వీధి కుక్కలు ఎందుకు వెంటబడతాయి, అప్పుడు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
వీధికుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడంతో, ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయమైంది.
కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వశాఖ వద్దనున్న గణాంకాల ప్రకారం... కుక్కకాటు కేసులు ఏటా పెరుగుతున్నాయి.
రాజధాని దిల్లీ, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆగస్టు 11వ తేదీన తీవ్రంగా స్పందించింది.
దిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంరక్షణ కేంద్రాలు (షెల్టర్లు) ఏర్పాటుచేసి, వీధికుక్కలను అక్కడికి తరలించాలని దిల్లీ ప్రభుత్వాన్ని, దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ), న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ)లను ఆదేశించింది.
ఈ షెల్టర్లలో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ సౌకర్యాలతో పాటు సీసీ టీవీ కెమెరాలు ఉండాలని న్యాయమూర్తులు జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడి ధర్మాసనం స్పష్టంగా చెప్పింది.
రాజస్థాన్ హైకోర్టు కూడా ఆగస్టు 11వ తేదీనే అదే తరహాలో స్పందించింది. జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్ నగరాల్లో వీధికుక్కలతో పాటు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న ఇతర జంతువుల సమస్య తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత పాలకవర్గాలను ఆదేశించింది.


ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న కుక్కకాటు కేసులు
2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 21,89,909 కేసులు నమోదు అయ్యాయి. 2023 సంవత్సరంలో ఆ సంఖ్య 30,52,521కి పెరిగింది. తర్వాత 2024 సంవత్సరంలో 37,15,713 కేసులు నమోదు అయ్యాయి. 2025 జనవరి ఒక్క నెలలోనే 4,29,664 కేసులు నమోదయ్యాయని కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వశాఖ వెల్లండించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కుక్కకాటు సమస్య తీవ్రంగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2022 సంవత్సరంలో 1,92,360 కేసులు నమోదైతే 2024 నాటికి ఈ సంఖ్య 2,45,174కు చేరింది.
తెలంగాణలో అయితే 2022 సంవత్సరంలో 92,924 కేసులు నమోదుకాగా, 2024 నాటికి 1,21,997 కేసులు నమోదయ్యాయి.
ఇక దేశ రాజధాని న్యూదిల్లీలో 2022 సంవత్సరంలో 6,691 కేసులుంటే, తర్వాత వరుస సంవత్సరాల్లో అనూహ్యంగా పెరిగాయి.
2023 సంవత్సరంలో 17,874 కేసులు, 2024 సంవత్సరంలో 25,210 కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి?
కుక్కలు మనుషులపై దాడి చేయడానికి వాటిలోనున్న అభద్రతాభావమే కారణమని పశువైద్యులు అజయ్ సూద్ చెప్పారు.
''ప్రతీ కుక్క కొంతప్రాంతాన్ని తన అడ్డాగా భావిస్తుంది. ఇప్పుడు వాటి సంతతి కూడా వేగంగా పెరుగుతోంది. మరోవైపు మానవ జనాభా కూడా పెరిగిపోతోంది. దీంతో కుక్కల విస్తృతి ప్రదేశం తగ్గిపోతోంది. దీంతో వాటిలో అభద్రతాభావం నెలకొంటోంది. మనుషులు తమ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నారని భావిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అవి దూకుడుగా ప్రవర్తిస్తాయి’’ అని ఆయన వెల్లడించారు.
‘‘కొన్నిసార్లు ప్రజల్ని భయపెట్టడం కూడా కుక్కలు ఒక ఆటలా చూస్తాయి. అవి వెంటపడినప్పుడు ప్రజలు పరుగుపెడతారు. అది చూసి మానవులు తమకు భయపడుతున్నారని వాటికి అర్ధమవుతుంది. ఈ క్రమంలో అవి ఒక్కోసారి మనుషులపై దాడిచేసి కరుస్తాయి'' అని అజయ్ సూద్ వివరించారు.
ఉష్ణోగ్రతలు పెరగడం, తిండి దొరక్కపోవడం, పెద్ద శబ్ధాలు, ప్రకాశవంతమైన లైట్లు కారణంగా కూడా వీధుల్లో ఉండే కుక్కలు దూకుడుగా ప్రవర్తిస్తాయి.
గతంలో జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకుని కూడా కుక్కలు ఒక్కోసారి తీవ్రంగా వ్యవహరిస్తాయి. ఎవరైనా రాయితో కొడితే అవి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి.
