ప్రింట్ ఇస్తే తుపాకులు రెడీ.. అసలేమిటీ 3డీ టెక్నాలజీ..?

3డీ గన్స్

ఫొటో సోర్స్, Getty/BBC

    • రచయిత, డాన్ హార్డూన్
    • హోదా, బీబీసీ ట్రెండింగ్

ప్రపంచవ్యాప్తంగా నేరగాళ్లు, తీవ్రవాదులకు 3‌డీ ప్రింటెడ్ తుపాకులు ‘ఇష్టమైన ఆయుధాలు’గా మారుతున్నాయని ఓ నిపుణుడు బీబీసీకి చెప్పారు. యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈఓ బ్రియాన్ థాంప్సన్ హత్యలో స్వయంతయారీ పాక్షిక 3డీ ప్రింట్ తుపాకీ వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల కాలంలో ఇలా సొంతంగా తయారుచేసిన 3డీ తుపాకులతోపాటు లైసెన్సులేని, అధికారికంగా రికార్డులలో లేని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టెలిగ్రాం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా సామాజిక మాధ్యమాలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ 3డీ ప్రింటెడ్ తుపాకుల వినియోగం పెరగడంపైన, వీటిని ఎలా తయారుచేయాలో వివరిస్తున్న వెబ్‌సైట్ల‌పై 'బీబీసీ ట్రెండింగ్' పరిశోధన చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కనిపెట్టడం కష్టం

3డీ ప్రింటెడ్‌ తుపాకులను సాధారణంగా ‘ఘోస్ట్’ తుపాకులుగా అభివర్ణిస్తుంటారు. వీటిని కనిపెట్టడం కష్టం. 3డీ ప్రింటర్స్, డౌన్‌లోడ్ చేసుకోగలిగిన బ్లూప్రింట్స్, సాధారణ పదార్థాలతో వీటిని తయారుచేస్తారు.

తుపాకీ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించే ఈ డిజైన్ టెక్నాలజీ గడిచిన దశాబ్దంలో విస్తృతంగా అభివృద్ది చెందింది. తుపాకీలోని ప్లాస్టిక్ భాగాలు విరిగిపోకుండా ఎన్నిరౌండ్లు అయినా కాల్చగల సత్తా తాజా మోడల్స్‌లో లభిస్తోంది.

హింసకు పాల్పడాలనుకునే వ్యక్తులకు 3డీ ప్రింటెడ్ తుపాకులు ‘ఆయుధ అవకాశాలుగా’ మారాయని అమెరికా కేంద్రంగా పనిచేసే తుపాకుల నియంత్రణ సంస్థకు చెందిన నిక్‌ సుప్లినా చెప్పారు.

‘‘ఇందుకు కావాల్సిన వనరులు సులభంగా దొరుకుతుతాయి. ఖర్చు తగ్గింది. తేలికగా వీటి బ్లూప్రింట్ లభిస్తోంది’’ అని ఆయన చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌‌లో తుపాకుల కోసం ప్రకటనలు ఇవ్వడం ద్వారా బీబీసీ పరిశోధన మొదలైంది.

2024 అక్టోబరులో మెటా ఫ్లాట్‌ఫామ్‌పై ఆ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ 3డీ ప్రింటెడ్, ఇతర ఘోస్ట్ తుపాకులు సహా వందలాది తుపాకుల ప్రకటనలను 'టెక్ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్' అనే లాభాపేక్ష లేని సంస్థ గుర్తించింది.

ఈ పరిశోధనా అంశాలపై వ్యాఖ్యానించడానికి మెటా అప్పట్లో నిరాకరించింది. అనేక నెలల తరువాత కూడా మెటా డేటాబేస్‌ అదే తరహా తుపాకీ ప్రకటనలు చూపించడాన్ని బీబీసీ ట్రెండింగ్ గుర్తించింది.

వాట్సాప్ చాట్

ఆన్‌లైన్‌లో అమ్మకాలు

చాలా భాగం తుపాకుల ప్రకటనలు టెలిగ్రాం, వాట్సాప్ చానెల్స్ ద్వారా నేరుగా వాటిని కొనుగోలు చేసే సామర్థ్యం ఉన్న ఖాతాదారులకే పంపారు. ఈ చానెల్స్‌లో వివిధ రకాల తుపాకులు అమ్మకానికి పెట్టినట్టు మేం కనుగొన్నాం. వీటిలో కొన్ని 3డీ ప్రింటెడ్ తుపాకుల్లా కనిపిస్తున్నాయి. వెయ్యిమంది సబ్‌స్క్రైబర్లున్న ఓ టెలిగ్రాం ఖాతా అయితే తాము ఆయుధాలను ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తామని పేర్కొంది.

తనను తాను జెస్సీగా పిలుచుకుంటున్న ఆ టెలిగ్రాం ఖాతాదారుడిని బీబీసీ ట్రెండింగ్ సంప్రదించింది. యూకేకు 3డీ ప్రింటెడ్ తుపాకులు సరఫరా చేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది నిర్థరించుకోవాలనుకున్నాం.

