రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి నోటీసులు

రాహుల్ గాంధీ, కాంగ్రెస్, ఎలక్షన్ కమిషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో, కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి(చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు.

కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ జారీ చేసిన ఈ నోటీసుల్లో " ఆ డేటా ఎన్నికల కమిషన్‌కు చెందినదని మీరు మీ ప్రజెంటేషన్‌లో చెప్పారు. పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డులో శకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని కూడా చెప్పారు"

"ఈ ఓటరు కార్డుపై రెండుసార్లు ఓటు వేశారని, టిక్ మార్క్ పోలింగ్ బూత్ అధికారిదనీ చెప్పారు."

"దర్యాప్తు సమయంలో శకున్ రాణి తాను ఒకసారి మాత్రమే ఓటు వేశానని, మీరు ఆరోపించినట్లుగా రెండుసార్లు కాదని తెలియజేశారు. మీరు చూపించిన టిక్ చేసిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది."

"కాబట్టి, శకున్ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటు వేశారని మీరు పేర్కొన్న పత్రాలను అందించాలని కోరుతున్నాం, తద్వారా ఈ విషయంపై సరైన దర్యాప్తు జరుగుతుంది" అని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శకున్ రాణి, ఎన్నికల సంఘం, రాజకీయాలు, ఓటర్లు

ఫొటో సోర్స్, Indian National Congress

ఫొటో క్యాప్షన్, 'ఓట్ల రిగ్గింగ్' కోసం 'ఫారం 6' పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దీనికి ఆయన మహదేవపుర నియోజకవర్గానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు 'శకున్ రాణి'ని ఉదాహరణగా చూపారు.

రాహుల్ గాంధీ ఏమన్నారు?

ఆగస్టు 7న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు.

"ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ తప్పు అని తేలుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ తరచుగా గెలుపుతో ముగిస్తోంది. దీని వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలకు సందేహాలున్నాయి. కానీ కచ్చితమైన ఆధారాలు లేవు'' అని విలేఖరుల సమావేశం ప్రారంభంలో రాహుల్ గాంధీ అన్నారు.

హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సందేహాలు మరింత బలపడ్డాయని ఆయన చెప్పారు.

ఇది 'ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్ర'గా విమర్శిస్తూ, ఆధారాలంటూ కొన్ని వివరాలు కూడా చూపించారు రాహుల్. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలిచ్చారాయన.

"మహారాష్ట్రలో ఎన్నికల 'చోరీ'కి ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందనడానికి, మెషీన్ రీడబుల్ ఓటరు జాబితాను అందించకపోవడమే నిదర్శనం" అని రాహుల్ ఆరోపించారు.

కొత్త ఓటర్లను ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేయడానికి 'ఫారం 6' ఉపయోగిస్తారు. ఈ ఫారం 6 పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందని ఆయన ఆరోపించారు.

కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గానికి చెందిన 70 ఏళ్ల 'శకున్ రాణి' అనే మహిళను రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపారు. ఆమె రెండుసార్లు కొత్త ఓటరుగా నమోదు చేసుకున్నారని, రెండుసార్లు ఓటు వేశారని ఆరోపించారు.

ఈ విషయం బయటపడకుండా ఉండటానికి ఓటింగ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎలక్షన్ కమిషన్ నాశనం చేయాలనుకుందని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు .

కాగా, రాహుల్ గాంధీ ఆరోపణలు 'తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి' అని భారత ఎన్నికల సంఘం బదులిచ్చింది.

ఎన్నికల సంఘం, రాజకీయాలు, ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల సంఘం ఏం చెప్పింది?

రాహుల్ గాంధీ తన ఫిర్యాదులను కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది.

రాహుల్ గాంధీ తాను చెబుతున్నది నిజమని నమ్మితే అఫిడవిట్‌పై సంతకం చేసి ఫిర్యాదు చేయాలని తెలిపింది.

"ఓటరు జాబితాను నవంబర్ 2024, జనవరి 2025లో కాంగ్రెస్‌ పార్టీకి అందించాం. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే హైకోర్టులో ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే దీనిని సవాలు చేయవచ్చు" అని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రకటన తెలిపింది.

"ఓటరు జాబితాలో అనర్హులైన ఓటర్లను చేర్చడం, అర్హులైన వారిని తొలగించినట్లు మీరు ప్రస్తావించారు. అలాంటి ఓటర్ల పేర్లతో కూడిన వివరాలను ఓటర్ల నమోదు నియమావళి1960లో రూల్ 20(3)(బి) కింద జతపరిచిన డిక్లరేషన్, అఫిడవిట్‌ను సంతకం చేసి మాకు పంపించండి. దాని ప్రకారం మేం చర్య తీసుకుంటాం" అని ఆ ప్రకటన వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)