గోల్డ్ డిగ్గర్స్: ‘మహిళలంటే మగవాళ్లను వంచించేవాళ్లు’ అనే అర్ధమిచ్చేలా వీడియో గేమ్, లింగవివక్ష అంటూ చైనా మహిళల ఆందోళన

ఫొటో సోర్స్, Qianfang Studio
- రచయిత, కెల్లీ ఎన్జీ, అబెల్ యూ
- హోదా, బీబీసీ చైనీస్
'అతను కుక్క కన్నా ఎక్కువ విశ్వాసపాత్రుడు... అలాంటి నోరులేనివాళ్లు మరింత మంది వస్తే'... ఓ మహిళ చేసే ఇలాంటి వ్యాఖ్యలున్న సరికొత్త వీడియో గేమ్ ఒకటి ఇప్పుడు చైనాలో లింగ వివక్షపై చర్చకు తెరలేపింది.
ఈ వీడియో గేమ్‌లో ప్లేయర్స్ గోల్డ్ డిగ్గర్స్( మగాళ్లను వంచించే మహిళలు) పై లైవ్‌లో పగ (లైవ్-యాక్షన్ రివేంజ్) సాధించే పురుష పాత్రధారులు.
మోసపూరిత ఆలోచనలున్న మహిళల వలపు వలలో చిక్కుకొని, డబ్బు పోగొట్టుకున్న మగవాళ్లు ఏ విధంగా స్పందిస్తారనే రీతిలో ఈ గేమ్‌ను రూపొందించారు.
'గోల్డ్ డిగ్గర్స్' పేరుతో జూన్‌లో విడుదలైన ఈ గేమ్...కొన్ని గంటల వ్యవధిలోనే గేమింగ్ ప్లాట్‌ఫాం ‘స్టీమ్ సేల్స్’లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే స్థాయిలో వివాదాలూ వెనువెంటనే వెల్లువెత్తుతున్నాయి.
ఇది లింగవివక్ష ధోరణులను ప్రోత్సహిస్తోందని కొంతమంది విమర్శిస్తుంటే, ప్రేమ ముసుగులో మోసాలు (లవ్ స్కామ్స్) పట్ల ప్రజలను ఈ గేమ్ అప్రమత్తం చేస్తుందని దాని మద్దతుదారులు చెబుతున్నారు.
కానీ, విమర్శలు వేడెక్కడంతో విడుదలైన మరునాడే గేమ్ రూపకర్తలు స్పందించి, దాని పేరును 'ఎమోషనల్ యాంటీ-ఫ్రాడ్ సిమ్యులేటర్' అని మార్చేశారు.

నష్టనివారణకు ఆ చర్యలేవీ సరిపోలేదు
ఆ గేమ్ డైరెక్టర్, హాంగ్ కాంగ్ ఫిల్మ్ మేకర్ మార్క్ హును ఇప్పుడు అనేక పలు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నిషేధించాయి.
మహిళలను టార్గెట్ చేయాలనే ఉద్దేశం తమకెప్పుడూ లేదని గేమ్ రూపకర్తలు చెబుతున్నారు. మోడ్రన్ డేటింగ్‌లోని సందిగ్ధతలు, భావోద్వేగాల హద్దుల గురించి బహిరంగ చర్చ జరిగేలా దోహదం చేయాలని ఆశించామంటున్నారు.
ఆ గేమ్ ఆడటానికి ప్రయత్నించిన నటి హు యికున్ తీవ్రంగా స్పందించారు. అది చాలా అసహ్యం కలిగించేలా ఉందని, హేతుబద్ధత లేదని చెప్పారు.
‘‘ విమర్శలకు, ప్రజల మధ్య విభజనకు దారితీసేలా కంటెంట్ రూపొందించడమనే ఆధునిక వ్యాపారాత్మక ధోరణికి ఇదొక మచ్చుతునక’’ అని గేమ్ రూపకర్తలను విమర్శించారు.
'గోల్డ్ డిగ్గర్' అనే పదమే స్త్రీద్వేషం అనే దుర్గంధాన్ని వెదజల్లుతోందని హు యికున్ సహా పలువురు విమర్శకులు చెప్పారు.
''మహిళలపై తరచుగా వేస్తున్న ముద్ర ఇది '' అని హు అన్నారు. ''బూతు జోక్‌లు, అవమానించేలా మాటలు మన దైనందిన భాషలోకి చొచ్చుకుపోయాయి'' అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
''నీకొక ధనవంతుడైన బాయ్ ఫ్రెండ్ ఉంటే, నిన్ను గోల్డ్ డిగ్గర్ అని పిలుస్తారు. నీవు అందంగా ఉండటానికి ప్రయత్నించినా గోల్డ్ డిగ్గర్ అనే అంటారు. ఒక్కోసారి ఎవరితోనైనా మందు పార్టీకి వెళ్లినా అదే ముద్ర వేస్తారు'' అని హు యికున్ విమర్శించారు.

