'మీ కాలేయంలో బిడ్డ ఉంది' అని షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్, మరి చివరకు ఏం జరిగింది?

ఉత్తర ప్రదేశ్, మేరఠ్, కాలేయంలో గర్భం

ఫొటో సోర్స్, Prabhat Kumar/BBC

ఫొటో క్యాప్షన్, ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ప్రపంచంలో అత్యంత అరుదైన గర్భం.
    • రచయిత, ప్రేరణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఓ గర్భిణి గురించి డాక్టర్లు చెప్పిన విషయం షాకింగ్‌ న్యూస్‌గా మారింది. యూపీలో ఈ కేసు ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఆమె కడుపులోని పిండం గర్భాశయంలో కాకుండా లివర్‌ (కాలేయం)లో పెరుగుతోంది.

బులంద్‌షహర్ జిల్లాలోని దస్తురా గ్రామంలో నివసించే 35 ఏళ్ల సర్వేష్‌ కేసు, అనేక మంది సీనియర్ డాక్టర్లు, రీసర్చర్లకు పరిశోధనాంశంగా మారింది.

అసలు ఇదెలా జరిగింది? ఇప్పుడామె పరిస్థితి ఎలా ఉంది? ఇది ఎలా ముగుస్తుంది. ఇలాంటి అనేక ప్రశ్నలు సామాన్య ప్రజల్లో ఉన్నాయి.

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి బీబీసీ ప్రతినిధులు దస్తూరా గ్రామానికి వెళ్లారు.

బీబీసీ ప్రతినిధులు సర్వేష్ ఇంటికి వెళ్లేటప్పటికి, ఆమె మంచంపై పడుకుని ఉన్నారు. పొట్ట చుట్టూ పెద్ద బెల్ట్ కట్టి ఉంది. పైకి లేచేందుకు, పడుకుని అటు ఇటు తిరిగేందుకు కూడా ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారు.

పొట్ట పై భాగంలో కుడివైపున 21 కుట్లు పడ్డాయని ఆమె బీబీసీతో చెప్పారు.

బరువైన వస్తువులను ఎత్తకూడదని, తేలికైన ఆహారం తింటూ, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ ఆమెకు సూచించారు.

మంచం మీద కూర్చోవడం, పడుకోవడం, బాత్‌రూమ్‌కెళ్లడం, దుస్తులు మార్చుకోవడం... ఇలా అన్ని పనుల్లోనూ ఆమెకు భర్త పరమ్‌వీర్ సాయం చేస్తున్నారు.

మూడు నెలల నుంచి తమ జీవితం చిక్కుముడిలా మారిందని సర్వేష్, పరమ్‌వీర్‌లు చెప్పారు.

"నాకు బాగా వాంతులు అవుతున్నాయి. అలసిపోతున్నా. నొప్పిగా ఉంటోంది. నాకేమవుతుందో అర్థం కావడం లేదు" అని ఆమె బీబీసీతో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తర ప్రదేశ్, మేరఠ్, కాలేయంలో గర్భం

ఫొటో సోర్స్, Prabhat Kumar/BBC

ఫొటో క్యాప్షన్, వీలైనంత త్వరగా సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ సూచించినట్లు పరమ్‌వీర్ చెప్పారు.

తన ఆరోగ్యం విషమించడం మొదలైన తర్వాత డాక్టర్‌ను సంప్రదించానని, అల్ట్రా సౌండ్ చేయించుకోవాలని సూచించారని సర్వేష్ చెప్పారు.

అయితే అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో అంతా సాధారణంగా ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆమెకు కడుపు నొప్పికి మందులు ఇచ్చారు.

నెల రోజుల పాటు కడుపు నొప్పికి మందులు తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో ఆమెకు మళ్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు.

ఈసారి వచ్చిన రిపోర్ట్‌లో ఒక అసాధారణమైన, అరుదైన విషయం బయటపడింది. డాక్టర్లు కూడా దాన్ని నమ్మలేకపోయారు.

ఉత్తర ప్రదేశ్, మేరఠ్, కాలేయంలో గర్భం

ఫొటో సోర్స్, Prabhat Kumar/BBC

ఫొటో క్యాప్షన్, తన కెరీర్‌లో ఇలాంటి కేసు చూడలేదనని రేడియాలజిస్ట్ చెప్పారు.

