కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే భవిష్యత్తు ఎలా ఉంటుంది?

కవిత, కేసీఆర్

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha

    • రచయిత, బళ్ళ సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుని కుమార్తె కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రకటన చేసింది. పార్టీ వ్యతిరేక పనులు చేస్తూ, పార్టీకి నష్టం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది ఊహించని పరిణామం కాదు, ఆ మాటకొస్తే ఈ నిర్ణయం ఒకింత ఆలస్యం అయిందనే వారూ లేకపోలేదు.

''ఇలా పార్టీకి వ్యతిరేకంగా వేరే ఎవరైనా ఉంటే, ఇంతకంటే వేగంగానే చర్యలు ఉండేవేమో. కానీ, కవిత విషయంలో ఇప్పటివరకు ఆ కుటుంబం భరించింది అని చెప్పవచ్చు'' అని విశ్లేషించారు ఓయూ రాజనీతి శాస్త్ర విభాగ విశ్రాంత ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు.

''ఆమెపై ఇంతకాలం చర్యలు లేకపోవడం పలువురికి అనుమానాలు పెంచింది'' అని వ్యాఖ్యానించారు ఓయూ విశ్రాంత ప్రొఫెసర్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్.

మరి ఇప్పుడు కవిత ప్రస్థానం ఎటువైపు? ఆ ప్రభావం బీఆర్ఎస్‌పై ఎంత? ఎలా ఉంటుంది? కొత్త పార్టీ పెడతారా? పెడితే భవిష్యత్ ఉంటుందా? - ఇవే ముఖ్యమైన ప్రశ్నలు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha

బీఆర్ఎస్‌పై కవిత వ్యాఖ్యలు, సస్పెన్షన్ ప్రభావం ఉంటుందా?

కవిత ప్రభావం కచ్చితంగా బీఆర్ఎస్‌పై ఉంటుందని అంటున్నారు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్.

''కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీపై ప్రభావం చూపించేదిగానే చూడాలి. ఇది ఇతర పార్టీలకు అస్త్రంగా ఉంటుంది'' అని ఆయన అన్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌ది కూడా ఇదే మాట.

''హరీష్ ఏం చేసినా కేసీఆర్ అనుమతి లేకుండా చేయరని అందరికీ తెలుసు. కవిత, కేసీఆర్‌ను కూడా బద్నాం చేసినట్టే. ఇతర పక్షాలకు ఆమె అస్త్రం ఇచ్చింది. ఇంత కాలం బీఆర్ఎస్ చెబుతూ వచ్చిన వాదనను అంతం చేసేసింది. కాళేశ్వరం ఘనత కేసీఆర్‌ది, కానీ అవినీతి కేసీఆర్‌ది కాదంటే కుదరదు'' అన్నారు నాగేశ్వర్.

అయితే, బీఆర్ఎస్ మీద ఆమె ప్రభావం అంత తీవ్రంగా ఉండకపోవచ్చని మరికొందరి విశ్లేషణ.

''ఆ పార్టీపై ఆమె వెళ్లిపోయిన ప్రభావం ఏమాత్రం ఉండదు'' అన్నారు సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్.

ప్రొఫెసర్ నాగేశ్వర్, కేసీఆర్, కవిత, కేటీఆర్, బీఆర్ఎస్

ఫొటో సోర్స్, Prof K Nageshwar English/YT

కవిత కొత్త పార్టీ పెడతారా?

కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువంటున్నారు విశ్లేషకులు నాగేశ్వర్.

''కవిత ఇంత కాలం బీఆర్ఎస్‌లో ఉంటూ వ్యూహం రచించాలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీల ఓటర్లు ఆమె వైపు రారు. ఆమె కోసమంటూ ఎవరైనా వస్తే బీఆర్ఎస్ వారే రావాలి. అందుకే ఆమె కేసీఆర్‌ను మాత్రం ఏమీ అనకుండా వచ్చారు. బీజేపీపైనా, కాంగ్రెస్ - రేవంత్ పైనా ఆమె చేసే విమర్శలు చూస్తే, ఆ రెండు పార్టీల్లో ఆమె చేరరు. సొంతంగా పార్టీ పెట్టాలి'' అని విశ్లేషించారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

తెలంగాణలో మరో పార్టీకి అవకాశం ఉంటుందంటున్నారు పాత్రికేయులు కె. శ్రీనివాస్.

