నిషేధాన్ని పట్టించుకోకుండా కెన్యాలో సెక్స్‌వర్కర్లతో గడిపిన బ్రిటిష్ సైనికులు

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, స్టూవర్ట్ మెక్‌లీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కెన్యాలోని వివాదాస్పద బ్రిటిష్ ఆర్మీ స్థావరంలోని కొందరు సైనికులు సెక్స్‌వర్కర్లతో గడుపుతున్నట్టు బ్రిటిష్ ఆర్మీ విచారణలో తేలింది.
కెన్యాలోని బటుక్ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌లోని సైనికులు సెక్స్ వర్కర్లతో 'తక్కువ లేదా మితమైన' స్థాయిలో గడిపినట్లు నివేదిక తెలిపింది. దీన్ని ఆపడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ఓ రిపోర్టు తెలిపింది.
ఈ స్థావరంలో 2022 జులై నుంచి రెండేళ్ల పాటు సైనికుల ప్రవర్తనను పరిశీలించేందుకు చేసిన విచారణలో ఈ అంశం వెలుగు చూసింది. కొంతమంది సైనికులు సెక్స్ కోసం స్థానిక మహిళలకు డబ్బులు చెల్లిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఐటీవీ పరిశోధన చేసిన తర్వాత ఆర్మీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది.
బటుక్ స్థావరంలో ఉన్న బ్రిటిష్ సైనికుడొకరు ఆగ్నెస్ వంజిరు అనే స్థానిక మహిళను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాక ప్రజాందోళనలు మొదలయ్యాయి. దీని తరువాత ఐటీవీ డాక్యుమెంటరీ రూపొందించింది.
అప్పటి నుంచి కెన్యా రాజధాని నైరోబికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్యుకి పట్టణానికి సమీపంలో ఉన్న శిక్షణ కేంద్రంలోని దళాల ప్రవర్తనపై వరుస ఆరోపణలు వచ్చాయి.
లైంగిక దోపిడీ, దాడులను అరికట్టడంలో భాగంగా విదేశాల్లోని సైనికులు సెక్స్ వర్కర్లతో గడపడంపై 2022లో బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిషేధం విధించింది.


ఫొటో సోర్స్, facebook.com/BATUKOfficial
దర్యాప్తులో ఏం తేలింది?
ఏ హోదాలో ఉన్న సైనికులైనా సరే, లైంగిక దోపిడీకి పాల్పడకుండా చూసేందుకు సైన్యం కట్టుబడి ఉందని బ్రిటన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ సర్ రోలీ వాకర్ ఒక ప్రకటనలో చెప్పారు.
‘‘కెన్యాలో ఇప్పటికీ పరిమిత స్థాయిలో సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు దర్యాప్తు కమిటీ పరిశోధనలో తేలింది. ఇలా జరగడానికి వీల్లేదు’’ అని ఆయన చెప్పారు.
''బ్రిటిష్ ఆర్మీలో లైంగిక దోపిడీకి, వేధింపులకు ఎలాంటి స్థానం లేదు. ఇది బ్రిటిష్ సైనికుడిగా ఉండే విలువలకు పూర్తిగా వ్యతిరేకం. లైంగిక దోపిడీ, వేధింపుల ద్వారా లాభం పొందేందుకు బలహీనులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే దీని ఉద్దేశం’’ అని ఆయన అన్నారు.
ఇద్దరు సర్వీస్‌లో ఉన్న అధికారులు, ఒక ప్రభుత్వ అధికారి, స్వతంత్ర సలహాదారు ఉన్న నలుగురు సభ్యుల బృందం ఈ దర్యాప్తు నిర్వహించింది.
బటుక్‌లోని సైనికుల ప్రవర్తనపై ఈ బృందం దర్యాప్తు చేసింది. సైనికులు డబ్బులు చెల్లించి సెక్స్‌లో పాల్గొనడాన్ని నిషేధిస్తున్న జేఎస్‌పీ769 నిబంధనను ఉల్లంఘనలను ఇన్వెస్టిగేషన్ టీమ్ పరిశీలించింది.
2022 జులైలో నియమావళి అమల్లోకి వచ్చినప్పటికీ బటుక్‌లో 35 సార్లు సైనికులు డబ్బు చెల్లించి సెక్స్‌లో పాల్గొన్నారని నివేదిక తెలిపింది. ఆ సమయంలో బటుక్ సైనిక శిక్షణ స్థావరంలో 7666 మంది బ్రిటిష్ సైనికులు ఉన్నారు.
ఆర్మీ సిబ్బంది కోసం 2022 నవంబర్‌లో కొత్త నియమావళిపై శిక్షణ ఇవ్వడానికి ముందు సెక్స్ వర్కర్లతో గడిపిన సంఘటనలు 26 నమోదైనట్లు దర్యాప్తు బృందం పరిశోధనలో తేలింది. ఆ తర్వాత 9 కేసులు నమోదయ్యాయి.
అయితే మెజార్టీ కేసుల్లో సైనికులు డబ్బులిచ్చి సెక్స్‌లో పాల్గొన్నట్లు నిరూపణ కాలేదు. ప్రస్తుతం ఐదు కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని విదేశీ కార్యాలయం బీబీసీతో చెప్పింది. వీటి గురించి దర్యాప్తు పూర్తైన తర్వాత ఆరోపణలు వచ్చాయి.
నివేదికలో సూచనలనను అమలు చేస్తామని ఆర్మీ తెలిపింది. సెక్స్ వర్కర్లను ఉపయోగించుకున్న సైనికులను డిస్మిస్ చేయడంతో పాటు అదనపు శిక్షణ ఇచ్చే అంశాన్ని అమలు చేస్తామని పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook.com/BATUKOfficial
మహిళ హత్యతో కలకలం
వంజిరు అనే ఓ బిడ్డతల్లిని బటుక్‌లో హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడవేశారు. ఇందులో బ్రిటిష్ సైనికుడి హస్తమున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హత్య జరిగిన రోజు రాత్రి వంజిరు ఓ హోటల్‌లో బ్రిటిష్ సైనికులతో ఉన్నారు. ఈ విషయాన్ని 2021లో సండే టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో బటుక్‌లో సైనికుల ప్రవర్తనపై దర్యాప్తు మొదలైంది.
సైన్యం నియమించిన కమిటీతో పాటు కెన్యాలో ఎంపీలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. బటుక్ పట్టణంలో బ్రిటిష్ సైనికులు తమను గాయాలయ్యేలా కొట్టారని, స్థానిక మహిళలతో పిల్లలను కని వారిని వదిలి వేశారని ఫిర్యాదులు వచ్చాయి.
ఈ ఏడాది జూన్‌లో బటుక్ సైనిక స్థావరంలో ఉన్న ఓ సైనికుడిని అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణల మీద స్వదేశానికి పంపించారు.
సైన్యం నియమించిన దర్యాప్తు బృందం బటుక్‌లోని అనేక మంది స్థానికులతో మాట్లాడింది. అందులో మెజార్టీ ప్రజలు బటుక్‌లో బ్రిటిష్ ఆర్మీ క్యాంపు ఉండటం పట్లం సంతోషం వెలిబుచ్చారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














