ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ గాంధీ చేసిన 10 ఆరోపణలు, ఇంకా సమాధానం దొరకని ప్రశ్నలు

ఫొటో సోర్స్, Indian National Congress
- రచయిత, వినాయక్ హోగాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీతో కుమ్మక్కై, దేశంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఆగస్టు 7న విలేకరుల సమావేశం నిర్వహించి, దాదాపు గంటసేపు ప్రజెంటేషన్ ఇచ్చారు, ఎన్నికల్లో 'ఓట్ల చోరీ' జరుగుతోందని ఆరోపించారు.
ఆ తర్వాత, ఈ విషయం దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది.
ఇంతకీ, రాహుల్ గాంధీ చేసిన పది ఆరోపణలేంటి? ఈ ఆరోపణల వల్ల ఎన్నికల సంఘంపై తలెత్తిన ప్రశ్నలేంటి? దీనిపై నిపుణులు ఏమి చెబుతున్నారు?
వీటిలో ఏ ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చిందో, ఇంకా ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందో తెలుసుకుందాం.

గంటసేపు జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన అతిపెద్ద ఆరోపణలు, చూపిన ఆధారాలు
"ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ తప్పు అని తేలుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బీజేపీ తరచుగా గెలుపుతో ముగిస్తోంది. దీని వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాలకు సందేహాలున్నాయి. కానీ కచ్చితమైన ఆధారాలు లేవు'' అని విలేఖరుల సమావేశం ప్రారంభంలో రాహుల్ గాంధీ అన్నారు.
హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సందేహాలు మరింత బలపడ్డాయని రాహుల్ గాంధీ చెప్పారు.
ఇది 'ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్ర'గా విమర్శిస్తూ, ఆధారాలంటూ కొన్ని వివరాలు కూడా చూపించారు. కొన్ని ఉదాహరణలిచ్చారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ ఆరోపణలను తప్పుదారి పట్టించేవిగా పేర్కొంది.
"సంబంధిత ఆధారాలను డిక్లరేషన్ ద్వారా సమర్పిస్తే, అవసరమైన చర్యలు చేపట్టవచ్చు" అని కమిషన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఇంతకీ రాహుల్ గాంధీ చేసిన 10 ఆరోపణలు ఏంటి?
1. ఎన్నికల షెడ్యూల్‌లో అవకతవకలు
రాహుల్ గాంధీ చేసిన మొదటి ఆరోపణ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించినది.
''ఒకప్పుడు భారతదేశంలో 'ఈవీఎం యంత్రాలు' లేకముందు దేశం మొత్తం ఒకేసారి బ్యాలెట్ పేపర్లపై ఓటు వేసింది. కానీ, ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ నెలల తరబడి జరుగుతుంది. ఇన్ని దశల ఓటింగ్ ఎందుకు ఎన్నికల షెడ్యూల్ అకస్మాత్తుగా మారిపోతుంది. ఎన్నికలను నియంత్రించడానికే ఇదంతా జరుగుతుంది" అని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Indian National Congress
2. భారీగా ఓట్ల చోరీ
రాహుల్ గాంధీ చేసిన అతి తీవ్రమైన ఆరోపణ ఇది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందనే అనుమానం మరింత బలపడిందని రాహుల్ గాంధీ అన్నారు. దీనిని నిరూపించడానికి ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు.
గత 5 సంవత్సరాలలో చేరిన వారి కంటే ఎక్కువ మంది కొత్త ఓటర్లు గత ఐదు నెలల్లో నమోదయ్యారు.
అడల్ట్స్ (18ఏళ్లు పైబడిన) మొత్తం జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.
పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓటింగ్ శాతం అకస్మాత్తుగా పెరిగింది.
3. రికార్డులను నాశనం చేయడం
విలేఖరుల సమావేశంలో రాహుల్ గాంధీ చేసిన అతి ముఖ్యమైన ఆరోపణల్లో 'ఆధారాలు చూపేందుకు ఎలక్షన్ కమిషన్ అయిష్టత చూపడం, సాక్ష్యాలను నాశనం చేయడం' ఒకటి.