''ప్రస్తుతం తెలంగాణలో మరో రాజకీయ వేదికకు లేదా పార్టీకి స్థానం ఉందని చెప్పవచ్చు'' అన్నారాయన.

కవిత, కేటీఆర్

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha

కవిత పార్టీ పెడితే భవిష్యత్తు ఎలా ఉంటుంది?

తెలుగునాట ఎందరో నాయకులు, సొంతంగా ఎదిగినవారు, ముఖ్యమంత్రులతో బంధుత్వం ఉన్నవారు పార్టీలు పెట్టారు. కానీ వాటిలో కొన్నే నిలబడ్డాయి. కవిత నిజంగా కొత్త రాజకీయ పార్టీ పెడితే, నిర్వహించడం, నిలబెట్టడం అంత తేలిక కాదంటున్నారు ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు.

''పార్టీ పెట్టడం తేలిక, నడపడమే కష్టం. చెన్నారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి కూడా పార్టీలను నిలుపలేకపోయారు. జగన్, మమతా బెనర్జీ, శరద్ పవార్‌లు కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రాంతీయం చేసుకున్నారు. కవిత సొంతంగా పార్టీ పెడితే, నిలబెట్టడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు తరహాలో చిన్న పార్టీలా ఉండే అవకాశమూ తక్కువే. ఎందుకంటే అక్కడి పార్టీలకు ఉండే కులం-ప్రాంతం అనుకూలత తెలుగునేల మీద లేదు'' అని విశ్లేషించారు ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు.

తెలుగుదేశం నుంచి లక్ష్మీ పార్వతి, వైఎస్సార్సీపీ నుంచి షర్మిల విడిపోయినప్పటికీ కూడా విజయం సాధించలేకపోయారని ఆయన గుర్తు చేశారు.

''కుటుంబం అండ లేకపోవడం చాలా పెద్ద లోటు అవుతుంది. ఇప్పడు కుటుంబం కూడా కవితను పక్కన పెట్టినట్లే'' అన్నారు ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు.

ఆమె భవిష్యత్తు మరీ అంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పలేమంటున్నారు దుర్గం రవీందర్.

ఎన్నికల పరంగా చూసినప్పుడు ఆమె ప్రభావం చూపలేకపోవచ్చంటున్నారు.

''జాతీయ పార్టీ, సొంత యంత్రాంగంతో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఏం చేయలేకపోయారు. ఆ తండ్రికి కూతురనేది మాత్రమే కవిత అర్హత. ఏ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేంత బలం ఆమెకు ఉందని నేను అనుకోవడం లేదు'' అన్నారు రవీందర్.

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha

ఒకవేళ కవిత పార్టీ పెడితే అది నియోజకవర్గానికి 200 నుంచి 2000 వేల ఓట్లు చీల్చే పార్టీగా మిగిలిపోవచ్చన్నది దుర్గం రవీందర్ విశ్లేషణ.

''మొత్తం కవిత వ్యవహారం టీ కప్పులో తుపానుగా మిగిలిపోతుంది. ఆమె ఏదో గూటికి వెళ్లాల్సిందే. సొంతంగా యుద్ధం చేయలేదు. బీసీలు ఎప్పుడూ ఆవిడ వెంట లేరు, ఆమె వాళ్లకు చేసిందీ లేదు. కవిత వంటివారు పెద్ద పార్టీల మధ్య బ్యాలెన్స్ చేసే పావులు మాత్రమే తప్ప, ఆడించేవారు కాదు. ఆమె తెలివి, సామర్థ్యం, నిబద్ధత, నిజాయతీ అన్నీ ప్రశ్నార్థకాలే'' అన్నది రవీందర్ మాట.

