'చైనాతో స్నేహం ఎంత ముఖ్యమో భారత్‌కు ఇప్పటికి అర్థమైంది', చైనా మీడియా ఎందుకిలా అంటోంది?

ఫొటో సోర్స్, Mikhail Svetlov/Getty Images)
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత పర్యటనకు ఆ దేశ అధికారిక మీడియా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది.
వాంగ్ యీ తన రెండు రోజుల పర్యటనలో, ఇరుదేశాల మధ్యనున్న సరిహద్దు వివాదంపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో కీలక చర్చలు జరిపారని చైనీస్ మీడియా పేర్కొంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోనూ వాంగ్ యీ భేటీ అయ్యారు.
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో భారత్ ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకోవాలని అనుకుంటోందని, వాంగ్ యీ భారత్‌లో పర్యటన అందులో భాగమేనని చైనా జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.


ఫొటో సోర్స్, Getty Images
చైనా మీడియా ఏమందంటే..
భారత్, చైనా మధ్య బలమైన సంబంధాలు 'గ్లోబల్ సౌత్'కి ఎంత మేలు చేస్తాయో రుజువవుతుందని చైనా మీడియా అభిప్రాయపడింది.
ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహాన్ని ఉద్దేశిస్తూ 'గ్లోబల్ సౌత్' అనే పదాన్ని ఉపయోగించింది.
అయితే, వాంగ్ యీ పర్యటనకు సంబంధించి భారత్, చైనా ప్రకటనల్లో తేడా కనిపించింది. ముఖ్యంగా తైవాన్ అంశం, టిబెట్ భూభాగంలోని త్సాంగ్‌పో నది(దీనినే భారత్‌లో బ్రహ్మపుత్ర నదిగా అని పిలుస్తారు)పై ప్రతిపాదిత డ్యాం అంశాలు.
చైనా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న త్సాంగ్‌పో ఆనకట్టపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ డ్యాం నిర్మాణం కారణంగా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.
వాంగ్ యీ భారత్‌లో పర్యటన ద్వారా ఏం సాధించారని చైనా మీడియా అడిగిన ప్రశ్నకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆగస్ట్ 20న స్పందిస్తూ, ''అనేక కీలక అంశాలపై ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చారు'' అని చెప్పారు.
'వివిధ అంశాలపై చర్చలను పునఃప్రారంభించడం, పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని మరింత పెంచుకోవడం, ప్రపంచ సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవడం, అలాగే ఏ దేశమైనా ఏకపక్ష వైఖరితో ఒత్తిడి చేసే విధానాన్ని వ్యతిరేకించడం వంటి అంశాలు చర్చల్లో ఉన్నాయి' అని చైనా అధికారిక పత్రిక 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది.
సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని తెలిపింది.

