ఉద్యోగం చేస్తున్నట్లు నటిస్తున్న చైనా నిరుద్యోగులు, ఎందుకంటే...

- రచయిత, సిల్వియా చాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జీతం లేకుండా పని చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అందులోనూ ఆఫీసులో ఉన్నందుకు ఎదురు డబ్బులు చెల్లించడం అసలే ఉండదు.
కానీ, కంపెనీలకు డబ్బులు చెల్లిస్తూ, ఉద్యోగం చేస్తున్నట్లు నటించే నిరుద్యోగుల సంఖ్య చైనాలో పెరిగింది.
దీంతో ఇలాంటి సర్వీసు అందిస్తున్న కంపెనీల సంఖ్య కూడా పెరుగుతోంది.
చైనాలో ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల మార్కెట్ కూలిపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ నిరుద్యోగం 14శాతం కంటే ఎక్కువగా ఉంది.
నిజమైన ఉద్యోగాలు పెరగడం కష్టం కావడంతో, కొంతమంది యువకులు ఇంట్లో ఉండే బదులు డబ్బులు చెల్లించి మరీ ఆఫీసుకు వెళుతున్నారు.
30 ఏళ్ల షుయి ఝౌకు ఫుడ్ బిజినెస్ ఉంది. 2024లో అది మూత పడింది.
దీంతో ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి రోజుకు 30 యువాన్లు చెల్లిస్తూ ప్రిటెండ్ టు వర్క్ అనే కంపెనీకి వెళుతున్నారు.
ఈ కంపెనీ హాంగ్‌కాంగ్‌కు ఉత్తరాన ఉన్న డోంగ్గువాన్ అనే నగరంలో ఉంది.
ఆయన చేరిన ఆఫీసులోనే ఆయనలాంటి మరో ఐదుగురు సహచరులు ఉన్నారు.
"నాకు చాలా సంతోషంగా ఉంది. మేమంతా ఒక గ్రూప్‌గా కలిసి పని చేస్తున్నట్లు అనిపిస్తోంది" అని ఝౌ చెప్పారు.
ఇలాంటివి ప్రస్తుతం చైనాలోని షెంజెన్, షాంఘై, నాంజింగ్, వుహాన్, చెంగ్డూ, కుమింగ్ సహా అన్ని పెద్ద నగరాల్లో కనిపిస్తున్నాయి.
అక్కడ కంప్యూటర్లు, ఇంటర్నెట్, మీటింగ్ రూములు, కెఫెటేరియాలను చూస్తే నిజంగానే ఆఫీసు నడుస్తున్నట్లు అనిపిస్తుంది.
ఆఫీసుకు వచ్చినవాళ్లు అక్కడ ఖాళీగా కూర్చున్నా, కంప్యూటర్లలో ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు.
కొంతమంది సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నిరుద్యోగ యువకుల నుంచి కొన్ని ఆఫీసులు 30 నుంచి 50 యువాన్లు వసూలు చేస్తూ లంచ్, స్నాక్స్, డ్రింక్స్ అందిస్తున్నాయి.


న్యూజీలాండ్‌లోని విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ లెక్చరర్‌గా ఉన్న డాక్టర్ క్రిస్టియన్ యావోకు చైనా ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్ర అవగాహన ఉంది.
‘‘పని చేస్తున్నట్లు నటించడం ఇప్పుడు సర్వసాధారణం. ఆర్థిక రంగంలో జరుగుతున్న మార్పులు, విద్య, ఉద్యోగాల మధ్య సమతుల్యత లేకపోవడం, తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచించడానికి, మార్పుల్లో భాగంగా లభించే చిన్న ఉద్యోగాలు చేయడానికి యువతకు ఇలాంటి ప్రదేశాలు అవసరం" అని ఆయన చెప్పారు.
