వీధికుక్కలు, పశువులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలలో ఏముంది?

వీధి కుక్కలు

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ సంస్థలు, రైల్వే, బస్సు స్టాండ్‌ల వద్ద నుంచి వీధి కుక్కలను తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వీధికుక్కలు, పశువులను జాతీయరహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలనుంచి తరలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది.

అయితే దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.

కోర్టు మౌఖిక ఉత్తర్వులో మాత్రం, ''దీన్ని కచ్చితంగా పాటించాలి. లేదంటే అధికారులు వ్యక్తిగతంగా దీనికి బాధ్యులు అవుతారు'' అని హెచ్చరించింది.

ఆస్పత్రులు, విద్యాసంస్థలు, క్రీడాసముదాయాలు, రైల్వేస్టేషన్లు లాంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను గుర్తించి, ఆ ప్రాంతాలలోకి వీధికుక్కలు రాకుండా కంచె వేయాలని రాష్ట్రపభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది. ఇలాంటి ప్రాంతాలలోని వీధికుక్కలను అధికారులు తరలించాలని, వాటికి స్టెరిలైజేషన్ చేసి, వాటిని డాగ్ షెల్టర్లకు తరలించాలని తెలిపింది.

కొంతమంది న్యాయవాదులు ఈ ఆదేశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దానిని సవరించేందుకు విచారణ జరపాలని అభ్యర్థించారు. కానీ ఈ వినతిని ధర్మాసనం తిరస్కరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌.వి అంజారియాతో కూడిన ధర్మాసనం శుక్రవారం వీధికుక్కల కేసుపై తీర్పును వెలువరించింది.

విద్యా సంస్థలు, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రాంతాలలోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా కంచె వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని లైవ్ లా తెలిపింది.

ఈ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలదేనని, వాటికి టీకాలువేసి, స్టెరిలైజేషన్‌ చేసిన తర్వాత జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం వాటిని డాగ్ షెల్టర్లలో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.

కుక్క

ఫొటో సోర్స్, Getty Images

లైవ్ లా ప్రకారం.. ఈ ప్రాంతాల నుంచి తరలించిన కుక్కలను తిరిగి అక్కడే విడిచిపెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా చేయడం ద్వారా ఈ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తొలగించే లక్ష్యాన్ని చేరుకోలేమని కూడా కోర్టు తెలిపింది.

అయితే, ఈ ప్రాంతాలను స్థానిక పరిపాలనా సంస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ద్వారా సమస్య పునరావృతం కాకుండా ఉంటుందని కోర్టు పేర్కొంది. జాతీయ రహదారుల నుంచి పశువులను తరలించాలని ఆదేశించింది.

సుప్రీంకోర్టు అంతకుముందు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఈ ఏడాది జులైలోజస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్‌ మహాదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఒక వార్తా కథనాన్ని సుమోటోగా స్వీకరించి, వీధి కుక్కల అంశాన్ని విచారణకు స్వీకరించింది.

ఆగస్టు 11న ఈ కేసును విచారిస్తున్నప్పుడు, దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్ హోమ్‌కు తరలించాలని ఈ ఇద్దరు జడ్జీల ధర్మాసనం చెప్పింది.

కుక్క కాట్లు , రేబిస్ వ్యాధి పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

అప్పట్లో ఈ పనిని పూర్తి చేసేందుకు అధికారులకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది.

అయితే, జంతు ప్రేమికులు ఈ ఉత్తర్వును వ్యతిరేకించారు. ఈ ఉత్తర్వుపై సుప్రీంకోర్టులోనే కొందరు జంతు ప్రేమికులు ఫిర్యాదు దాఖలు చేశారు.

''కుక్కలను వీధుల నుంచి తరలించడమనేది శాస్త్రీయ విధానం కాదు, సమస్యకు శాశ్వతం పరిష్కారంఇది కాదు'' అని జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా తెలిపింది.

''ఒకవేళ దిల్లీ ప్రభుత్వం గతంలోనే సమర్థవంతంగా స్టెరిలైజేషన్ ప్రొగ్రామ్‌ అమలు చేస్తే, ఇవాళ వీధుల్లో కుక్కలు దాదాపుగా ఉండేవి కావు'' అని ఈ సంస్థ పేర్కొంది.

షెల్టర్ హోమ్‌లలో వీధి కుక్కలను బంధించే ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన త్రిసభ్యధర్మాసనం ఆ కుక్కలను అదే ప్రాంతంలో విడుదల చేయాలని పేర్కొంది.

అయితే, రేబిస్ ఉన్న లేదా రేబిస్ వచ్చే అనుమానమున్న కుక్కలను విడుదల చేయద్దని తెలిపింది.

సుప్రీంకోర్టు నిర్ణయంపై చాలామంది జంతు ప్రేమికులు, జంతు హక్కుల కార్యకర్తలు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేవమై హర్షం వ్యక్తం చేశారు.

కుక్కలు

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రాల్లో పరిస్థితేంటి?

ఏబీసీ రూల్స్ 2023కు అనుగుణంగా వీధి కుక్కలను, రేబిస్‌ను ఎదుర్కోవడంపై దేశంలో చాలా రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.

దేశంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో అత్యధికంగా వీధి కుక్కలు ఉన్నాయని మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ 2022లో పార్లమెంట్‌కు తెలిపింది. దాద్రా అండ్ నగర్ హవేలీ, లక్షద్వీప్, మణిపూర్‌లోని వీధుల్లో అసలు వీధి కుక్కలే లేవని చెప్పింది.

అయితే, 2012 ఏడాదితో పోల్చి చూస్తే 2019 నాటికి ఉత్తరప్రదేశ్‌లో వీధి కుక్కల సంఖ్య 20.59 లక్షలకు తగ్గిందని ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వీధి కుక్కల విషయంలో ఉత్తరప్రదేశ్ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో పర్యవేక్షణ లేకుండా ఆహారం పెట్టడం నిషేధం.

కేరళలో 2012తో పోలిస్తే 2019 నాటికి వీధి కుక్కల సంఖ్య పెరిగింది. అక్కడ సుమారు 2.89 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా.

వీధి కుక్కల దాడులను అరికట్టేందుకు, ఏబీసీ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఒక ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది.

మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో సమతుల్యమైన విధానాన్ని అమలు చేస్తోంది. ముంబయిలో వీధి కుక్కలకు, పిల్లులకు ఆహారం పెట్టడం చట్టబద్ధమైనప్పటికీ, అవి కేవలం ఎంపిక చేసిన, శానిటైజ్ చేసిన ప్రాంతాల్లోనే.

పర్యటకానికి ప్రసిద్ధి చెందిన గోవాలో కూడా వీధి కుక్కలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. దేశంలో తొలి రేబిస్ నియంత్రిత రాష్ట్రం గోవానే . 2017 నుంచి ఎలాంటి రేబిస్ కేసులు అక్కడ నమోదు కాలేదు. అయితే, 2023లో ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి మరణించాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)