మీ గోళ్లు రంగు మారుతున్నాయా? ఈ లక్షణం తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావొచ్చు.. తెలుసుకోండి..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉపాసన
- హోదా, బీబీసీ ప్రతినిధి
చేతుల అందాన్ని పెంచే గోళ్లను నిర్జీవ కణాలు అంటారు. అంటే, జీవం లేనివని. కానీ, ఈ నిర్జీవ గోర్లు మీ ఆరోగ్యం గురించి చాలా చెప్పగలవని తెలుసా?
గోళ్లు చూసి గుండె, మూత్రపిండాలతో సహా శరీరంలోని అనేక అవయవాలకు సంబంధించిన వ్యాధులను గుర్తించవచ్చని 'క్లినికల్ డెర్మటాలజీ రివ్యూ' పరిశోధన రిపోర్ట్ పేర్కొంది.
కర్ణాటక మెడికల్ కాలేజ్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని 272 మంది రోగులపై క్లినికల్ డెర్మటాలజీ రివ్యూ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగుల గోళ్లలో వచ్చిన మార్పులను పరిశీలించారు.
ఈ పరిశోధనలో పాల్గొన్న రోగులలో 26 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. 21 శాతం మందికి రక్త సమస్యలు, 17 శాతం మందికి కాలేయం, గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ట్ - జీఐటీ (పేగు) వ్యాధులున్నాయి. 12 శాతం మంది రోగులకు గుండె, కిడ్నీ సమస్యలు ఉన్నాయి.
అంటే, ఎవరిలోనైనా శ్వాసకోశ వ్యవస్థ అధ్వానంగా మారితే, గోళ్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఈ పరిశోధన గమనించింది. అదేవిధంగా, శరీరంలో ఏదైనా రక్త సంబంధిత వ్యాధి లేదా కాలేయం, గ్యాస్ట్రో, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి ఉంటే, గోళ్లలో మార్పులు కనిపిస్తాయని తేలింది.
అయితే, గోళ్లలో ఎలాంటి మార్పులు ప్రమాద సంకేతంగా పరిగణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
గోళ్లలో ఎలాంటి మార్పులను గమనించారు?
చేతులు, కాళ్ల గోర్లు వాటి కింది చర్మాన్ని గాయాల నుంచి రక్షిస్తాయి.
కాగా, గోళ్ల రంగు, ఆకారంలో మార్పులను క్లినికల్ డెర్మటాలజీ రివ్యూ పరిశోధన పలు వ్యాధులకు సంకేతంగా సూచించింది.
గోళ్లలో వాపు(క్లబ్బింగ్), పొడవైన చారల రేఖలు(లాంగిట్యూడినల్ రిడ్జిస్), గోళ్లు పసుపు రంగులోకి మారడం, రంగు మారడం ఈ పరిశోధనలో గుర్తించిన ప్రధాన లక్షణాలు.
కొన్నిసార్లు గోళ్లలో ఒకటి కంటే ఎక్కువ లక్షణాలు ఒకేసారి కనిపించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
గోళ్ల రంగు పాలిపోతే..
గుండె జబ్బు ఉన్న రోగులలో గోర్లు వంగి కిందికి తిరగడం (క్లబ్బింగ్), పొడవైన గీతలు(లాంగిట్యూడినల్ రిడ్జిస్) వంటి లక్షణాలు గమనించినట్లు పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.
"సాధారణంగా, మనుషుల గోళ్లు కొద్దిగా గులాబీ రంగులో ఉంటాయి. వాటి రంగు పాలిపోతే, అది రక్తహీనతను సూచిస్తుంది" అని మెట్రో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం చీఫ్ డాక్టర్ సమీర్ గుప్తా అన్నారు.
"అదేవిధంగా, గోళ్ల రంగు నీలం రంగులోకి మారితే, అది సైనోసిస్‌ను సూచిస్తుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇది గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా వ్యాధి వల్ల కావొచ్చు. ఈ వ్యాధి ఏంటో తెలుసుకోవడానికి, ప్రత్యేక పరీక్షలు చేస్తారు" అని ఆయన అన్నారు.
