ద్వీపంలో ఒంటరిగా ఏడాదిన్నరపాటు తన పిల్లితో కలిసి బతికిన వ్యక్తి నేర్చుకున్న పాఠాలేంటి?

చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

    • రచయిత, రొనాల్డ్ అలెగ్జాండర్ అవిలా క్లాడియో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తేమ, చలి భరించలేనంతగా ఉన్నాయి. ప్లాస్టిక్, ప్లైవుడ్‌, టార్పాలిన్‌తో వేసిన టెంట్ చుట్టూ మైళ్ల కొద్దీ రాళ్లు, చెట్లు, జంతువులు, సముద్రం మాత్రమే కనిపిస్తున్నాయి.

అక్కడ మనుషులే లేరు. ఇక ఆసుపత్రి, డెంటల్ క్లినిక్‌లాంటివి ఉంటాయా?

బాబ్ కుల్‌ను పంటి సమస్య విపరీతంగా బాధించింది. ఒక పన్నును తీసేయాల్సి వచ్చింది.

తన వెంట తెచ్చుకున్న శాటిలైట్ ఫోన్‌తో సైన్యానికి కాల్ చేయాలుకున్నాడు.

కాల్ చేసినా వాళ్లు వెంటనే రాకపోవచ్చు. అలా చేస్తే చిలీలోని పటగోనియా ద్వీపంలో ఏడాది కాలం ఒంటరిగా బతికితే ఎలా ఉంటుందో చూడాలన్న తన మిషన్ అర్థంతరంగా ఆగిపోతుంది.

దీంతో ఆయన అత్యవసర పరిస్థితిలో సంప్రదించేందుకు నర్సుగా పని చేస్తున్న తన స్నేహితురాలు ప్యాటీకి మెయిల్ చేశారు.

ఆమె స్పందన చాలా స్పష్టంగా ఉంది.

''నీ పంటికి ఒక తాడు కట్టు, దాని రెండో చివరను తలుపుకు కట్టు. తర్వాత తలుపును గట్టిగా మూసేయ్... పనైపోతుంది. ఇక్కడివాళ్లంతా శతాబ్దాలుగా అదే చేస్తున్నారు'' అని ఆమె తనకు చెప్పినట్లు బాబ్ కుల్ వెల్లడించారు.

ప్యాటీకి తర్వాత కాస్త ఆందోళన అనిపించినప్పటికీ, ఆమె మెసేజ్ తన మిషన్ కొనసాగించడానికి అవసరమైన స్ఫూర్తి ఇచ్చిందని కుల్ చెప్పారు.

కుల్ నివసిస్తున్న క్యాబిన్‌ తలుపు పెద్దదేమీ కాదు. దీంతో ఆయన తన పంటికి కట్టిన తాడు చివరను ఒక బండరాయికి కట్టి విసిరేయాలనుకున్నారు. అయితే నొప్పి భరించగలనా అనే భయంతో ఆ రాయిని విసిరేసేందుకు సందేహించారు.

"నేనేం చేశానంటే, తాడు చివరను టేబుల్ కాలికి కట్టేశాను. అది కదలకుండా మేకులు కొట్టా. బలంగా లాగాను. అది తల్చుకుంటేనే భయంకరంగా ఉంది" అని కుల్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

ఫొటో క్యాప్షన్, ఒంటరిగా ద్వీపంలో నివసించేందుకు కుల్ తనతో పాటు అనేక వస్తువులు తెచ్చుకున్నారు.

ఒంటరిగా ఎందుకు?

2001లో కుల్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.

తన పరిశోధనలో భాగంగా, తీవ్రమైన వాతావరణంలో ఏకాంతంగా జీవించడం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆయన చిలీలోని మారుమూల ద్వీప సముదాయానికి వెళ్లారు.

ఆయన నిర్బంధ ఏకాంతంలో, పుచ్చిపోయిన పన్ను లాంటి సమస్యలు ముడిపడి ఉన్నాయి. అయితే, ప్రజలు ఇలా సొంత వైద్యం చేసుకోవాలని ప్రోత్సహించడం లేదు.

మనం మన సామర్థ్యాన్ని ఎలా విస్మరిస్తుంటామో ఆ పరిస్థితి చూపించింది.

