రాహుల్ గాంధీ ఆరోపణలు, ఎలక్షన్ కమిషన్ సమాధానాలు.. ఓటర్లుగా మీకు ఈ 5 విషయాలు తెలుసా?

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఆగస్టు 7న, రాహుల్ గాంధీ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఇవి 'తప్పుదోవ పట్టించేవి' అని వ్యాఖ్యానించింది.

ఓట్లు చోరీ అయ్యాయనే ఆయన వాదన నిజమని నమ్మితే, అఫిడవిట్‌పై రాహుల్ గాంధీ సంతకం చేయాలని, అలా చేయలేకపోతే, దేశానికి క్షమాపణ చెప్పాలని కమిషన్ డిమాండ్ చేసింది.

బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు చేశారు.

బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) తర్వాత వచ్చిన మొదటి ముసాయిదా జాబితాలో తన పేరు లేదని ఆయన ఆరోపించారు.

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా రిగ్గింగ్ జరుగుతోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు.

ఓటరు కార్డులు, జాబితాకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. వాటికి సమాధానాలను బీబీసీ తేలికైన భాషలో తయారుచేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు లైన్‌లో నిల్చున్న మహిళలు

1. ఈపీఐసీ(EPIC) అంటే ఏంటి?

ఈపీఐసీ అంటే 'ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు'. సాధారణ పరిభాషలో దీనిని ఓటరు గుర్తింపు కార్డ్ అంటారు.

దీనిని ఎలక్షన్ కమిషన్ జారీ చేస్తుంది. దీనిలో వ్యక్తి పేరు, ఫోటో, జెండర్, పుట్టిన తేదీ, వయసు, చిరునామా, ఒక ఈపీఐసీ నంబర్ ఉంటాయి.

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, Getty Images

2. రెండు ఈపీఐసీ సంఖ్యలు ఉండొచ్చా?

చట్టపరంగా, ఒక వ్యక్తికి ఒకే ఈపీఐసీ నంబర్ ఉండాలి.

1951 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పేరు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటరు జాబితాలో మాత్రమే ఉండాలి.

వేరే ప్రాంతానికి మారినప్పుడు ఓ వ్యక్తికి కొత్త ఓటరు కార్డు లభిస్తుంది.

సదరు వ్యక్తి ఇలా కొత్త ఓటరు కార్డు పొందినప్పుడు చాలా సందర్భాల్లో పాత ఈపీఐసీ నంబర్‌ను రద్దు చేసుకోరు. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి పేరు మీద రెండు ఈపీఐసీ నంబర్‌లుంటాయి.

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఓటరు జాబితా డిజిటల్ డేటా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

3. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చూసుకోవాలి?

జాతీయ ఓటర్ల సేవా పోర్టల్‌లో ఎవరైనా ఓటరు జాబితాలో తమ పేరును తనిఖీ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌లో మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి తన వివరాలు, ఈపీఐసీ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఓటరు జాబితాలో తన పేరును తనిఖీ చేసుకోవచ్చు.

దీని ద్వారా ఒక ఓటరు తన అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ చిరునామాను తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్ సహాయంతో, ఒక వ్యక్తి తన పేరు మీద రెండు ఈపీఐసీ నంబర్లు అంటే రెండు ఓటరు కార్డులు ఉన్నాయోమో కూడా కూడా తెలుసుకోవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ ఈపీఐసీ నంబర్లు కనిపిస్తే, ఫామ్-7 ద్వారా తన పాత ఓటరు ఐడీని తొలగించుకోవాలి.

దీంతో పాటు ఒక వ్యక్తి బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) లేదా జిల్లా ఎన్నికల కార్యాలయానికి వెళ్లి కూడా ఓటరు జాబితాలో తన పేరును తనిఖీ చేసుకోవచ్చు.

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, Congress

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

4. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఏం చేయాలి?

ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ఫామ్-6 ని నింపాలి.

మొదటిసారి ఓటు నమోదు చేసుకోవడానికి ఈ ఫామ్ నింపాలి.

