సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు: ‘‘మీకు పిల్లలు పుట్టరు..మిగిలింది అదొక్కటే’’ అంటూ మోసం, దీనిపై పోలీసులు ఇంకా ఏం చెబుతున్నారంటే

సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్, ఐవీఎఫ్, డాక్టర్ నమ్రత, హైదరాబాద్ పోలీస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘పాప పుడితే 3.50 లక్షల రూపాయలు, బాబు పుడితే 4.50 లక్షల రూపాయలు ఇస్తామని ఏజెంట్లతో డీల్ కుదుర్చుకున్నారు. క్లయింట్ల ఆర్థిక స్తోమతను బట్టి 11 లక్షల రూపాయల నుంచి 40 లక్షల దాకా వసూలు చేశారు. సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి’’ అని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

సరోగసీ పేరుతో పిల్లల విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమ్రత సహా ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు జులై 27న హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ ఎస్. రష్మీ పెరుమాళ్ ప్రకటించారు.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు సరోగసీ పేరుతో తమను మోసం చేశారని తొలుత రాజస్థాన్‌కు చెందిన దంపతులు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ గోపాలపురం పోలీసులు జులై 25న కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణలో పురోగతిని ఆగస్టు 12న (మంగళవారం) నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)కు బదలాయిస్తూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారామె.

గోపాలపురం పోలీసుస్టేషన్‌లో ఇప్పటివరకు మొత్తం 9 కేసులు నమోదు చేశారు.

‘‘జులై చివరి వారంలో నమోదైన మొదటి ఎఫ్ఐఆర్‌కు అదనంగా ఎనిమిది ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం. డాక్టర్లు, ఏజెంట్లు, పిల్లలను అమ్మిన తల్లిదండ్రులు సహా మొత్తం 25 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాం’’ అని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో తాను ఎలాంటి తప్పూ చేయలేదని, త్వరలోనే బయటకు వచ్చి నిజాలు వెల్లడిస్తానని డాక్టర్ నమ్రత పోలీసుల విచారణకు హాజరైన సందర్భంలో మీడియాకు చెప్పారు.

"నేను సరోగసీ చేయలేదు. దత్తత ఇచ్చేందుకు ప్రయత్నించా" అని ఆమె తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్, ఐవీఎఫ్, డాక్టర్ నమ్రత, హైదరాబాద్ పోలీస్

ఫొటో సోర్స్, Hyderabad Police

ఫొటో క్యాప్షన్, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్‌పై 9 కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.

'మరో నలుగురు డాక్టర్ల సహకారం'

సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలోనూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారని తమ విచారణలో తేలిందని డీసీపీ చెప్పారు.

సికింద్రాబాద్‌లోని క్లినిక్‌కు క్లయింట్లను తీసుకువచ్చి ప్రాథమిక టెస్టులు చేసేవారని, తర్వాత వారిని విశాఖపట్నం తీసుకెళ్లేవారని చెప్పారు.

"రెండు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తే పరిధి మారి కేసులు పెట్టినా ఇబ్బంది ఉండదని భావించారు" అని రష్మీ పెరుమాళ్ చెప్పారు.

ఇప్పటివరకు అరెస్టయిన వారిలో నలుగురు డాక్టర్లు ఉన్నట్లు వివరించారు.

‘‘హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సదానందం అనస్తీషియా స్పెషలిస్టుగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఉన్నారు. వైజాగ్‌కు చెందిన డాక్టర్ విద్యుల్లత (పీడియాట్రిషన్), డాక్టర్ రవి (అనస్తీషియా), డాక్టర్ ఉష (గైనకాలజిస్టు) ఉన్నారు’’ అని చెప్పారు.

వీరిలో కొందరు డాక్టర్ నమ్రతతో కలిసి చదువుకున్నారని చెప్పారు.

వీరి వివరణ కోసం బీబీసీ వారి న్యాయవాదులను సంప్రదించడానికి ప్రయత్నించినా, వారు అందుబాటులోకి రాలేదు. వారు స్పందించగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్, ఐవీఎఫ్, డాక్టర్ నమ్రత, హైదరాబాద్ పోలీస్

ఫొటో సోర్స్, Hyderabad Police

ఫొటో క్యాప్షన్, ఈ కేసులో నిర్వాహకురాలు నమ్రతతోపాటు 8 మందిని అరెస్ట్ చేశారు.

19 మంది ఏజెంట్లు, సబ్ ఏజెంట్ల అరెస్టు

కేసులో ధనశ్రీ సంతోషి అనే ప్రధాన ఏజెంట్ సహా పిల్లల విక్రయాలకు సహకరిస్తున్న 19 మంది ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు చెప్పారు రష్మీ పెరుమాళ్.

వీరిలో అస్సాం, బిహార్‌, ఒడిశాలకు చెందిన వారున్నట్లు గుర్తించారు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే ఉంటూ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

"ఏజెంట్లలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. వారిలో కొందరు ఎగ్ (అండం) డోనార్లుగా వచ్చి ఏజెంట్లుగా మారారు. ఇద్దరు, ముగ్గురు సరొగేట్ మదర్స్ (పిల్లలను కని ఇచ్చే తల్లులు)గా వ్యవహరించారని మా విచారణలో తేలింది" అని చెప్పారు.

