‘ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో సగం ఉన్నా ట్రంప్ చెప్పేది అబద్ధం అని మోదీ ప్రకటన చేయాలి’ అని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు?

ఫొటో సోర్స్, SansadTV
‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో జరిగిన ఫోన్ సంభాషణ గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంటుకు తెలిపారు.
‘‘మే 9 రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు నాతో ఓ గంటసేపు మాట్లాడాలని నాలుగైదుసార్లు ప్రయత్నించారు. తరువాత నేను కాల్ చేసి ఆయనతో మాట్లాడాను’’
‘‘పాకిస్తాన్ పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన నాతో చెప్పారు. పాకిస్తాన్ ఉద్దేశం అదే అయితే మేం మరింత పెద్దఎత్తున దాడిచేస్తామని, వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పాను’’
మేం ముందే చెప్పినట్టే ‘‘మేం బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానమిస్తాం. మే 10వ తేదీ ఉదయానికల్లా పాకిస్తాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాం. ఇదీ మా సమాధానం, మా స్ఫూర్తి’’
అంతకుముందు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాల్పుల విరమణకు తానే కారణమంటూ ట్రంప్ చేసిన ప్రకటనలపై పార్లమెంటుకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
‘‘కాల్పుల విరమణ ఘనత తనదే అంటూ ట్రంప్ 29సార్లు చెప్పారు. ఆయన అబద్ధాలు చెబుతుంటే ప్రధాని మోదీకి ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో సగం ఉన్నా.. ప్రధానికి దమ్ముంటే ట్రంప్ చెప్పేది అబద్ధమని చెప్పాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

మోదీ సమాధానంపై నిరసన
‘‘భారతదేశం ప్రతి ప్రతిస్పందన గతంలో కంటే బలంగా ఉందని ఈ రోజు పాకిస్తాన్ గ్రహించింది. భవిష్యత్తులో అవసరమైతే భారత్ ఏమైనా చేయగలదని కూడా తెలుసు’’ అని మోదీ చెప్పారు.
‘‘ప్రపంచంలో ఏ నాయకుడూ ఈ ఆపరేషన్ నిలిపివేయమని ఇండియాను అడగలేదు’’ మోదీ స్పష్టం చేశారు.
దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున దుమారం రేగింది.
'ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను. పాకిస్తాన్ ఏదైనా చేయడానికి సాహసిస్తే దానికి దీటైన జవాబు లభిస్తుంది’’ అని మోదీ తెలిపారు. సమస్యల కోసం పార్టీ కాంగ్రెస్ పాకిస్తాన్‌పై ఆధారపడుతోందని ఆయన ఆరోపించారు.
దీంతో మరోసారి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బెంచీలపై నిలబడి నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, Sansd TV/ BBC
కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. మోదీ సాయంత్రం ఆరున్నరగంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 'ఇండియా వైపు చూడలేని వారికి అద్దం చూపించడానికి నేను నిలబడ్డాను' అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత్ తన రక్షణ కోసం చర్యలు తీసుకోవడాన్ని ప్రపంచంలోని ఏ దేశమూ అడ్డుకోలేదు’’ అన్నారు.
‘‘భారత్‌కు క్వాడ్, బ్రిక్స్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ సహా పలు దేశాల నుంచి భారత్‌కు మద్దతు లభించింది. కానీ నా దేశ వీరుల ధైర్యసాహసాలకు కాంగ్రెస్ మద్దతు లభించలేదు’’
‘‘మూడు,నాలుగు రోజుల తరువాత 56 అంగుళాల ఛాతీ ఎక్కడికి వెళ్లిందని, మోదీ ఎక్కడికి వెళ్లారని, మోదీ విఫలమయ్యారు అని చెప్పి కాంగ్రెస్ సంతోషపడుతోంది. పహల్గాంలో ప్రజలు చనిపోయిన తరువాత కూడా వాళ్లు స్వార్థ రాజకీయాల కోసం చూస్తున్నారు. ఇంకా నన్నే లక్ష్యంగా చేసుకున్నారు’’ అని మోదీ విమర్శించారు.
