ఎస్ఎస్ చిల్కా: వందేళ్ల కిందట శ్రీకాకుళం జిల్లా తీరంలో మునిగిపోయిన ఈ నౌక చుట్టూ ఇప్పుడేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, BBC/Balaramnaidu
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
శ్రీకాకుళం జిల్లాలోని బారువ తీరం నుంచి చూస్తే దాదాపు 200 మీటర్ల దూరంలో సముద్రంలో పాతిపెట్టినట్టున్న ఒక స్తంభం పైభాగం కనిపిస్తుంటుంది.
ఆ స్తంభం కింద వందేళ్ల కిందట మునిగిపోయిన ఎస్ఎస్ చిల్కా అనే నౌక ఉంది.
బ్రిటిష్ ఇండియాలో ఈ నౌకను బ్రిటిష్ ఇండియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ మదరాసు (ప్రస్తుతం చెన్నై) నుంచి రంగూన్ ( నేటి యాంగూన్ - మియన్మార్) వరకు నడిపేది.
ఆ నౌక శ్రీకాకుళం జిల్లాలోని బారువ తీరానికి ఎందుకు వచ్చింది? మునిగిపోయిన సమయంలో ఈ నౌకలో ప్రయాణికులెవరైనా ఉన్నారా? ఈ భారీ నౌక ఎందుకు మునిగిపోయింది? వందేళ్లు దాటినా దానిని తీసే ప్రయత్నం జరగలేదా?
ఇటీవల కాలంలో బారువ తీరానికి ప్రభుత్వ అధికారులు, స్కూబా డైవర్స్ తరుచూ వస్తున్నారు. మునిగిపోయిన ఎస్ఎస్ చిల్కా నౌక కేంద్రంగా బారువ తీరంలో ఏం జరుగుతోంది?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు వందేళ్ల కిందట ఏం జరిగిందో చూద్దాం..


ఫొటో సోర్స్, Balaramnaidu
వందేళ్ల కిందట బారువ తీరంలో...
కచ్చితంగా చెప్పాలంటే 107 ఏళ్ల కిందట, ప్రస్తుత శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామం బారువ నుంచి రంగూన్‌కు ఉపాధి కోసం వెళ్లేవారు. రంగూన్‌ను ప్రస్తుతం యాంగూన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రస్తుత మియన్మార్‌లో ఉంది.
"మా నాన్నగారు రంగూన్ వెళ్లేవారు. కూలి పనుల కోసం. వాటి గురించి మాకు కథలు చెప్పేవారు. అలాగే 1917లో బారువ తీరంలో మునిగిపోయిన చిల్కా నౌక గురించి మాకు చెప్తుండేవారు" అని బారువ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.
‘‘ఇక్కడ పీచు పరిశ్రమలు ఉండేవి. పీచు వస్తువులు, డోర్ మ్యాట్లు, తాళ్లు వంటివి ఇక్కడి నుంచి నౌకల్లో రంగూన్ తీసుకెళ్లేవారట. వాటితో పాటు ఉపాధి కోసం రంగూన్ వెళ్లేవారూ ఆ నౌకల్లోనే ప్రయాణించేవారు. అలాగే మా నాన్నగారు కూడా వెళ్లి వస్తుండేవారు’’ అని నాగేశ్వరరావు చెప్పారు.
"ఆ షిప్ మునిగిపోయిన చోట కనిపించే పొగ గొట్టం (మాస్ట్) లాంటి దాన్ని చూసేందుకు మేం సూర్యోదయం సమయంలో వస్తుండేవాళ్లం. ఎందుకంటే ఆ సమయంలో సముద్రం లోపలికి వెళ్లిపోవడం వల్ల మాస్ట్ స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు దానిని చూసి అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు చాలామంది పర్యటకులు, యూట్యూబర్లు వస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు" అని నాగేశ్వరరావు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/Balaramnaidu
నౌక మునిగిపోయిన రోజు ఏం జరిగిందంటే...
ఎస్ఎస్ చిల్కా 1917 జులైలో మునిగిపోయిన ఘటనను అప్పటి వార్తాపత్రికలు ప్రచురించాయి. ఆ వార్తలు, అలాగే సముద్రాలపై పరిశోధనలు చేసే విదేశీ చరిత్రకారుడు జాన్ కాస్టెలాస్, విశాఖలో స్కూబా డైవర్ బలరాంనాయుడికి పంపిన ఈ-మెయిల్ సమాచారం ఆధారంగా బలరాంనాయుడు బీబీసీకి ప్రమాద వివరాలు తెలిపారు.
బలరాంనాయుడు నేవీ మాజీ ఉద్యోగి. ప్రస్తుతం స్కూబా డైవింగ్ తో పాటు లివిన్ అడ్వెంచర్స్ పేరుతో వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు.
ఈయనే బారువ తీరంలో మునిగిపోయి ఉన్న ఎస్ఎస్ చిల్కా నౌకను వీడియోలు తీసి 2019లో బయట ప్రపంచానికి చూపించారు.
ఆ సందర్భంలోనే ఆయనతో ఎస్ఎస్ చిల్కా నౌక ప్రమాదంపై విదేశీ చరిత్రకారుడు మరిన్ని వివరాలను షేర్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Balaramnaidu
బలరాంనాయుడుకు విదేశీ చరిత్రకారుడు జాన్ కాస్టెలాస్ అందించిన వివరాల ప్రకారం...
"ఎస్ఎస్ చిల్కా 1917 జూన్ 30 న మద్రాసు నుంచి వివిధ సరుకులతో బయలుదేరి బారువ తీరం చేరుకుంది. అక్కడ తయారైన పీచు వస్తువులు, కొందరు స్థానికులను ఎక్కించుకుని ఒడిశాలోని గోపాల్ పూర్ తీరం వైపు వెళ్లేందుకు బయలుదేరింది. ఆ సమయంలో షిప్పులోని 3వ హ్యాచ్ (ఓడలోని ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లేందుకు ఉండే మార్గం) వద్ద మంటలు రావడం గమనించారు. ఆ సమయంలో పడవలో భారతీయులతో పాటు కొందరు యూరోపియన్లు ఉన్నారు. మొత్తంగా 1600 నుంచి 1700 మంది వరకు ఆ నౌకలో ఉన్నారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పైగా మరింతగా వ్యాపించాయి. దాంతో భయందోళనలకు గురైన ప్రయాణీకులు చాలా మంది నౌక నుంచి నీటిలో దూకేశారు"

