‘‘నా బాయ్ ఫ్రెండ్ ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు.. కానీ నేనా విషయం పట్టించుకోను’’ డేటింగ్ యాప్ హైట్ ఫీచర్‌పై చర్చ ఏంటి?

- రచయిత, మైయా డేవిస్, ఎమిలీ హోల్ట్
- హోదా, బీబీసీ న్యూస్
జోయ్ 5 అడుగుల 6 అంగుళాల (1.67 మీటర్లు) ఎత్తు ఉంటారు, అంటే సగటు అమెరికన్ కంటే కొంచెం పొట్టివారు. కానీ కిందటేడాది ఆష్లే టిండర్ డేటింగ్ యాప్‌లో జోయ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఆమె చివరగా ఆలోచించిన విషయం ఆయన ఎత్తు గురించి.
"మేం మా అభిరుచులు, ఆసక్తుల గురించి మాట్లాడుకున్నాం. ఎత్తు గురించి కాదు" అని ఆష్లీ చెప్పారు.
టిండర్ ఇటీవల ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొంతమంది ప్రీమియం యూజర్లకు తమ భాగస్వామిని వారి ఎత్తు ఆధారంగా ఎంచుకోవడానికి వీలు కల్పిస్తోంది.
అయితే, మంచి జోడీ కుదరకుండా కొత్త ఫిల్టర్ నిరోధిస్తుందని ఆష్లీ వంటి వారు చెబుతున్నారు. అదే సమయంలో, పొట్టిగా ఉండే మగవారికి భాగస్వామిని కనుగొనడానికి ఇది సహాయపడుతుందని మరికొందరు భావిస్తున్నారు.
హైట్ ఫిల్టర్ ఫీచర్‌ను టిండర్ యూకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పరిమితంగా పరీక్షిస్తోంది. రెండు అత్యంత ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ చెల్లించే వ్యక్తులకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచింది. అయితే, ఏయే దేశాలలో ఈ ట్రయల్ చేస్తోందో టిండర్ బీబీసీకి చెప్పలేదు. యూజర్ ప్రాధాన్యం ఆధారంగా భాగస్వాములను చూపడానికి టిండర్ అల్గారిథమ్‌కు సహాయం చేయడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది.
కొత్త ఫీచర్‌ను కొంతమంది యూజర్లు సరదాగా తీసుకుంటుంటే... మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
'పొట్టి రాజులపై యుద్ధం'
కొత్త ఫీచర్‌పై కొందరు నెటిజన్లు జోక్ చేశారు.
"టిండర్ ఇప్పుడే పొట్టి రాజులపై యుద్ధం ప్రకటించింది" అని ఒకరు సోషల్ మీడియాలో రాశారు.
5 అడుగుల 9 అంగుళాలకు పైగా ఎత్తు ఉన్న పురుషులందరినీ ఫిల్టర్ చేయడానికి టిండర్ హైట్ ఫిల్టర్‌ని ఉపయోగిస్తామని మరొకరు తెలిపారు.
ఇంకొకరు, "టిండర్ ఏం చెప్పినా నాకు పట్టింపు లేదు, పొట్టి రాజులే ఉత్తమం" అని కామెంట్ చేశారు.