దీనిపై విపక్షాలు మరోసారి సభను అడ్డుకునే పనిచేయడంతో స్పీకర్ విపక్షాలను మందలించారు.
‘‘ఏప్రిల్ 22 దాడులకు మన సైన్యం 22 నిమిషాలలో లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది’’ అన్నారు మోదీ
‘‘భారత్ ఇలాంటి వ్యూహాన్ని రచించడం ఇదే తొలిసారి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు చేరుకున్నాం. పాకిస్తాన్‌లో ప్రతి మూలలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. బహవల్పూర్, మురిద్కేలను కూడా నేలమట్టం చేశారు’’ అని ప్రధాని తెలిపారు.
'‘ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రపంచమంతా భారత్ స్వావలంబన శక్తిని గుర్తించింది. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ బలహీనతను చాటిచెప్పాయి’’ అన్నారు.
సీడీఎస్ నియామకాన్ని ప్రస్తావిస్తూ ‘‘నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మధ్య సమన్వయం పాకిస్తాన్‌ను కష్టాలపాలు చేసింది’’ అన్నారు.
సిందూర్ నుంచి సింధు వరకు భారత్ చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ అన్నారు. తాము భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఉగ్రవాదుల మాస్టర్లు అర్థం చేసుకున్నారు.

మోదీ ప్రసంగంలో కీలకాంశాలు
- ఉగ్రవాదానికి దీటైన సమాధానం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇది మన జాతీయ సంకల్పం. మన సాయుధ దళాల సామర్థ్యం, బలం, ధైర్యసాహసాలపై నమ్మకం ఉంది.
- సైన్యానికి స్వేచ్ఛనిచ్చాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి చర్యలు తీసుకోవాలో సైన్యం నిర్ణయించుకోవాలని చెప్పాం.
- పహల్గాం దాడి తర్వాత భారత్ కొన్ని కఠిన చర్యలు తీసుకుంటుందని పాక్ సైన్యం ఊహించింది. అణ్వాయుధాల బెదిరింపులు కూడా మొదలయ్యాయి.
- మే 6వ తేదీ రాత్రి, 7వ తేదీ ఉదయం భారత్ చర్యలు తీసుకోవడంతో పాక్ ఏమీ చేయలేకపోయింది.
- న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్ పని చేయదని, దానికి భారత్ తలవంచదని భారత్ నిరూపించింది. పాకిస్తాన్ గుండెలపై భారత్ గట్టిగా కొట్టింది.
- పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇప్పటికీ ఆ దేశ వైమానిక స్థావరాలు చాలా వరకు ఐసీయూలో ఉన్నాయి
- ఉగ్రదాడి జరిగితే మరింత గట్టిగా బదులిస్తామనేది సరికొత్త పద్దతి.
- టెర్రరిస్టులు తమను పోషించే ప్రభుత్వాన్ని, ఉగ్రవాద యజమానులను వేరువేరుగా చూడరు.


ఫొటో సోర్స్, Sansad TV/BBC
రాహుల్ గాంధీ సవాల్
‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా కాల్పుల విరమణకు తానే ఆదేశించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇందిరాగాంధీని ప్రస్తావిస్తూ ఆయన ట్రంప్ విషయంలో ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
ప్రభుత్వానికి పోరాట సంకల్పం లేకపోవడంతో వైమానిక దళం చేతులు కట్టేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
‘‘కాల్పుల విరమణ ఘనత తనదే అని ట్రంప్ 29సార్లు చెప్పారు. ఆయన చెప్పేది అబద్ధమే అయితే, ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో మోదీకి సగం ఉన్నా, అది సరికాదు అని చెప్పాలి. ప్రధానికి ధైర్యం ఉంటే ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పాలి’’ అని రాహుల్ సవాల్ చేశారు.