ఫొటో సోర్స్, Qianfang Studio
స్థానిక మీడియాలోనూ భేదాభిప్రాయాలు
చివరకు స్థానిక మీడియా కూడా ఈ గేమ్ కారణంగా చీలిపోయింది.
‘‘మొత్తం మహిళాలోకంపై మోసకారులనే ముద్ర వేశారు’’ అని సెంట్రల్ హుబేయి ప్రావిన్స్ నుంచి వెలువడే ఓ పత్రిక వ్యాఖ్యానించింది.
కానీ అదొక 'సృజనాత్మక గేమ్' అని బీజింగ్ యూత్ దినపత్రిక ప్రశంసించింది. 2023లో జరిగిన లవ్ స్కామ్స్ తాలూకా ఆర్థిక ప్రభావం దాదాపు 2 బిలియన్ల యువాన్లు ( సుమారు రూ. 2,397 కోట్లు) మేర ఉందని నేషనల్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ డేటాను ఆ పత్రిక ఉటంకించింది.
''ఎమోషనల్ ఫ్రాడ్స్‌కు సత్వరమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది'' అని ఎడిటోరియల్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సేల్స్‌లో దూసుకుపోతున్న గేమ్...
పీసీ ప్లాట్‌ఫాంపై టాప్ టెన్ టైటిల్స్‌లో ఈ గేమ్ చోటు సంపాదించింది. చివరకు అత్యంత విజయవంతమైన చైనీస్ గేమ్‌గా ఆదరణ పొందిన బ్లాక్ మైత్: వుకాంగ్‌ను సైతం అధిగమించింది.
''దీని (గేమ్) గురించి ప్రజలు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థంకావట్లేదు. నీవు గోల్డ్ డిగ్గర్ కాదని నీకు తెలిసినప్పుడు, ఈ గేమ్‌తో దాడి జరుగుతుందని ఎందుకు బాధపడాలి?'' అని 28 ఏళ్ల ఓ వ్యక్తి ప్రశ్నించారు.
గేమ్ ప్రాథమిక ఉద్దేశమే జెండర్‌కు సంబంధించిందని, గోల్డ్ డిగ్గర్స్ అంతా మహిళలే అని విమర్శకులు అంటున్నారు.
ఫ్యాట్ క్యాట్‌గా ఇంటర్‌నెట్‌లో పేరొందిన ఓ చైనా వాసి నిజజీవిత కథ ప్రేరణతో ఈ గేమ్ వచ్చిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. బ్రేకప్ తర్వాత గత ఏడాది ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఆయన మరణం ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన్ను దోచుకొని, ప్రాణాలను తీసుకోవడానికి కారణమైందంటూ ఆయన మాజీ ప్రియురాలిని కొంతమంది విమర్శించారు. ఇందుకోసం 'గోల్డ్ డిగ్గర్' అనే పదాన్ని విరివిగా వాడారు. అయితే వారి ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.
మహిళలు ఇంట్లోనే ఉండాలని, పురుషులే పోషకులని నమ్మే సమాజం ఉన్న చైనాలో... అలాంటి లింగ నిబంధనలను ఈ వీడియో గేమ్ శాశ్వతం చేసిందంటూ కొంతమంది మహిళలు బీబీసీతో మాట్లాడుతూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
చైనాలో లింగ వివక్ష ఉంటుందని, ప్రభుత్వం కూడా పురుషాధిక్య సమాజానికి మద్దతుగా మాట్లాడుతుందన్న విమర్శలు ఉన్నాయి. అందువల్ల మహిళలు వృత్తిపరమైన విజయంకన్నా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడానికే ప్రాధాన్యమివ్వాలన్నదానికి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ కూడా ఆమోదిస్తోంది.
'మంచి భార్యలు, మంచి తల్లులు' అంటూ దేశాధ్యక్షుడు జింపింగ్ తరచూ ప్రస్తావిస్తుంటారు.
మరోవైపు లింగ సమానత్వం కోసం డిమాండు చేస్తున్న కొందరు మహిళా ఉద్యమకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
''పురుషులు, మహిళల మధ్య శత్రుత్వాన్ని పెంచడానికేనన్నట్లుగా ఆన్‌లైన్ గేమ్ ఉందని భావిస్తున్నా'' అంటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ మహిళ ఆందోళన వ్యక్తంచేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














