ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం ఏం చెప్పింది?

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

భారత ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మహారాష్ట్ర, హరియాణాలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో "ఓటరు జాబితాలలో భారీగా అక్రమాలు జరిగాయని" ఆయన అన్నారు.

"మహారాష్ట్రలో ఎన్నికల "చోరీ"కి ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందనడానికి ,ఎన్నికల సంఘం మెషిన్ రీడబుల్ ఓటరు జాబితాను అందించకపోవడమే నిదర్శనం" అని రాహుల్ ఆరోపించారు.

రాహుల్ గాంధీ ఆరోపణలు 'తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి' అని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. రాహుల్ గాంధీ తన ఫిర్యాదులను కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కమిషన్ పేర్కొంది.

రాహుల్ గాంధీ తాను చెబుతున్నది నిజమని నమ్మితే అఫిడవిట్‌పై సంతకం చేసి ఫిర్యాదు చేయాలని, లేదంటే ఆయన దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్లేనని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న రాహుల్ వాదనను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తోసిపుచ్చారు.

"రాహుల్ గాంధీ నిరంతరం అబద్ధాలు చెబుతూ, తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. గతంలో మహారాష్ట్రలో 75 లక్షల ఓట్లు పెరిగాయని, ఇప్పుడు కోటి ఓట్లు పెరిగాయన్నారు. అబద్ధాలు చెబుతూ తన ఓటమిని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు.

గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. ఇందులో మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఓటర్ల జాబితాలో మార్పులు, లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఓటర్ల పెరుగుదలకు సంబంధించి, ధృవీకరించని ఆధారాలను చూపించారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2.6 కోట్ల మంది కొత్త ఓటర్లు పాల్గొన్నారు.

ఆరోపణ 1: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

  • మహారాష్ట్రలో గత ఐదేళ్లలో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారి సంఖ్య కంటే ఐదు నెలల్లో నమోదైన కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని మేం ఎన్నికల సంఘానికి బహిరంగంగానే చెప్పాం.
  • కొత్త ఓటర్ల నమోదు అనుమానాస్పదంగా ఉంది.
  • మహారాష్ట్ర జనాభా కంటే కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించే అంశం.
  • ఐదేళ్ల తర్వాత, ఓటింగ్ శాతంలో అకస్మాత్తుగా భారీ పెరుగుదల కనిపించింది.
  • అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమి పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది, అయితే కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అదే కూటమి విజయం సాధించింది. ఇది అనుమానాస్పదంగా ఉంది.
  • మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కోటి మంది కొత్త ఓటర్లు చేరడాన్ని మేం గమనించాము. దీని గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశాం.
  • రాష్ట్రంలో 40 లక్షల నకిలీ ఓటర్లను గుర్తించారు.

ఆరోపణ2 : కర్ణాటక గురించి ఏం చెప్పారు?

  • కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ఇంటర్నల్ పోల్స్ అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్‌కు 9 సీట్లు మాత్రమే వచ్చాయి.
  • కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో లక్షకు పైగా నకిలీ ఓటర్లు, నకిలీ చిరునామాలు, బల్క్ ఓటర్లు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ దర్యాప్తులో తేలింది.
  • బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ స్థానంలో 6.5 లక్షల ఓట్లలో లక్షకు పైగా ఓట్ల 'దొంగతనం' జరిగింది.
  • కర్ణాటకలోని అనేక బూత్‌లలో వేర్వేరు రాష్ట్రాలలో ఓటు వేసిన సుమారు 11 వేల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం.
  • ఈ ఓటర్ల పేర్లు, బూత్ నంబర్లు, చిరునామాల జాబితా మా వద్ద ఉంది.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకే ఓటరు పేరు ఒకటి కంటే ఎక్కువ బూత్‌లలో నమోదైందని రాహుల్ గాంధీ అన్నారు.