"ఇలాంటివి జరిగినప్పుడు మీ మనసు 'నేను దంత వైద్యుడి దగ్గర ఉండాలి లేదా సన్నిహితుల దగ్గర ఉండాలి' అని అనుకుంటుంది" అని ఆయన చెప్పారు

అనేకమంది ఒంటరితనానికి భయపడతారనేది ఆయన అభిప్రాయం.

"ఎందుకంటే ఒంటరితనం మనం ఎదుర్కొనే సవాళ్లలో ఒకటి. అది మీకు తెలియని వాటిని ఎదుర్కొనే పరిస్థితుల్ని మీకు కల్పిస్తుంది" అని ఆయన చెప్పారు.

అయితే తనకు సంబంధించినంత వరకు అది ‘నేర్చుకునే’ ప్రక్రియలో భాగమని కుల్ బీబీసీ ఔట్‌లుక్ కార్యక్రమంలో చెప్పారు.

చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

ఫొటో క్యాప్షన్, పటగోనియాలో ఒంటరిగా ఉన్న సమయంలో కుల్ తన పుచ్చిపోయిన పంటిని తానే తొలగించుకున్నారు.

అమెరికా నుంచి కెనడాకు..

79 ఏళ్ల బాబ్ కుల్ అమెరికన్. దక్షిణ కాలిఫోర్నియాలోని గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో పెరిగారు.

ఆయన రోడ్డు పక్కనే ఉన్న తన ఇంటి పెరట్లో పడుకునే వారు.

"నా బాల్యం అందంగానే గడిచింది. అయితే అది నాకు అర్థం కాలేదు. నాలో ఏదో లోపం ఉందని అనిపించింది. అందుకే నేను చెట్లు, గడ్డి భూములు, వాగులు ఉన్న అడవిలో ఒంటరిగా ఉండేవాడిని. అది నాకు గొప్ప వరం" అని ఆయన చెప్పారు.

చదువు పూర్తైన తర్వాత అమెరికా అంతా తిరిగారు. ఆ సమయంలో వియత్నాంలో యుద్ధం చేసేందుకు యువకుల్ని బలవంతంగా సైన్యంలో తీసుకుంటున్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు బాబ్ కుల్ కెనడా వెళ్లారు.

కెనడాలో ఆయన అనేక ఉద్యోగాలు చేశారు. ఫైర్ డిపార్ట్‌మెంట్, టింబర్ డిపోలలో పని చేశారు. రెండేళ్ల పాటు ఫోటోగ్రఫీ కోర్సు చదివారు.

అక్కడ తాను అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు కుల్ చెప్పారు.

చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

ఫొటో క్యాప్షన్, ప్రొపేన్ సాయంతో కుల్ తన గదిని వెచ్చగా ఉంచుకున్నారు.

"బార్లలో తాగి వచ్చి, తాకిన ప్రతిదాన్ని పాడు చేసే మగవాడిని అయ్యాను. ఆ సమయంలో నేను ఖాళీగా ఉన్నట్లు అనిపించేది. నా జీవితం శూన్యం. నేను నాతోనే సమయం గడపాలి" అని ఆయన వివరించారు.

దీంతో ఉత్తర కెనడాలోని అరణ్యాల మధ్య వీలైనంత ఎక్కువ కాలం ఒంటరిగా జీవించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

బ్రిటిష్ కొలంబియాలోని ఒక అడవిలో మూడు నెలల పాటు ఒంటరిగా జీవించారు. అక్కడ చేపలు పట్టడం, వేటాడం లాంటివి చేసేవారు.

ఒక రోజు బీచ్‌లో ఎలుగుబంటి జాడలను చూడటంతో ఆయన సాహస యాత్ర అనుభవం భయానకంగా మారింది.

"ఒక రాత్రి నేను క్యాంప్ ఫైర్ నుండి బయటకు వచ్చి అడవిలోకి నడిచి చీకటిలో నేలపై పడుకున్నాను. అప్పుడు ఒక ఎలుగుబంటి నా వైపు వస్తున్న శబ్దం విన్నాను. భయం వేసింది" అని ఆయన చెప్పారు.

ఆ సమయంలో అతను కదలకుండా నిలబడ్డారు. చుట్టూ ఎవరూ లేకపోయినా, ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసినా సాయం కోసం కేకలు వేశారు. దీంతో ఆ ఎలుగుబంటి వెళ్లిపోయింది.

