దక్షిణ భారతం నుంచి ఇండోనేసియా వరకు విజయాలు సాధించిన రాజు.. సముద్రంపై ఆధిపత్యంతో శత్రువులపై పట్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రీస్తు శకం 850 ప్రాంతంలో దక్షిణాన పాండ్యులు, పల్లవులు మధ్య వివాదాలను అవకాశంగా చేసుకుని.. అప్పటికి పెద్దగా గుర్తింపు లేని విజయాలయ అనే రాజు తంజావూరును స్వాధీనం చేసుకున్నారు.
ఆ విజయం చోళ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసింది.
అనంతరం క్రీ.శ. 907లో చోళ వంశానికి చెందిన మొదటి పరాంతక చోళుడు (పరాంతక చోళ - 1) సింహాసనాన్ని అధిష్టించి 48 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ, మొదటి పరాంతక చోళుడు తరువాత వచ్చిన చోళ రాజులు బలహీనులు కావడంతో ఆ వంశం క్షీణించడం ప్రారంభమైంది.
క్రీ.శ. 985లో మొదటి రాజరాజ చోళుడు (రాజరాజ చోళ -1) సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుంచి చోళ వంశ ప్రాభవం మళ్లీ పెరిగింది.
రాజరాజ చోళుడు -1, ఆయన కుమారుడు రాజేంద్ర చోళుడి నాయకత్వంలో ఆసియాలో ఒక ప్రధాన సైనిక, ఆర్థిక, సాంస్కృతిక శక్తిగా ఎదిగారు చోళులు.
ఒకప్పుడు ఆయన సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవుల నుంచి ఉత్తరాన బెంగాల్‌లోని గంగా నది తీరం వరకు వ్యాపించింది.
దాంతో ‘తంజావూరు మహా చోళులు’గా వారు ప్రసిద్ధి చెందారు. రిచర్డ్ ఈటన్ తన ‘ఇండియా ఇన్ ద పర్షియన్ ఏజ్’ పుస్తకంలో చోళులు దక్షిణ తీరమంతా ఆధిపత్యం సాధించారని, అందుకే దక్షిణ తీరానికి ఇప్పటికీ ‘కోరమాండల్’ అనే వాడుక ఉందని.. చోళ మండలం అనే పదానికి మారిన పద రూపమే కోరమాండల్ అని రాశారు.


ఫొటో సోర్స్, Getty Images
శ్రీవిజయ రాజ్యంతో శత్రుత్వం
11వ శతాబ్దం ప్రారంభం నాటికి ఖమెర్‌లు(కంబోడియాకు చెందినవారు), చోళ వ్యాపారులు బంగాళాఖాతం సరిహద్దులో ఉన్న రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ సాధించారు.
చోళులు, ఖమెర్‌లు ఇద్దరూ తమ ప్రయోజనాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయని గ్రహించారు.
ఆ సమయంలో ఖమెర్ సామ్రాజ్యం కూడా చాలా విస్తారంగా, శక్తిమంతంగా ఉండేది.
ప్రస్తుత కంబోడియా, థాయిలాండ్, వియత్నాంలలోని అనేక ప్రాంతాలను ఖమెర్‌లు పాలించారు.
కంబోడియాలోని ప్రసిద్ధ అంకోర్ వాట్ ఆలయాన్ని ఖమెర్ రాజులే నిర్మించారు.
‘చోళులు, ఖమెర్ల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగినట్లు అనేక శాసనాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1020లో వారు రత్నాలు, బంగారు రథాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. చైనా జనాభా పెరగడం, వారికి విలాస వస్తువులపై ఆసక్తి పెరగడంతో రెండు రాజ్యాలు భారీగా లబ్ధి పొందాయి’ అని వై. సుబ్బరాయలు తన 'సౌత్ ఇండియా అండర్ ది చోళాస్' అనే పుస్తకంలో రాశారు.
చోళులు, ఖమెర్‌లు ఇద్దరికీ ఒకే శత్రు రాజ్యం ఉండేది. ప్రస్తుత ఇండోనేసియా ప్రాంతానికి చెందిన ఆ రాజ్యం పేరు శ్రీవిజయ.