50 మందిని మోసం చేసినట్లుగా అనుమానం – పోలీసులు

ఐవీఎఫ్ చికిత్స ఫెయిల్ అవుతుందని నమ్మించి క్లయింట్లను సరోగసీకి ఒప్పించేవారని పోలీసుల విచారణలో తేలింది.

ఆ తర్వాత పిల్లలు కావాలనుకునే భార్యాభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి సరోగసీ ప్రక్రియ మొదలైనట్లుగా చెప్పేవారు. నెలనెలా అల్ట్రా సౌండ్ స్కాన్ ఫొటోలు పంపించేవారని పోలీసులు చెప్పారు.

"ఈలోగా ఏజెంట్లు డెలివరీకి సిద్ధంగా ఉన్న పేద మహిళలను గుర్తించి పిల్లలను కొనేందుకు ఒప్పందం చేసుకునేవారు. అలా కొన్న పిల్లలనే సరోగసీ ద్వారా పుట్టినట్లు నమ్మించి ఇచ్చేవారు" అని రష్మీ పెరుమాళ్ వివరించారు.

"డాక్టర్ సూరి శ్రీమతి అనే 90 ఏళ్ల డాక్టర్ పేరును నమ్రత వాడుకుని సికింద్రాబాద్ క్లినిక్‌ను నడుపుతున్నారు. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు పెట్టాం" అని చెప్పారు.

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై 2010 నుంచి 2020 వరకు 15 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కొన్ని కేసుల్లో డాక్టర్ నమ్రతతో ఫిర్యాదుదారులు రాజీ కుదుర్చుకోగా, మిగిలిన కేసులు కొనసాగుతున్నాయి.

"ఫేక్ ఐవీఎఫ్ చికిత్సలతో దాదాపు 50 మందిని మోసం చేసి సరోగసీకి ఒప్పించినట్లుగా రికార్డులను బట్టి తెలుస్తోంది. కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్, డాక్టర్ నమ్రత బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేయిస్తాం. పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది" అని చెప్పారు డీసీపీ రష్మీ పెరుమాళ్.

సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్, ఐవీఎఫ్, డాక్టర్ నమ్రత, హైదరాబాద్ పోలీస్

ఫొటో సోర్స్, facebook.com/universalsrushtifertilityindia

ఫొటో క్యాప్షన్, డాక్టర్ నమ్రత

మొదటి కేసు ఎలా నమోదైందంటే...

‘‘నా నుంచి అండం, నా భర్త నుంచి వీర్యం తీసుకుని సరోగసీ విధానంలో బేబీని పుట్టిస్తామని చెప్పారు. ఆ తర్వాత మాకు ఇచ్చిన పసికందు మా బిడ్డ కాదని, మేం మోసపోయామని అర్థమైంది’’ అంటూ సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసర్చ్ సెంటర్‌పై రాజస్థాన్‌కు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు.

ఇందుకుగాను రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు చెప్పారని దంపతులు తెలిపారు. నిరుడు సెప్టెంబరులో విశాఖపట్నంలోని ఫెర్టిలిటీ సెంటర్‌కు దంపతులను తీసుకెళ్లి.. వారి నుంచి అండం, వీర్యం సేకరించారు.

2024 సెప్టెంబరు 23వ తేదీన సరోగేట్ తల్లి (బిడ్డను కనేందుకు ఒప్పందం చేసుకున్న మహిళ) దొరికిందని సెంటర్ నిర్వాహకులు రాజస్థాన్ దంపతులకు సమాచారం ఇచ్చారు.

‘‘తర్వాత వివిధ దశల్లో ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారు. అలా ఈ ఏడాది మే నాటికి రూ.30.26 లక్షలు చెల్లించాం’’ అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బేబీ పుట్టాక డీఎన్ఏ టెస్టు చేయాలనేది ఫెర్టిలిటీ సెంటర్, రాజస్థాన్ దంపతుల మధ్య ఒప్పందంగా ఉంది.

డెలివరీకి ముందుగానే డీఎన్ఏ టెస్టు చేయాలని వారు కోరినా, డాక్టర్ నమ్రత దాటవేస్తుండటంతో దంపతుల్లో అనుమానం మొదలైంది.

తర్వాత సరోగేట్ తండ్రి మరికొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ నిర్వాహకులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రూ.2 లక్షలు ఇచ్చేందుకు దంపతులు అంగీకరించారు.

ఆ తర్వాత వారి చేతిలో అప్పుడే పుట్టిన బేబీని పెట్టారు. డీఎన్ఏ రిపోర్టులు లేకుండా బిడ్డను ఇవ్వడంతో రాజస్థాన్ దంపతులకు అనుమానం వచ్చి నిలదీయడంతో డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నారు. అయితే, టెస్టులు చేయకుండా ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు దాట వేస్తున్నట్లుగా దంపతులు గుర్తించారు.

తర్వాత ఆ దంపతులు దిల్లీకి వెళ్లి, అక్కడ బేబీ సహా ముగ్గురికీ డీఎన్ఏ టెస్టులు చేయించగా.. అసలు విషయం బయటపడింది. ఆ పసికందుకు వారు తల్లిదండ్రులు (బయోలాజికల్ పేరెంట్స్) కాదని తేలింది.

దీంతో మోసపోయామని గ్రహించిన దంపతులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)