ఆసిమ్ మునీర్ ‘అణు యుద్ధం’ వ్యాఖ్యలకు భారత్ ఇచ్చిన సమాధానం

పాకిస్తాన్, భారత్, ఆసిమ్ మునీర్

ఫొటో సోర్స్, Reuters

పాకిస్తాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇటీవల చేసిన ప్రకటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది.

'అణు దాడి చేస్తామని బెదిరించడం పాకిస్తాన్ అలవాటు' గా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆసిమ్ మునీర్ హెచ్చరికపై 'ది ప్రింట్‌'లో కథనం , ఇతర మీడియాల్లో కథనాల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ ప్రకటన చేసింది.

భారత్‌తో భవిష్యత్తులో యుద్ధం జరిగితే, దానివల్ల పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే, అది అణు యుద్ధంలోకి తీసుకెళ్తుందని అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ అన్నారని 'ది ప్రింట్' తెలిపింది.

దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పందిస్తూ "పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. అణు దాడి చేస్తామని బెదిరించడం పాకిస్తాన్ అలవాటు" అని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత జెండా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత జెండా (ఫైల్)

'అణు బెదిరింపులకు భారత్ తలొగ్గదు'

అమెరికాలో జరిగిన కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ "మాది అణ్వాయుధ దేశం, మేం అంతమైపోతున్నామని భావిస్తే, మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తాం" అని అన్నారని ది ప్రింట్ కథనం తెలిపింది.

"ఇటువంటి ప్రకటనలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోగలదు. ఉగ్రవాదులతో సంబంధాలున్న సైన్యం గల దేశంలో అణ్వాయుధాల భద్రత, నియంత్రణను విశ్వసించలేమనే సందేహాలను ఈ ప్రకటనలు మరింత పెంచుతాయి" అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

‘మరో దేశం భూభాగం నుంచి ఈ ప్రకటనలు చేయడం విచారకరం. భారత్ అణు బెదిరింపులకు తలొగ్గదని ఇప్పటికే స్పష్టంచేసింది. మా జాతీయ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటాం’ అని తెలిపింది.

'విశ్వగురు' ప్రకటనలపై

మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ విజయం సాధించిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశం తనను తాను 'విశ్వ గురు' అని చెప్పుకుంటుందని, కానీ అది నిజం కాదన్నారు.

భారత్ 'వివక్ష, ద్వంద్వ వైఖరి'కి వ్యతిరేకంగా పాకిస్తాన్ విజయవంతమైన దౌత్య యుద్ధం చేసిందని కూడా మునీర్ అన్నారు.

'ఆపరేషన్ సిందూర్'పై భారత సైన్యం, వైమానిక దళ అధిపతుల ప్రకటనలు వెలువడిన సమయంలో అసిమ్ మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు 4న ఐఐటీ మద్రాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన 'ఆపరేషన్ సిందూర్' మిగతా మిషన్ల కన్నా భిన్నమైనదని అన్నారు.

మే నెలలో జరిగిన సంఘర్షణలో భారత్ ఆరు పాకిస్తాన్ విమానాలను కూల్చివేసిందని ఇటీవలె భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. అయితే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వాదనను తిరస్కరించారు.

పహల్గాంలో దాడి జరిగాక, మే 6-7 రాత్రి ''పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశాం'' అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

పహల్గాం దాడి తరువాత రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణ ప్రారంభమైంది. అయితే, మే 10న ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.

కాగా, ఈ ఘర్షణ సమయంలో భారత్‌కు చెందిన "ఐదు ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు" పాకిస్తాన్ పేర్కొంది. ఈ వాదనలను భారత్ తిరస్కరించింది.

మునీర్; డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, PA/REUTERS

ట్రంప్ గురించి మునీర్ ఏమన్నారు?

రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించినందుకు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఆసిఫ్ మునీర్ కృతజ్ఞతలు తెలిపారు.

"భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడమే కాకుండా ప్రపంచంలో అనేక యుద్ధాలను కూడా నిరోధించిన అధ్యక్షుడు ట్రంప్‌కు పాకిస్తాన్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది" అని మునీర్ అన్నారు.

కాల్పుల విరమణకు ట్రంప్ స్వయంగా క్రెడిట్ తీసుకున్నారు కానీ, పాకిస్తాన్ చర్చలను ప్రతిపాదించిన తర్వాతే ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ స్పష్టం చేసింది.

అయితే, కాల్పుల విరమణ ఒప్పందంలో 'మధ్యవర్తిత్వం' వాదనలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)