"ఓటింగ్‌కు సంబంధించిన రికార్డులను ఇవ్వడంలో ఎలక్షన్ కమిషన్ ఆలస్యం చేస్తోంది. పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వంటి ఆధారాలను నాశనం చేస్తోంది'' అని రాహుల్ గాంధీ అన్నారు.
దీనికి సంబంధించి రాహుల్ గాంధీ రెండు ప్రశ్నలు సంధించారు.
- డిజిటల్ ఓటర్ జాబితాను అందించడానికి ఎన్నికల సంఘం ఎందుకు నిరాకరిస్తోంది?
- సీసీటీవీ ఫుటేజ్ పొందే విషయంలో ఎన్నికల సంఘం అకస్మాత్తుగా నియమాలను ఎందుకు మార్చింది?
విజ్ఞప్తుల తర్వాత 'నాన్-మెషిన్ రీడబుల్ పేపర్స్'గా ఓటరు జాబితా ఇచ్చారని, ఇది స్కాన్ చేయలేమని రాహుల్ చెప్పారు.
"ఏ రికార్డునూ నాశనం చేయకూడదు, ఎలక్షన్ కమిషన్ పనితీరులో పారదర్శకత ప్రజల హక్కు. మరి, ఎలక్షన్ కమిషన్ కచ్చితంగా ఏమి దాచాలనుకుంటోంది?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Indian National Congress
4. ఒకే నియోజకవర్గంలో 'లక్ష ఓట్ల చోరీ' ఆరోపణ
పైన పేర్కొన్న ఆరోపణలన్నింటినీ నిరూపించడానికి, గెలిచే అవకాశం ఉన్న లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాన్ని ఉదాహరణగా చూపించారు రాహుల్ గాంధీ.
కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలో లక్ష ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు.
ఈ ఆరోపణ చేస్తూ, ఓట్ల చోరీ ఐదు విధాలుగా జరుగుతుందని ఆయన అన్నారు.
- నకిలీ ఓటర్లు,
- నకిలీ, చెల్లని చిరునామాలు కలిగిన ఓటర్లు
- ఒకే చిరునామాలో అనేక మంది ఓటర్ల నమోదు
- చెల్లని ఫోటోలతో ఓటర్లు
- ఫామ్ 6 దుర్వినియోగం అనే ఐదు మార్గాల ద్వారా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
5. నకిలీ ఓటర్లు
మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కదాంట్లోనే నకిలీ ఓటర్ ఎంట్రీల ద్వారా 11,956 ఓట్లను దొంగిలించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
దీనర్థం ఒకే ఓటరు ఓటర్ల జాబితాలలోని వేర్వేరు బూత్ నంబర్లలో అనేకసార్లు కనిపిస్తారని రాహుల్ అంటున్నారు. దీనికి ఆయన కొన్ని ఉదాహరణలను కూడా చూపించారు.
ఒకే ఓటరు ఒకే నియోజకవర్గంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఓటరుగా కనిపిస్తున్నారని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు.
6. తప్పుడు చిరునామాలు
నకిలీ చిరునామాలతో ఉన్న చాలామంది నకిలీ ఓటర్లను ఓటు చోరీకి ఉపయోగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహదేవపుర నియోజకవర్గంలో 40,009 ఓట్లు దొంగింలించారని ఆరోపించారు.
ఈ ఓటర్ల చిరునామాలు లేవని, వారి చిరునామా కాలమ్‌లో '0, -, #' చిహ్నాలు కనిపిస్తున్నాయని, ఈ అడ్రస్‌లను పరిశీలించలేదని అన్నారు.

