50 ఇయర్స్ ఇండస్ట్రీ: రజినీకాంత్ అంటే జస్ట్ మ్యాజిక్ అంతే...

విలనిజం ఉట్టిపడే ప్రతినాయకుడిగా రజినీకాంత్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. క్రమంగా తమిళ సినిమాను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు.
ఆయన సినీ ప్రస్థానమేమీ పూల పాన్పుకాదు. ఎన్నో అవరోధాలను దాటుకుంటూ ఆయన ముందుకు వచ్చారు.
ప్రముఖ డైరెక్టర్ బాలచందర్ 1975లో రజనీని వెండితెరకు పరిచయం చేశారు. బాగా పెరిగిన గడ్డం, చిందరవందరగా కనిపించే జుట్టుతో వచ్చిన ఆయన తమిళ సినీ రంగంలో సూపర్‌స్టార్ అవుతారని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే నడక తీరు, స్టైల్‌తో రజనీ ఉన్నత శిఖరాలను చేరారు. ఒకానొక సమయంలో ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా తొలి పేరు ఆయనదే వినిపించేది. దేశానికి వెలుపల కూడా ఆయనకు వీరాభిమానులు ఉన్నారు.
నువ్వు అగ్ని పర్వతం కావచ్చు. నీ లోపలి లావాని గుర్తించే గురువు కావాలి. బాలచందర్ దొరికారు. అన్నీ రాసిపెట్టి ఉంటాయంటారు. బాలచందర్ దిద్దించారు. రజినీ రాసుకున్నారు. ఎంత ఎదిగినా గురువు ముందు చేతులు కట్టుకునే ఉన్నారు.
రజినీ ఎంత వేగంగా ఎదిగారంటే 1978లో కృష్ణతో నటించిన అన్నదమ్ముల సవాల్ సినిమాతో తెలుగు నేలలో ఆయనకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.
79లో ఏకంగా నటరత్న ఎన్టీఆర్‌తో సమానంగా టైగర్‌లో నటించారు.
1977లో 15 సినిమాల్లో నటిస్తే, ఎక్కువగా నెగెటివ్ రోల్స్.
78లో సోలో హీరోగా భైరవి. తర్వాత హీరోనే అని నియమం పెట్టుకోకుండా నటించారు. చాలా హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. గొప్ప పేరేమీ రాలేదు. జస్ట్ ఓకే.
తమిళంలో దళపతి, అన్నామలై, మన్నన్ ఇవన్నీ హిట్సే కానీ, ఒక యుద్ధ ట్యాంక్‌తో బాక్సాఫీస్ గోడల్ని బద్దలు కొట్టే సినిమా 1995లో వచ్చింది. దానిపేరు బాషా.
తర్వాత ఆయన మానవాతీత వ్యక్తిగా మారారు. ఒంటిచేత్తో కొడితే పాతిక మంది గాల్లోకి ఎగురుతారు. తంతే రైలు బోగి ఇనుప తలుపు కూడా బద్దలై పోతుంది (లింగా). బుల్లెట్‌ని కూడా ఊదేయగలరు.
73 ఏళ్ల వయసులో జైలర్‌లో ఫైట్స్ చేస్తే చప్పట్లు కొట్టారు. రజినీకాంత్‌ది ఇండియన్ స్క్రీన్ మీద ఏ స్థాయి అంటే , ఏం చేసినా లాజిక్ అడగరు. జస్ట్ మ్యాజిక్ అంతే.
విలన్ నుంచి సూపర్‌స్టార్ వరకు ఆయన ప్రస్థానాన్ని చూస్తే ఏదో కనికట్టు చేసినట్లు అనిపిస్తుంది.