"మార్పులకు సంబంధించిన పరిష్కారాల్లో ఇలాంటి ఆఫీసు ఒకటి" అని క్రిస్టియన్ యావో అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా సైట్ జియాహోంగ్షు బ్రౌజ్ చేస్తుండగా, ప్రిటెండ్ టు వర్క్ కంపెనీ గురించి ఝౌ తెలుసుకున్నారు. ఆఫీసు వాతావరణం వల్ల స్వీయ క్రమశిక్షణ మెరుగు పడుతుందని భావించినట్లు ఆయన చెప్పారు. ఆయన ఆ ఆఫీసులో చేరి మూడు నెలలైంది.
తాను పని చేస్తున్నట్లు నటిస్తున్న ఆఫీసు ఫోటోలను ఝౌ తన తల్లిదండ్రులకు పంపించారు. ఇప్పుడాయనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ వాళ్లు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.
ఆఫీసుకు వచ్చేవాళ్లు తమకు కావల్సినప్పుడు రావచ్చు, పోవచ్చు. ఝౌ ఉదయం ఎనిమిది లేదా తొమ్మిది గంటల మధ్య ఆఫీసుకు వస్తున్నారు. కొన్నిసార్లు రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంటారు. ఆ ఆఫీసు మేనేజర్ కూడా వెళ్లిపోయిన తర్వాత ఇంటికి వెళతారు.
మిగతావారు స్నేహితులయ్యారని ఝౌ చెప్పారు. వారిలో ఎవరో ఒకరు ఉద్యోగం కోసం వెదుకుతుంటారని, మిగతా వారు జోక్‌లు చెప్పుకోవడం, ఆడుకోవడం లాంటివి చేస్తుంటారు. పని పూర్తైన తర్వాత వాళ్లంత అప్పుడప్పుడు డిన్నర్ కూడా కలిసి చేస్తారు.
ఇలా కొంతమంది ఒక టీమ్‌లాగా ఏర్పడటం తనకు నచ్చిందని, తాను ఆఫీసులో చేరినప్పటి కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని ఝౌ చెప్పారు.
షాంఘైకి వస్తే, నిరుద్యోగ యువకులు డబ్బులిచ్చి ఉద్యోగం చేస్తున్నట్లు నటించేందుకు ఏర్పాటు చేసిన ఆఫీసులో ఒక వర్క్ స్టేషన్‌ను జియోవెన్ టాంగ్ ఈ ఏడాది మొదట్లో అద్దెకు తీసుకున్నారు. 23 ఏళ్ల ఈ యువతి గతేడాది యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు ఇప్పటి వరకు ఫుల్‌టైమ్ జాబ్ దొరకలేదు.
గ్రాడ్యుయేషన్ పూర్తైన ఏడాది లోపు విద్యార్ధులు తప్పని సరిగా ఉద్యోగంలో చేరాలి లేదా ఏదైనా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నట్లు ఆధారం సమర్పించాలని ఆమె చదువుకున్న యూనివర్సిటీలో ఒక అలిఖిత నియమమం ఉంది. అలా చేయకపోతే యూనివర్సిటీ వారికి డిప్లొమా ఇవ్వదు.
అద్దెకు తీసుకున్న ఆఫీసులో ఫోటోలు దిగి తాను ఇంటర్న్‌షిప్ చేస్తున్నానని, అందుకు ఆ ఫోటోలే ఆధారమని ఆమె వాటిని యూనివర్సిటీకి పంపించారు. ఆమె రోజూ డబ్బులు చెల్లించి ఆఫీసులో కూర్చుని ఆన్‌లైన్‌లో నవలలు రాస్తూ కొంత పాకెట్ మనీ సంపాదిస్తున్నారు.
"మీరు నటిస్తున్నట్లైతే, చివరి వరకు నటించండి" అని టాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల కలిగే నిరాశ, అసహనంలో నుంచి ఉద్యోగాలు చేస్తున్నట్లు నటించే ధోరణి ఏర్పడింది’’ అని జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్‌ట్యూట్ ఫర్ సోషల్ ఆంత్రోపాలజీ డైరెక్టర్ డాక్టర్ బియావో జియాంగ్ చెప్పారు.
