ఏపీ లిక్కర్ కేసు: చార్జిషీట్‌లో జగన్ గురించి ఏముంది?

వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్, ఏపీ లిక్కర్ స్కాం కేసు

ఫొటో సోర్స్, APCMO/FB

ఫొటో క్యాప్షన్, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్ ఫోటో)

ఏపీ లిక్కర్ స్కాం కేసులో తొలిసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది.

లిక్కర్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏసీబీ కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీట్‌ (అభియోగపత్రం)లో రెండుచోట్ల వైఎస్‌ జగన్‌ పేరును ప్రస్తావించింది.

మొత్తం 305 పేజీల ప్రాథమిక అభియోగపత్రంలో 131వ పేజీలో, అలాగే 298వ పేజీలోనూ జగన్‌ ప్రస్తావన తీసుకొచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్, ఏపీ లిక్కర్ స్కాం కేసు

ఫొటో సోర్స్, UGC

'ఆ ముగ్గురే డబ్బును జగన్‌కు చేరవేసేవారు'

2019 చివరలో, హైదరాబాద్‌లోని హోటల్‌ పార్క్‌ హయత్‌లో సజ్జల శ్రీధర్‌ రెడ్డి డిస్టిలరీల యజమానుల సమావేశం నిర్వహించారని, అక్కడ డిస్టిలరీల యజమానులను తాము చెప్పినట్టుగానే మద్యం అమ్మకాలకు సహకరించాలని ఓ విధంగా బెదిరింపులకు దిగినట్టు సిట్‌ ఆ అభియోగ పత్రంలో పేర్కొంది.

వ్యాపారంలో నష్టాల భయంతో, అనేక డిస్టిలరీలు 12 శాతం కిక్‌బ్యాక్‌(నీకిది.. నాకిది అనే విధంగా)లు చెల్లించడానికి అంగీకరించగా, అంతలోనే కిక్‌బ్యాక్‌ శాతాన్ని బేస్‌ ధరలో 20 శాతానికి పెంచారనీ.. ఆ సేకరించిన మొత్తాలను కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి అప్పగించారని సిట్‌ ఆరోపించింది.

కసిరెడ్డి ఆ డబ్బును విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బదిలీ చేసేవారని, వారు ఆ డబ్బును అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి చేరవేసేవారని 131వ పేజీలో సిట్‌ పేర్కొంది.

ప్రతి నెలా రూ.50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకూ వసూలు చేసే వారని సిట్ పేర్కొంది.

మద్యం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

298వ పేజీలో ఏముంది?

సిట్‌ పేర్కొన్న చార్జిషీట్‌లోని 298వ పేజీలో ఏముందంటే..

కేసులో ఏ1 రాజ్‌ కసిరెడ్డి మొత్తం రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం వెనుక సూత్రధారి, సహ కుట్రదారుడని ఆరోపించింది. ఎక్సైజ్‌ పాలసీ తారుమారు చేయడంలో కసిరెడ్డి కీలకమని, నగదు చెల్లింపులో మాన్యువల్‌ ప్రక్రియను ప్రవేశపెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొంది.

ఏ1 కసిరెడ్డి షెల్‌ కంపెనీలు సృష్టించి మరో నిందితుడు బాలాజీ గోవిందప్ప ద్వారా వైఎస్‌ జగన్‌కు కిక్‌బ్యాక్‌లను అప్పగించారని ఆరోపించింది.

అదేవిధంగా, మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డితో కలిసి ఎన్నికల కోసం రూ.250 నుంచి రూ.300 కోట్ల నగదును మళ్లించారని చార్జిషీట్‌లో పేర్కొంది.

వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్, ఏపీ లిక్కర్ స్కాం కేసు

ఫొటో సోర్స్, UGC

ఇంకా చార్జి‌షీట్‌లు వేస్తాం: సిట్‌ అధికారి శ్రీహరిబాబు

ఇది ప్రాథమిక చార్జిషీట్‌ మాత్రమేనని, ఇందులో ప్రస్తావించిన పేర్లు, నిందితుల పాత్రపై దర్యాప్తు జరగాల్సి ఉందని సిట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌, సీఐడీ అడిషనల్‌ ఎస్పీ ఆర్‌. శ్రీహరిబాబు బీబీసీతో చెప్పారు.

భవిష్యత్తులో ఇంకా సప్లిమెంటరీ చార్జిషీట్‌లు దాఖలు చేస్తామన్నారు.

"అసలు ఇప్పుడే కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇంకా నిందితులు చాలామంది ఉండొచ్చని భావిస్తున్నాం. నిందితులపై పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేస్తాం'' అని శ్రీహరిబాబు అన్నారు.

రాజకీయ వేధింపులు: వైసీపీ

రాజకీయంగా వైసీపీని వేధించేందుకే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్‌ స్కాం కేసును తెరమీదకు తెచ్చిందని మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో లిక్కర్‌ స్కాంలో ఆధారాలతో సహా చంద్రబాబు దొరికిపోయారనీ, సీఐడీ దీనిపై కేసులు నమోదు చేసిందని అంబటి అన్నారు.

చంద్రబాబు హయంలో 14 డిస్టిలరీలకు కొత్తగా అనుమతులు ఇచ్చారనీ, వాటి నుంచి ముడుపులు స్వీకరించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

వైఎస్ జగన్‌ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, చంద్రబాబు పెట్టే కేసుల్లో ఒక్కటి కూడా న్యాయస్థానాల ముందు నిలబడదని రాంబాబు అభిప్రాయపడ్డారు.

సిట్ వద్ద పక్కా ఆధారాలు : టీడీపీ

2014- 19 మధ్య చంద్రబాబు హయాంలోనే మద్యం కుంభకోణం జరిగిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పందించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''అయితే, 2019- 24 మధ్య వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు. ఇదంతా గోబెల్స్ ప్రచారం. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంలో సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లాయి? ఏయే షెల్ కంపెనీలు పుట్టించారు? ఎవరెవరి మధ్య ఎన్ని వేల ఫోన్ కాల్స్ జరిగాయి. ఎప్పుడెప్పుడు నిందితుల భేటీలు జరిగాయి. ఇలా అన్ని వివరాలతో సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది'' అని ఆయన అన్నారు.

ఆ వివరాలపై ఇప్పటివరకు ఒక్క వైసీపీ నేత కూడా సమాధానం చెప్పకుండా చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పట్టాభి విమర్శించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)