వీధి కుక్కలకు ఆహారం పెట్టడం తప్పా, దిల్లీ వాసుల ఆలోచన ఎలా ఉంది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, నికితా యాదవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దిల్లీలో వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత నగరంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
వీధికుక్కలను జాగ్రత్తగా చూసుకున్నందుకు తమను శత్రువుల్లా చూస్తున్నారని, దాడులు చేస్తున్నారని కొంతమంది జంతుప్రేమికులు చెబుతున్నారు.
వీధికుక్కలను వ్యతిరికిస్తున్నవారు వాటి వల్ల ప్రమాదాలు ఉన్నాయని, అవి ప్రజలను కరుస్తాయని వాదిస్తున్నారు.
మేఘా మల్హోత్రా రెండేళ్లుగా తన ఇంటి గేటు బయట వీధి కుక్కల కోసం ఆహారం పెడతారు.
"వాటికి ఆహారం పెట్టడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం నాకు ఆనందం కలిగిస్తుంది" అని ఆమె చెప్పారు.
అయితే ఇటీవల కొన్ని రోజులుగా ఆమె ఇంటి బయట ఆహారం పెట్టిన ప్రతీసారి స్థానికుల్లో అశాంతి పెరుగుతున్నట్లు మేఘా గుర్తించారు.
జంతువులకు ఆహారం పెట్టడం ఆపేయాలని కొంతమంది తనతో ఘర్షణకు దిగారని ఆమె చెప్పారు.
అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా తాను ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని మల్హోత్రా చెప్పారు.
అయితే అలాంటి పరిస్థితుల్ని మరింత దీటుగా ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధం కావల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
దిల్లీతో పాటు భారత దేశంలోని ఇతర నగరాల్లో ఇలాంటి ఘర్షణలు తరచుగా జరుగుతున్నాయి.
ప్రభుత్వ అధికారులు వేగంగా పెరుగుతున్న వీధి కుక్కలతో పోరాడాల్సి వస్తోంది.
వీధుల్లో తిరిగే శునకాలకు ఆహారం పెట్టేవారు వాటి పట్ల కరుణ చూపిస్తున్నామని భావిస్తారు. అయితే కుక్క కాట్లు పెరగడం, కుక్క కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య దీనిని వ్యతిరేకించే వారిని ప్రోత్సహిస్తోంది.
సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో మరింత అయోమయ పరిస్థితి ఏర్పడింది. జనాలతో రద్దీగా ఉండే నగరాల్లో వీధి కుక్కలను భారతదేశం ఎలా నియంత్రిస్తుందనే చర్చ జరుగుతోంది.
దిల్లీలోని వీధికుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కోర్టు సవరించింది. షెల్టర్లకు తరలించడానికి బదులుగా వాటికి వ్యాక్సిన్లు వేసి, వదిలేయాలని తీర్పు చెప్పింది.
అయితే దూకుడుగా ఉండేవాటిని, రేబిస్ వ్యాధి ఉన్న వాటిని షెల్టర్లకు తరలించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరిగే జంతువులకు ఆహారం పెట్టడాన్ని కూడా కోర్టు నిషేధించింది. కుక్కలకు ఆహారం పెట్టేందుకు నిర్దుష్ట ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు సూచించింది.

అయితే కొంతమంది కుక్కలకు ఆహారం పెట్టడంపై కోర్టు పూర్తిగా నిషేధం విధించిందని చెబుతున్నారు.
తమ పొరుగువారే తమను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని, తమపై దాడులు చేస్తున్నారని వీధి కుక్కలకు ఆహారం పెడుతూ వాటిని సంరక్షిస్తున్న వారు చెబుతున్నారు. వీధికుక్కలకు ఆహారం పెట్టడం పూర్తిగా నిషిద్ధమని వారు వాదిస్తున్నారని చెబుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించే ప్రాంతాల నుంచి వాటిని తరిమేస్తున్నారు. అలా కుక్కలను తరిమేయడం వల్ల వాటికి ఆహారం అందించే వారు రాకుండా ఉంటారనేది వారి ఆలోచన.
"కుక్కలు వారిపై దాడి చేస్తాయని ప్రజల మనసుల్లో ఉంది. వారికి తెలియనిది ఏంటంటే జంతువులకు ప్రేమ, సంరక్షణ మాత్రమే కావాలి" అని మేఘా మల్హోత్రా చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
వీధి కుక్క కరిస్తే బాధ్యతెవరిది?
భారతీయ నగరాల్లో ముఖ్యంగా దిల్లీలో వీధి కుక్కలు ఎక్కువ. దేశ రాజధానిలో దాదాపు10 లక్షల వీధి కుక్కలు ఉంటాయని అంచనా. అయితే పదేళ్లుగా వాటిని అధికారికంగా లెక్కించలేదు.
కుక్కలలో చాలా వరకు క్రూరమైనవేమీ కాదు. అవి ప్రజలతో అలవాటైనట్లుగా ప్రవర్తిస్తాయి. ప్రజలతో జీవిస్తాయి. ఆహారం కోసం కూడా ప్రజలపైనే ఆధారపడతాయి.
నగరాల్లో గేటెడ్ కాలనీల నుంచి టీ కొట్ల వరకు అవి రోజు వారీ నగర జీవితంలో భాగంగా మారిపోయాయి.
అయితే దిల్లీ, దాని చుట్టు పక్కల ఉన్న శాటిలైట్ టౌన్లలో స్థానికులు తాము కుక్క కాటు గురించి భయపడుతున్నామని, వీధి కుక్కల వల్ల బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత లేకుండా పోతోందని వాదిస్తున్నారు.