ఫొటో సోర్స్, Indian National Congress
7. ఒకే చిరునామాలో అనేక మంది ఓటర్లు
ఒకే చిరునామాలో అనేక మంది ఓటర్ల పద్ధతిని ఉపయోగించి మహదేవపుర నియోజకవర్గంలోనే 10,452 ఓట్లు దొంగిలించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు, కొన్ని ఇళ్ల ఫోటోలు చూపించి, ఒకే ఇంట్లో 80 మంది వరకు నివసిస్తున్నట్టు చూపారని, వాళ్లు అక్కడ నివసించడం లేదని తనిఖీల్లో తేలిందని రాహుల్ అన్నారు.
వాణిజ్య ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఒక లిక్కర్ షాపు వంటి చోట 68 మంది ఓటర్లున్నారని రాహుల్ గాంధీ చెప్పారు.
8. చెల్లని ఫోటోలు
ఓటరు కార్డులోని ఓటరు ఫోటో ఓటరు ప్రధాన గుర్తింపు.
మహదేవపుర నియోజకవర్గంలో చెల్లని ఫోటోలు ఉన్న ఓటరు కార్డులను ఉపయోగించి 4,132 ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ చెబుతున్నారు.
కొన్నిచోట్ల ఫోటోలు చాలా చిన్నగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల అస్సలు ఫోటోలు లేవని ఆయన అంటున్నారు.

ఫొటో సోర్స్, Indian National Congress
9. ఫామ్ 6 దుర్వినియోగం
కొత్త ఓటర్లను ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చేయడానికి 'ఫారం 6' ఉపయోగిస్తారు. ఈ ఫారం 6 పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
మహదేవపుర నియోజకవర్గానికి చెందిన 70 ఏళ్ల 'శకున్ రాణి' అనే మహిళను రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపారు. ఆమె రెండుసార్లు కొత్త ఓటరుగా నమోదు చేసుకున్నారని, రెండుసార్లు ఓటు వేశారని ఆయన ఆరోపించారు.
ఈ విషయం బయటపడకుండా ఉండటానికి ఓటింగ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎలక్షన్ కమిషన్ నాశనం చేయాలనుకుందని కూడా ఆరోపించారు రాహుల్ గాంధీ.
10. ఓట్ల చోరీ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు
ఓట్ల చోరీకి ఇదో పద్ధతి అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇందులో ఒక నమూనా ఉందన్నారు.
ఇది ఒక నియోజకవర్గంలోనే కాదని చాలాచోట్ల జరిగిందని, ఎలక్షన్ కమిషన్ బీజేపీతో కుమ్మక్కై ఆ పార్టీ ఓట్ల చోరీతో బీజేపీ గెలుపునకు సహాయపడుతోందని ఆరోపించారు.
"2024 లోక్‌సభ ఎన్నికల్లో 25 నియోజకవర్గాల్లో బీజేపీ 33 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. నరేంద్ర మోదీ అధికారంలో కొనసాగడానికి కేవలం 25 సీట్లు మాత్రమే అవసరం. అందుకే ఎలక్షన్ కమిషన్ మనకు డిజిటల్ ఓటరు జాబితాను ఇవ్వడం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యం నాశనం అవుతోందని కూడా ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI & ECI
ఎన్నికల సంఘంపై ప్రశ్నలు
రాహుల్ గాంధీ విలేఖరుల సమావేశం తర్వాత, ఎన్నికల సంఘంపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- ఎన్నికల ప్రక్రియ కొన్ని నెలలపాటు ఎందుకు జరుగుతోంది? ఈ ప్రక్రియను దశలవారీగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎన్నికల షెడ్యూల్ కొన్నిసార్లు అకస్మాత్తుగా ఎందుకు మారుతుంది?
- అకస్మాత్తుగా ఓటర్ల సంఖ్య ఎందుకు అంతగా పెరిగింది? ఉదాహరణకు, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 నెలల్లో ఓటర్ల సంఖ్య, 5 సంవత్సరాలలో కన్నా ఎక్కువగా ఎలా పెరిగింది?
