ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా

ఫొటో సోర్స్, Getty Images
భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో తెలిపారు.
ఇది తక్షణం అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(A) ఆధారంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ధన్‌ఖడ్ ఈ లేఖను తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా పంచుకున్నారు.
జగ్‌దీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.


ఫొటో సోర్స్, Getty Images
'నా ఆరోగ్యానికి, వైద్య సలహాలకు ప్రాధాన్యతనిస్తూ భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను' అని లేఖలో తెలిపారు.
రాష్ట్రపతి సహకారం, స్నేహపూర్వక సంబంధాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి, మంత్రిమండలి సహకారం, మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
'గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులందరి నుంచి నాకు లభించిన ప్రేమ, నమ్మకం, గౌరవం నా జీవితాంతం హృదయంలో ఉంటాయి' అని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్హు జిల్లా కిథానా గ్రామానికి చెందిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ 1979లో రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
1990 మార్చి నుంచి రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. 2019లో జూలై 30న పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు వరకు దేశంలోని అనేక హైకోర్టుల్లో సీనియర్ అడ్వకేట్‌గా కొనసాగారు.
1989లో ఝున్‌ఝున్హు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1990లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అయ్యారు.
1993-98 వరకు కిషన్‌గర్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
2019 జూలై నుంచి 2022 జూలై 18 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