‘మీ కాలేయంలో పాప ఉంది’

సర్వేష్‌కు అల్ట్రాసౌండ్ చేసిన డాక్టర్ సానియా జెహ్రా, ఆమె కాలేయంలో బిడ్డ ఉందని చెప్పారు. దీంతో సర్వేష్, ఆమె భర్త పరమ్‌వీర్ అయోమయంలో పడ్డారు.

ఇది నిజమా కాదా అని తేల్చుకోవడానికి సర్వేష్, బులంద్ షహర్ నుంచి మేరఠ్ వెళ్లి మరోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐ చేయించుకున్నారు.

రెండు రిపోర్టుల్లోనూ అదే విషయం వెల్లడైంది.

ఆమెకు రుతుచక్రం సాధారణంగా ఉండటంతో ఈ రిపోర్టులను నమ్మలేకపోయారు.

తన 20 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఎంఆర్ఐ చేసిన రేడియాలజిస్ట్ డాక్టర్ కేకే గుప్తా బీబీసీతో చెప్పారు.

నివేదికలో వెల్లడైన అంశాన్ని నిర్థరించుకునేందుకు ఆయన ‘మీ రుతుస్రావం సాధారణంగా ఉందా లేదా’ అని సర్వేష్‌ను పదేపదే అడిగారు.

"ఆ మహిళ కాలేయం కుడివైపున 12 వారాల పిండం ఉంది. అందులో గుండె స్పందన కూడా స్పష్టంగా కనిపించింది. దీన్ని ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది చాలా అరుదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుపడు మహిళలకు అధిక రక్త స్రావం అవుతుంది. దీనిని వారు సాధారణ రుతుస్రావంగా భావిస్తారు. ఇలాంటి కేసుల్లో గర్భధారణను గుర్తించడానికి సమయం పడుతుంది" అని డాక్టర్ గుప్తా వివరించారు.

ఉత్తర ప్రదేశ్, మేరఠ్, కాలేయంలో గర్భం

ఫొటో సోర్స్, Prabhat Kumar/BBC

ఫొటో క్యాప్షన్, సర్వేష్‌కు సర్జరీ చేసిన వైద్యుల బృందంలో డాక్టర్ పరుల్ దహియా ఉన్నారు.

‘సర్జరీ తప్ప ప్రత్యామ్నాయం లేదు’

పిండం పెద్దగా ఉంటే కాలేయం పగిలిపోయే ప్రమాదం ఉందని ఆ దంపతులకు డాక్టర్ చెప్పారు. ఈ పరిస్థితిలో బిడ్డ, తల్లి బ్రతకలేరు. అందువల్ల శస్త్రచికిత్స తప్ప వేరే మార్గం లేదని సూచించారు.

అయితే బులంద్‌షహర్‌లో ఏ డాక్టర్ కూడా ఈ కేసును చూసేందుకు సిద్ధపడలేదని పరమ్‌వీర్ చెప్పారు. దీంతో ఆయన మేరఠ్ వెళ్లారు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది.

ఇది చాలా క్లిష్టమైన కేసని, తల్లి బిడ్డ ప్రాణాలకుప్రమాదం ఉందని వైద్యులు ఆయనకు చెప్పారు.

సర్వేష్‌ను దిల్లీ తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు.

"మేము పేదవాళ్లం. దిల్లీ వెళ్లి అక్కడ ఖర్చులు భరించలేం. అనేకసార్లు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన తర్వాత, ఇక్కడే చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాం" అని సర్వేష్ చెప్పారు.

మేరఠ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల బృందం ఆమెకు సర్జరీ చేసేందుకు అంగీకరించింది.

"ఆమె మా దగ్గరకు వచ్చినప్పటికి, 3 నెలలుగా నొప్పితో బాధ పడుతోంది. ఆమె దగ్గర అల్ట్రాసోనోగ్రఫీ, ఎంఆర్‌ఐ రిపోర్టులు ఉన్నాయి. ఇది ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసు అని అందులో స్పష్టంగా ఉంది. ఈ కేసు గురించి మేము ఒక సీనియర్ సర్జన్‌తో మాట్లాడాము. ఎందుకంటే అలాంటి సందర్భంలో మీకు సర్జన్ అవసరం. ఆయన సర్జరీ చేసేందుకు అంగీకరించారు. సర్జరీ చేశాం" అని శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ల బృందంలో ఒకరైన పరుల్ దహియా చెప్పారు.

ఈ సర్జరీ గంటన్నర పాటు జరిగిందని డాక్టర్లు చెప్పారు.