ఫొటో సోర్స్, Balaramnaidu
"వారి కోసం సెఫ్టీ బోట్లు కిందకు దించారు. అదే సమయంలో బారువలోని స్థానిక మత్స్యకారులు వాళ్ల పడవలతో ప్రమాదం జరిగిన చోటుకి చేరుకున్నారు. 7 నుంచి 8 గంటలు కష్టపడి బారువ మత్స్యకారులు వీలైనంత మందిని తమ పడవల్లో ఎక్కించుకుని కాపాడారు. కాకపోతే 80 మంది వరకు మరణించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన యూరోపియన్లు, భారతీయులను బారువ రైల్వే స్టేషన్ లో ఉంచారు. అక్కడ నుంచి వారందరిని కలకత్తాకు రైలులో పంపించారు" అని జాన్ కాస్టెలాస్ అందించిన సమాచారంలో ఉందని బలరాం నాయుడు చెప్పారు.

మంటల్లో చిక్కుకుని..మునిగిపోయి..
నౌకలోని దాదాపు 16 వందల మందిని కాపాడిన ఆ నౌక చీఫ్ ఆఫీసర్ జార్జ్ మాక్డొనాల్డ్, చీఫ్ ఇంజనీర్ జేమ్స్ బ్రైమర్, ఆఫీసర్లు ఫ్రెడరిక్ విల్కిన్, కబ్రీ అహ్మద్ లకు అప్పటీ బ్రిటిష్ రాజు 'కింగ్స్ సిల్వర్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డులను ప్రదానం చేశారు.
"కానీ మంటల్లో చిక్కుకున్న ఎస్ఎస్ చిల్కా నౌక క్రమంగా మునిగిపోయింది. దాని గుర్తే ప్రస్తుతం కనిపిస్తున్న మాస్ట్. అయితే ఆ మాస్ట్ కింద నౌక ఇప్పటికీ గుర్తుపట్టే స్థితిలోనే ఉంది" అని బలరాంనాయుడు బీబీసీతో చెప్పారు.