వీధి కుక్కలు గుంపులు గుంపులుగా చేరి పిల్లలు, వృద్ధులు, మహిళల వెంటపడి భయాన్ని సృష్టిస్తున్న సందర్భాలు నమోదవుతున్నాయి.
"మేము దగ్గర లేకుండా పిల్లల బయట ఆడుకోవడానికి పంపించాలంటే భయంగా ఉంది. కుక్క కరిస్తే వాళ్ల పరిస్థితేంటి? ఎవరు బాధ్యత తీసుకుంటారు?" అని నార్త్ దిల్లీకి చెందిన చేతన్ సింగ్ ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా 2024లో 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అందులో దిల్లీలోనే 25వేల కంటే ఎక్కువ ఉన్నాయి.
పెద్ద సంఖ్యలో వీధి కుక్కలు ఉన్నప్పటికీ వాటిని నియంత్రించడానికి భారతదేశంలో యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం తప్ప సమగ్ర విధానమేదీ లేదు.
యానిమల్ బర్త్ కంట్రోల్ కూడా టీకాలు, స్టెరిలైజేషన్ ద్వారా వాటి సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
దిల్లీలో 25 యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలున్నాయి. ఇవన్నీ వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి వాటికి టీకాలు వేసి వీధుల్లో వదిలేయడం అనే పరిమిత లక్ష్యంతో పని చేస్తున్నాయి.
ఈ కేంద్రాల పరిధిలో విస్తృతమైన ప్రాంతం ఉంటుంది. పైగా వీటికి నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత దిల్లీలో వీధి కుక్కలకు ఆహారం పెట్టే ప్రాంతాలను గుర్తించేందుకు మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ప్రతీ జోన్‌లోని పారిశుధ్య కార్మికులు, ప్రజలు, వెల్ఫేర్ అసోసియేషన్లతో కలిసి ఈ ప్రదేశాలను గుర్తించాలని వీధి కుక్కలపై ఉపసంఘం నిర్ణయించిందని హిందూస్తాన్ టైమ్స్ వార్తాపత్రిక కథనం తెలిపింది.
దీని గురించి వివరాలు తెలుసుకునేందుకు దిల్లీ మేయర్ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది. అయితే వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు
వీధి కుక్కలకు ఆహారం పెట్టే స్థలాలను అధికారులు త్వరగా గుర్తించాలని, ఈ లోపు ఇప్పుడు ఉన్న వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
"వీధి కుక్కలకు ఆహారం అందించే ప్రాంతాలు ఎప్పుడు సమస్యాత్మకంగా మారలేదు. అవి పరిష్కారంలో భాగం" అని జంతు ప్రేమికురాలు అంబికా శుక్లా అన్నారు.
"కుక్కలకు ఆహారం అందిస్తున్న వాళ్లే వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. వాటిని సున్నితంగా ఉంచుతున్నారు" అని ఆమె చెప్పారు.
ఈ విషయాన్ని షెల్టర్లు కూడా అంగీకరిస్తున్నాయి. దిల్లీలో నైబర్‌హుడ్ వూఫ్ అనే ఎన్జీఓ స్టెరిలైజేషన్ డ్రైవ్‌లలో స్థానిక సంరక్షకులు పాల్గొన్నప్పుడు చాలా సమర్థవంతంగా ఉంటాయని తెలిపింది.
"కుక్కలను గుర్తించడంలో ఫీడర్లు మాకు సాయపడతాయి. దీంతో వాటిని గుర్తించి వ్యాన్‌లోకి ఎక్కించడం తేలికవుతుంది. ఎక్కువ సందర్భాల్లో మాకు తాళ్లు, వలలు అవసరం ఉండదు" అని షెల్టర్‌లో కార్యకలాపాలను నిర్వహించే దీపక్ నాగర్ చెప్పారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి స్పష్టమైన వ్యూహం లేదు. దీంతో దిల్లీలో కుక్కల సంఖ్యను నియంత్రించడానికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ ఉత్తమ పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు.
"స్టెరిలైజేషన్ ఒక్కటే మంచి మార్గం" అని మేఘా శుక్లా చెప్పారు. గత దశాబ్ధంతో పోలిస్తే తర్వాతి కాలంలో రేబిస్ కేసుల్ని తగ్గించడానికి ఈ పద్దతి ఉపయోగపడిందని ఆమె చెప్పారు.
అయితే ఒక ప్రాంతంలో వీధి కుక్కల సంఖ్యను 70 శాతం తగ్గించడానికి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అసలు వీధి కుక్కల విషయంలో చర్చించాల్సింది వాటి సంఖ్య గురించి కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటితో సహజీవనం గురించి అని మేఘా మల్హోత్రా లాంటి వారు చెబుతున్నారు.
"జంతువులకు కర్రలు, బోనులు కాదు, కరుణ అవసరమని అర్థం చేసుకోవాలి. వాటికి ఆహారం అందించే వారు కూడా మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. ఆహారాన్ని గేట్ల ముందు, రోడ్ల మీద కాకుండా సురక్షితమైన ప్రాంతంలో అందించాలి" అని మేఘా కోరారు.
"వీధి కుక్కల సమస్యకు పరిష్కారం వాటిపట్ల చూపే కరుణ, మనంపడే జాగ్రత్త మధ్య ఉంది" అంటారు ఆమె.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