'హీల్స్ వేసుకోలేరని..'
ఆష్లీ అమెరికాలోని విస్కాన్సిన్‌లో నివసిస్తుంటారు. కొంతమందికి ఎత్తు ఎందుకు ముఖ్యమో తనకు అర్థం అవుతోందని ఆమె చెప్పారు.
"'నేను హీల్స్ ధరించలేను, నా భాగస్వామి పొట్టిగా కనిపిస్తారు అని ప్రజలు మాట్లాడుకోవడం విన్నాను" అని 24 ఏళ్ల ఆష్లీ అన్నారు.
"కానీ, అది నాకెప్పుడూ ముఖ్యం కాదు" అని ఆమె అంటున్నారు.
జోయ్ ఒక అద్భుతమైన వ్యక్తి అని ఆష్లీ అన్నారు. అతను ఆరడుగులున్నా, ఐదడుగులున్నా తాను అలాగే భావిస్తానన్నారు.
హైట్ ఫిల్టర్ గతంలో కూడా ఉంటే, తాను, జోయ్‌ను కలవలేకపోయి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతరులు కూడా గొప్ప భాగస్వాములను కోల్పోయే ప్రమాదం ఉందని ఆష్లీ భావిస్తున్నారు.
'నిజమైన ప్రేమను కోల్పోవచ్చు'
టిండర్ హైట్ ఫిల్టర్ పొట్టి పురుషులకు డేటింగ్‌ను కష్టతరం చేస్తుందని జోయ్ అభిప్రాయపడ్డారు.
"మీరు లుక్స్‌పై మాత్రమే దృష్టి పెడితే, నిజమైన ప్రేమను కోల్పోవచ్చు" అని 27 ఏళ్ల జోయ్ అంటున్నారు. వ్యక్తులను ఎత్తు ద్వారా కాకుండా వ్యక్తిత్వం ద్వారా అంచనా వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన సొంత డేటింగ్ అనుభవం బాగుందని, కొత్త ఫీచర్ చాలా కనెక్షన్‌లను కోల్పోయేలా చేస్తుందని జోయ్ భావిస్తున్నారు.
కాగా, ఈ ఫిల్టర్‌లను అందించే మొదటి యాప్ టిండర్ కాదు, చాలా డేటింగ్ యాప్‌లలో ఈ ఫీచర్ ఉంది.హింజ్ యాప్ ఇప్పటికే చెల్లింపులు చేసే యూజర్లకు విద్య, మతం, ఇతర అలవాట్లతో పాటు ఎత్తు ఆధారంగా ఫిల్టర్ చేయడానికి అనుమతిస్తుంది. ఇక, బంబుల్ యాప్ అయితే నక్షత్రం గుర్తు ద్వారా, గ్రైండర్ యాప్ బాడీ టైప్ ద్వారా ఫిల్టర్ చేస్తాయి.
టిండర్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటింగ్ యాప్ కాబట్టి కొత్త ఫీచర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పొడవుగా లేని లేదా ధనవంతులు కాని పురుషులకు డేటింగ్ యాప్‌లు కఠినంగా ఉంటాయని 5 అడుగుల 9 అంగుళాల ఎత్తున్న మాంచెస్టర్‌కు చెందిన మ్యాట్ హీల్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఇలాంటి ఫిల్టర్లు యూజర్ల సమయాన్ని ఆదా చేస్తాయని ఆయన అంటున్నారు. ప్రజలు తమ డేటింగ్ ప్రాధాన్యాల విషయంలో కఠినంగా ఉండకూడదని మ్యాట్ భావిస్తున్నారు.

'పొట్టివాళ్లకూ ఉపయోగమే'
హైట్ ఫిల్టర్‌ను సానుకూలంగా చూస్తున్నారు లండన్‌కు చెందిన రచయిత్రి, పాడ్‌కాస్టర్ 31 ఏళ్ల బెత్ మెక్‌కాల్. ఈ ఫీచర్ పొట్టిగా ఉండే మగవారికి కొంత భరోసా ఇస్తుందని చెప్పారు. దీనివల్ల పొడవైన పురుషులతో మాత్రమే డేటింగ్ చేయాలనుకునే మహిళలను ముందుగానే గుర్తించి, వారికి దూరంగా ఉండటానికి పొట్టి పురుషులకు ఈ ఫిల్టర్ సాయం చేస్తుందని బెత్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఎంతమంది మహిళలు దీన్ని నిజంగా ఉపయోగిస్తారో తనకు కచ్చితంగా తెలియదన్నారు."చాలామంది మహిళలు పొట్టిగా ఉండే మగవారితో డేటింగ్ చేయడానికి అభ్యంతరం చెప్పరు" అని బెత్ చెప్పారు.
పొడవుగా ఉండటమనే అర్హత మంచి భాగస్వామిని చేయదని ఆమె అభిప్రాయపడ్డారు.
పొడవైన పురుషులను కొంతమంది మహిళలు ఇష్టపడతారనే విషయాన్ని ఫిల్టర్ వాడుకుంటోందని 'ది మ్యాచ్‌మేకర్ యూకే' మేనేజింగ్ డైరెక్టర్ లారా బెస్‌బ్రోడ్ అన్నారు.
కానీ, ఇది డేటింగ్ యాప్‌ల సమస్యలను పరిష్కరించలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
"దయతో నమ్మకంగా ఉండే 5 అడుగుల 7 అంగుళాల వ్యక్తి, వ్యక్తిత్వం లేని ఆరడుగుల వ్యక్తి కంటే ఆకర్షణీయంగా ఉంటాడు" అని లారా అన్నారు.
ప్రజలు మరింత అర్థవంతంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడే ప్రణాళికలో ఫిల్టర్ ఒక భాగమని టిండర్ అంటోంది.
ప్రతి పరీక్ష శాశ్వత ఫీచర్‌గా మారదని, కానీ అన్ని పరీక్షలు యాప్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయని టిండర్ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