సొంత పార్టీ పెట్టినా, ఆమె వెంట ఎందరు వస్తారన్నది ప్రశ్నార్థకమే అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు.

''పార్టీ పెడితే కాంగ్రెస్, బీజేపీ వారు ఆమె వైపు రారు. కేసీఆర్‌కి నిజమైన వారసురాలు ఈవిడే అని గుర్తించి బీఆర్ఎస్ కేడర్ ఇటు రావాలి. కానీ జాగృతి వాళ్లు తప్ప, మిగిలినవారు ఎందరు ఇటు వస్తారు? హరీష్‌ను విమర్శించడం ద్వారా ఒక రకంగా సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఇప్పుడు పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా ఆమెను వ్యతిరేకిస్తున్నాయి'' అన్నారు నాగేశ్వర్.

కవిత, కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్, కె.శ్రీనివాస్

అయితే, పూర్తి నిరాశాజనకంగా ఉంటుందని కూడా చెప్పలేమన్నది పాత్రికేయులు కె. శ్రీనివాస్ అభిప్రాయం.

కవిత మార్గం అంత తేలిక కాదంటూనే, ఆమె తన ఇమేజ్ పెంచుకుని రాజకీయంగా ఆచితూచి ఆడుగులు వేస్తే భవిష్యత్తు ఉంటుందంటున్నారు.

''ప్రస్తుతం ఆమె వెంట కీలక నేతలెవరూ లేరు. ఆమెపై ఇప్పటికే లిక్కర్ స్కాం కేసు నడుస్తోంది. ముందుగా ఈ ఇమేజ్ నుంచి బయటపడి రాజకీయంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది'' అన్నారాయన.

కేసీఆర్‌పై ఉన్న కోపంతోనే తనపై సీబీఐ కేసులు పెట్టించారనే వాదన ఆమె ముందు నుంచి వినిపిస్తూ వచ్చారని గుర్తు చేశారు కె శ్రీనివాస్.

ఈడీ అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ కవిత

ఫొటో సోర్స్, BRS

ఫొటో క్యాప్షన్, ఈడీ అరెస్ట్ సమయంలో ఎమ్మెల్సీ కవిత

అసలేం జరిగింది?

దిల్లీ మద్యం కేసులో కవిత అరెస్టై బయటకు వచ్చిన తరువాత నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారనీ, అప్పుడప్పుడూ పార్టీకి వ్యతిరేకం అనిపించే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ నడిచేది. మొత్తంగా మే చివర్లో ఆమె పేరుతో బయటకు వచ్చిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఆ లేఖలో ఆమె తన తండ్రిని సంబోధిస్తూ, పార్టీలోని అనేక అంశాల గురించి రాశారు. ఆ లేఖ తెలంగాణలో కలకలం రేపిన సమయంలో కవిత అమెరికాలో ఉన్నారు.

అమెరికా నుంచి వస్తూనే విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.

''కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి'' అంటూ అప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఆ వెంటనే ఆ లేఖపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండా ఆచితూచి మాట్లాడారు.

"ఎవరైనా సరే, పార్టీలో ఏ హోదాలో ఉన్నా, కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడవలసినవి అంతర్గతంగా మాట్లాడితేనే బావుంటుంది'' అన్నారు.

అప్పుడే విమానాశ్రయంలో కనిపించిన దృశ్యాలు కార్యకర్తల్లో, విశ్లేషకుల్లో అనుమానాలను పెంచాయి. అక్కడ ఎక్కడా గులాబీ జెండాలు కనిపించలేదు. ఫ్లెక్సీలలో 'కవితక్క టీమ్ ' అనే పేర్లు కనిపించాయి. ఇతర బీఆర్ఎస్ నాయకుల ఫోటోలూ లేవు.

కవిత మాత్రం తాను పార్టీ నుంచి వేరు కాదు అనే భావన వచ్చేలాగే మాట్లాడారు.

