ప్లాటిపస్: విన్‌స్టన్ చర్చిల్ కోసం పంపించిన ఈ ‘గుడ్లు పెట్టే క్షీరదం’ ఓడలో ఎలా చనిపోయింది? నాజీలే కారణమా?

ఫొటో సోర్స్, Australian Museum
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ
1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ రహస్య నౌక అసాధారణ బహుమతి తీసుకుని ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లండ్‌కు బయలుదేరింది. అందులో ఒకే ఒక ప్లాటిపస్ ఉంది.
ఆ ప్లాటిపస్‌ను అప్పటి యూకే ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ కోసం పంపారు. ‘విన్‌స్టన్’ అని ఆయన పేరే దానికి పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం పసిఫిక్ ప్రాంతానికి విస్తరించి, తమ ముంగిట్లో ఉండడంతో బ్రిటన్ మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆస్ట్రేలియా చర్చిల్‌కి ఈ జంతువును బహుమతిగా పంపింది.
అయితే ఇంగ్లండ్ చేరడానికి కొన్నిరోజుల ముందే ప్లాటిపస్‌ను తీసుకెళ్తున్న ఓడ ఉన్న ప్రాంతం చుట్టూ సముద్రంలో యుద్ధం తీవ్రత పెరిగిపోయింది.
దీన్ని తీసుకెళ్తున్న ప్రత్యేక నీటి ట్యాంకులో అది చనిపోయి కనిపించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సంబంధాలు దెబ్బతింటాయన్న భయంతో ‘విన్‌స్టన్’(ప్లాటిపస్) మరణాన్ని రహస్యంగా ఉంచారు.
ఆ ఓడకు సమీపంలోకి వచ్చినన నాజీ సబ్‌మెరైన్ల వల్ల అది మరణించిందన్న ప్రచారం జరిగింది.
కానీ దాని మరణానికి అసలు కారణం ఏంటన్నది ఇప్పటివరకూ మిస్టరీగానే మిగిలిపోయింది.


ఫొటో సోర్స్, Getty Images
‘విన్‌స్టన్’లు, ఓ యుద్ధం
ప్లాటిపస్ ముఖం బాతు ముఖాన్ని పోలి ఉంటుంది. ఓటర్(నీట్లో ఉండే ఓ జంతువు) శరీరం, తోక కలిగిన గుడ్లు పెట్టే క్షీరదం ఇది.
అయితే అరుదైన జంతువుల సేకరణను ఇష్టపడే విన్ స్టన్ చర్చిల్ తన ప్రైవేట్ జంతు శాలలో ఆరు ప్లాటిపస్‌లను ఉంచాలనుకునేవారు.
1943లో ఆయన ఈ విషయాన్ని అప్పటి ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి హెచ్.వి. డాక్ ఎవాట్‌కు చెప్పారు.
ప్లాటిపస్ ఎగుమతిపై ఆస్ట్రేలియాలో నిషేధం ఉన్నప్పటికీ ఎవాట్ దీన్నో సవాలుగా తీసుకున్నారు. అంత సుదీర్ఘ ప్రయాణం చేసి అంతకుముందు ఏ ప్లాటిపస్ బతకలేదు.
జపాన్ సమీపిస్తున్న వేళ బ్రిటన్ తమ విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఆ సమయంలో ఆస్ట్రేలియా భావిస్తోంది.
ప్లాటిపస్‌ను పంపిస్తే చర్చిల్ ఆస్ట్రేలియాపై దృష్టిపెడతారని భావించి, దాన్ని అందించాలని ఎవాట్ భావించారు.
ప్లాటిపస్ రవాణాలో సహాయం చేయాలన్న విజ్ఞప్తిని ప్రకృతి పరిరక్షణ వేత్త డేవిడ్ ఫ్లీయే తోసిపుచ్చారు.
యూరప్, ఆసియా వ్యవహారాల్లో తలమునకలై ఉన్న చర్చిల్‌కు ఆరు ప్లాటిపస్‌ల గురించి ఆలోచించేంత సమయం ఉందని తాను నమ్మలేదని 1980లో రాసిన పుస్తకం ‘పారడాక్సికల్ ప్లాటిపస్’లో ఫ్లీయే రాశారు.
ఆరు ప్లాటిపస్‌లకు బదులుగా ఒకటి పంపిస్తామని తాను నేతలకు నచ్చజెప్పినట్టు ఫ్లీ రాశారు.
మెల్‌బోర్న్‌కు దగ్గరలో ఉన్న నదిలో ఓ చిన్నప్లాటిపస్‌ను పట్టుకున్నారు. దానికి విన్‌స్టన్ పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, Australian Museum
ప్లాటిపస్ మరణానికి రెండో ప్రపంచ యుద్ధమే కారణమా?
ఆ ప్లాటిపస్ ఉండేందుకు వీలుగా ఓడలో ఎండుగడ్డితో బొరియలు, శుభ్రమైన నీటితో నివాసం ఏర్పాటుచేశారు. దానికి ఆహారంగా 50వేల పురుగులు, బాతు గుడ్లు సిద్ధం చేశారు. 45 రోజుల సముద్ర ప్రయాణలో దాని బాగోగులు చూసుకునేందుకు ఓ వ్యక్తిని నియమించారు.
పసిఫిస్ మహాసముద్రమంతటా ప్రయాణించి పనామా కెనాల్ మీదుగా అట్లాంటిక్‌లో ప్రవేశించిన ఆ ప్లాటిపస్ దురదృష్టవశాత్తూ ట్రిప్ చివరి దశలో చనిపోయింది.
ఇంగ్లండ్ చేరుకోకముందే ప్లాటిపస్ మరణించడంపై సంతాపం వ్యక్తంచేస్తూ చర్చిల్ ఎవాట్‌కు లేఖ రాశారు. ఇది తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.
ఎలాంటి చర్చలకూ తావివ్వకుండా చాలా ఏళ్లపాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. కానీ తర్వాతిరోజుల్లో న్యూస్ పేపర్లలో దీనిపై అనేక కథనాలొచ్చాయి. ప్లాటిపస్ ప్రయాణిస్తున్న ఓడను జర్మన్ సబ్ మెరైన్ ఢీకొట్టిందని, పేలుడు పదార్థాల తీవ్రతకు ఆ ప్లాటిపస్ మరణించిందన్నది ఆ కథనాల సారాంశం.