ఆరోపణ 3: నకిలీ ఓటర్లు

  • వేర్వేరు రాష్ట్రాలకు చెందిన అనేకమందిని ఓటరు జాబితాలో చేర్చారు.
  • ఒకే వ్యక్తి బెంగళూరులోని మహాదేవ్‌పుర, తూర్పు లక్నో, ముంబైలోని తూర్పు జోగేశ్వరి నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేసుకున్నారు.
  • తమ పరిశోధన బృందం 40 వేలకు పైగా నకిలీ ఓటర్లను గుర్తించిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఆ ఓటర్ల చిరునామాలు తప్పుగా ఉండటం లేదా ఆ చిరునామానే లేకపోవడం, ఆ చిరునామాలో నమోదు చేసుకున్న ఓటరే లేకపోవడం వంటి వాటిని తమ టీమ్ గుర్తించినట్లు రాహుల్ చెప్పారు.
  • ప్రతి ఇంటి అడ్రస్‌లో 80, 46 మంది ఓటర్లు నమోదయ్యారు. ఒకే ఇంట్లో పెద్ద సంఖ్యలో నమోదైన ఓటర్ల సంఖ్య 10 వేలకు పైన ఉంది.
  • కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే ఫాం- 6ను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. అలాంటివి 33,692 కేసులు నమోదయ్యాయి.

ఆరోపణ 4: గెలుపోటముల మధ్య తేడా స్వల్పం

  • హరియాణాలోని ఎనిమిది స్థానాల్లో గెలుపోటముల మధ్య తేడా 22,779 మాత్రమే. ఈ రాష్ట్రంలో 2 కోట్లమంది ఓటర్లున్నారు.
  • ఇక్కడ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయి.
  • ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. 90 సీట్లున్న హరియాణా అసెంబ్లీలో కాంగ్రెస్ 60 సీట్లలో గెలుస్తుందని చెప్పారు.
  • దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని బీజేపీ నిరూపించింది. ఆ పార్టీ 48 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును దాటింది.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, x.com/RahulGandhi

ఫొటో క్యాప్షన్, ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని రాజ్యాంగం చెబుతోందని రాహుల్ అన్నారు.

ఆరోపణ 5: ఎన్నికల సంఘం గురించి..

"2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలో కొనసాగడానికి ప్రధాని మోదీకి 25 సీట్లు దొంగిలించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 33 వేల ఓట్ల కంటే తక్కువ తేడాతో 25 సీట్లు గెలుచుకుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.

"భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మీరు ఉన్నారు, నాశనం చేయడానికి కాదని ఈసీకి చెబుతున్నాం. ఇప్పుడీ సమాచారం అంతా సాక్ష్యమే. కర్ణాటక మాత్రమే కాదు. దేశంలోని ప్రతీ ఓటరు జాబితా రుజువు లాంటిదే" అని రాహుల్ గాంధీ అన్నారు.

"ఇది భారత రాజ్యాంగం, జాతీయ జెండాకు వ్యతిరేకంగా జరిగిన నేరం. అంతకన్నా తక్కువ కాదు. ఇది ఒక అసెంబ్లీలో జరిగిన నేరానికి రుజువు. మేము ఈ నమూనాను గుర్తించాం. అందుకే దీన్ని పూర్తిగా నమ్ముతున్నాం. మేము దీనిపై అధ్యయనం చేశాం" అని రాహుల్ గాంధీ చెప్పారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ ఆరోపణలపై కర్నాటక ఎన్నికల ప్రధాన అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది?

రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలపై కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు.

"కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎన్నికల అధికారిని కలవడానికి సమయం కోరింది. ఆగస్టు 8న మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్య వారికి సమయం కేటాయించాం" అని ఆ ప్రకటనలో తెలిపారు.

"ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నియమాలు-1960తో పాటు భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనల ప్రకారం అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు రూపొందిస్తారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

"ఓటరు జాబితాను నవంబర్ 2024, జనవరి 2025లో కాంగ్రెస్‌ పార్టీకి అందించాం. ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే హైకోర్టులో ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే దీనిని సవాలు చేయవచ్చు" అని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన తెలిపింది.

