బ్రహ్మజెముడు పండు తింటే ఆరోగ్యానికి మంచిదా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అహ్మద్ అల్-ఖాతిబ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రహ్మజెముడు పండులో ఎన్నో పోషకాహార, ఔషధ ప్రయోజనాలున్నాయి.
ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాచీన కాలం నుంచే ఎన్నో సంస్కృతుల్లో ఈ పండును ఒక ఔషధంగా వాడారని చరిత్ర చెప్తోంది.
ఈ పండు ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుందని వివిధ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
అయితే, వీటిని ఎవరైనా తినొచ్చా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు?


ఫొటో సోర్స్, Getty Images
బ్రహ్మజెముడు పండ్లు వివిధ దేశాల్లో వివిధ రంగుల్లో ఉంటాయి.
కొన్ని ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, కొన్ని ఎర్రగా, వంగపండు రంగులో ఉంటాయి.
అలాగే, ఈ పండ్ల రుచి కూడా భిన్నంగా ఉంటుంది.
పసుపు రంగులో ఉండే బ్రహ్మజెముడు పండు ఎర్ర పండుతో పోలిస్తే చాలా రుచికరంగా ఉంటుందని ఈ పండ్లను విక్రయించే సయ్యిద్ అలియాస్ అబూ యాసిన్ అనే ఈజిప్ట్‌కు చెందిన వర్తకుడు చెప్పారు.
బ్రహ్మజెముడులో మగ, ఆడ చెట్లు ఉంటాయని.. వీటిలో ఆడ చెట్లకు కాసే పండ్లు మరింత తియ్యగా ఉంటాయని అబూ యాసిన్ చెప్పారు.
మగ, ఆడ చెట్లకు కాసిన పండ్ల మధ్య తేడాను గుర్తు పట్టొచ్చని.. మగ చెట్లకు కాసే పండ్లపై చిన్నచిన్న గడ్డలు ఉంటాయని యాసిన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్‌లో బ్రహ్మజెముడు పండును ‘పేదవారి పండు’ అని కూడా పిలుస్తుంటారు. అక్కడ ఇది బాగా చౌకగా లభించడమే దీనికి కారణం.
ట్యునీషియాలో దీన్ని 'సుల్తాన్ ఘాలా' (పంటల్లో రాజు) అని కూడా అంటారు.
బ్రహ్మజెముడు పండులో ఎన్నో ఔషధ, పోషకాహార గుణాలు ఉన్నాయి.
ఇటీవల, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రచురించిన ఓ అధ్యయనంలో.. యాపిల్స్, టమోటాలు, అరటిలో ఉండే యాంటీఆక్సిడెంట్‌ల కంటే ఈ పండులో రెండింతలు అధికంగా ఉంటుందని పేర్కొంది.
విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్, బెటాలైన్స్ ఈ పండులో పుష్కలంగా ఉంటాయని వెల్లడించింది.
బ్రహ్మజెముడు పండులో ఉండే పోషక పదార్థాలు కరోనరీ ఆర్టరీ డిసీజ్ (గుండెకు సంబంధించిన వ్యాధి) ముప్పు తగ్గించడమే కాకుండా.. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఈ పండులో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
క్రమం తప్పకుండా ఈ పండును తింటే రక్త కణాల పనితీరు మెరుగవుతుంది.
యూఎస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం.. బ్రహ్మజెముడు పండులో పొటాషియం ఎక్కువగా ఉండి, సోడియం తక్కువగా ఉంటుంది.
కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇదెంతో ఉపయోగకరం.
కొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్లుగా బ్రహ్మజెముడు పండును ఒక సంప్రదాయ ఔషధంగా వాడుతున్నారు.
విటమిన్ సీ లోపం వల్ల కలిగే ఇబ్బందులు, డయాబెటిస్ వంటి సమస్యలకు అందించే చికిత్సల్లో ఈ పండును వాడుతున్నారు.
