మాంసాహార స్క్రూవర్మ్ కేసులు మెక్సికోలో పెరుగుతున్నాయి, మనుషులకూ వ్యాప్తిస్తున్న పరాన్నజీవి.. వ్యాధిని ఎలా గుర్తించాలి?

స్క్రూవర్మ్ లార్వాలు

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, వెనెస్సా బుష్‌ష్లటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మాంసాహార పరాన్నజీవి న్యూవరల్డ్ స్క్రూవర్మ్ (ఎన్‌డబ్ల్యూఎస్) కేసులు మెక్సికోలో పెరుగుతున్నాయి.

మెక్సికో ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జులై మూడో వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు నాలుగు వారాల మధ్య కాలంలో ఎన్‌డబ్ల్యూఎస్ బారినపడిన జంతువుల సంఖ్య 53 శాతం పెరిగింది.

ఈగ లార్వా ద్వారా వ్యాపించే ఈ పరాన్నజీవి ప్రధానంగా పశువులపై ప్రభావం చూపుతుంది. కుక్కలు, గుర్రాలు, గొర్రెలతో పాటు మనుషులూ వీటి బారినపడిన కేసులను మెక్సికోలో నమోదయ్యాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం... దక్షిణ మెక్సికో రాష్ట్రాలైన కాంపేచే, చియాపాస్‌లోని ఆసుపత్రుల్లో డజన్ల కొద్దీ ప్రజలు చికిత్స పొందారు.

ఎల్ సాల్వడార్ నుంచి తిరిగొచ్చిన రోగిలో ఎన్‌డబ్ల్యూఎస్‌ను గుర్తించిన అమెరికా వైద్యాధికారులు, ఇది మొదటి మానవ కేసుగా నిర్ధరించామని ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే మెక్సికోలో ఈ పరాన్నజీవి బారినపడిన జంతువుల సంఖ్య పెరిగింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్క్రూవర్మ్

ఫొటో సోర్స్, Reuters

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

స్క్రూవర్మ్ పునరుత్పత్తి చక్రాన్ని అడ్డుకోవడానికి స్టెరిలైజ్డ్ మగ ఈగలను విడుదల చేయడం ద్వారా ఎన్‌డబ్ల్యూఎస్‌ను నిర్మూలించినట్లు 1966లో అమెరికాలో ప్రకటించారు. 1991లో మెక్సికో కూడా ఈ పద్ధతిని అనుసరించింది.

అయితే, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికాలోని ఉష్ణ మండలం, సమశీతోష్ణ మండలం ప్రాంతాల్లో ఎన్‌డబ్ల్యూఎస్ సాధారణంగానే ఉంది.

2024 నవంబర్‌లో తొలికేసు మెక్సికోలో నమోదైన తర్వాత ఉత్తరాన ఎన్‌డబ్ల్యూఎస్ వ్యాపిస్తోంది.

ఆడ ఎన్‌డబ్ల్యూఎస్ ఈగలు (కోక్లియోమియా హోమివివోరాక్స్) వార్మ్-బ్లడెడ్ జంతువుల చర్మంపై ఏర్పడిన గాయాలపై, లేదా చుట్టూ గుడ్లు పెడతాయి. అవి ముక్కు, నోరు, కనురెప్పలు, చెవులు, జననేంద్రియాల్లోని శ్లేష్మ పొరలకు కూడా చేరుతాయి.

ఆ గుడ్లు పొదగడంతో బయటపడిన లార్వాలు గాయం లేదా శ్లేష్మ పొరల ద్వారా శరీరంలోకి చొరబడతాయి. సజీవ మాంసాన్ని తింటూ పెరుగుతాయి.

ఇలా ముట్టడించడాన్ని మైయాసిస్ అంటారు. చికిత్స చేయకుండా అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకం కావచ్చు. లార్వాలు తమ పదునైన మౌత్ హుక్స్‌తో కణాజాలాన్ని చీల్చుకుంటూ వెళ్లి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.

ఇలాంటి ప్రాణాంతక కేసులు మనుషుల్లో అరుదు అయినప్పటికీ, ఇప్పటికే ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

కాంపేచే రాష్ట్రంలో 86 ఏళ్ల మహిళ ఒకరు చర్మ క్యాన్సర్‌తో జులైలో మరణించారని, ఆ వ్యాధి స్క్రూవర్మ్ లార్వా వల్లే తీవ్రమైందని మెక్సికో ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

పశువులతో పనిచేసేవారు, వ్యాధి సోకిన పశువులున్న గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు.

స్క్రూవర్మ్ వ్యాపించిన ప్రాంతానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ సూచిస్తోంది.

చర్మంపై అనూహ్య మార్పులొస్తే వైద్యుడిని సంప్రదించాలి.

ద్రవంతో కూడిన బొబ్బలు, పొలుసులు రావడం వంటివి దీని లక్షణాలు.

అలాగే గాయాలుంటే వాటి చుట్టూ పురుగు తొలుస్తున్నట్లు, లేదా ముక్కు, నోరు, కళ్లలో లార్వా కదులుతున్నట్లు అనిపించడం కూడా రోగ లక్షణాల్లో ఉన్నాయి.

ఏదైనా ప్రభావిత ప్రాంతానికి వెళ్లాల్సి వస్తే, ముందుజాగ్రత్తగా నివారణ కీలకమని నిపుణులు చెబుతున్నారు. శరీరంపై గాయాలుంటే శుభ్రంచేసి, వాటిని కప్పి ఉంచాలని సూచిస్తున్నారు.

వ్యాధి సోకినట్లు అనుమానం ఉన్న వ్యక్తులు వైద్య సహాయం తీసుకోవాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)