వాహనాల వల్ల జరిగిన ప్రమాదాలలో అవి గాయపడినప్పుడు, ఆ అనుభవాన్ని గుర్తు పెట్టుకుని వాహనాలు వస్తున్నప్పుడు వాటిపై దాడికి ప్రయత్నిస్తాయి.
అయితే, కుక్కల ప్రవర్తన కచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పడం కూడా కష్టమే.

ఫొటో సోర్స్, Getty Images
వీధి కుక్కలు మిమ్మల్ని వెంబడిస్తే ఏమి చేయాలి?
వాహనాల మీద వెళుతున్నప్పుడు కుక్క మిమ్మల్ని వెంబడిస్తే, కొంచెం వేగంగా వెళ్లాలి. అప్పుడు కుక్క ఆగిపోతుంది. నడుస్తున్నప్పుడైతే మీ చేతిలో కర్ర లేదా ఏదైనా వస్తువు ఉండటం మంచిది. చాలా కుక్కలు దాడి చేయవు, మనుషుల్లో భయం కలిగించడానికి ప్రయత్నిస్తాయి.
శబ్దం చేసినా, వాటిని భయపెట్టే వస్తువును ఏదైనా చూపించినా కుక్కలు వెనక్కి తగ్గుతాయి. కుక్క మొరిగిందంటే అది మామూలు కుక్క కాదు, కాస్త దూకుడు ఉన్న కుక్క అన్నది మనం అర్ధం చేసుకోవాలి.
అప్పుడు మనం పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాలి.
పిల్లలను ఒంటరిగా వదిలివేయకూడదు. చాలా కుక్కలు ఒంటరిగా ఉన్న పిల్లలపై దాడి చేస్తాయి.
కుక్కలు గుంపులుగా ఉన్నప్పుడు వాటికి దగ్గరగా వెళ్లకపోవడం మంచిది.

ఫొటో సోర్స్, Getty Images
పెంపుడు కుక్కలూ కరుస్తున్నాయెందుకు?
పెంపుడు కుక్కలు దూకుడుగా ప్రవర్తించేలా వాటి యజమానులే తయారుచేస్తారని డాక్టర్ అజయ్ సూద్ చెప్పారు.
''రెండు, మూడు నెలల వయస్సున్న కుక్కపిల్లలు ప్రతీ వస్తువును నోటితో పట్టుకుంటాయి. ఆ సమయంలో యజమానులు వాటిని నోటితో పట్టుకోకుండా ఆపరు. అవి ఆడుకుంటున్నాయని చూస్తూ ఆనందిస్తారు. తర్వాత వాటికి అదొక అలవాటుగా మారుతుంది. నిజానికి ఇది వాటికి మంచి అలవాట్లు నేర్పించాల్సిన వయస్సు.
చాలామంది కుక్కలను తెచ్చుకొని వాటిని ఇంట్లో ఒక మూలన కట్టేసి ఉంచుతారు. దీంతో అవి అభద్రతాభావానికి గురవుతాయి. వాటికి అంతగా పరిచయం లేని వ్యక్తులు ఎదురైనప్పుడు దూకుడుగా వ్యవహరిస్తాయి'' అని ఆయన వివరించారు.
ఆహారం, పానీయాల్లో అసమతుల్యత కూడా అవి దూకుడుగా వ్యవహరించేందుకు కారణం అవుతుందని సూద్ చెప్పారు.
''కొన్నిసార్లు ఇంట్లో, పెంపుడు కుక్కలకు వాటికి సరిపోయేదాని కంటే అధికంగా ఆహారం పెడుతుంటారు. ఎక్కువ శారీరక శ్రమ కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి శారీరక శక్తి మొత్తం ఖర్చు కాదు. దీంతో అవి దూకుడుగా మారతాయి'' అని తెలిపారు.
భారత్‌లో పశువుల కోసం పనిచేస్తోన్న 'ఫ్రెడికోజ్ సంస్థ'కు చెందిన అభిషేక్ సింగ్... వీధి కుక్కలు ప్రమాదకరమా? లేక పెంపుడు కుక్కలు ప్రమాదకరమా అనే ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశం వాటి జాతిపై ఆధారపడి ఉంటుందని అన్నారు. హైపర్ బ్రీడ్ కుక్కలు మరింత దూకుడుగా ఉంటాయని చెప్పారు.
''ఒకవేళ ఒక కుక్క, హైపర్‌బ్రీడ్‌కు చెందినదైతే దాని ప్రవర్తన ఎప్పుడు, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏ కుక్కలతో ఎక్కువ ప్రమాదం?
పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు కరవడంతో తేడా ఉంటుందని డాక్టర్ సూద్ చెప్పారు. పెంపుడు కుక్క ఒకసారి కరవగానే వెనక్కి తగ్గుతుందని అన్నారు.