ఫొటో సోర్స్, The India Today Group via Getty Images
గొడవపడ్డ అమ్మాయే రజినీలోని స్టైల్‌ను గుర్తించారు
దాదాపు 52 ఏళ్ల కిందట...ఒక మెడికో అమ్మాయి బస్ కండక్టర్‌తో గొడవపడ్డారు. బ్యాక్ డోర్ నుంచి ఎక్కి, ఫ్రంట్ డోర్ నుంచి దిగాలి. అప్పట్లో బెంగళూరులో సిటీ బస్ రూల్ ఇది. దీన్ని ఆమె పాటించలేదు. తీవ్రమైన మాటల యుద్ధం.
కొద్ది రోజుల తరువాత వాళ్లు స్నేహితులయ్యారు. ఆయన కళ్లలోని తీక్షణత, మాటలోని పదును, కదలికల్లోని స్టయిల్‌ను మొదట గుర్తించింది ఆవిడే. ఆయన వుండాల్సింది బస్సులో కాదని, ఒక స్టార్‌గా ఆకాశంలోనని ఆమె నమ్మారు.
ఆయన ఉద్యోగం మాని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేరారు. అవకాశాలు వచ్చాయి. ఆమె కోసం వచ్చారు. కానీ, లేరు. బెంగళూరు వదిలి వెళ్లిపోయారు. ఎక్కడికో తెలియదు, ఇప్పటికీ. ఆమె పేరు నిర్మల. ఆయన పేరు రజినీకాంత్. ఇంటిపేరు సూపర్ స్టార్.
రజినీ గురించి వినిపించే కథల్లో ఇదొకటి. నిర్మల కథ కావచ్చు, కల్పన కూడా కావచ్చు. ఆయనకి జీవితం చాలా ఇచ్చింది. తీసుకుంది. తొమ్మిదేళ్లకే తల్లిలేని బిడ్డ.
రజినీకాంత్ సినిమా వయసు 50 ఏళ్లు. హీరోగా 46 ఏళ్లు, ఇంత సుదీర్ఘ కాలం నెంబర్ వన్ హీరోగా వుండడం ఒక ప్రపంచ రికార్డ్.
రజనీ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. రానోజీ రావు, రమా బాయి దంపతులకు 1949, డిసెంబరు 12న బెంగళూరులో నాలుగో సంతానంగా ఆయన జన్మించారు. ఇంటిలో అందరికంటే ఆయనే చిన్నవాడు.
కండక్టర్ కాక ముందు కూలిపనులు చేశారు. మనిషిలో విపరీతమైన కోపం, లెక్కలేనితనం. ఎదిరించే లక్షణం. తల్లిలేనితనం నుంచి వచ్చిన ఫస్ట్రేషన్. ఇంట్లో వాళ్లు భయంతో రామకృష్ణ ఆశ్రమానికి పంపారు. నెమ్మది అలవడింది.
బస్సులో రజినీకాంత్ టికెట్లు ఇస్తున్న పద్ధతి, బస్సు దిగడం ఎక్కడంలోని స్టయిల్ ఇవన్నీ డ్రైవర్ రాజబహదూర్‌ని ఆకర్షించాయి. రజినీని మద్రాస్‌కి తరిమిన వ్యక్తుల్లో ఈయన ముఖ్యులు.
ఇప్పటికీ ఈయన ఇంటికి మారువేషంలో వచ్చి సూపర్‌స్టార్ గంటలుగంటలు కబుర్లు చెబుతారని అంటారు.

ఫొటో సోర్స్, India Today Group via Getty Images
'పాత లుంగీ ముడతల చొక్కా'
రజినీకాంత్‌కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఓసారి బెంగళూరులో ఓ దేవాలయానికి వెళ్లాలనుకున్నప్పుడు, జనాలు ఎక్కువగా ఉంటారనీ, వెళ్లడం మంచిది కాదనీ సన్నిహితులు వారించారు.
కానీ వాళ్ల మాట వినకుండా ఓ పాత లుంగీ కట్టుకొని, ముడతల పడ్డ చొక్కా వేసుకొని ఓ పేద వృద్ధుడిలా ఆ గుడిలో రజనీ అడుగుపెట్టారు. ఆయన్ని అలా చూసిన ఓ గుజరాతీ మహిళ, బిచ్చగాడు అనుకొని జాలిపడి రజనీ చేతిలో పది రూపాయల నోటు పెట్టి ముందుకెళ్లారు.
రజినీ కూడా వద్దనకుండా ఆ డబ్బులను జేబులో పెట్టుకున్నారు. కాసేపటి తరవాత రజనీ హుండీలో వంద రూపాయలు వేయడం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయారు.
ఆపైన రజినీ ఖరీదైన కారెక్కడం చూసి తన తప్పు తెలుసుకున్న మహిళ, దగ్గరికొచ్చి తానిచ్చిన పది రూపాయల్ని తిరిగిచ్చేయమన్నారు. కానీ రజినీ దానికి ఒప్పుకోలేదు.
'ఇలాంటి సందర్భాల్లోనే నేనేంటో నాకు తెలుస్తుంది. నా స్థాయిని గుర్తుచేయడానికి దేవుడే మీతో అలా చేయించారేమో' అంటూ ఆ మహిళకి సర్దిచెప్పారు రజినీ.
ఆయన నిరాడంబరతకు అద్దంపట్టే ఘటన ఇది. 'ద నేమ్ ఈజ్ రజనీకాంత్' అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు రచయిత్రి గాయత్రీ శ్రీకాంత్.