''పార్టీలో కోవర్టుల పని ఇది. వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. పార్టీని బలోపేతం చేయడానికి ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఉండాలి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు వెళ్తుంది'' అన్నారు కవిత.

దానికి స్పందనగా, ''కోవర్టులు అన్ని పార్టీల్లో ఉంటారు. రేవంత్ కోవర్టులు కొందరు ఉంటే ఉండవచ్చు. కాలక్రమంలో కోవర్టులు తమకు తామే బయటపడతారు'' అన్నారు కేటీఆర్.

ఇక ఆ తరువాత నుంచి కవిత వేసే ప్రతి అడుగూ చర్చనీయాంశంగా మారింది. ఆమె చర్యలు, వ్యాఖ్యలన్నీ బీఆర్ఎస్ నుంచి దూరం జరిగేవిలానే కనిపించాయి.

కల్వకుంట్ల కవిత, కేటీఆర్

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha

ఆ తరువాత తన ఇంట్లో విలేఖర్లతో మాట్లాడుతూ, నేరుగా పేరు వాడకపోయినా, అక్కడున్న వారికి అర్థమయ్యేలా కేటీఆర్‌ను ఉద్దేశించి కొన్ని విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోకి వెళ్లను అన్నారు కానీ, చివరి వరకూ బీఆర్ఎస్‌లోనే అని మాత్రం అప్పట్లో అనలేదు.

తరువాత తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసినప్పుడు, కవిత కూడా సంబరాలు చేశారు. లేఖ విడుదలైనప్పటి నుంచి జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుపు, ఆకుపచ్చ కలిగిన కండువా వేసుకుంటున్నారు తప్ప గులాబీ రంగు కండువాతో కనిపించలేదు.

కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైనప్పుడు, ఆయనకు సంఘీభావంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు కవిత వెళ్లారు కానీ, ఆమెతో కేసీఆర్ మాట్లాడినట్టు కూడా కనిపించలేదు.

బీసీ రిజర్వేషన్ల వేడుకల సమయంలో ఎమ్మెల్సీ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై, పార్టీ సరిగ్గా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో మాటల యుద్ధం నడిచింది. కేసీఆర్ నాయకత్వం తప్ప ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయను అని కొన్ని ఇంటర్వ్యూలలో పరోక్షంగా మాట్లాడారు.

ఇటీవల తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పదవి నుంచి కవితను తప్పించి, కొప్పుల ఈశ్వర్‌ను ఆ పదవిలో కూర్చొబెట్టింది బీఆర్ఎస్. ఈ ఘటనతో ఆమెకూ, పార్టీకీ మధ్య దూరం మరింత పెరిగింది. తాను సొంతంగా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. తరచూ బీసీ నినాదం తీసుకుంటూ, జాగృతి సంస్థ తరపున మాట్లాడుతూ కనిపించారు.

కల్వకుంట్ల కవిత, హరీష్ రావు

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Kavitha

వివాదం అలా పెరుగుతూ వస్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ బాధ్యత సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆమె మరోసారి విలేఖర్ల ముందుకు వచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్పష్టం చేసేలా ఆమె మాట్లాడారు.

''హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. (వాళ్లిద్దరూ కేసీఆర్ దగ్గర) అవినీతి అనకొండలు, కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందంటే.. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత?'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

''జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్'' అంటూ నినాదాలు చేశారు.

ఈ మాటలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. హరీష్ రావును సమర్థిస్తూ కేటీఆర్ సహా, సొంత పార్టీ వీడియోలు విడుదల చేసింది.

మరోవైపు కాంగ్రెస్, బీజేపీలకు ఈ విషయం అందివచ్చిన అస్త్రంగా మారింది. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు స్పష్టమైందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

చివరగా సెప్టెంబరు 2 మంగళవారం కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదలైంది. దీనిపై కవిత ఇంకా స్పందించాల్సి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)