''సాధారణంగా పెంపుడు కుక్కలకు తాము తప్పు చేశామని గ్రహించే గుణం ఉంటుంది. అందుకే ఒకసారి కరవగానే అవి వెనక్కి తగ్గుతాయి. అదే వీధి కుక్కలు ఇలా ఉండవు. వాటికి వేటాగే గుణం ఉంటుంది. పుట్టుకతోనే వాటికి దూకుడు స్వభావం ఉంటుంది’’ అని డాక్టర్ సూద్ వివరించారు.
పెంపుడు కుక్కలకు వ్యాక్సీన్లు ఇప్పిస్తారు. వీధి కుక్కలకు అలాంటివేమీ ఉండవు. కాబట్టి వీధి కుక్కలు కరిస్తే రేబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images
పిచ్చి కుక్క కరిస్తే ఏంచేయాలి?
‘‘ఒకవేళ పిచ్చి కుక్క కరిస్తే దాన్ని నాలుగు రోజుల పాటు గమనించాలి. అప్పటికీ అది బతికే ఉంటే ఫర్వాలేదు. చనిపోతే మాత్రం దాని కాటు పడ్డవారికి చాలా ప్రమాదం' అని అంతా సాధారణంగా భావిస్తుంటారు.
ఈ విషయమై డాక్టర్ సూద్ ఏమంటారంటే, 'రేబిస్ సోకిన నాలుగు నుంచి పది రోజుల్లోగా ఆ కుక్క చనిపోతుంది. ఒకవేళ వీధి కుక్క కరిస్తే, అదే రోజున దానికి రేబిస్ సోకినట్లుగా భావిస్తారు. అందుకే దాన్ని నాలుగు రోజుల పాటు గమనించాలని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ అది మరణిస్తే అప్పుడు బాధితులు ఇంజెక్షన్ తీసుకోవడం తప్పనిసరి'' అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రేబిస్ సోకకుండా ఏంచేయాలంటే...
ఏదైనా కుక్క కరిస్తే తమకు రేబిస్ వ్యాధి సోకుతుందనే భయం చాలామందిలో ఉంటుంది.
రేబిస్‌లో రెండు రకాలు ఉంటాయి.
మొదటిది డంబ్ రేబిస్. ఇది సోకితే కుక్క శరీరంలోని నరాలు బలహీనం అవుతాయి. అది కదల్లేక ఎప్పుడూ ఒక దగ్గరే కూర్చొని ఉంటుంది. తర్వాత పక్షవాతంతో నాలుగు రోజుల్లోనే చనిపోతుంది.
రెండోది ఫ్యూరియస్ రేబిస్. ఇది సోకితే కుక్క మరణించడానికి పది రోజులు పడుతుంది. ఈ సమయంలో అది మరింత కోపంగా, దూకుడుగా మారుతుంది.
''ఫ్యూరియస్ రేబిస్ సోకితే కుక్క లాలాజలం కూడా మింగలేకపోతుంది. గొంతులోని నరాలు పక్షవాతానికి గురవుతాయి. అది ఆ అనారోగ్యంతో మరింత కలతకు గురై మనుషులపై దాడి చేయడం మొదలెడుతుంది’’ అని డాక్టర్ సూద్ చెప్పారు.
కుక్క కరిచినప్పుడు మొదట గాయాన్ని కనీసం పది నిమిషాల పాటు శుభ్రంగా కడగాలి. తర్వాత బెటాడిన్ క్రీమ్ రాయాలి.
''సాధారణంగా పెంపుడు కుక్కలకు టీకాలు ఇస్తారు కాబట్టి రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు. అందుకే దాన్నొక మామూలు గాయం లాగే పరిగణించాలి. ఒకవేళ వీధి కుక్క కరిస్తే దాన్ని తప్పకుండా గమనించాలి. రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి.
తర్వాత పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణను కొనసాగిస్తుండాలి. కుక్క కరిచిన రోజుతోపాటు మూడో రోజు, ఏడో రోజు, పధ్నాలుగో రోజు, 28వ రోజు... ఇలా మొత్తం అయిదు ఇంజెక్షన్లు తీసుకోవాలి’’ అని డాక్టర్ సూద్ వివరించారు.
యాంటీ రేబిస్ ఇంజెక్షన్ కంటే ముందు 'ఇమ్యునోగ్లోబులిన్' అనే మరో ఇంజెక్షన్ కూడా తీసుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని ఉచితంగా అందజేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