ఫొటో సోర్స్, X/Lokesh Kanagaraj
'నువ్వు హీరోనా'
''ఈ మధ్య కర్ణాటకలో ఉండే మా అన్నయ్య ఇంటికెళ్లా. నన్ను చూడటానికి పక్కింట్లో ఉండే నందులాల్ అనే రాజస్థానీ పెద్దాయన ఒకరు వచ్చారు.
'ఏంటి రజినీ ఇంకా రిటైర్ అవలేదా' అనడిగారు. 'లేదండీ.. ఓ సినిమాలో నటిస్తున్నా, ఐశ్వర్యారాయ్ హీరోయిన్' అని చెప్పా. 'ఓహ్ వెరీగుడ్, ఐశ్వర్య బాగా నటిస్తుంది. ఇంతకీ అందులో హీరో ఎవరు?' అనడిగారు. నాకెలా చెప్పాలో అర్థం కాలేదు. 'నేనే హీరోని' అని చెప్పేసరికి ఆయనకి నోట మాట రాలేదు. కాసేపు నన్ను అలా చూస్తుండిపోయారు.
'ఐశ్వర్య, అమితాబ్, అభిషేక్... వీళ్లందరికీ ఏమైంది' అని గొణుగుతూ ఆయన వెళ్లిపోయారు. నేను హీరోనంటే ఆ పెద్దాయనే నమ్మలేదు. అలాంటి నాతో కలిసి నటించినందుకు థాంక్యూ ఐశ్వర్య'' అంటూ రోబో ఆడియో వేడుకలో తన నిజాయితీతో అందర్నీ ఆశ్చర్యపరిచారు రజినీ.

ఫొటో సోర్స్, Rajinikanth/facebook
స్వామీజీగా సూపర్‌స్టార్
వీరప్పన్ చెరనుంచి కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ విడుదలయ్యాక, ఆయన్ని పరామర్శించడానికి స్వామీజీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి వెళ్లారు. రాజ్‌కుమార్‌తో మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన అనేక విషయాలను ఆ స్వామీజీ చెప్పడం మొదలుపెట్టారు.
తనకూ, కొందరు సన్నిహితులకూ మాత్రమే తెలిసిన విషయాల్ని ఆ బాబా చెబుతుండటం విని రాజ్‌కుమార్ చాలా ఆశ్చర్యపోయారు. కాసేపటి తరవాత ఆ బాబా తన తలాపాగానీ, గడ్డాన్నీ తొలగించాకే అందరికీ అర్థమైంది.. అలా స్వామీజీ వేషంలో వచ్చింది రజినీకాంత్ అని. రాజ్‌కుమార్‌ను ఆటపట్టించడానికి రజనీ వేసిన ఆ వేషం, ఆయన హాస్య చతురతకి ఓ ఉదాహరణ.