"ఓటరు జాబితాలో అనర్హులైన ఓటర్లను చేర్చడం, అర్హులైన వారిని తొలగించినట్లు మీరు ప్రస్తావించారు. అలాంటి ఓటర్ల పేర్లతో కూడిన వివరాలను ఓటర్ల నమోదు నియమావళి1960లో రూల్ 20(3)(బి) కింద జతపరిచిన డిక్లరేషన్, అఫిడవిట్‌ను సంతకం చేసి మాకు పంపించండి. దాని ప్రకారం మేం చర్య తీసుకుంటాం" అని ఆ ప్రకటన వెల్లడించింది.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, x.com/RahulGandhi

ఫొటో క్యాప్షన్, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రాహుల్ వ్యాఖ్యలు రాజకీయ అంశంగా మారతాయని నిపుణులు భావిస్తున్నారు.

రాహుల్ ఆరోపణలపై నిపుణులేమంటున్నారు?

రాహుల్ గాంధీ ఆరోపణలు తీవ్రమైనవని సీనియర్ జర్నలిస్ట్ అదితి ఫడ్నిస్ చెప్పారు.

"ఒక రకంగా ఇది ఎన్నికల సంఘం మీద దాడి. అయితే ఎలక్షన్ కమిషన్ ఆరోపణలను అంగీకరించడం లేదు. ఈ ఆరోపణలను ఎదుర్కోవడం ఎన్నికల సంఘానికి పరీక్ష లాంటిది" అని ఆమె అన్నారు.

"ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికతకు సంబంధించి మొదటిసారిగా ఒకరు ఇంత తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈసీ పూర్తిగా నిజాయితీ లేకుండా వ్యవహరించిందని దీని వల్ల ఓటర్ల చేతుల్లో ఉన్న ఆయుధం మొద్దు బారిపోయింది" అని ఆమె బీబీసీతో చెప్పారు.

"ఇది తీవ్రమైన ఆరోపణ. ఎన్నికల కమిషన్ ఆయన నుండి అఫిడవిట్ కోరింది కాబట్టి ఇది తార్కికమని నేను భావిస్తున్నాను. రాహుల్ గాంధీ వద్ద ఏదైనా రుజువు ఉండి ఉండవచ్చు. ఆయన గుడ్డిగా ఆరోపణలు చేయరు" అని అదితి ఫడ్నిస్ చెప్పారు.

బిహార్‌లో స్పెషల్ ఓటర్ రివిజన్ క్యాంపెయిన్‌పై తీవ్ర గందరగోళం కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు దీనిని రాజకీయ అంశంగా మారుస్తాయని చెప్పారు.

"బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆరోపణలు రాజకీయ అంశంగా మారతాయని" ఆమె అన్నారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక ఎన్నికలు

ఫొటో సోర్స్, facebook.com/pralhadvjoshi

బీజేపీ ఏం చెప్పింది?

మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న రాహుల్ గాంధీ ఆరోపణల్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు.

భారత దేశంలో ఎన్నికలు సరిగ్గా జరగవని ప్రపంచానికి చెప్పేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

"మీరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. లోక్‌సభలో ఇంకా ఎక్కువ సీట్లు కోల్పోయారు. కర్ణాటక అసెంబ్లీలో ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చాయి కానీ లోక్‌సభలో కాదు. భారతదేశంలో ఎన్నికలు సరిగ్గా జరగవని మీరు ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ సంస్థలను అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే, మీ అభ్యర్థులు జార్ఖండ్‌లో ఎలా గెలిచారు? జమ్మూ కశ్మీర్‌లో ఎలా గెలిచారు?" అని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు.

"రాహుల్ గాంధీ రాజ్యాంగ సంస్థపై రాహుల్ గాంధీ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల ఓటర్ల జాబితాను ఆయన ఎందుకు ప్రదర్శించరు?" అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా ప్రశ్నించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)