‘‘పహల్గాం దాడి తరువాత ఏ ఒక్కదేశమూ పాకిస్తాన్‌ను ఖండించలేదు. అంటే దీనర్థం ప్రపంచమంతా ఇండియాను పాకిస్తాన్‌తో సమానంగా చూశాయని’’
‘‘పహల్గాం సూత్రధారి అయిన పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌తో లంచ్ చేశారు, ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఎలా అరికట్టాలో అమెరికన్ కమాండర్లతో చర్చిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
'ఏ ఉగ్రదాడి అయినా యుద్ధ ప్రకటనే' అనే విధానంతో ఉగ్రవాదులను యుద్ధంలోకి లాగాలనుకున్నప్పుడల్లా దాడి చేసే హక్కును కల్పించారు’’
భారత ప్రభుత్వ విదేశాంగ విధానంపై ప్రశ్నలు లేవనెత్తిన ప్రతిపక్ష నేత, చైనా, పాకిస్తాన్ లను వేరువేరుగా ఉంచాలనే భారత విదేశాంగ విధాన ప్రధాన సూత్రం దెబ్బతిందని ప్రతిపక్ష నేత విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
- రాజకీయ సంకల్పం, కార్యాచరణ స్వేచ్ఛ అనే రెండు అంశాలు ఉన్నాయి. 1971లో రాజకీయ సంకల్పం ఉంది. ప్రపంచంలోని అగ్రరాజ్యానికి చెందిన ఏడో నౌకాదళం హిందూ మహాసముద్రానికి వస్తుంటే ,అప్పటి ప్రధాని బంగ్లాదేశ్ లో మనం చేయాల్సిన పనిని పూర్తి చేస్తామని చెప్పారు.
- 1971లో లక్ష మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది.
- మరోవైపు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత ప్రభుత్వం మాకు పోరాడే రాజకీయ సంకల్పం లేదని పాకిస్తాన్‌కు చెప్పింది. ఉద్రిక్తతలను పెంచాలనుకోవడం లేదని తెలిపింది.
- పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక స్థావరాలపై దాడులు చేయవద్దని కోరినట్లు ఇండోనేషియాలోని భారత రక్షణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న శివకుమార్ తెలిపారు.
- ఇదే విషయాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిరోజే పాకిస్తాన్‌కు చెప్పారు. అయినప్పటికీ ఫైటర్ పైలట్లను పంపించారు.
- పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నామని భారత్ భావించినా చైనా మాత్రం దానితో పూర్తిగా అనుసంధానమై ప్రతి క్షణాన్నిప్రత్యక్షంగా అందించింది. ఇరు దేశాలు ఏకం కావడానికి మన విదేశాంగ విధానం విఫలం కావడమే కారణం.


ఫొటో సోర్స్, facebook/priyanka gandhi vadra
ప్రియాంక ఏమన్నారు?
అంతకుముందు లోక్ సభలో 'ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పహల్గాం దాడిలో భద్రతాలోపాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘‘నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో ఓ విషయాన్ని వదిలేశారు. బైసరన్ వ్యాలీ పర్యటక ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదనే విషయం చెప్పలేదు’’
పహల్గామ్ దాడి తర్వాత హోంమంత్రి లేదా ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఎవరైనా ఎందుకు రాజీనామా చేయలేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ 'కశ్మీర్ లో శాంతి ఉంది. శాంతి వాతావరణం ఉంది, కశ్మీర్ కు రండి, పర్యటన చేయండి అని కొంతకాలం కిందటినుంచి ప్రభుత్వం చెబుతోంది. శుభం ద్వివేదికి ఆరు నెలల కిందట పెళ్లయింది, ఆయన కశ్మీర్‌లోని బైసరన్ లోయకు వెళ్లారు. పహల్గాం దాడిలో మరణించిన 26 మందిలో శుభమ్ ద్వివేది ఒకరు, ఆయనను భార్య ముందే ఉగ్రవాదులు చంపారు’’
‘‘అక్కడ భద్రత ఎందుకు లేదు? అక్కడ ఒక్క సైనికుడు కూడా ఎందుకు కనిపించలేదు? రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పర్యటకులు అక్కడికి వెళతారని ప్రభుత్వానికి తెలియదా? అక్కడికి చేరుకోవాలంటే అడవి గుండా వెళ్లాల్సిందేనని తెలియదా? ఏదైనా జరిగితే ప్రజలు ఏం చేయగలరు? ’’ అని ప్రియాంక ప్రశ్నించారు.
