ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన జర్నలిస్టు అనస్ అల్ షరీఫ్ ఎవరు? ఐడీఎఫ్ ఆరోపిస్తున్నట్లు హమాస్ నాయకుడా?

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, అలిస్ డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఐదుగురు జర్నలిస్టులలో 28 ఏళ్ల అనస్ అల్ షరీఫ్ ఒకరు.
గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు.
మిగిలిన నలుగురు జర్నలిస్టుల్లో కరస్పాండెంట్ మొహమ్మద్ ఖ్రేఖ్, కెమెరామెన్లు ఇబ్రహీం జాహెర్, మొహమ్మద్ నౌఫల్, మోవామెన్ అలివా ఉన్నారని అల్ జజీరా తెలిపింది.
ఈ దాడిలో మరో ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్లు ఆసుపత్రి అధికారి మొహమ్మద్ అల్ ఖాల్ది, మరో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.
జర్నలిస్టులు ఉంటున్న టెంట్‌పై జరిగిన జరిగిన దాడిని ఐక్యరాజ్య సమితి సహా అల్ జజీరా ఉన్న ఖతార్, కొన్ని మీడియా గ్రూపులు ఖండించాయి.
షరీఫ్ ‘హమాస్ టెర్రరిస్ట్ సెల్ హెడ్’ అని ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఆ వ్యాఖ్యల్ని సమర్థించే ఆధారాలను సమర్పించలేదు.
గతంలో ఇలాంటి వ్యాఖ్యలను షరీఫ్‌తో పాటు అల్‌జజీరా, మీడియా హక్కుల సంస్థలు తిరస్కరించాయి.
అయితే.. గాజాలో యుద్దానికి ముందు షరీఫ్ కొంతకాలం హమాస్ మీడియా టీమ్ కోసం పని చేసినట్లు బీబీసీ గుర్తించింది.
చనిపోవడానికి ముందు ఆయన చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లలో హమాస్‌ను విమర్శించడాన్ని గుర్తించవచ్చు.
షరీఫ్ హత్యను ఏ విధంగానూ సమర్థించుకోలేరని ‘కమిటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ జర్నలిస్ట్స్’ సీఈఓ జోడీ గిన్స్‌బర్గ్ బీబీసీతో చెప్పారు.
"హమాస్‌కు మీడియా సలహాదారుగా పనిచేశారని కానీ.. ప్రస్తుతం పనిచేస్తున్నారని కానీ లక్ష్యంగా చేసుకోవడం సరికాదు.. యుద్ధ సమయాల్లో పోరాటంలో క్రియాశీలంగా ఉన్నవారినే ‘లెజిటిమేట్ టార్గెట్స్’ గుర్తిస్తారు అని అంతర్జాతీయ చట్టాలు స్పష్టం చేశాయి’ అని ఆమె అన్నారు.
"షరీఫ్ హమాస్ క్రియాశీల సభ్యుడని చెప్పేందుకు ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు.


