పాకిస్తాన్: పెంపుడు పులులు, సింహాలను యజమానులు ఎందుకు దాచేస్తున్నారు?

- రచయిత, అజాద్ మోషిరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- నుంచి, లాహోర్
పాకిస్తాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన లాహోర్ శివారు ప్రాంతాల్లోని ఆ ఫామ్ హౌస్‌లో ఏదో అసాధారణమైనది ఉందనడానికి అక్కడ గాల్లో నుంచి వస్తున్న వాసనే తొలి సంకేతం.
లోపలికి వెళ్లిచూస్తే, విషయం ఏమిటో తెలిసిపోతుంది... 26 సింహాలు, పులులు, వాటి పిల్లల నివాసం అది. వాటి యజమాని ఫయాజ్. వర్షం వల్ల అక్కడ నేలంతా బురదగా మారింది. కానీ జంతువులు అక్కడ సుఖంగా ఉన్నాయని ఫయాజ్ చెప్పారు.
''అవి మమ్మల్ని చూడగానే దగ్గరకు వస్తాయి. పెట్టింది తింటాయి. అవి క్రూరంగా వ్యవహరించవు'' అన్నారు ఆయన.
అంతలోనే ఓ సింహం గర్జించింది.
''అదొకటి దూకుడుగా ఉంటుంది. అది దాని స్వభావం'' అన్నారు ఫయాజ్.


ఫొటో సోర్స్, Fayyaz
అధికారానికి, హోదాకు చిహ్నంగా...
ఫయాజ్‌కు పెద్దపులులంటే చాలా ఇష్టం. 38 ఏళ్ల ఫయాజ్ పదేళ్లుగా సంతానోత్పత్తి పులిజంటలను, పిల్లలను విక్రయిస్తున్నారు. పాకిస్తాన్‌లోని అతిపెద్ద సింహాల వ్యాపారుల్లో ఆయన ఒకరుగా పేరుపడ్డారు . అలాగే ఆయన వన్యమృగాల నివాసం కూడా బహుశా దేశంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నవాటిలో అదే పెద్దది
సింహాలు, పులులు, ప్యూమాలు, చీతాలు, చిరుతపులులు... ఈ వన్య మృగాలను దశాబ్దాలుగా దేశంలో రాజకీయ నాయకులు సహా పలువురు తమ హోదాకు, అధికారానికి చిహ్నంగా భావిస్తున్నారు.
అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లింలీగ్ (నవాజ్) పార్టీ చిహ్నం పెద్ద పులి.
ఇటీవల కాలంలో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి షార్ట్ వీడియోల సోషల్ మీడియా యాప్స్ విస్తృతమవడంతో వన్యమృగాల యాజమాన్యంలోనూ పెరుగుదల కనిపిస్తోంది.
కొన్నిసార్లు వివాహ కార్యక్రమాలకు కూడా సింహాలను వెంటబెట్టుకొని వస్తున్నారు.

ఫొటో సోర్స్, Screengrab/BBC
పెంపుడు సింహం దాడితో పాక్ కఠిన చర్యలు...
పెంపుడు సింహం ఒకటి తప్పించుకొని లాహోర్‌లోని ఓ వీధిలో నడిచివెళ్తున్న ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలపై దాడి చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీని ప్రభావం ఇప్పటికే ఫయాజ్ వంటి వ్యక్తులపై పడుతోంది.
కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఒక్కో జంతువుకు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 50 వేల పాకిస్తానీ రూపాయలు (176 డాలర్లు) కచ్చితంగా చెల్లించాలి. రెండు రకాల జంతువులను మాత్రమే పెంచుకోవాలి. రెండుజాతులకు కలిపి పదికి మించకుండా చూసుకోవాలి.
ఈ ప్రదేశాలను ప్రజలు సందర్శించేందుకు కచ్చితంగా తెరిచి ఉంచాలి.
ఈ కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే 2 లక్షల పాకిస్తానీ రూపాయల వరకు జరిమానా విధిస్తారు. తీవ్రమైన నేరాలకైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష తప్పదు.