ఈ రాజ్య పాలకులు బౌద్ధ మతాన్ని అనుసరించేవారు. ఆగ్నేయాసియాలోని అనేక ఓడరేవులను నియంత్రించేవారు.
చైనా వైపు వెళ్లే అన్ని నౌకలపై వారు పన్నులు విధించేవారు. పన్నులు చెల్లించని నౌకలపై శ్రీవిజయ నావికాదళం దాడి చేసి ధ్వంసం చేసేది.

విజయోత్తుంగ వర్మను బంధించి, ఆయనకు అల్లుడై..
శ్రీవిజయ రాజుల తీరు చోళ రాజులకు ఆగ్రహం తెప్పించేది.
శ్రీవిజయ రాజులు ఓవైపు చోళ రాజులకు స్నేహపూర్వక సందేశాలు పంపుతుండేవారు... అలాగే ప్రస్తుత తమిళనాడులోని నాగపట్నం తీరంలో ఒక బౌద్ధ విహారం నిర్మించడానికి ధనం కూడా పంపుతుండేవారు.. మరోవైపు చోళులు చిన్నపాటి రాజులు మాత్రమేనని.. వారు పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నారని చైనాలోని రాజులకు చెప్తుండేవారు.
ఇది చోళులకు కోపం తెప్పించేది.
అయితే, రాజేంద్ర చోళుడు 1015లో చైనాతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాక పరిస్థితి మారింది. శ్రీవిజయ రాజ్యం తమ పట్ల అనుసరిస్తున్న తీరు అర్థం చేసుకున్నాక ఆ రాజ్యానికి చెందిన విజయోత్తుంగ వర్మకు తమ శక్తిసామర్థ్యాలు ఏమిటో చూపించాలని రాజేంద్ర చోళుడు నిర్ణయించుకున్నారు.
ఫలితంగా 1017లో చోళులు, శ్రీవిజయ రాజ్యం మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విజయం సాధించిన రాజేంద్ర చోళుడు రాజా విజయోత్తుంగ వర్మను బంధించారు.
అనంతరం, విజయోత్తుంగ వర్మ తన కుమార్తెను రాజేంద్ర చోళుడుకిచ్చి వివాహం చేసి చోళుల ఆధిపత్యాన్ని అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ నియమాలు ఉల్లంఘించారని విమర్శలు
రాజేంద్ర చోళుడు ఆసియాలోనే ప్రముఖ రాజుగా ఎదిగారు. యుద్ధ సమయంలో హింసకు పాల్పడటంలో అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
యుద్ధ నియమాలను ఉల్లంఘించారని ఆయన శత్రువులు ఆరోపించారు.
రాజేంద్ర చోళుడు యుద్ధాల్లో శత్రు రాజ్యాలను పూర్తిగా నాశనం చేసేవారని, బ్రాహ్మణులను, స్త్రీలను చంపడానికి కూడా వెనుకాడలేదని మరో రాజవంశం చాళుక్యులు చెప్పేవారు.
‘రాజేంద్ర చోళుడి సైనికులు చాలా క్రూరంగా ప్రవర్తించారని శ్రీలంక చరిత్రలో కూడా రాసి ఉంది’ అని అనిరుధ్ కనిశెట్టి తన 'లార్డ్స్ ఆఫ్ ది డెక్కన్, సదరన్ ఇండియా ఫ్రమ్ చాళుక్యాస్ టు చోళాస్' అనే పుస్తకంలో రాశారు.
"వారు రాజకుటుంబానికి చెందిన మహిళలను అపహరించి, అనురాధపురం రాజ ఖజానాను దోచుకున్నారు. ఇది మాత్రమే కాదు, బౌద్ధ ఆరామాలలోని స్తూపాలను ధ్వంసం చేసి, అక్కడి రత్నాలను స్వాధీనం చేసుకున్నారు" అని రాజేంద్ర చోళుడి దండయాత్రల గురించి ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images
శ్రీలంక, మాల్దీవులపై దండయాత్రలు
1014లో రాజరాజ చోళుడు మరణించిన తరువాత రాజేంద్ర చోళుడు సింహాసనాన్ని అధిష్టించారు.
