టిబెట్‌లో చైనా నిర్మిస్తున్న అతిపెద్ద డ్యామ్‌ను ‘భారత్‌పై వాటర్ బాంబ్’అని ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టెస్సా వాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను చైనా అధికారులు టిబెట్ భూభాగంలో నిర్మించడం ప్రారంభించారు. ఇది భారత్, బంగ్లాదేశ్‌లలో ఆందోళనలను రేకెత్తించింది.
యార్లుంగ్ త్సాంగ్పో నదిపై చైనా దీన్ని నిర్మిస్తోంది. శనివారం జరిగిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చైనా ప్రధాని లి కియాంగ్ హాజరైనట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
ఈ నది టిబెటన్ పీఠభూమి గుండా ప్రవహిస్తుంది. నది దిగువన భారత్, బంగ్లాదేశ్‌లోని లక్షలాది మంది ప్రజలను ఈ ప్రాజెక్టు ప్రభావితం చేస్తుందని, పర్యావరణానికి, స్థానిక టిబెటన్లకు హాని కలిగిస్తుందనే వాదనలున్నాయి.
అయితే, దాదాపు రూ. 14.4 లక్షల కోట్లు (1.2 ట్రిలియన్ యువాన్లు) ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రకృతిని కాపాడుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయ పడుతుందని చైనా అంటోంది.
మోటువో హైడ్రోపవర్ స్టేషన్ అని పిలిచే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌గా మారుతుంది. చైనా ప్రస్తుత త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే కూడా ఇది పెద్దది. మోటువో దానికంటే మూడు రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ డ్యామ్ యార్లుంగ్ త్సాంగ్పో నదీ ప్రవాహాన్ని నియంత్రించడానికి లేదా మార్చడానికి చైనాకు వీలు కల్పిస్తుందని నిపుణులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలోకి, అలాగే బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. ఇది ఈ ప్రాంతాలలో సియాంగ్, బ్రహ్మపుత్ర, జమునా నదులుగా ప్రహహిస్తుంది.
"టిబెట్ పీఠభూమిలోని నదులపై చైనా నియంత్రణ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది'' అని ఆస్ట్రేలియన్ పరిశోధనా బృందం లోవీ ఇనిస్టిట్యూట్ 2020 నివేదికలో పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
ఇదొక వాటర్ బాంబ్: అరుణాచల్ ప్రదేశ్ సీఎం
ఈ నెల ప్రారంభంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ ''డ్యామ్ నిర్మాణం పూర్తయితే సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు చాలావరకు ఎండిపోవచ్చు'' అన్నారు.
''ఈ ప్రాజెక్ట్ మా తెగలకు, మా జీవన విధానానికి, ఉనికి ముప్పు కలిగించనుంది. ఎందుకంటే, చైనా దీనిని ఒక రకమైన వాటర్ బాంబ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు" అని పెమా అభిప్రాయపడ్డారు.
చైనా అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే, అది సియాంగ్ నది వెంబడి ఉన్న గ్రామాలను నాశనం చేయగలదని, ముఖ్యంగా ఆది తెగ వంటి సమూహాలకు హాని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో భారత్ ఏం చెప్పింది?
ప్రాజెక్టు విషయమై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనవరిలో చైనా వద్ద ఆందోళన వ్యక్తం చేసిందని, దిగువన నివసించే ప్రజలకు హాని జరగకుండా చూసుకోవాలని కోరిందని ఆ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇటువంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలో దిగువన ఉన్న దేశాలతో పారదర్శకత, సంప్రదింపుల అవసరాన్ని కూడా సూచించినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో, భారత్ తన ప్రజలను రక్షించుకోవడానికి సియాంగ్ నదిపై హైడ్రోపవర్ డ్యామ్ నిర్మించాలని యోచిస్తోంది.
చైనా అకస్మాత్తుగా తన ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తే వరద ముప్పునకు గురికాకుండా ఈ డ్యామ్ రక్షణగా పనిచేస్తుంది.