- డిజిటల్ ఓటరు జాబితాను అందించడానికి ఎన్నికల సంఘం ఎందుకు నిరాకరిస్తోంది? నాన్ మెషీన్ రీడబుల్ ఫార్మట్‌లో ఎందుకు అందిస్తోంది?
- ఎలక్షన్ కమిషన్ దగ్గర డిజిటల్ డేటా ఉంటే, అది స్వయంగా నకిలీ ఓటర్లను, నకిలీ చిరునామాలను ఎందుకు గుర్తించలేదు?.
- కొత్త ఓటర్ల కోసం ఉద్దేశించిన ఫామ్ 6ను డెబ్బై ఏళ్ల వయసున్న వారు, అది కూడా సంవత్సరంలో రెండుసార్లు ఎలా ఉపయోగించగలరు? పైగా, ఈ వ్యక్తి రెండుసార్లు ఎలా ఓటు వేయగలరు?
- ఒక చిన్న ఇంటి చిరునామాతో 80 మంది ఓటర్లు ఎలా నమోదయ్యారు?
- 45 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ సీసీటీవీలు, పోలింగ్ స్టేషన్ల వీడియోలను ఎందుకు ధ్వంసం చేస్తోంది? డేటాను నిల్వ చేసే సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు ఈ డేటాను నాశనం చేయడానికి ఎందుకు అంత తొందరపడుతోంది?
- సీసీటీవీ ఫుటేజ్ పొందే నియమాలను ఎన్నికల సంఘం ఎందుకు మార్చింది?
- మహారాష్ట్రలో కేవలం 5 నెలల్లో 41 లక్షల మంది ఓటర్లు పెరగడంలో మిస్టరీ ఏంటి?
- ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం విలేఖరుల సమావేశం ఎందుకు నిర్వహించలేదు. ఎందుకు ఒక ప్రకటన విడుదల చేయలేదు?.
- డిజిటల్ ఓటరు జాబితా, సీసీటీవీ డేటాను అందించడానికి తిరస్కరించడం ద్వారా ఎన్నికల సంఘం పౌరులను తప్పుదారి పట్టిస్తోందా?.

'పొరపాట్లు సరిదిద్దడం కమిషన్ పని'
తప్పులు జరగడానికి అవకాశం ఉందని, అయితే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని సీనియర్ న్యాయ నిపుణులు శ్రీహరి అనేయ్ ప్రశ్నించారు.
''ఈ ఆరోపణలు తీవ్రమైనవే. కానీ రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నాయి. కమిషన్ కూడా ఇందులో భాగస్వామి అని చెప్పేముందు ఆయన చూపించిన లోపాలు నిజమా? కాదా? అన్నది పరిశీలించాలి. ఎలక్షన్ కమిషన్ వాటిపై దర్యాప్తు చేయాలి'' అని శ్రీహరి బీబీసీతో చెప్పారు.
''ఈ 5 రకాల తప్పులు జరగడానికి అవకాశం ఉంది. వాటిని సరిచేయడం కమిషన్ రాజ్యాంగ బాధ్యత. దీన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోదు?'' అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం మీడియా ప్రతినిధి రవికాంత్ ద్వివేదిని దీనిపై ప్రశ్నించినప్పుడు, ఆయన ఎన్నికల సంఘం వైపు వాదనలు వినిపించారు.
''లోక్‌సభలో ప్రతిపక్ష నేత మీడియాలో ఈ ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సమస్యలపై ఎప్పుడూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీనికి ముందు కూడా ఆయన స్వయంగా సంతకం చేసిన లేఖను మాకు పంపలేదు. ఆ ప్రశ్నలకు మేం సమాధానాలు అందించినప్పుడు, ఆయన వాటిని తిరస్కరిస్తారు'' అని రవికాంత్ ద్వివేది చెప్పారు.