"పని చేస్తున్నట్లు నటించే యువకులు తమను తాము సురక్షిత వలయంలో బంధించుకుంటున్నారు. దీనివల్ల వారు సమాజం నుంచి దూరం జరిగినా అది వారికి కొంత సౌలభ్యాన్ని ఇస్తుంది" అని ఆయన అన్నారు.
డోంగుగువాన్ నగరంలో ప్రిటెండ్ టు వర్క్ అనే ఆఫీసు స్థాపించిన 30ఏళ్ల ఫీయు( పేరు మార్చాం) "నేను వర్క్ స్టేషన్ అమ్మడం లేదు. పని లేని వ్యక్తిగా ఉండకపోవడం అనే గౌరవాన్ని అమ్ముతున్నా" అని చెప్పారు.
ఆయన గతంలో నిరుద్యోగి. రిటైల్ వ్యాపారం చేసిన ఆయన కోవిడ్ సంక్షోభ సమయంలో దాన్ని మూసివేశారు.
"ఆ సమయంలో నేను చాలా ఆందోళనగా ఉన్నా. జీవితం ముగిసిందని అనిపించింది. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నా. అయితే నా దగ్గర అంత శక్తి లేదు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన ప్రిటెండ్ టు వర్క్ గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. నెలలోనే ఆ వర్క్‌స్టేషన్ నిండిపోయింది. కొత్తగా చేరాలనుకునే వారు ఇప్పుడు అందులో దరఖాస్తు చేసుకోవాలి.
తన కంపెనీకి వచ్చే వారిలో 40శాతం మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఉన్నారని, వారు ఫోటోలు తీసుకుని తాము అక్కడ ఇంటర్న్ షిప్ చేస్తున్నట్లు ట్యూటర్లకు ఫోటోలు పంపిస్తున్నారని ఫీయు చెప్పారు.
తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక వస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.
మిగిలిన 60శాతం మంది ఫ్రీలాన్సర్లు. అందులో ఎక్కువ మంది డిజిటల్ నోమాడ్లు. వారిలో కొందరు పెద్ద పెద్ద ఈ కామర్స్ సంస్థలు, సైబర్ స్పేస్ రైటర్లుగా పని చేశారు. వారి సగటు వయసు 30. అందులో అందరి కంటే చిన్న వ్యక్తి వయసు 25 ఏళ్లు.

అధికారికంగా వీళ్లను "ఫ్లెక్సిబుల్ ఎంప్లాయిమెంట్ ప్రొఫెషనల్స్" అని పిలుస్తున్నారు. వీరిలో క్యాబ్ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ఉన్నారు.
ఇలాంటివి దీర్ఘకాలంలో లాభదాయకంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకమని ఫీయు చెబుతున్నారు. ఇది వ్యాపారంలా కాకుండా సామాజిక ప్రయోగంగా చూడటానికి ఆయన ఇష్టపడుతున్నారు.
"ఇది గౌరవం కోసం అబద్దాలు చెబుతుంది. అయితే కొంతమంది వాస్తవాన్ని తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఆఫీసుకు వచ్చే వారు దీర్ఘకాలం నటిస్తుంటే మేము మోసం చేస్తున్నట్లే" అని ఆయన చెప్పారు.
"వారు నటిస్తున్న వర్క్ ప్లేస్‌ను నిజమైన ఆఫీసుగా మార్చేందుకు సాయం చేయడంలో ఈ ప్లేస్ ఉపయోగపడితే ఈ సామాజిక ప్రయోగం విజయవంతమైనట్లే" అని ఫీయు అభిప్రాయ పడ్డారు.
ఝౌ ప్రస్తుతం తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
కొన్ని సంస్థలు తమ నియామకాలలో ఏఐ టూల్స్‌లో నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తాను గుర్తించానని అన్నారు. అందుకే ఏఐ నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల ఫుల్ టైమ్ జాబ్ సంపాదించడం తేలికవుతుందని ఆయన భావిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