ఫొటో సోర్స్, Mikhail Svetlov/Getty
భారత మీడియాలో ఇలా..
భారత్‌కు రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతులపై నియంత్రణను చైనా ఎత్తివేసినట్లు భారత్‌లోని కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.
అయితే, దీనిపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, ఈ విషయం తనకు తెలియదని చెప్పారు.
''ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగడానికి తమ వైపు నుంచి చర్చలు కొనసాగించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి చైనా సిద్ధంగా ఉంది'' అని మావో నింగ్ వెల్లడించారు.
'భారత్‌కు అవసరమైన ఎరువుల్లో దాదాపు 30 శాతం మేర చైనా సరఫరా చేస్తోంది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీకి అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాలు, అలాగే రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలను అందిస్తోంది' అని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని అంశాలపై ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు
వాంగ్-జైశంకర్ మధ్య జరిగిన సమావేశంలో తైవాన్‌ను 'చైనాలో భాగం' అని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సంబోధించారని చైనా ఒక ప్రకటనలో పేర్కొంది.
కానీ, ఆగస్టు 19న భారత విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో.. "తైవాన్ అంశాన్ని చైనా లేవనెత్తింది. ఈ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని భారత్ నొక్కిచెప్పింది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే తైవాన్‌తో ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తుందని భారత్ స్పష్టం చేసింది" అని అందులో పేర్కొంది.
ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత, మే నెలలో భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. పాకిస్తాన్‌లోని ''టెర్రరిస్టుల స్థావరాలను'' భారత సైన్యం ధ్వంసం చేసింది.
ఈ నేపథ్యంలో, టెర్రరిజం అంశాన్ని చైనాతో చర్చల్లో లేవనెత్తినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. టెర్రరిజంపై సంయుక్త పోరాటం అనేది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటని ప్రస్తావించినట్లు అందులో పేర్కొంది.
'ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని వాంగ్ యీ కూడా అన్నారు' అని ఆ ప్రకటనలో ప్రస్తావించింది.
కానీ, చైనా మీడియా మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో కానీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు డోభాల్‌తో భేటీల్లో కానీ వాంగ్ యీ 'టెర్రరిజం సమస్యను ప్రస్తావించలేదు' అని పేర్కొంది.
టిబెట్‌లోని త్సాంగ్‌పో దిగువ ప్రాంతంలో చైనా ప్రతిపాదిత భారీ ఆనకట్ట గురించి భారత్ ఆందోళనలను జైశంకర్ తెలియజేశారని, ఈ విషయంలో పారదర్శకత అవసరాన్ని నొక్కి చెప్పారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
కానీ, చైనా ప్రకటనలో దీనిపై ఎలాంటి ప్రస్తావన లేదు.

ఫొటో సోర్స్, narendramodi@x
'అమెరికా టారిఫ్‌ల వల్లే భారత్, చైనా దగ్గరవుతున్నాయి'
వాంగ్ యీ భారత పర్యటనను చైనా ప్రభుత్వ మీడియా సానుకూలంగా చూస్తోంది. ఇరువైపులా మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి రెండు దేశాలూ ఆసక్తిగా ఉన్నాయని చెబుతోంది. అమెరికా అనుసరిస్తున్న 'ఏకపక్ష ఒత్తిడి' విధానాన్నీ ప్రస్తావించింది.
టియాంజిన్‌లో జరగనున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాకకు సన్నాహకంగా వాంగ్ యీ భారత పర్యటనను విస్తృత కోణంలో చూస్తున్నారని, చైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఆంగ్ల దినపత్రిక 'చైనా డైలీ' ఆగస్ట్ 19న సంపాదకీయంలో పేర్కొంది.
అమెరికా ప్రభుత్వం "మిగిలిన ప్రపంచంపై సుంకాల యుద్ధం" చేస్తుండగా, భారత్‌కు "అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఆ సుంకాల నుంచి తప్పించుకోలేమనే కఠిన వాస్తవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు నిరాకరించినందున అమెరికా ప్రభుత్వంతో భారత్ సంఘర్షణ స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుంటోంది. చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నస్తోంది' అని చైనా డైలీ ప్రస్తావించింది.
'భారత్ ఎగుమతుల కోసం అమెరికా మార్కెట్‌పై అధికంగా ఆధారపడటం వల్లే టారిఫ్‌లను ఎదుర్కోవడంలో బలహీనంగా మారింది. భారత్ ఇప్పుడు ఆసియా మార్కెట్ల వైపు చూస్తోంది' అని చైనా ప్రభుత్వ ఆధీనంలోని 'గ్లోబల్ టైమ్స్' పత్రిక పేర్కొంది.
''చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా భారత్ అమెరికాతో తన బేరసారాల శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు'' అని ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన లీన్ మిన్వాంగ్ చేసిన వ్యాఖ్యను 'గ్వాంచా' వెబ్‌సైట్ తన వ్యాసంలో ప్రస్తావించింది.
''మెరుగైన సంబంధాలను చైనా స్వాగతిస్తుంది. అయితే, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ఎప్పుడూ రాజీపడదు'' అని లీన్ చేసిన వ్యాఖ్యనూ జోడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