ఓ గంటలోనే లిబరేటర్, గ్లాక్ స్విచ్ మోడల్స్ తుపాకులు కావాలా అంటూ జెస్సీ తిరుగు జవాబిచ్చారు.

గ్లాక్ స్విచ్ (ఆటోసీర్ అని కూడా పిలుస్తారు) అనేది ఒక చిన్న భాగం. ఇది కొన్నిసార్లు 3డి-ప్రింటెడ్ భాగం కూడా కావచ్చు. పిస్టల్‌ను ఇదే ఆటోమేటిక్ ఆయుధంగా మారుస్తుంది.

3d guns

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మయన్మార్‌లోని తిరుగుబాటు గ్రూపులు తుపాకీల తయారీకి 3డీ ప్రింటర్స్ వినియోగించాయి

"క్రిప్టో అరాచకవాది" కోడి విల్సన్ 2013లో రూపొందించిన 'ది లిబరేటర్' ప్రపంచంలో విస్తృతంగా అందుబాటులో ఉన్న మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ గన్.

దీనికి ఒక బుల్లెట్ కాల్చగల సామర్థ్యం ఉంది.

బ్రిటన్ కస్టమ్స్‌ విభాగాన్ని దాటి ఆయుధాన్ని అక్రమంగా రవాణా చేయగలనని, బిట్ కాయిన్ రూపంలో 160 పౌండ్లు చెల్లించాలని, దానిని ఓ యూకే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని జెస్సీ సూచించారు. ఆ ఖాతా వివరాలను మేం గుర్తించలేకపోయాం.

తర్వాత బీబీసీ తనెవరో చెబుతూ జెస్సీని సంప్రదించింది. యూకేలో ఆయుధాల విక్రయం చట్టవిరుద్ధమని జెస్సీ ఒప్పుకున్నారు. కానీ ఆయన మాట తీరులో పశ్చాత్తాపం కనిపించలేదు.

"నేను నా వ్యాపారాన్ని నడుపుతున్నాను, ఆన్‌లైన్‌లో కొన్ని తుపాకులు అమ్ముతాను" అని ఆయన చెప్పారు.

మీరే తుపాకీ తయారీదారు

జెస్సీ చెప్పే మాటలు నిజమో కాదో పరీక్షించడానికి మేం ఆయనతో లావాదేవీని కొనసాగించలేదు. ఆయన వైఖరి మోసగాడిలా ఉన్నా, మెటాలో ప్రకటనలు చేయడం, టెలిగ్రామ్‌లో ఆయన కార్యకలాపాల సామర్థ్యం చూస్తే నిజమైన తుపాకీ డీలర్లు ఎలాంటి లొసుగులను తమకు అనుకూలంగా ఉపయోగించుకోగలరనే విషయాన్ని ఎత్తి చూపుతోంది.

మేం పేర్కొన్న ప్రకటనలపై మెటా స్పందించింది.

"మా విధానాలకు అనుగుణంగా ఆటోమ్యాటిక్‌గా అలాంటి ప్రకటనలు వాటంతట అవే ఆగిపోయాయి" అని చెబుతూ ఆ ప్రకటనలను యాడ్ లైబ్రరీలో చేర్చడం అంటే "ఆ ప్రకటన ఇప్పటికీ లైవ్‌లో ఉందని లేదా కనిపిస్తుందని కాదు" అని బీబీసీకి తెలిపింది.

తమ విధానాలను ఉల్లంఘించినందుకు జెస్సీ ఖాతాను తొలగించినట్లు టెలిగ్రామ్ తెలిపింది.

"టెలిగ్రామ్ సేవా నిబంధనల ప్రకారం ఆయుధాల విక్రయాలను స్పష్టంగా నిషేధించాం. ఇలాంటివాటిని కనుగొన్నప్పుడల్లా తొలగిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ టూల్స్‌ వినియోగంలో అనుభవం ఉన్న పర్యవేక్షకులు టెలిగ్రామ్‌లో ఏం జరుగుతోందో చూస్తుంటారు. ఆయుధాల అమ్మకం సహా ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ హానికరమైన కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించిన రిపోర్టులను స్వీకరిస్తారు’’ అని తెలిపింది.

3డీ ప్రింటెడ్ తుపాకులు కావాలనుకునే వారు సోషల్ మీడియా ద్వారా రెడీమేడ్ తుపాకులు కొనాల్సిన అవసరం లేదు. వారే సొంతంగా సమీకరించుకోవచ్చు. ఎఫ్‌జీసీ-9 వంటి మోడళ్లు కేవలం 3డి-ప్రింటెడ్ ప్లాస్టిక్ పునర్వినియోగ భాగాలను మాత్రమే ఉపయోగించి తయారుచేశారు. వీటికి వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న తుపాకీ భాగాలు అవసరం లేదు.