''ఉదాహరణకు, డిసెంబర్ 24న మహారాష్ట్ర అంశాన్ని లేవనెత్తారు. కొంతమంది న్యాయవాదులు 'ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ' నుంచి మాకు లేఖ రాశారు. డిసెంబర్ 24న 2024న మేమిచ్చిన సమాధానం మా వెబ్‌సైట్‌లో ఉంది. కానీ మేమెప్పుడూ సమాధానం ఇవ్వలేదని రాహుల్ గాంధీ చెబుతున్నారు" అని ఆయనన్నారు.
''రాహుల్ గాంధీ తన సొంత విశ్లేషణను నమ్మి, ఎలక్షన్ కమిషన్‌పై తన ఆరోపణలు నిజమని నమ్మితే, అఫిడవిట్‌పై సంతకం చేయడానికి ఆయనకు ఎలాంటి సమస్య ఉండకూడదు'' అని అన్నారు రవికాంత్.
''డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీ సంతకం చేయకపోతే, ఆయన తన విశ్లేషణ, దాని నుంచి ఏర్పరుచుకున్న నిర్ణయాలు, హాస్యాస్పదమైన ఆరోపణలను నమ్మడం లేదని అర్థం. అలాంటి పరిస్థితిలో, ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలి" అని కమిషన్ మీడియా ప్రతినిధి ద్వివేది డిమాండ్ చేశారు.
"ఇది నిజంగా ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న. అందువల్ల అఫిడవిట్‌లో సమాచారం ఉంటేనే స్పందిస్తామనడం, లేకపోతే పట్టించుకోబోమనడం సరైనది కాదు'' అని సీనియర్ న్యాయవాది జైనా కొఠారి బీబీసీతో చెప్పారు.
"ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఓటర్ల జాబితాల తయారీ ఎలక్షన్ కమిషన్ అతిపెద్ద, అతి ముఖ్యమైన బాధ్యత. దానిని ఎలా తయారు చేయాలనే దానిపై కూడా నియమాలు ఉన్నాయి. లక్ష మందితో కూడిన నకిలీ ఓటర్ల జాబితా తయారయిందన్న ఆరోపణ చాలా తీవ్రమైనది. రాజ్యాంగం ద్వారా కేటాయించిన బాధ్యతలను ఎలక్షన్ కమిషన్ నిర్వర్తిస్తుందా లేదా అనే దానిపై ప్రశ్న తలెత్తింది. కాబట్టి, వారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అని జైనా అన్నారు.
'పాయింట్ల వారీగా సమాధానమివ్వాలి'
''ఒక జాతీయ పార్టీ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు, ఆరోపణకు అఫిడవిట్ కోసం నిరీక్షించకుండా ఎలక్షన్ కమిషన్ 'పాయింట్ బై పాయింట్' సమాధానం ఇవ్వాలి'' అని మాజీ ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా బీబీసీతో అన్నారు.
''ఎలక్షన్ కమిషన్ 'అఫిడవిట్‌పై సమాచారం అడగడం' తప్పు కాదని నేననుకుంటున్నా. అయితే తనను తాను సమర్థించుకోవడానికి అఫిడవిట్‌పై సమాచారాన్ని సమర్పించాలనే ఈ ఒక్క డిమాండ్ వెనుక ఎలక్షన్ కమిషన్ దాక్కోకూడదు. బీజేపీకి ఇందులో ప్రమేయముందా లేదా అన్నది తర్వాతి విషయం. ఈ తప్పులు జరిగి ఉండొచ్చు. వాటిని తొలగించడం రాజ్యాంగ యంత్రాంగంగా మీ పని" అని శ్రీహరి అన్నారు.
"అఫిడవిట్‌లో ఇవ్వండి. మేం స్పందిస్తామనే వైఖరి రాజ్యాంగబద్ధమైనది కాదు. ఆరోపణలు ఎవరు చేస్తున్నారో లేదా అది ఏ రాజకీయ పార్టీనో అనే విషయాన్ని పక్కనపెట్టి, ఈ విషయం గురించి మనం ఆలోచించాలి" అని న్యాయ నిపుణులు జైనా కొఠారి అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు అందించదు?