ఆ సంఘటన బాబ్‌కుల్‌ జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.

చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

ఫొటో క్యాప్షన్, చిలీలోని పటగోనియాలో "అల్టిమా ఎస్పరెంజా" ఎవరూ పట్టించుకోని ఓ ద్వీప సమూహం

నన్ను నేను తెలుసుకోవడానికి..

ప్రకృతిలో ఈ అనుభవం తర్వాత కుల్ విదేశాల్లో పర్యటించడం మొదలు పెట్టాడు. డొమినికన్ రిపబ్లిక్‌లో సెయిలింగ్, డైవింగ్ నేర్పారు.

మాంట్రియల్‌లో ట్రక్ ఢీ కొన్న ప్రమాదంలో ఆయన కాలు తెగిపోయింది. ఏడాదిపాటు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది.

ఈ సంఘటన తర్వాత 40 ఏళ్ల వయసులో మెక్‌గిల్ యూనివర్సిటీలో మనస్తత్వ శాస్త్రంలో పీహెచ్‌డీ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో ఆయన ఆసక్తులన్నీ మారిపోయాయి.

"నేను నిజంగా అధ్యయనం చేయాలనుకున్న జంతువు నేనే అని గ్రహించా" అని ఆయన చెప్పారు.

తన అధ్యయనం కోసం దక్షిణ చిలీలో ద్వీపాల సమూహం అల్టిమా ఎస్పెంరంజా ఆయన మదిలో మెదిలింది.

ఇది సాధారణ ప్రజలతో పాటు పర్యటకులకు కూడా దూరంగా ఉంది. దక్షిణ అమెరికా ప్రభుత్వం హెచ్చరించినట్లు ఈ ప్రదేశం "క్రూరమైనది, తీవ్రమైనది"

"నేను కెనడాలోని వెస్ట్ వాంకోవర్‌లో నివసించా. చలి వాతావరణం నాకు తెలుసని చిలీ ప్రజలకు చెప్పా" అని కుల్ వివరించారు.

అయితే తనకు చలి వాతావరణం ఏంటో అంతగా తెలియదని, చిలీలో తాను నివసించాలనుకున్న ప్రదేశం భూమీ మీద అత్యంత వేగంగా గాలులు వీచే ప్రాంతమని ఆయన చెప్పారు.

ఆయన తనకు కావల్సిన పరికరాలతో ద్వీపానికి చేరుకునేందుకు చిలీ నేవీ సాయం చేసింది.

పేరు కూడా లేని ఓ చిన్న ద్వీపంలో ఆయన స్థిరపడ్డారు. కనుచూపు మేరలో ఎవరూ లేని ప్రాంతమది.

బాబ్‌కుల్ ఆ ద్వీపానికి చాలా సామాగ్రి తెచ్చుకున్నారు. అందులో ఆహారం, నిర్మాణ పనిముట్లు, చేపలు పట్టే కర్ర, చిన్న పడవ, ఎయిర్ ట్యూబ్ బోట్, స్టవ్, కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి.

వీటన్నింటికీ తోడు, తాను పట్టి నిల్వ ఉంచిన చేపలు తాజాగా ఉన్నాయో లేదో గుర్తించేందుకు ఒక పిల్లిని కూడా ఆ ద్వీపంలోకి తీసుకువచ్చారు.

తర్వాతి రోజుల్లో ఆ పిల్లే ఆయనకు తోడుగా మారింది.

చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

ఫొటో క్యాప్షన్, పటగోనియాలో ప్లైవుడ్, ప్లాస్టిక్ షీట్లతో కుల్ తన ఇంటిని నిర్మించుకున్నారు.

మొదటి కొన్ని నెలలు చాలా భారంగా గడిచాయి. ఒక రోజు రాత్రి పూట అలలు భారీగా రావడంతో టెంట్ నీళ్లలో మునిగింది. కానీ, అందులోనే పడుకోవాల్సి వచ్చింది. తర్వాతి రోజు ఉదయం తన వస్తువుల్ని వేరే చోటకు తరలించారు.

నీళ్లు రాకుండా ఉండేందుకు స్తంభాలపై స్వయంగా ఒక టెంట్ నిర్మించుకున్నారు.