ఈ ఫామ్‌లో, వ్యక్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, జెండర్, చిరునామా, కుటుంబంలో ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం.

ఈ ఫామ్‌ను ఆన్‌లైన్‌లో ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌లో నింపొచ్చు లేదా బీఎల్‌ఓ లేదా జిల్లా ఎన్నికల కార్యాలయానికి సమర్పించవచ్చు.

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కెనడాలో బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారు.

5. ఓటరు జాబితా పొందడం ఎలా?

ఓటరు సర్వీస్ పోర్టల్‌ను ద్వారా ఎవరైనా ఓటరు జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబితా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది. దీని డిజిటల్ డేటా లేదు.

ఒక వ్యక్తి ఓటరు జాబితాలో తన పేరును తనిఖీ చేసుకోవాలనుకుంటే, ఆయన తన అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పోలింగ్ స్టేషన్ సంఖ్యను కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే పోర్టల్‌లో పోలింగ్ స్టేషన్ ప్రకారం ఓటరు జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఒక వ్యక్తి తన పేరును చూసుకోవటానికి మొత్తం పీడీఎఫ్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. డిజిటల్ డేటా అందుబాటులో ఉంటే, ఒకే క్లిక్‌తో పేరును సులభంగా చూసుకోవచ్చు.

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మెషీన్ రీడబుల్ ఓటరు జాబితా ఓటర్ల గోప్యతకు హాని కలిగిస్తుందని ఎలక్షన్ కమిషన్ అంటోంది

డిజిటల్ ఓటరు జాబితా ఎందుకు అందుబాటులో లేదు?

ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటల్ డేటాను అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌ను డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నాయకుడు, అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా 2019లో ఇలాంటి డిమాండే చేశారు. ఓటరు జాబితాను డిజిటల్ విశ్లేషణ చేయడానికి వీలుగా మెషీన్-రీడబుల్ ఫార్మాట్‌లో పూర్తి ఓటరు జాబితాను కోరుతూ ఆయన ఈ డిమాండ్ చేశారు.

మెషీన్ రీడబుల్ ఓటరు జాబితా ఓటర్ల గోప్యతకు హాని కలిగిస్తుందని ఎలక్షన్ కమిషన్ అప్పుడు చెప్పింది.

ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని కమల్ నాథ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.. కానీ కోర్టు దానిని తిరస్కరించింది.

గోప్యత, డేటా భద్రత పరంగా ఎలక్షన్ కమిషన్ విధానం సరైనదని సుప్రీంకోర్టు భావించింది.

''పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచడం వల్ల ఓటర్ల గోప్యత ఉల్లంఘన జరగనప్పుడు, అదే జాబితాను డిజిటల్ రూపంలో అందించడం వల్ల ఎలా అవుతుంది? ఇది నాకు ఇది అర్థం కాలేదు'' అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కో ఫౌండర్ జగదీప్ చోకర్ అంటున్నారు.

ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా, రాహుల్ గాంధీ, డిజిటల్ డేటా

ఫొటో సోర్స్, x.com/RahulGandhi

ఇతర దేశాల్లో డిజిటల్ ఓటరు జాబితాలు ఉన్నాయా?

కెనడా ఎన్నికల చట్టం ప్రకారం, అక్కడి ఎన్నికల కమిషన్ ఎంపీలు, రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు డిజిటల్ రూపంలో ఓటరు జాబితాలను అందిస్తుంది.

ఈ జాబితాలో ఓటర్ల పేర్లు, వారి చిరునామాలు, వారి ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు ఉంటాయి.

అదేవిధంగా, అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఓటర్ల జాబితాలను ఎలక్ట్రానిక్‌గా అందుబాటులో ఉంచుతాయి.

చాలా రాష్ట్రాల్లో ఇది జర్నలిస్టులు, పరిశోధకులు, రాజకీయ పార్టీలు ఉపయోగించుకోగలిగే ఓ పబ్లిక్ డాక్యుమెంట్‌లా ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)