ఖాళీ అవుతున్న కేజ్‌లు...
లాహోర్ శివారులోనే మరో ఫామ్‌హౌస్‌లో ఐదు పిల్ల సింహాలు కనిపించాయి. వాటి శరీరం మట్టికొట్టింది. కేజ్ చుట్టూ తిరుగుతున్నాయి.
''వాటి తల్లిదండ్రులు ఏమయ్యాయి?'' అని ఒక వైల్డ్ లైఫ్ అధికారి తనలో తానే ప్రశ్నించుకున్నారు.
సమీపంలో, పలు ఖాళీ కేజ్‌లు ఉన్నాయి.
అనుమతి లేకుండా ఇక్కడ ఓ వ్యక్తి సింహాలను, వాటి పిల్లలను అక్రమంగా అమ్మకానికి పెంచుతున్నారని వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం అందింది. వారు చేరుకున్న సమయానికి, ఆ యజమాని తన సంరక్షకుడికి బ్యాగ్ ఇచ్చి అక్కడ నుంచి పరారయ్యారు.
''నన్ను రెండు వారాల క్రితమే నియమించుకున్నారు'' అని ఆయన చెప్పారు. ఆయనను విచారణ నిమిత్తం అధికారులు తీసుకువెళ్లారు. పిల్ల సింహాల తల్లిదండ్రులను ఆ ఫామ్ యజమానే దూరంగా తీసుకెళ్లి దాచిపెట్టి ఉంటాడని అధికారులు సందేహిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న పిల్ల సింహాలను లాహోర్‌లోని జూకు తరలించారు. వైద్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఉంచారు.
దాడులు ఫలితమివ్వట్లదా?
పులుల విక్రయం దశాబ్దాలుగా సాగుతున్న పాకిస్తాన్‌లో ఇప్పడీ దాడులు ఫలితమివ్వడంలేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే వెల్లడికాని పెద్ద పులులు వందల సంఖ్యలో ఉంటాయని నమ్ముతున్నారు.
స్వచ్ఛందంగా వెల్లడించని సింహాలు పంజాబ్‌లోనే 30 నుంచి 40 శాతం ఉంటాయని వైల్డ్ లైఫ్ అండ్ పార్క్స్ డైరెక్టర్ జనరల్ ముబీన్ ఇల్లాహి భావిస్తున్నారు. ''ఇది పూర్తికావడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది'' అని బీబీసీతో అన్నారు.
అక్కడ మరో సమస్య ఉంది. పులుల సంతోనోత్పత్తి పాకిస్తాన్‌లో సర్వసాధారణ విధానమైందని, కొన్ని పెద్ద పులులను చంపాల్సి రావచ్చని ముబీన్ చెప్పారు. ''వాటికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. విధివిధానాలను మేం పరిశీలిస్తున్నాం'' అన్నారు.
గత ఏడాది డిసెంబరులో లాహోర్‌లోనే తప్పించుకున్న సింహాన్ని కాల్చి చంపిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తదుపరి ఏంచేయాలో....
ఫయాజ్ తన ఫామ్ హౌస్‌ను తదుపరి ఏంచేయాలా అని ఆలోచిస్తున్నారు.
వన్యమృగాల కేజ్‌ల సైజ్‌పై ఒక అధికారి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆ ఫామ్‌లను జూ మాదిరిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన బీబీసీతో అన్నారు.
ఆ విధంగా చేయడానికి ఫయాజ్‌కు ఇప్పుడు మూడు నెలల గడువు ఉంది.
ఆ జంతువులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని జంతు హక్కుల సంఘాలు భావిస్తున్నాయి.
''జూ కాదు, మేం అభయారణ్యాలనే కోరుతున్నాం. ఒక క్రమబద్ధమైన పరిష్కారం కావాలి. అంతరాలు కాదు'' అని ఆల్తమష్ సయీద్ బీబీసీతో అన్నారు. జూలో పరిస్థితులపై మరింత పారదర్శకత అవసరమని, పెద్ద పులుల ప్రైవేట్ యాజమాన్య సమస్యకు తగిన పరిష్కారం చూపించాలని అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