ఆ వెంటనే ఆయన తన పొరుగు రాజులైన పాండ్యులు, చేర రాజులతో పొత్తు కుదుర్చుకుని క్రీ.శ. 1017లో శ్రీలంకపై దండయాత్ర చేశారు.
ఆ దాడి ఉద్దేశం అధికారాన్ని చేజిక్కించుకోవడం కంటే.. వీలైనంత ఎక్కువ బంగారం, ఇతర విలువైన వస్తువులను తిరిగి తీసుకురావడమేనని ఆ కాలపు శాసనాలలో పేర్కొన్నారు.
ఫలితంగా మొదటిసారిగా చోళులు శ్రీలంక ద్వీపం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఏడాది తర్వాత 1018లో రాజేంద్ర చోళుడు సముద్ర మార్గంలో వెళ్లి దండయాత్రలు చేసి మాల్దీవులు, లక్ష దీవులు ప్రాంతాలను చోళ సామ్రాజ్య కాలనీలుగా మార్చివేశారు.
1019లో ఆయన ఉత్తర కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రలకు సైనికులను దండయాత్రలకు పంపారు.
దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగాన్ని పాలిస్తున్న చాళుక్యులు, కళ్యాణులను రాజేంద్ర చోళుడు 1021లో జయించారు.

ఫొటో సోర్స్, Getty Images
బెంగాల్‌ను జయించి పీపాల్లో గంగాజలం తెచ్చి..
1022లో రాజేంద్ర చోళుడు తన సామ్రాజ్యాన్ని గంగానది దాటి 1000 మైళ్ల (సుమారు 1600 కి.మీ ) వరకు విస్తరించారు.
ఆ దారిలో ఒడిశా, బెంగాల్‌లలో అప్పటికి శక్తిమంతంగా ఉన్న ‘పాల’ రాజవంశానికి చెందిన రాజు మహిపాలుడిని జయించి ఆయన్ను బంధించారు.
‘రాజేంద్ర చోళుడు బెంగాల్ నుంచి చాలా విలువైన రత్నాలు, వారి దేవతల విగ్రహాలతోపాటు పవిత్ర గంగా జలాన్ని పీపాలలో నింపుకుని తన రాజ్యానికి తీసుకొచ్చారు. ఈ విజయానికి గుర్తుగా ఆయనకు 'గంగైకొండ' అనే బిరుదు వచ్చింది. తర్వాత 'గంగైకొండ చోళపురం'ను కొత్త రాజధానిగా చేసుకున్నారు రాజేంద్ర చోళుడు. గంగైకొండ అంటే గంగను జయించినవాడని అర్థం’ అని రిచర్డ్ ఈటన్ తన పుస్తకంలో రాశారు.
‘ఈ విజయం తర్వాత గంగా జలాలను దక్షిణానికి తీసుకెళ్లడం ఉత్తరాదిపై దక్షిణాది విజయానికి చిహ్నం’ అని ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన 'ఎర్లీ ఇండియా' పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సుమత్రాపై దండయాత్ర
రాజేంద్ర చోళుడు ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించారు. ఇది 250 సంవత్సరాలకు పైగా శైవానికి, చోళ నిర్మాణ శైలికి ప్రతీకగా నిలిచింది.
అలాగే 16 మైళ్ల పొడవు(సుమారు 25 కిలోమీటర్లు), 3 మైళ్ల(సుమారు 5 కిలోమీటర్లు) వెడల్పు గల విశాలమైన కృత్రిమ సరస్సును తవ్వించారు.
బెంగాల్ నుంచి తెచ్చిన గంగా జలాన్ని ఈ సరస్సులో పోశారు. కానీ రాజేంద్ర చోళుడు ఉత్తర భారతంపై తన ఆధిపత్యాన్ని ఎక్కువకాలం కొనసాగించలేకపోయారు.
మాల్దీవులు, శ్రీలంకలో విజయాలు సాధించిన తరువాత ఆనందంతో ఉప్పొంగిన రాజేంద్ర, మరో ముఖ్యమైన విదేశీ దండయాత్రకు ప్రణాళికలు వేయడం మొదలుపెట్టారు.