లివర్‌లో ఉన్న పిండం, సర్జరీ నిర్వహించినప్పుడు తీసిన వీడియోను డాక్టర్ కేకే గుప్తా బీబీసీకి చూపించారు.

ఉత్తర ప్రదేశ్, మేరఠ్, కాలేయంలో గర్భం

ఫొటో సోర్స్, Prabhat Kumar/BBC

ఫొటో క్యాప్షన్, సర్వేష్ మెడికల్ రిపోర్టుల్ని బీబీసీ పరిశీలించింది.

ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ గర్భం అంటే ఏమిటి?

సాధారణంగా అండాశయం నుండి విడుదలైన గుడ్డు వీర్యంతో కలిసినప్పుడు స్త్రీ గర్భం ధరిస్తుంది.

ఆ గుడ్డు ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భాశయంలోకి వెళ్లి పిండంగా మారి గర్భంలో అభివృద్ధి చెందుతుంది.

అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ఫలదీకరణ చెందిన అండం, గర్భాశయాన్ని చేరుకోకుండా ఫెలోపియన్ ట్యూబ్‌ లేదా వేరే అవయవం ఉపరితలానికి అంటుకుంటుందని బనారస్ హిందూ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ మమతా సింగ్ వివరించారు.

"ఈ కేసులో ఆ గుడ్డు కాలేయంలో చిక్కుకుంది. కాలేయానికి రక్త సరఫరా బాగా జరుగుతుంది. అందుకే ఇది తొలినాళ్లలో పిండానికి 'సారవంతమైన భూమి'గా పనిచేస్తుంది. కానీ కొంత సమయం తర్వాత తల్లికి, బిడ్డకి ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు" అని డాక్టర్ మమత చెప్పారు.

ఉత్తర ప్రదేశ్, మేరఠ్, కాలేయంలో గర్భం

ఫొటో సోర్స్, Prabhat Kumar/BBC

ఫొటో క్యాప్షన్, ప్రపంచ వ్యాప్తంగా సగటున ఒక శాతం ఇంట్రాహెపాటిక్ గర్భధారణ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్ మమతా సింగ్ వెల్లడించారు.

భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి?

ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ గర్భం ఎంత అరుదు? అన్నది తెలుసుకోవడానికి పట్నా ఎయిమ్స్‌లో ప్రసూతి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మోనికా అనంత్‌ను బీబీసీ సంప్రదించింది.

ఇంట్రాహెపాటిక్ గర్భధారణ కేసులు ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక శాతం నమోదవుతున్నాయనీ, ఇందులో గర్భం గర్భాశయంలో జరగదని డాక్టర్ మోనికా చెప్పారు.

"ఒక అంచనా ప్రకారం 70 నుండి 80 లక్షల గర్భాలలో ఒక కేసు ఇంట్రాహెపాటిక్ గర్భం కావచ్చు" అని ఆమె అన్నారు.

సర్వేష్ కేసు కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా 45 ఇంట్రాహెపాటిక్ గర్భధారణ కేసులు నమోదయ్యాయని, అందులో మూడు భారత్‌కు చెందినవని డాక్టర్ మోనికా చెప్పారు.

మొదటి కేసు 2012 లో దిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో నమోదైంది.

ఆ తర్వాత 2022లో గోవా మెడికల్ కాలేజ్, 2023లో పట్నా ఎయిమ్స్‌లో మూడవ కేసు వెలుగులోకి వచ్చింది.

పట్నా ఎయిమ్స్ కేసును డాక్టర్ మోనికా అనంత్, ఆమె బృందం స్వయంగా పరిశీలించింది.

పట్నా ఎయిమ్స్ కేసులో డాక్టర్ మోనికా బృందం మందుల సాయంతో అండాన్ని నిర్వీర్యం చేశారు. తర్వాత ఏడాది పాటు బాధితురాలిని జాగ్రత్తగా పర్యవేక్షించారు.

తాను చేపట్టిన అరుదైన కేసు గురించి డాక్టర్ మోనికా ఒక రాసిన కథనం పబ్‌మెడ్‌లో ప్రచురించారు.

పబ్‌మెడ్ అమెరికాలోని ప్రముఖ వైద్య పరిశోధన డేటాబేస్.

డాక్టర్ పరుల్ దహియా, డాక్టర్ కేకే గుప్తా బృందం కూడా సర్వేష్ కేసును డాక్యుమెంట్ చేయడం ప్రారంభించారు.

దీన్నిపూర్తి చేసి త్వరలోనే వైద్య పత్రికలో ప్రచురణకు పంపించనున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)