"టార్పాలిన్‌ను గట్టిగా ఉంచడమే నా ప్లాన్. అందుకోసం 2వేల సీలలు తెచ్చాను. అయితే వాటి సైజు సరిగ్గా లేదు. అందుకే వాటిని జాగ్రత్తగా కొట్టాల్సి వచ్చింది. చలికి నా వేళ్లు పగిలిపోయాయి. నేను సీలల్ని సుత్తితో కొడుతూ తిట్టుకుంటూనే ఉన్నా" అని బాబ్ చెప్పారు.

తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఇంట్లో ఆయన కఠినమైన పటగోనియా ద్వీపాన్ని కాస్త మెరుగ్గా ఎదుర్కోగలిగారు.

ఆ కాన్వాస్ గోడల మధ్య నుంచి అతని నుంచి తప్పించుకోలేక పోయిన వ్యక్తి ఆయనే.

చిలీ, పటగోనియా, కెనడా, బాబ్ కుల్, ఒంటరితనం, వాంకోవర్

ఫొటో సోర్స్, Bob Kull

ఫొటో క్యాప్షన్, ఆదివారాలు పూర్తిగా ఖాళీగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చానని కుల్ చెప్పారు.

ఒంటరితనం నుంచి ఏం నేర్చుకోవచ్చు?

బలమైన గాలి, తేమ కాన్వాస్ షెడ్‌ను దెబ్బ తీశాయి. దీంతో కుల్ రోజంతా మరమ్మతులతో బిజీగా గడపాల్సి వచ్చింది.

"నేను రోజూ ఎలాగోలా బతికేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ రిపేర్లు చేసుకోవాల్సి ఉండేది. టెంట్ బాగు చేసుకోవడంతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళాలి. కట్టెల కోసం వెతకాలి. మంట వేసుకోవడానికి వాటిని ముక్కలుగా నరకాలి" అని బాబ్ చెప్పారు.

రోజూ నిర్ణీత సమయంలో ధ్యాన సాధన చేశారు. అయితే ఆదివారం పూర్తిగా ఖాళీగా ఉండేవాడినని బాబ్ చెప్పారు.

స్నేహితురాలు ప్యాటీ ఆయన్ను వెతుకుతూ చిలీ నేవీతో కలిసి వచ్చే వరకు, కుల్ పటగోనియాలో ఏడాదిన్నర గడిపారు.

తాను ఇప్పటికే ఒంటరితనానికి అలవాటు పడ్డానని, సాహసయాత్రను ముగించడానికి తొందరపడలేదని ఆయన వారితో చెప్పారు.

"నన్ను తీసుకెళ్లడానికి నేవీ షిప్ వచ్చినప్పుడు ప్యాటీ నాతో ఉంది. అయితే నేను షిప్‌లో వెనక కూర్చుని ద్వీపం దూరంగా అదృశ్యమయ్యే వరకు చూస్తూ ఉండిపోయా" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

అల్టిమా ఎస్పెరంజా తనకు ‘ఇల్లు’గా మారిందని కుల్ చెప్పారు.

ఆయన ప్రస్తుతం కెనడాలోని వాంకోవర్‌లో నివసిస్తున్నారు. ఆయన ఇప్పుడు కూడా ఏకాంత వాసాన్ని కొనసాగిస్తున్నారు.

"నేను ఇటీవలే నెలపాటు ఒంటరిగా క్యాంపింగ్‌లో గడిపాను. ఉత్తరం వైపు కారులో వెళ్లాను. సీ ప్లేన్ నడుపుతున్న పైలట్‌కు డబ్బు చెల్లించి నన్ను ఓ మారుమూల సరస్సు వద్ద దింపాలని అడిగాను" అని బాబ్ కుల్ చెప్పారు.

ఈ సరస్సు ఎక్కడ ఉంది? అన్నది చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

తన ఏకాంతానికి ఎవరూ అంతరాయం కలిగించకూడదని బాబ్ కుల్ కోరుకుంటున్నారు.

(బాబ్ కుల్‌ను బీబీసీ ఔట్‌లుక్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ వెర్షన్‌ను మీరు ఇక్కడ వినవచ్చు. ఈ ఇంటర్వ్యూను కథనంగా రాశారు రోనాల్డ్ అలెగ్జాండర్ అవిలా-క్లాడియో.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)