బ్రహ్మజెముడు పండుతో ఇతర ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
పేగులు, కిడ్నీలు, కాలేయం, బ్లాడర్‌ను శుభ్రపరిచే గుణాలు ఈ పండులో ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థ, గుండె, మానసిక ఆరోగ్యంపై కూడా బ్రహ్మజెముడు పండు సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పోషకాహార నిపుణులు మజ్ద్ అల్-ఖాతిబ్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రహ్మజెముడు పండ్లలో పుష్కలంగా ఉండే పీచు పదార్థం మల విసర్జన సాఫీగా జరిగేలా తోడ్పడుతుంది.
ఈ పండ్లను తింటే శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
గట్ బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులోకి తెచ్చేందుకు ఈ పండ్లు ఉపయోగపడతాయని పోహకాహార నిపుణులు మజ్ద్ అల్-ఖాతిబ్ చెప్పారు.
ఇందులో ఉండే ఫైబర్, పెక్టిన్ శరీరంలో చక్కెర శోషణను నెమ్మది పరుస్తుంది.
దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్‌కు రెస్పాండ్ అయ్యే సామర్థ్యాన్ని పెంచుతాయి.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఈ పండు గుండె, ధమనుల సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పండులో ఉండే విటమిన్ సీ, అవసరమైన మినరల్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతాయి.
దీర్ఘకాలిక వ్యాధులపై శరీరం పోరాడేందుకు కూడా ఈ పండు సాయపడుతుంది. మొత్తంగా ఆరోగ్యానికి ఈ పండును మంచి ఆహారంగా చెబుతుంటారు.
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, బ్రహ్మజెముడు పండును పరిమితంగానే తినాలని మజ్ద్ అల్-ఖాతిబ్ సూచిస్తున్నారు.
ముఖ్యంగా డయాబెటిస్, తక్కువ రక్తపోటు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఉన్న వారు ఈ పండ్లను మోతాదు మేరకు తినాలని చెబుతున్నారు.
ఎక్కువగా తినాలనుకునేవారు వైద్యుల సూచనలు తీసుకోవడం మంచిదని ఖాతిబ్ సూచించారు.
పోహకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం.. రోజుకు రెండు బ్రహ్మజెముడు పండ్లను తినొచ్చు. దీంతో పాటు అవసరమైనంత నీటిని తాగాలని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రహ్మజెముడు చెట్టు చరిత్రేంటి?
సెంట్రల్ అమెరికా, మెక్సికోల్లో బ్రహ్మజెముడు పండును, బ్రహ్మజెముడు మొక్కను ప్రాచీన కాలం నుంచి ఔషధంగా వాడుతున్నారు.
చరిత్ర ప్రకారం.. 14వ, 16వ శతాబ్దాల మధ్య వెల్లివిరిసిన అజ్టెక్ ప్రజల సంస్కృతిలో బ్రహ్మజెముడు ముఖ్యమైన భాగంగా ఉండేది.
అజ్టెక్ సంస్కృతి అనేది 14, 16వ శతాబ్దాల మధ్య మెక్సికోలో వృద్ధి చెందిన నాగరికత.
1492 వరకు యూరోపియన్లకు అసలు బ్రహ్మజెముడు పండు గురించి తెలియదు.
కరీబియన్ సముద్రంలో ఉన్న హిస్పానియోలా దీవిని (ప్రస్తుతం హైతీ, డొమినికన్ రిపబ్లిక్) స్పానిష్ వారు ఆక్రమించుకున్నప్పుడు, అక్కడ స్థానికులకు ఈ పండును ఇచ్చారు.
స్పానిష్ ప్రజలు ఈ బ్రహ్మజెముడు మొక్కను యూరప్‌కు తీసుకొచ్చారు. మధ్యధరా తీరం మీదుగా 16, 17వ శతాబ్దాల్లో ఉత్తర ఆఫ్రికాలోకి కూడా ఈ పండ్లు విస్తరించాయి.
18వ శతాబ్దంలో దక్షిణాఫ్రికా, భారత్, చైనాలోకి బ్రహ్మజెముడు మొక్కలు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