''రవికాంత్ అనే పేరును 'రవికాంత్' లేదా 'రవీ కాంత్' అని రాస్తే, ఆ వ్యక్తి ఒక్కరే అని కంప్యూటర్ గుర్తించదు. ప్రతి సందర్భంలోనూ స్పెల్లింగ్ భిన్నంగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. దాదాపు 100 కోట్ల రికార్డులు ఉన్న డేటాబేస్‌లో, ఈ సమస్య సహజం. ఇది సాంకేతికంగా సులభం అనిపించినప్పటికీ, ఆల్ఫాన్యూమరిక్ ఫీల్డ్‌లు ఒకేలా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది" అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది.
సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేశారనే ఆరోపణ, నియమాలను ఎన్నికల సంఘం ఎందుకు మార్చిందనే ప్రశ్నపై, ఎలక్షన్ కమిషన్ ఇలా సమాధానమిచ్చింది.
"ఎన్నికల ప్రక్రియపై ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే, సంబంధిత వ్యక్తి 45 రోజుల్లోపు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేయవచ్చు. అలాంటి కేసు నమోదయితే పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ను సురక్షితంగా ఉంచుతారు. లేకపోతే ఈ ఫుటేజ్ వల్ల ఉపయోగం లేదు. ఓటర్ల గోప్యతకు ముప్పు వాటిల్లుతుంది. అంతేకాకుండా, లక్షలాది పోలింగ్ కేంద్రాల్లోని ఫుటేజీని పరిశీలించడానికి 1 లక్ష రోజులు లేదా 273 సంవత్సరాలు పట్టవచ్చు. దీనికి చట్టపరంగా కూడా అర్థం లేదు" అని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
అయితే, డిజిటల్ జాబితాను అందించడానికి ఎలక్షన్ కమిషన్‌కు అభ్యంతరం ఏంటనే ప్రశ్నను శ్రీహరి లేవెనెత్తారు.
దీనిపై కూడా ఎన్నికల సంఘం ఓటరు గోప్యతకు సంబంధించిన ఆందోళనను వ్యక్తం చేసింది.
"'కమల్ నాథ్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్' కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో, యంత్రాలతో చదవగలిగే ఓటర్ల జాబితా ఓటర్ల గోప్యతను ఉల్లంఘించవచ్చని తీర్పునిచ్చింది. కాబట్టి, కాంగ్రెస్ చేసే ఈ డిమాండ్ చెల్లదు" అని ఎన్నికల సంఘం తెలిపింది.
మరోవైపు, ఎన్నికల చట్టం ప్రకారం, ఓటరు జాబితా బహిరంగంగా అందుబాటులో ఉండాలనే నియమం ఉందని జైనా కొఠారి అంటున్నారు.
ఎన్నికల చట్టానికి చేసిన సవరణలేంటి?
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలను అఫిడవిట్‌లో సమర్పించాలని ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తోంది. అప్పుడే దానిని పరిగణనలోకి తీసుకుంటామని చెబుతోంది.
"1951 చట్టం నుంచి ఎన్నికల చట్టాన్ని ఎప్పుడు సవరించారు? ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే సవరణ జరిగింది. ఎలక్షన్ కమిషన్ తప్పులు ప్రజలకు కనిపిస్తే, వాటిని ఎత్తిచూపితే, ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదు? బీజేపీతో పొత్తు ఉందా లేదా అనేది తర్వాతి సంగతి'' అని అని శ్రీహరి అన్నారు.
''ఇలాంటి గందరగోళ వాతావరణాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. మంచి ప్రజాస్వామ్యంలో ఇంత సందేహాస్పద వాతావరణం ఉండకూడదు" అని జైనా అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














