అరుణ్‌ జైట్లీ గురించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై విమర్శలెందుకు, ఆయన కుమారుడు రోహన్ జైట్లీ ఏమన్నారు?

రాహుల్, రోహన్

ఫొటో సోర్స్, Getty Images

దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీపై చేసిన వ్యాఖ్యల కారణంగా.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో అరుణ్ జైట్లీ తనను బెదిరించారని అన్నారు.

దీనిపై అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ స్పందించారు. ప్రభుత్వం 2020లో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని, తన తండ్రి అరుణ్ జైట్లీ 2019లో మరణించారని అన్నారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నాయకులు, మంత్రులు కూడా విమర్శలు గుప్పించారు. "రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారం" అని అన్నారు.

అరుణ్ జైట్లీ 2019 ఆగస్ట్ 24న మరణించారు. 2020 సెప్టెంబర్‌లో వ్యవసాయ చట్టాలు తెచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాహుల్ గాంధీ, అరుణ్ జైట్లీ, బీజేపీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

రాహుల్ గాంధీ ఏమన్నారు?

శనివారం, రాహుల్ గాంధీ 'లీగల్ కాన్‌క్లేవ్ 2025' వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆయన అరుణ్ జైట్లీ గురించి ప్రస్తావించారు.

"నేను వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్న సమయంలో జరిగిన ఒక విషయం ఇంకా నాకు గుర్తుంది. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు, నేను ఇది చెప్పకూడదనుకున్నా, కానీ చెబుతున్నా. నన్ను బెదిరించడానికి అరుణ్ జైట్లీ గారిని పంపించారు" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

అరుణ్ జైట్లీ గురించి ఆయన మాట్లాడుతూ, "మీరు ఇలాగే కొనసాగితే, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే, వ్యవసాయ చట్టాలపై పోరాడితే, మీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ నాతో అన్నారు. నేను ఆయన వైపు చూసి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియదనుకుంటా అన్నాను" అని రాహుల్ చెప్పారు.

రోహన్ జైట్లీ

ఫొటో సోర్స్, Getty Images

రోహన్ జైట్లీ ఏమన్నారంటే..

"వ్యవసాయ చట్టాల విషయంలో నా తండ్రి అరుణ్ జైట్లీ తనను బెదిరించారని రాహుల్ గాంధీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు" అని రోహన్ జైట్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"రాహుల్ గాంధీకి నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఏంటంటే, వ్యవసాయ చట్టాలు 2020లో తీసుకొచ్చారు, కానీ నా తండ్రి 2019లోనే మరణించారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, బెదిరించే స్వభావం మా నాన్నకు లేదు, ఎవరితోనైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.." అని ఆయన ఆ పోస్ట్‌లో రాశారు.

"నా తండ్రికి ప్రజాస్వామ్యంపై ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆయనకు ఏకాభిప్రాయం సాధించడంలో నమ్మకం ఉండేది. రాజకీయాల్లో అలాంటి పరిస్థితులు ఎదురైనా, అన్ని పక్షాలను చర్చల కోసం ఆహ్వానించేవారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం. ఇది తరచూ జరిగేది. ఇదే ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం" అని రోహన్ రాశారు.

ఈ లోకంలో లేని వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ కాస్త సంయమనం పాటించాలని రోహన్ జైట్లీ కోరారు.

"మన మధ్య లేని వారి గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ సంయమనం పాటించాలని నేను కోరుతున్నా. మనోహర్ పారికర్ గారి విషయంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇది దురదృష్టకరం. ఆయన చివరి రోజులను రాహుల్ రాజకీయాల కోసం వాడుకున్నారు. ఈ లోకం విడిచి వెళ్లిపోయిన వారికి ఆత్మశాంతి కలగనివ్వండి" అని రోహన్ తన పోస్ట్‌లో రాశారు.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Justin Tallis-WPA Pool/Getty Images

ఫొటో క్యాప్షన్, "ఇలాంటి బాధ్యతారహిత నాయకత్వం కాంగ్రెస్‌కే కాదు, దేశానికి కూడా హాని కలిగిస్తుంది" అని ఆర్థిక మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బీజేపీ మాటల దాడి

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

"రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతారు, ప్రచారం చేస్తారు"అని బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు.

"వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడచిపోయాయి. ఎలాంటి మార్పూ లేదు. రోజుకో కొత్త అబద్ధం, రోజుకో కొత్త ప్రచారం. ఇంకా ఎంతకాలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు? ఎప్పటివరకూ కాంగ్రెస్ భ్రమలో ఉంటుంది?" అని ఆయన అన్నారు.

"అరుణ్ జైట్లీ 2019 ఆగస్ట్ 24న మరణించారు. వ్యవసాయ చట్టాలను 2020 సెప్టెంబర్ 17న లోక్‌ సభలో, 2020 సెప్టెంబర్ 20న రాజ్యసభలో ఆమోదించారు. అంటే, వ్యవసాయ చట్టాల బిల్లు అరుణ్ జైట్లీ మరణించాక వచ్చింది. మరి ఆయన రాహుల్‌ను బెదిరించడానికి ఎప్పుడొచ్చారు?" అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు.

"దీనికి అరుణ్ జైట్లీ కుటుంబానికి, బీజేపీకి, దేశం మొత్తానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ చేశారు.

"తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. రాజకీయ అసంతృప్తితో ఉన్నఆయన.. మన మధ్య లేనివారినీ వదిలిపెట్టడం లేదు"అని ఆయన రాశారు.

"వాస్తవానికి, తప్పుడు ప్రకటనలు చేసినందుకు సుప్రీంకోర్టు రాహుల్‌ను ఇప్పటికే రెండుసార్లు మందలించింది. అయినా ఆయన గుణపాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు" అని ఆ పోస్ట్‌లో రాశారు జైవీర్ షెర్గిల్.

దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా స్పందించారు.

రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేస్తూ.. "బాధ్యతారహిత ప్రవర్తనకు ముఖం ఉంటే, అది రాహుల్ గాంధీనే" అని ఆమె రాశారు.

"ప్రజా జీవితంతో సంబంధమున్న వ్యక్తులపై, ఈ ప్రపంచంలో లేని వారిపై కూడా నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆయన స్వభావంగా మారింది. అరుణ్ జైట్లీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవి" అని ఆమె పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)