ఈసారి ఇండోనేషియాలోని సుమాత్రాపై దండయాత్రకు తన నౌకాదళాన్ని పంపాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీవిజయపై గెలుపు
ఇంతకుముందు 1017 సంవత్సరంలో రాజేంద్ర చోళుడు, శ్రీవిజయ రాజుల మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజేంద్ర చోళుడు విజయం సాధించారు.
మలేసియాలోని కటాహ్ అనే నగరంలో దొరికిన శాసనంలో ఈ ప్రస్తావన ఉంది. దీనిలో రాజేంద్రుడిని 'కటాహ్ విజేత' అని పేర్కొన్నారు.
మళ్లీ 1025లో రాజేంద్ర చోళుడు శ్రీవిజయ రాజ్యంతో యుద్ధం చేయడానికి తన మొత్తం నావికాదళాన్ని పంపించారు.
"ఈ దండయాత్రలో విజయం సాధించాక సంతకం చేసిన ఒప్పందం ప్రకారం, అంకోర్ రాజు సూర్యవర్మ రాజేంద్ర చోళుడికి విలువైన బహుమతులు ఇచ్చారు. ఈ దండయాత్ర కోసం రాజేంద్ర చోళుడు భారీ స్థాయిలో నావికా దళాన్ని పంపారు’ అని పాల్ మునోజ్ రాసిన 'ఎర్లీ కింగ్‌డమ్స్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.
‘ఈ దండయాత్ర కోసం సైనికులతోపాటు ఏనుగులను కూడా ఓడల్లో ఎక్కించారు. శ్రీలంకలోని ఒక ఓడరేవు నుంచి చోళులు తమ దండయాత్ర ప్రారంభించారు’ అని విలియం డాల్రింపల్ తన 'ది గోల్డెన్ రోడ్' పుస్తకంలో రాశారు.
"చాలా రోజులపాటు సముద్రంలో ప్రయాణించాక, సుమత్ర, థాయిలాండ్‌లలోని ఓడరేవులు, మలేసియాలోని 'కేదహ్'పై ఆకస్మిక దాడులు చేశారు. ఒక దక్షిణాసియా సామ్రాజ్యం విదేశం చేసిన సుదూర దండ్రయాత్రగా ఇది నిలిచింది" అని రాశారు.
ఈ విజయవంతమైన దండయాత్ర తరువాత రాజేంద్ర చోళుడి ఆధిపత్యం ఆగ్నేయాసియావరకు విస్తరించింది.
ఈ విజయం తరువాత రాజేంద్ర చోళుడు 1027వ సంవత్సరంలో తంజావూరులోని ఒక ఆలయ గోడపై దాని పూర్తి వివరాలను రాయించారు.
"ఈ వివరాల్లో ప్రస్తావించిన ఆరు ప్రదేశాలలో నాలుగు సుమత్రాలో, ఒకటి మలయ్ ద్వీపకల్పంలో, మరొకటి నికోబార్ దీవుల్లో ఉన్నాయి’ అని విజయ్, సంగీత సఖుజా రాసిన 'రాజేంద్ర చోళ, ఫస్ట్ నావల్ ఎక్స్‌పీడిషన్ టూ సౌత్ఈస్ట్ ఏసియా' అనే పుస్తకంలో పేర్కొన్నారు.
‘ప్రస్తుతం సింగపూర్‌గా పిలిచే ప్రాంతం మీదుగా రాజేంద్ర ప్రయాణించి ఉండొచ్చు. ఎందుకంటే, అక్కడ కూడా ఒక శాసనం దొరికింది. అందులో రాజేంద్ర చోళుని అనేక బిరుదుల్లో ఒకటి ప్రస్తావించారు’ అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో సన్నిహిత సంబంధాలు
ఆగ్నేయాసియాలోకి రాజేంద్ర చోళుడి నావికాదళం ప్రవేశించడం వెనుక కారణం విజయం సాధించడం మాత్రమే కాదు, సముద్ర మార్గాలపై వాణిజ్య యుద్ధంలో సైనిక శక్తిని ఉపయోగించి శ్రీవిజయ రాజుల ఆధిపత్యాన్ని అణచివేయడం కూడా.