నీలిరంగు గోర్లు (సైనోసిస్) హైపోక్సియా, ఉబ్బసం లేదా పల్మనరీ హైపర్‌టెన్షన్ వంటి పరిస్థితులకు కూడా సంకేతం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఊపిరితిత్తుల వ్యాధి
శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులలో క్లబ్బింగ్ అత్యంత ముఖ్యమైన లక్షణం. ఆ తరువాత, పొడవైన చారల గీతలు, గోర్లు విరగడం, రంగు మారడం కూడా పరిశోధనలో గమనించారు. దీనర్థం ఎవరైనా వారి గోళ్లలో ఈ లక్షణాలను గమనించినట్లయితే, వైద్యుడిని సంప్రదించాలి.
ఊపిరితిత్తుల వ్యాధులు శరీరంలోని వివిధ భాగాలలో వేర్వేరు లక్షణాలను చూపుతాయని గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని పల్మనరీ మెడిసిన్ విభాగం చీఫ్ డాక్టర్ రష్మీ ఉపాధ్యాయ్ అన్నారు.
"ఉదాహరణకు, చర్మం పాలిపోయి, మెరుస్తూ ఉండవచ్చు. గోళ్లలో కూడా చాలా లక్షణాలు కనిపిస్తాయి. దీంతో మన ఊపిరితిత్తులలో ఏదో లోపం ఉందని గ్రహించవచ్చు" అని అన్నారు.
గోళ్లకు సంబంధించిన మొదటి లక్షణం క్లబ్బింగ్.
"ఇటీవలి కాలంలో, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ (ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది) కేసులు పెరుగుతున్నాయి. రక్తంలో ఎక్కువ కాలం ఆక్సిజన్ లేకపోవడంతో గోళ్లకు చేరే రక్త నాళాలు సన్నగా మారుతాయి. అందువల్ల, నెయిల్స్ క్లబ్బింగ్ కనిపించడం ప్రారంభమవుతుంది" అని డాక్టర్ రష్మీ అన్నారు.
ఎల్లో నెయిల్ సిండ్రోమ్‌లో గోళ్లు మందంగా, పసుపు రంగులోకి మారుతాయని, గోరు చుట్టూ వాపు వస్తుందని ఆమె తెలిపారు. ఈ సిండ్రోమ్ బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల చీము లేదా కైలోథొరాక్స్ వంటి పరిస్థితులను సూచిస్తుంది - ఇవన్నీ ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించినవి.

ఫొటో సోర్స్, Getty Images
గ్యాస్ట్రో లేదా కాలేయ సమస్య
క్లినికల్ డెర్మటాలజీ రివ్యూ పరిశోధనలో గ్యాస్ట్రిక్, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న 46 మంది రోగులలో గమనించిన అత్యంత సాధారణ లక్షణాలు పసుపు గోర్లు, పొడవాటి గీతలు, నెయిల్ క్లబ్బింగ్, టెరీజ్ నెయిల్ (గోరు దిగువ భాగం తెల్లబడటం). అత్యంత ప్రధాన లక్షణం టెరీజ్ నెయిల్.
డాక్టర్ సమీర్ గుప్తా ప్రకారం, క్లబ్బింగ్ నెయిల్ కొద్దిగా వంగి, కిందికి ఉంటుంది, ఇది దీర్ఘకాలిక వ్యాధులని సూచిస్తుంది.
కిడ్నీ వ్యాధులు
మూత్రపిండాల వ్యాధిగ్రస్తులలో పసుపు రంగు గోర్లు, లాంగిట్యూడినల్ రిడ్జిస్, హాఫ్ అండ్ హాఫ్ నెయిల్, ఒబ్లిటిరేటెడ్ లూనులా (గోరు అడుగున అర్ధ చంద్రాకార ఆకారం కనిపించకపోవడం), బ్రిటల్ నెయిల్( గోళ్లు పొడిగా, పెళుసుగా) ప్రభావం కనిపిస్తుందని ఉందని రిపోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
"దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులలో హాఫ్ అండ్ హాఫ్ నెయిల్ అత్యంత సాధారణ సంకేతం" అని ఘాజియాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రజిత్ మజుందార్ చెప్పారు.
'హాఫ్ అండ్ హాఫ్ నెయిల్' అంటే గోరులో ఒక సగం ఒకరకంగా, మిగిలిన సగం మరోరకంగా కనిపిస్తుంది.
అయితే, కొన్నిసార్లు ఏదైనా గాయం లేదా గోళ్ల అందాన్ని పెంచడానికి తీసుకున్న చర్యల కారణంగా వాటిలో మార్పు వస్తుంది. కాబట్టి, మీ గోళ్ల ఆధారంగా ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