ఫొటో సోర్స్, VALLI VELAN MOVIES
నేలమీద రజనీ..
'దళపతి' సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులవి. నటుడు అరవింద్ స్వామికి అదే తొలి సినిమా. తన షాట్ వచ్చేవరకు పక్కన వేచి ఉండమని దర్శకుడు చెప్పడంతో అరవింద్ ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ ఏసీ ఆన్‌లో ఉండటంతో పాటు మంచం కూడా శుభ్రంగా కనిపించడంతో ఆదమరిచి అక్కడే నిద్రపోయారు.
కాసేపయ్యాక అరవింద్‌కి మెలకువ వచ్చి చూసేసరికి రజినీకాంత్ అదే గదిలో నేల మీద పడుకొని కనిపించారు. రజనీని అలా చూసి కంగారు పడుతూ బయటికి వెళ్లిన అరవింద్ స్వామి, విషయమేంటని ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ని అడిగారు.
'మీరు పడుకుంది రజినీ సార్ గది. మిమ్మల్ని లేపడానికి మేం వస్తుంటే, రజినీ సార్ వద్దని వారించారు. ఆయనే నేల మీద పడుకున్నారు' అని ఆ అసిస్టెంట్ చెప్పడంతో ఆశ్చర్యపోవడం అరవింద్ స్వామి వంతైంది. ఈ విషయాన్ని అరవింద్ స్వామే స్వయంగా ఓ టీవీ కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చెక్కుచెదరని స్నేహం
'రోబో' సినిమా విడుదలైన తరవాత చెన్నైలో అభిమానులంతా పండగ చేసుకుంటుంటే రజినీకాంత్ మాత్రం ఒంటరిగా బెంగళూరు వెళ్లారు. అక్కడ ఓ రిటైర్డ్ బస్ డ్రైవర్‌తో కలిసి ఆలయాలను సందర్శించడం మొదలుపెట్టారు.
అలా ఓ గుళ్లో ఆ మాజీ డ్రైవర్‌ని కూర్చొబెట్టి తన తరవాతి సినిమా స్టోరీ లైన్ వినిపించి, దానిపైన అభిప్రాయం చెప్పమని రజినీ అడిగారు. దశాబ్దాల సినీ అనుభవం ఉన్న రజినీ ఓ సాధారణ డ్రైవర్‌ను అభిప్రాయం అడగడం ఆశ్చర్యం కలిగించినా, రజనీకి అది బాగా అలవాటైన పనే.
దాదాపు నలభై ఏడేళ్ల క్రితం రజనీకాంత్‌ని సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించిన స్నేహితుడు రావ్ బహదూరే ఈ రిటైర్డ్ బస్ డ్రైవర్. తనలో మొదట హీరోని చూసింది తన స్నేహితుడు బహదూరే అంటారు రజినీ. అందుకే ఇప్పటికీ స్నేహితుడి మాటకీ, జడ్జ్‌మెంట్‌కీ ఆయన గౌరవమిస్తారు. 'ఫోర్బ్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రావ్ బహదూర్ ఈ విషయాల్ని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా అయ్యారు సూపర్‌స్టార్
'కమల్ హాసన్ ఉన్న రాష్ట్రంలో నేనెలా సూపర్ స్టార్ అయ్యాననే సందేహం చాలామందికి రావొచ్చు. నేను నా దారి మార్చుకోవడం వల్లే ఈ ఇమేజ్ వచ్చింది. గతంలో నేను ఎంచుకునే కథల పట్ల కమల్ అసంతృప్తితో ఉండేవారు. ఆ విషయాన్ని నాతో చాలా సార్లు చర్చించారు. నేను కాస్త భిన్నమైన కథల్ని ఎంచుకోవాలన్నది ఆయన అభిప్రాయం. కానీ కమల్ అప్పటికే భిన్నమైన సినిమాలు చేస్తున్నారు కాబట్టి, ఆయన దారిలో వెళ్లకుండా నేను కమర్షియల్ చిత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అలా నా దారి మార్చుకున్నా' అని కమల్ యాభై ఏళ్ల సినిమా వేడుకల సందర్భంగా రజినీ అన్నారు.
తాను సూపర్‌స్టార్ కావడానికి పరోక్షంగా మరో సూపర్‌స్టార్ మాటలే కారణమని రజినీకాంత్ చెప్పిన తీరుకు సభలో ఉన్నవారంతా చప్పట్లు చరిచారు.

ఫొటో సోర్స్, Sun Pictures
తెలుగులోనూ క్రేజ్
‘‘నాన్నా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్‌గా వస్తుంది’’
‘‘ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’’
‘‘ నా దారి... రహదారి’’
ఈ డైలాగులన్నీ రజినీకాంత్ నటించిన డబ్బింగ్ సినిమాలలోవి. ఆయన తెలుగునాట కూడా ఎంతగా ఫేమస్సో చెప్పడానికి జనం నోళ్లలో నానే ఈ డైలాగులే నిదర్శనం.
ఆయన నటరత్న ఎన్టీరామారావుతో టైగర్ సినిమాలో నటించారు. హీరో కృష్ణతో అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలలో నటించారు. అలాగే శోభన్‌బాబుతో జీవనపోరాటం చిత్రంలోనూ నటించారు. చిరంజీవి, రజినీకాంత్ కూడా కలిసి నటించారు. తాజాగా నాగార్జున, రజినీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా విడుదలైంది.
ఇక మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో, మోహన్‌బాబు తండ్రిగా, ఊరిపెద్దగా ఇచ్చే తీర్పులు ‘‘ఆపరా... అంతకుమించి ఒక్కమాట మాట్లాడినా’’ అంటూ సాయికుమార్ డబ్బింగ్‌తో రజినీకాంత్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లింది.
పెదరాయుడులో ఆయన చుట్టకాల్చే స్టైల్, భుజంపై కండువా వేసుకునే స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
సినిమాలలో ఆయన సిగరెట్ కాల్చే స్టైల్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది.
రజినీకాంత్ హీరోగా నిలదొక్కునే క్రమంలోఅటు తమిళంతోపాటు తెలుగు సినిమాలలోనూ నటించేవారు . తరువాత తమిళంలో బిజీ అయిపోయారు. దీంతో తమిళంలో ఆయన నటించిన సినిమాలు దాదాపుగా తెలుగులోనూ డబ్ అవడం మొదలైంది.
బాషా, నరసింహ, అరుణాచలం, చంద్రముఖి, రోబో, శివాజీ,, జైలర్ లాంటి సినిమాలు తెలుగులోనూ భారీ విజయాలు అందుకోవడమే తెలుగునేలపై రజినీకి ఉన్న స్టార్‌డమ్‌కు నిదర్శనం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