ఎస్ఎస్ చిల్కా ప్రస్తుతం ఎలా ఉందంటే...
బలరాంనాయుడుకి చెందిన స్కూబా డైవర్ల టీం మునిగిపోయిన ఎస్ఎస్ చిల్కా నౌక వద్దకు పలుమార్లు వెళ్లింది. వీరు ఆ నౌక ఎలా ఉందో, అక్కడ ఏముందో బీబీసీకి వివరించారు. వాటి వీడియోలు తీసి చూపించారు.
"షిప్ చాలా పెద్దదిగా ఉంది. 75 మీటర్లు కంటే ఎక్కువ పొడవు ఉన్నట్లు అనిపించింది. నౌక ఆకారం చెడిపోలేదు. కాకపోతే వందేళ్లు దాటడంతో నౌక క్యాబిన్లు, పైపులు, ఇతర ఇంజన్లు ఇలా అన్నింటి చుట్టూ సముద్రపు మొక్కలు పెరిగాయి. ఈ నౌకే అవాసంగా రకరకాలైన చేపలు గుంపులుగా కనిపించాయి. కోరల్స్ చాలా ఉన్నాయి. నౌక చుట్టూ ఇసుక చేరి కనిపిస్తోంది" అని బలరాం నాయుడు చెప్పారు.

"సముద్రంలో ఇలా నౌకను చూడటం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అందుకే స్కూబా డైవింగ్ ద్వారా అక్కడికి పర్యటకుల్ని తీసుకుని వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తున్నట్లు ఉంది" అని బలరాంనాయుడు అన్నారు.

'అంతర్జాతీయ పర్యటకులూ వస్తారు’
బారువ తీరానికి దాదాపు 200 మీటర్ల దూరంలో, ఏడెనిమిది మీటర్ల లోతులోనే ఈ నౌక ఉండటంతో పర్యటకులు దీనిని చూసేందుకు ఆసక్తి చూపుతారని ఆ నౌక వద్దకు వెళ్లిన స్కూబా డైవర్ శెట్టి బీబీసీతో చెప్పారు.
" బేసిక్ స్కూబా డైవింగ్ శిక్షణ ఇచ్చి...టూరిస్టులను అక్కడికి తీసుకుని వెళ్లవచ్చు. ఇప్పటికే రుషికొండలో ఈ విధంగా స్కూబా డైవింగ్ ద్వారా పర్యటకులు సముద్రంలోని జీవులను చూసేందుకు వెళ్తున్నారు. ఇది భారీ నౌక కాబట్టి ఇంటర్నేషనల్ టూరిస్టులను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. పైగా తీరానికి సమీపంలోనే ఈ నౌక మునిగింది. కాబట్టి స్కూబా డైవింగ్‌కి అనుకూలంగా ఉంటుంది" అని బీబీసీతో అన్నారు శెట్టి.

"తీరం నుంచి కనిపించే గొట్టాన్ని (మాస్ట్) చూసేందుకు చాలా మంది వస్తుంటారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు..కెరటాలు వెనక్కి వెళ్లేటప్పుడు మాస్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. అలాగే జాతీయ రహదారికి సమీపంలోనే ఈ తీరం ఉంది" అని బారువ మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఎన్.శ్రీనివాసరావు బీబీసీకి చెప్పారు.
టూరిజంశాఖ కూడా బారువ తీరంపై దృష్టి పెట్టింది. ఇటీవల బారువ బీచ్ ఫెస్టివల్ పేరుతో ఒక ఉత్సవాన్ని నిర్వహించింది. అప్పటీ నుంచి ఎస్ఎస్ చిల్కా కేంద్రంగా బారువ తీరంలో టూరిజాన్ని అభివృద్ధి చేసి, విశాఖ రుషికొండ తరహాలో ఈ బీచుకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా సాధించాలని ఆలోచన చేస్తున్నట్లు జిల్లా టూరిజంశాఖ అధికారి నారాయణరావు బీబీసీతో చెప్పారు.
"రెండు సంవత్సరాల్లో బారువ తీరానికి పర్యటకుల తాకిడి బాగా పెరుగుతుంది. ఇక్కడ టూరిజం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ 58 ఎకరాల భూమిని పర్యాటక శాఖకి కేటాయించారు. ఎస్ఎస్ చిల్కా నౌక వద్దకు పర్యటకుల్ని స్కూబా డైవింగ్ ద్వారా తీసుకుని వెళ్లగలిగితే వాటర్ టూరిజంలో ఏపీ నెంబర్ వన్ అవుతుంది" అని జిల్లా టూరిజంశాఖ అధికారి నారాయణరావు అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














