యూనివర్సిటీ పేపర్ లీక్: బలమైన కథాంశం - మరి నారాయణమూర్తి ఎక్కడ ఆగిపోయారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
నాటకం నుంచి సినిమా పుట్టింది. సినిమా దృశ్య ప్రధానం. నాటకంలో డైలాగ్ ముఖ్యం. దృశ్యం సరిగా కనపడదు. కాబట్టి , హావభావాల కంటే గట్టిగా డైలాగ్ చెప్పాలి.
ఆర్.నారాయణమూర్తి సినిమాల్లో డైలాగ్ దృశ్యాన్ని డామినేట్ చేస్తుంది. ‘యూనివర్సిటీ -పేపర్ లీక్’ కూడా అంతే.
ఈ సినిమా విద్యా వ్యవస్థలోని డొల్లతనాన్ని, పేద విద్యార్థుల నిస్సహాయత ఎత్తి చూపుతుంది.
కథేంటంటే... రామయ్య, అర్జున్ తండ్రీకొడుకులు. రామయ్య వైస్ చాన్సలర్, అర్జున్ పోలీస్ ఇన్‌స్పెక్టర్. నాగభూషణం ఒక ప్రైవేట్ యూనివర్సిటీ యజమాని. ఫీజుల పేరుతో విద్యార్థుల్ని దోపిడీ చేస్తుంటాడు. పేపర్ లీక్ చేయించడం, నకిలీ విద్యార్థులతో పరీక్షలు రాయించడం , విద్యా వ్యాపారాన్ని పెంచుకోవడం ఆయన పని.
నాగభూషణం అరాచకాన్ని రామయ్య, అర్జున్ ఎలా ఎదుర్కొన్నారనేది మిగతా కథ. నారాయణమూర్తి నిజాయితీ, చిత్తశుద్ధి మరోసారి కథాంశంలో కనిపించాయి.
ఈ సినిమాలో చర్చించిన అనేక అంశాలు మిగతా సినిమాల్లో ఎక్కడా కనపడవు. బయట సొసైటీలో కూడా ఎక్కడా చర్చ జరగడం లేదు.
విద్యార్థి ఉద్యమాలు బలహీనమైన తర్వాత ప్రశ్నించే వారు లేకుండా పోయారు. కెరీరిజం కీలకమయ్యే సరికి సంఘటిత శక్తి మాయమైంది.


ఫొటో సోర్స్, R Narayanamurty
‘అడిగేవన్నీ న్యాయమైనవే..కానీ’
ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ, మాతృభాష గొప్పతనం గురించి మాట్లాడ్డం కొందరికి ఫ్యాషన్. పేద, దళిత పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకపోతే అవకాశాలకి దూరమవుతారు. ఇంగ్లీష్ మీడియం అందకుండా కొందరు చేస్తున్న కుట్ర అని దర్శకుడు నారాయణమూర్తి వాదన.
పిల్లల చదువుల కోసం రైతులు, పేదవాళ్లు చివరికి కిడ్నీలు అమ్ముకునే స్థితికి వెళ్లిపోతున్నారు. అప్పులు చేసి చదివిస్తే, పేపర్ లీక్ చేసి అవకాశాల్ని కొందరు తన్నుకుపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?
గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గించేసి, అన్నిటినీ ప్రైవేట్‌పరం చేయడం వెనుక రిజర్వేషన్లు ఎత్తి వేయాలనే మోసం వుంది.
ప్రైవేట్ విద్యాసంస్థల దిగజారుడుతనాన్ని అర్థం చేసుకోలేక , మార్కులు తగ్గాయని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్ని ఎవరు కాపాడుతారు?
విద్య, వైద్యాన్ని జాతీయ చేయాలనేది నారాయణమూర్తి డిమాండ్.
ఆయన అడుగుతున్న ప్రశ్నలన్నీ నిజమే, న్యాయమే కానీ, సినిమాలో అదంతా చెప్పగలిగారా? అంటే లేదనే చెప్పాలి.
40 ఏళ్ల క్రితం, ఇప్పటి సినిమా ఒకటి కాదు. ప్రేక్షకుడు ఎదిగాడు, సినిమా మారింది. ఇంకా పాత పద్ధతిలోనే అరుపులు, కేకలు , డప్పు కొట్టే పాటలతో తీస్తామంటే కుదరదు, జనం కనపడరు. హైదరాబాద్ మొత్తం ఒకే థియేటర్‌లో సినిమా వుంది. దానికి కూడా ప్రేక్షకులు అంతంత మాత్రమే.
చెప్పాలనుకున్న కథ, సమాజానికి పనికొచ్చేదే కావచ్చు, కానీ రెండు గంటలు ఆసక్తికరంగా చెప్పాలి. సినిమాలో కథకి ఒక ఆర్డర్ వుండాలి, క్యారెక్టర్ రిజిస్టర్ కావాలి. అప్పుడే ఎమోషన్ పండుతుంది. ఇవన్నీ నారాయణమూర్తికి తెలియనవి కావు. అయినా సినిమా గందరగోళంగా.. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నాటకం చూసినట్టుంది.

ఫొటో సోర్స్, R Narayanamurty
‘థియేటర్‌లో విద్యార్థులే లేరు’
సినిమాలో నారాయణమూర్తి డబుల్ యాక్షన్ అని అర్థం చేసుకోడానికి చాలా టైమ్ పడుతుంది. తండ్రీకొడుకుల్ని గుర్తించడానికి ఇంకా సమయం పడుతుంది. ఇద్దరూ ఒకేలా వుంటారు. కాకపోతే ఒకరు తెల్లటి దుస్తుల్లో, ఇంకొకరు యూనిఫాంలో. వీళ్లలో తండ్రి వైస్ చాన్సలర్ అని చివర్లో గానీ తెలియదు. ఎందుకంటే ఆయన పిల్లలతో పాడుతూ డ్యాన్స్ చేస్తూ వుంటాడు.
తెరమీద కనిపించిన ఒకరిద్దరికి తప్ప ఎవరికీ నటన రాదు. ఆ ఒకరిద్దరు కూడా ఓవర్. నారాయణమూర్తి ప్రతి సీన్‌లోనూ ఆవేశపూరితంగా వుండడం దేనికో అర్థం కాదు. ఎడిటింగ్ ఇష్టం వచ్చినట్టు ఉండడంతో సీన్స్ జంప్ అవుతుంటాయి.
మామూలు సినిమాల పద్ధతిలో దీన్ని సమీక్షించడం కరెక్ట్ కూడా కాదు. కానీ నారాయణమూర్తి ఎవరి కోసం తీశారో, వాళ్లు కూడా థియేటర్‌కి రాకపోతే ఏంటి ప్రయోజనం?
థియేటర్‌లో విద్యార్థులే లేనప్పుడు విద్యా సమస్యలపై ఎంత చర్చిస్తే ఏంటి లాభం?
నారాయణమూర్తి తాను అనుకునే విషయాలు ప్రజలకు చెప్పడానికి సినిమాలు తీసే పద్ధతిని కొంత మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్లస్ పాయింట్
* కథలో చర్చించిన అంశాలు
మైనస్ పాయింట్
* 40 ఏళ్ల క్రితం సినిమాలా వుండడం
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