తన నదులపై డ్యామ్‌లు నిర్మించే చట్టపరమైన హక్కు తనకు ఉందని, దిగువన ఉన్న దేశాలపై ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చైనా చెప్పింది.
మరోవైపు, ప్రాజెక్టుపై బంగ్లాదేశ్ కూడా ఆందోళనలు వ్యక్తం చేసింది, ఫిబ్రవరిలో డ్యామ్ గురించి మరింత సమాచారం కోరుతూ చైనాకు ఒక లేఖ పంపింది.

ఫొటో సోర్స్, Getty Images
లోతైన లోయలో డ్యామ్
టిబెట్ అటానమస్ రీజియన్‌లోని ఈ ప్రదేశంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి చైనా అధికారులు చాలాకాలంగా ఆసక్తి చూపుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత లోతైనది, భూమిపై అతి పొడవైనదిగా భావిస్తున్న లోయలో ఈ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం టిబెట్‌లోని అతి పొడవైన నది అయిన యార్లుంగ్ త్సాంగ్పో, నామ్చా బార్వా అనే పర్వతం చుట్టూ యూటర్న్ తీసుకునే వెంబడి ఉంది.
ఈ మలుపును "గ్రేట్ బెండ్" అని పిలుస్తారు, ఈ మలుపు తీసుకునే క్రమంలో నది ఎత్తు వందల మీటర్లకు పడిపోతుంది. ఈ నదిలో కొంత భాగాన్ని మళ్లించడానికి నామ్చా బార్వా పర్వతం గుండా 20 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను తవ్వుతామని మునుపటి ప్రణాళికలో చైనా అధికారులు తెలిపారు.
ఇంజనీర్లు సొరంగాల ద్వారా నీటిని మళ్లించడం కోసం ఐదు మెట్ల లాంటి (క్యాస్కేడింగ్) విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి పని చేస్తారని చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా నుంచి వచ్చిన ఇటీవలి కథనం తెలిపింది. ఉత్పత్తి అయిన విద్యుత్‌లో టిబెట్‌లో కొంత, చైనాలోని ఇతర ప్రాంతాలకు ఎక్కువ భాగం పంపిస్తారని కూడా తెలిపింది.
దేశంలోని విద్యుత్ కొరత ఉన్న తూర్పు మహానగరాల కోసం భారీ ఆనకట్టలు, హైడ్రోపవర్ స్టేషన్లను నిర్మించడానికి చైనా టిబెటన్ ప్రాంతాలతో సహా పశ్చిమ ప్రాంతంలోని ఏటవాలు లోయలు, శక్తిమంతమైన నదులపై దృష్టి సారించింది.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ "షీడియాన్‌డోంగ్‌సాంగ్" అనే విధానం ద్వారా ఈ ప్రణాళికకు మద్దతు ఇచ్చారు, దీనర్థం "పశ్చిమం నుంచి తూర్పుకు విద్యుత్తును పంపడం".
ఈ డ్యామ్‌లు దేశానికి, స్థానిక ప్రజలకు ఉపయోగకరమని చైనా ప్రభుత్వం, దాని మీడియా చెబుతున్నాయి. డ్యామ్‌లు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, శక్తిని అందిస్తాయని, టిబెటన్ల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పాయి.
'టిబెట్ దోపిడీ'
టిబెటన్లను, వారి భూమిని బీజింగ్ దోపిడీ చేస్తోందనడానికి తాజా ఆనకట్టలే ఉదాహరణ అని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
గత సంవత్సరం, వందలాది మంది టిబెటన్లు మరొక ఆనకట్టకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం వారిలో చాలామందిని అరెస్టు చేసింది, కొంతమందిని తీవ్రంగా కొట్టినట్లు కొన్నివర్గాలు, ధ్రువీకరణ వీడియోల ద్వారా బీబీసీ తెలుసుకుంది.
జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన టిబెటన్ లోయలు ముంపునకు గురవడంతో పాటు, భూకంప ప్రమాదాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో డ్యామ్ లు నిర్మించడం వల్ల సంభవించే ప్రమాదాల గురించి కూడా ఆందోళనలు ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