"ఈ యాత్రల ముఖ్య ఉద్దేశం చైనాతో మరింత లాభదాయకమైన వాణిజ్యానికి తలుపులు తెరవడం. ఆ సమయంలో చైనాలో మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, అటవీ ఉత్పత్తులు, పత్తికి బాగా డిమాండ్ ఉండేది. చోళులు ఈ వస్తువులను చైనాకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలు ఆర్జించవచ్చని ఆశించారు"అని కెన్నెత్ హాల్ తన 'ఖమెర్ కమర్షియల్ డెవలప్‌మెంట్ అండ్ ఫారిన్ కాంటాక్ట్స్ అండర్ సూర్యవర్మన్ I' అనే పుస్తకంలో రాశారు.
శ్రీవిజయ రాజ్యాన్ని ఆత్మరక్షణలోకి నెట్టిన తర్వాత రాజేంద్ర చోళుడు చైనాకు ఒక రాయబారిని పంపారు.
ఆ రాయబారి తన వెంట చైనా చక్రవర్తి కోసం దంతాలు, ముత్యాలు, రోజ్ వాటర్, ఖడ్గమృగం కొమ్ములు, పట్టు వస్త్రాలు వంటి అనేక విలువైన బహుమతులు తీసుకెళ్లారు.
కొన్ని రోజుల తరువాత, చైనాలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలోని కొన్ని భాగాలు ఇప్పటికీ ఉన్నాయి.
‘1067-69 నుంచి చోళ యువరాజు దివాకరుడు చైనాలో ఈ ఆలయ నిర్వహణకు నిధులు సమకూర్చినట్టుగా ఒక చైనీస్ శాసనంలో ఉంది’ అని జాన్ గై అనే రచయిత తమిళ్ మర్చంట్స్ అండ్ ద హిందూ-బుద్ధిస్ట్ డయాస్పోరా అనే పుస్తకంలో రాశారు.
తమిళ వ్యాపారులు సువాసన గల కలప, అగరుబత్తీలు, కర్పూరం, ముత్యాలు, చైనామట్టి పాత్రలు, బంగారం వంటి సరకులతో నిండిన నౌకలను చైనా నుంచి కోరమాండల్‌కు తీసుకువచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖమెర్‌తో మైత్రి
రాజేంద్ర చోళుని కాలంలో చోళ, ఖమెర్ రాజవంశాలు పరస్పరం సహకరించుకున్నాయనడానికి ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయం అంకోర్ వాట్ నిర్మాణమే నిదర్శనం.
ఈ ఆలయం ఇప్పటికీ ఉంది. దాదాపు 500 ఎకరాలలో విస్తరించి ఉంది.
ఈ విష్ణుమూర్తి ఆలయ సముదాయం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే అంతరిక్షం నుంచి చూసినా కూడా కనిపిస్తుంది.
తంజావూరు, చిదంబరం వద్ద చోళులు దేవాలయాలు నిర్మిస్తున్న సమయానికే ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది. అప్పుడే హిందూ మహాసముద్రంలోని రెండు బలమైన రాజ్యాల మధ్యం మిత్రుత్వం ఏర్పడింది.
రాజేంద్ర చోళుడు మంచి యోధుడిగానే కాకుండా, మంచి పాలకుడిగా కూడా నిలిచారు. ఆయన అనేక గ్రామాలలో ఉన్నత స్థాయి గురుకులాలను స్థాపించారు. అక్కడ విద్యార్థులకు సంస్కృతం, తమిళ భాషలను బోధించేవారు.
తంజావూరుతో పాటు శ్రీరంగం, మదురై, రామేశ్వరంలో అనేక అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు రాజేంద్ర. అవి ఇప్పటికీ నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
రాజేంద్ర చోళుడు సముద్రాలను జయించడంతోపాటు ప్రజల మనసులు కూడా గెలుచుకున్నాడని చెబుతారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