ఫొటో సోర్స్, AFP
గాజా ప్రజల గొంతుక
అనస్ అల్ షరీఫ్ ఉత్తర గాజా స్ట్రిప్‌లో జనసాంద్రత అధికంగా ఉన్న జబాలియాలో జన్మించారు.
ఆయన తమ సంస్థ కోసం రెండేళ్లుగా పని చేస్తున్నారని అల్ జజీరా తెలిపింది.
"గాజాలో యుద్ధం జరుగుతున్నంత కాలం ఆయన పనిచేశారు. ప్రజల స్థితిగతులు, గాజా దాడుల గురించి ప్రతిరోజూ కథనాలు ఇచ్చారు" అని అల్ జజీరా ఇంగ్లీష్ వార్తల డైరెక్టర్ సలాహ్ నెగ్మ్ బీబీసీకి చెప్పారు.
అనస్ అల్ షరీఫ్‌కు నాలుగేళ్ల కుమార్తె షామ్, ఏడాదిన్నర కొడుకు సలాహ్ ఉన్నారు.
యుద్ధ సమయంలో చాలా కాలం పాటు వారికి దూరంగా ఉన్నారు.
ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలను స్థానికులు ధిక్కరించిన తర్వాత షరీఫ్ ఆ ప్రాంతం నుంచి రిపోర్టింగ్ చేస్తూనే ఉన్నారు.
ఈ ఏడాది జనవరిలో ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నవ్వుతున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
యుద్ధం మొదలైన 15 నెలల తర్వాత తొలిసారి తాను సలాహ్‌ను కలిశానని ఆ ఫోటో కింద రాశారు.
గాజాలో పరిస్థితుల గురించి రిపోర్టింగ్ చేస్తూ షరీఫ్ తరచుగా లైవ్ ప్రసారాల్లో కనిపించేవారు.
2024లో గాజాలో జరిగిన వైమానిక దాడిలో మరణించిన అల్ జజీరా కరస్పాండెంట్ ఇస్మాయిల్ అల్ ఘౌల్, కెమెరామెన్ రామి అల్ రిఫి సహా తన సహచరులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని షరీఫ్ రిపోర్ట్ చేశారు.
2023 డిసెంబర్‌లో షరీఫ్ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడిలో షరీఫ్ తండ్రి చనిపోయారు.
తండ్రి చనిపోవడానికి కొన్ని గంటల ముందు గాజాపై ఇజ్రాయెల్ చేసిన తీవ్రమైన బాంబు దాడుల గురించి షరీఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"షరీఫ్ గాజాలో మిగిలి ఉన్న ఏకైక గొంతుక" అని అల్ జజీరా మేనేజింగ్ ఎడిటర్ మొహమ్మద్ మోవాద్ అన్నారు.

ఫొటో సోర్స్, Al Jazeera
షరీఫ్ ఉగ్రవాద ముఠా నాయకుడన్న ఇజ్రాయెల్
షరీఫ్ జర్నలిస్టుగా నటిస్తూ హమాస్ టెర్రరిస్ట్ విభాగానికి పని చేశారని, ఇజ్రాయెలీలపై రాకెట్ దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. అయితే అది వాస్తవమని నిరూపించేందుకు చాలా తక్కువ ఆధారాలు చూపిస్తోంది.
హమాస్‌తో ఆయనకున్న "సైనిక అనుబంధాన్ని నిరూపించే" పత్రాలు తమ వద్ద ఉన్నాయని, వాటిలో "సిబ్బంది జాబితా, ఉగ్రవాద శిక్షణ కోర్సుల వివరాలు, ఫోన్ డైరెక్టరీలు, జీతాలకు సంబంధించిన వివరాలు" ఉన్నట్లు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లో హమాస్ ఆపరేటివ్స్ జాబితాకు సంబంధించిన స్క్రీన్‌షాట్లను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
షరీఫ్ హమాస్ సైనిక విభాగంలో సభ్యుడని ఇజ్రాయెల్ గతంలోనూ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణను షరీఫ్‌తో పాటు అల్ జజీరా తిరస్కరించింది
షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, ఈ వ్యవహారంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ పిలుపిచ్చింది.
"ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆపడానికి అంతర్జాతీయ సమాజం నుండి గట్టి చర్య తీసుకోకపోతే, మీడియా నిపుణులపై ఇలాంటి చట్టవిరుద్ధ హత్యలు మరిన్ని జరిగే అవకాశం ఉంది" అని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది.
2023 అక్టోబర్ 7 ఘటన తర్వాత ఇజ్రాయెల్ గాజాపై ప్రారంభించిన యుద్ధంలో దాదాపు 200 మంది జర్నలిస్టులు మరణించారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ చెబుతోంది.
జులైలో ఇజ్రాయెల్ అరబిక్ భాషా ప్రతినిధి షరీఫ్ వీడియోను పోస్ట్ చేస్తూ "అతను హమాస్ సైనిక విభాగంలో సభ్యుడు" అని ఆరోపించారు. ఇది జరిగిన తర్వాత ఇజ్రాయెల్ తనను లక్ష్యంగా చేసుకుంటుందనే విషయం షరీఫ్‌కు తెలుసు.
చనిపోవడానికి కొన్ని రోజుల ముందు షరీఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ సందేశంలో "నా ప్రజలకు మద్దతుగా వారి గొంతుకగా ఉంటాను. దీని కోసం నా శక్తినంతా ధారపోశాను. గాజాను మర్చిపోవద్దు" అని షరీఫ్ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














