్కు మూసుకుపోయినా, నోటిని ఉపయోగించి శ్వాస తీసుకుంటారు" అని ఆయన తెలిపారు.

ఈఎన్‌టీ పరీక్ష

బాగా జలుబు చేసినప్పుడు సాధారణంగా ముక్కు మూసుకుపోతుంది. కానీ కొన్నిసార్లు, టాన్సిల్స్ పెరగడం వల్ల కూడా ముక్కు మూసుకుపోతుంది. ఇది పిల్లలలో ఎక్కువగా జరుగుతుంది.

పిల్లల్లో పెద్ద అడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడతాయి. దీనివల్ల వారి ముక్కులో కొంతమేర మూసుకుపోతుంది. అందుకే చాలా మంది పిల్లలు నోరు తెరిచి నిద్రపోతారు.

వయసు పెరిగే కొద్దీ టాన్సిల్స్ చిన్నవి అవుతాయి. ఈ అలవాటు నెమ్మదిగా పోతుంది.

నిద్ర, ఆరోగ్యం, వ్యాధి, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?

నోరు తెరిచి నిద్రపోవడానికి సెప్టం కార్టిలేజ్ కూడా ఒక కారణం కావొచ్చు.

ముక్కు నాళంలో ఒక ముఖ్యమైన భాగం సెప్టం. దీన్ని సెప్టం కార్టిలేజ్ అని కూడా పిలుస్తారు. ఇది ముక్కును రెండు భాగాలుగా విభజిస్తుంది.

"సెప్టమ్ కార్టిలేజ్ సహజంగా పూర్తిగా నిటారుగా ఉండదు, కొద్దిగా వంకరగా ఉంటుంది. అది మరింత వంకరగా మారితే ముక్కులోని ఒక భాగాన్ని అడ్డుకుంటుంది. దీన్నే డీవియేటెడ్ నాసల్ సెప్టం (డీఎన్ఎస్) అంటారు. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వస్తుంది" అని విజయ్ హడ్డా తెలిపారు.

ఈ సమస్య తీవ్రమైతే సెప్టోప్లాస్టీ ఆపరేషన్ ద్వారా నయం చేయొచ్చు.

కానీ, ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు నోరు తెరిచి ఉంచి, పెద్ద శబ్దం చేస్తూ శ్వాస తీసుకుంటున్నా లేదా గురక పెడుతున్నా వైద్యులను సంప్రదించడం మంచిది.

నిద్ర, ఆరోగ్యం, వ్యాధి, చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

వైద్య సలహా ఎప్పుడు అవసరం

"నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంది. ఇది నోటి పరిశుభ్రతను ప్రభావితం చేస్తుంది" అని దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న పల్మనరీ, క్రిటికల్ కేర్, స్లీప్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ రోహిత్ కుమార్ తెలిపారు.

ఒక వ్యక్తి నోరు తెరిచి నిద్రపోయే సమయంలో లేదా నోటితో గాలి తీసుకునే సమయంలో గురక వినిపిస్తే, అది వేరే ఏదైనా సమస్యకు సంకేతం కావొచ్చు అన్నది వైద్యుల అభిప్రాయం.

అటువంటి పరిస్థితిలో దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి.

"ఎవరికైనా దగ్గు, కఫం లేదా ఇతర సమస్యలు లేకపోయినా, నోరు తెరిచి నిద్రపోతే, ముందుగా ఈఎన్‌టీ(చెవి,ముక్కు,గొంతు సంబంధిత) పరీక్ష చేయించుకోవాలి. ఆ తరువాత అవసరాన్నిబట్టి మిగతా పరీక్షలు చేయించుకోవాలి"అని డాక్టర్ రోహిత్ కుమార్ అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)