‘‘అక్కడ వైద్యులనుగానీ, ప్రాథమిక చికిత్సగానీ ఏర్పాటు చేయలేదు. భద్రతా ఏర్పాట్లు కూడా లేవు. పర్యటకులు ప్రభుత్వాన్ని నమ్మి అక్కడికి వెళ్లారు. కానీ ప్రభుత్వం వారిని దేవుడి దయకు వదిలేసింది’’ అన్నారు ప్రియాంక.
పహల్గాంలో భద్రతా లోపంపై మోదీ ప్రభుత్వం మౌనంగా ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం నెహ్రూ నుంచి తన తల్లి కన్నీళ్ల వరకు అన్నీ చెప్పిందని, కానీ చెప్పుకోవాల్సింది పహల్గాం వైఫల్యం అని ఆమె అన్నారు.
‘‘ మా అమ్మ కన్నీళ్ల గురించి చర్చ జరిగింది. తన భర్త ఉగ్రవాదుల చేతిలో అమరుడైనప్పుడు మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఆమె వయసు 44 ఏళ్లు. ఈ రోజు నేను ఈ సభలో నిలబడి ఆ 26 మంది గురించి మాట్లాడుతుంటే, వారి బాధ నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను’’
నిజానికి అమిత్ షా తన ప్రసంగంలో బాట్లా హౌస్ కేసును ప్రస్తావిస్తూ సోనియాగాంధీని టార్గెట్ చేశారు. సల్మాన్ ఖుర్షీద్ వీడియోను ఉటంకిస్తూ సోనియా గాంధీ ఉగ్రవాదుల కోసం కన్నీరు కారుస్తున్నారని అమిత్ షా ఆరోపించారు.

ఫొటో సోర్స్, TWITTER @YADAVAKHILESH
ఆపరేషన్ మహదేవ్‌పై అఖిలేష్ ఏమన్నారు?
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఆపరేషన్ మహదేవ్‌పై తాను ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం లేదన్నారు. నిన్ననే ఎన్‌కౌంటర్ ఎందుకు జరిగింది? అని ప్రశ్నించారు.
అంతకు ముందు హోంమంత్రి అమిత్ షా ప్రకటన సందర్భంగా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
పాకిస్తాన్‌తో ఘర్షణను నిలిపివేస్తున్న విషయాన్ని ప్రభుత్వానికి బదులు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ప్రకటించడంపై అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
ప్రభుత్వం ఎలా తలవంచిందని ఎస్పీ చీఫ్ ప్రశ్నించారు. కాల్పుల విరమణ వెనుక కారణాలేంటి?అని అడిగారు.
‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇకపై ఉగ్రదాడులు ఉండవని, టూరిజం పెరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ పహల్గాం దాడి జరిగినప్పుడు భద్రతే లేదు. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరుగుతున్న ప్రచారం గర్హనీయం. ఆపరేషన్ సిందూర్ అస్తిత్వమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం’’ అన్నారు అఖిలేష్
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజకీయ ప్రతినిధులను విదేశాలకు పంపడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. 'ప్రతినిధి బృందంలో పేర్లు చెప్పే హక్కు రాజకీయ పార్టీలకు ఉంది’’ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