"మీరు తప్పనిసరిగా డీఐవై (మీరే సొంతంగా తయారు చేసుకోగలిగే) గన్‌స్మిత్ అవుతున్నారు" అని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకుడు డాక్టర్ రాజన్ బస్రా చెప్పారు. కానీ "ఇది మీ ఆఫీస్ ప్రింటర్లో ఏ4 పేపర్ షీట్‌ను ముద్రించినంత సులభం కాదు" అన్నారు.

బీబీసీ ఇంతకు ముందు చెప్పినట్టు 3డి-ప్రింటెడ్ గన్లను తయారు చేయడానికి దశలవారీ సూచనలు, డౌన్‌లోడ్ చేయడానికి వీలైన బ్లూప్రింట్లను అందించే వెబ్‌సైట్లు ఉన్నాయి. అలాంటి సూచనలను ఫ్లోరిడాకు చెందిన గన్ రైట్స్ అటార్నీ మాథ్యూ లారోసియర్ రాశారు. ఆయనకు గ్లోబల్ ప్రో-3డి-ప్రింటెడ్ గన్ కమ్యూనిటీతో సంబంధం ఉంది. ఈ కమ్యూనిటీకి అమెరికాలో చాలా మంది సభ్యులు ఉన్నారు. ఆయుధాలను కలిగి ఉండడాన్ని తమ హక్కుగా అమెరికాలో రెండో సవరణను వీరు భావిస్తారు.

ప్రాణాంతక ఆయుధాన్ని తయారు చేయడంలో ప్రజలకు సహాయపడేందుకు సమాచారాన్ని ఎందుకు పంచుకుంటున్నారని మాథ్యూను బీబీసీ ట్రెండింగ్ ప్రశ్నించింది.

దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇది కేవలం సమాచారం మాత్రమే. కేవలం ఒకట్లు, సున్నాలతో ఉన్న సమాచారం. దానిని ఎవరైనా దుర్వినియోగ పరచవచ్చనే మీ ఆందోళనను నేను అర్థం చేసుకోగలను. కానీ అది సమాచారం కన్నా ఎక్కువైనది అని చెప్పడం కూడా సరైనది కాదు’’ అన్నారు.

పాఠశాలల్లో కాల్పులకో, నరమేథానికో ఈ సమాచారం ఉపయోగించే ముప్పు గురించి అడిగితే.. ‘‘అలాంటిది జరగనందుకు దేవుడికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు. తన దృష్టిలో 3డీ ప్రింటెడ్ తుపాకులకు సానుకూల దిశను అందించిన దేశంగా మయన్మార్‌ను ఆయన ఉదహరించారు.

మయన్మార్‌లో ఏం జరుగుతోంది?

ప్రస్తుత సైనిక ఘర్షణలలో 3డీ ప్రింటెడ్ తుపాకులు వాడుతున్న ఏకైక దేశంగా మయన్మార్ నిలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా రెసిస్టెంట్స్ ఫైటర్స్ ఎఫ్‌జీసీ -9 వాడినట్టు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే రెసిస్టెన్స్ దళాలు నల్లబజారులో మెషిన్‌గన్స్ కంటే పదింతలు చౌకగా ఉండే ఈ ఎఫ్‌‌జీసీ‌-9 తుపాకులను 2022, 2023లో వందలాదిగా తయారుచేశాయి. అయినా కూడా చాలా గ్రూపులు ఈ 3డీ ప్రింటెడ్ తుపాకులు వాడటాన్ని ఆపేశాయని బీబీసీ బర్మీస్ ప్రతినిధి నిన్ మో కనుగొన్నారు.

నిన్ మోతో తిరుగుబాటు నేతలు మాట్లాడుతూ... సైనిక ప్రభుత్వం గ్లూ, మెటల్ వంటి అవసరమైన పదార్థాల దిగుమతిపై కఠిన నియంత్రణ అమలుచేస్తోందని చెప్పారు. దీనికితోడు ఈ గ్రూపుల వద్ద పీఆర్‌జీ, మెషిన్‌గన్లు వినియోగించే స్థితిలోనే ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న 3డీ ప్రింటెడ్ తుపాకులు సైనిక అవసరాలకు సరిపడా సామర్థ్యం లేవనేందుకు మయన్మార్ ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. కానీ ప్రపంచవ్యాప్తంగా వాటి విస్తరణ స్పష్టం. 3డీ గన్స్ బ్లూప్రింట్‌లను కలిగి ఉండటం నేరమనే చట్టాలు చేయాలనే ఆలోచనలో అనేక దేశాలు ఉన్నాయి. సాధారణ ప్రింటర్స్ కరెన్సీ నోట్లను ముద్రించడాన్ని ఎలా అడ్డుకుంటాయో అదే పద్ధతిలో 3డీ ప్రింటర్ తయారీ దారులు కూడా తుపాకీ భాగాలను ముద్రించకుండా అడ్డుకునేలా చేయాలనే అభిప్రాయం ఉంది. మరి ఇటువంటి చర్యలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)