ఫొటో సోర్స్, Renee Nowytarger/University of Sydney
రహస్యానికి ఎప్పుడు తెరపడిందంటే...
''ఇది ఆసక్తి, ఉత్సాహం కలిగించే కథ.. అవునా? కాదా?'' అని పీహెచ్‌డీ స్టూడెంట్ హారిసన్ క్రాఫ్ట్ బీబీసీతో అన్నారు.
కానీ చాలా కాలంగా ప్రజలకు దీనిపై సందేహాలున్నాయి.
ఈ నిజాన్ని కనుక్కోవాలని గత ఏడాది క్రాఫ్ట్ నిర్ణయించుకున్నారు.
కాన్‌బెర్రా, లండన్‌లో పాత రికార్డులు పరిశీలించారు. షిప్ సిబ్బందికి సంబంధించిన డాక్యుమెంట్లు కనిపించాయి. షిప్‌లో విన్‌స్టన్(ప్లాటిపస్) బాగోగులు చూసుకున్న వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఉంది.
వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, షిప్ అంతా ప్రశాంతంగా ఉందని తనకు అర్ధమైందని ఆయన చెప్పారు.
ఆస్ట్రేలియాలోని మరో ప్రాంతంలో సిడ్నీ టీమ్ కూడా విన్‌స్టన్ ప్లాటిపస్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తన వ్యక్తిగత సేకరణలను డేవిడ్ ఫ్లీయే ఆస్ట్రేలియా మ్యూజియానికి అందించారు. ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమోనని అక్కడున్న ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఎదురుచూశారు.
చాలా కాలం నుంచి ప్రజలు దీని గురించి సమాచారం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.
సిడ్నీ యూనివర్సిటీలోని బృందంతో కలిసి ఫ్లీయే రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేసి అసలు నిజాన్ని బయటకు తీసుకురావాలని మ్యూజియం ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్లాటిపస్ చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటుందని 1940ల్లో ప్రజలనుకునేవారు. విన్‌స్టన్ కోసం యూకే చాలా ఎదురుచూసింది. దానికి ఆహారం అందించేందుకు వీలుగా పురుగులను పట్టేందుకు యువకులకు డబ్బులు చెల్లించాలని భావించింది.

ఫొటో సోర్స్, Renee Nowytarger/University of Sydney
అధిక ఉష్ణోగ్రతలే కారణమా?
ఓడలోని విన్‌స్టన్ కేర్ టేకర్ లాగ్ బుక్‌లో రాసిన సమాచారం ప్రకారం.. దాని కోసం ఉంచిన పురుగులు చనిపోతుండడంతో దాని ఆహారం క్రమంగా తగ్గినట్టు అంతర్గత సిబ్బంది గుర్తించారు.
కానీ అసలైన ఆధారం నీళ్లు, గాలి ఉష్ణోగ్రతలకు సంబంధించిన రికార్డులనుంచి వచ్చింది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు, సాయంత్రం ఆరు గంటలకు వీటిని నమోదు చేశారు.
ప్లాటిపస్‌కు సురక్షితమైన 27డిగ్రీల కన్నా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండేవి.
ఆ వేడిని తట్టుకోలేక విన్‌స్టన్ ఉడికిపోయినట్టు అయిపోయిందని సిడ్నీ యూనివర్సిటీ బృందం నిర్ణయానికి వచ్చింది. 80 ఏళ్లకు పైగా దీనిపై పరిశోధన సాగింది.
అయితే సబ్ మెరైన్ వాదనను వారు పూర్తిగా తోసిపుచ్చలేదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్లాటిపస్‌లు మరణించొచ్చని వారు తెలిపారు.
ప్లాటిపస్‌కు సరైన ఆహారమందించలేదని, దానికి సరిపడా చల్లని వాతావరణం అందించలేకపోయామని చెప్పడం కన్నా నింద జర్మన్ల మీదకు నెట్టడం చాలా తేలికని ఎవాన్ కోవన్ బీబీసీతో చెప్పారు.
చరిత్ర పూర్తిగా ఎవరు చెబుతున్నారనేదానిపై ఆధారపడి ఉంటుందని పాల్ జక్ అన్నారు.

ఫొటో సోర్స్, Australian Museum
అమెరికాలో ప్లాటిపస్‌ల ప్రేమాయణం
మొదటి ప్రయత్నం విఫలమైనా ఆస్ట్రేలియా తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. 1947లో మరోసారి ప్రయత్నించింది.
అమెరికాలోని బ్రోన్స్క్ జూకు మూడు ప్లాటిపస్‌లు పంపించేందుకు ప్రభుత్వాన్ని ఫ్లీయే ఒప్పించారు. అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఇది మరో ప్రయత్నం. ఈ సారి అమెరికాతో..
విన్‌స్టన్ లా కాకుండా ఈ సారి ప్రయాణం అందరికీ తెలిసింది. బెట్టీ, పెనెలోప్, సెసిల్ బోస్టన్‌కు చేరుకోవడం చాలా ఉత్సాహవంతంగా సాగింది. వాటికి గొప్ప స్వాగతం లభించింది. న్యూయార్క్ నగరంలోనూ వాటి రాక సందడిగా మారింది . అక్కడ ఆస్ట్రేలియా అంబాసిడర్ వాటికి ఆహారం అందించారు.
అమెరికా చేరుకున్న కొన్నిరోజులకే బెట్టీ మరణించగా, పెనెలోప్, సెసిల్ స్టార్లయ్యాయి. చాలా మంది వాటిని చూడడానికి వచ్చారు. వాటి ప్రతి కదలికా న్యూస్ పేపర్లలో వచ్చేది.
ప్లాటిపస్‌లు ఒంటరిగా జీవిస్తాయి. కానీ న్యూయార్క్‌లో వాటి కోసం ప్రేమ కథ రూపొందింది. సెసిల్ ప్రేమ కోసం చాలా ఎదురుచూసేది. కానీ పెనెలోప్ ఆసక్తి కనబర్చేది కాదు.

ఫొటో సోర్స్, Australian Museum
సెసిల్ ఎందుకు చనిపోయింది?
కానీ 1953లో అవి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ నాలుగు రోజులు ప్రేమాయణం సాగించాయి.
బేబి ప్లాటిపస్ కోసం అంతా ఎదురుచూశారు. ఆస్ట్రేలియా వెలుపల ఓ ప్లాటిపస్ పుట్టడం అదే తొలిసారి కాబోతుందని భావించారు.
నాలుగు నెలల పాటు పెనెలోప్‌ను రాజకుమారిలా చూశారు. చాలా ఆహారం అందించారు. జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ బేబీ ప్లాటిపస్‌లు కనిపించలేదు. మరింత ఆహారం కోసం కడుపుతో ఉన్నట్టు నటించిందని కొందరు భావించారు.
1957లో అదికనిపించకుండా పోయింది. దాని కోసం చాలా వెతికారు. కానీ అది తప్పిపోయి, చనిపోయిందని చివరికి తేల్చారు.
పెనెలోప్‌ను వెతకడం మొదలుపెట్టడం ఆపేసిన తర్వాతి రోజు సెసిల్ చనిపోయింది. పెనెలోప్ లేదన్న బాధతో దాని గుండె పగిలిందని న్యూస్ పేపర్లు రాశాయి.
ప్లాటిపస్ దౌత్యం కూడా వాటి మరణంతో ముగిసిపోయింది. 1958లో బ్రోక్స్ జూ కొత్త ప్లాటిపస్‌లను తెప్పించినప్పటికీ అవి ఏడాది కాలం కూడా బతకలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్లాటిపస్‌ల ఎగుమతికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినం చేసింది.
ఆ తర్వాతి నుంచి కేవలం రెండు ప్లాటిపస్‌లు మాత్రమే ఆ దేశం నుంచి తరలించారు. 2019 నుంచి అవి శాన్ డియోగో జూలో ఉంటున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














