ఖడ్గమృగాలను కాపాడేందుకు రేడియో ధార్మికతను ఉపయోగిస్తున్నారు, ఎక్కడంటే...

దక్షిణాఫ్రికా, ఖడ్గమృగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,
    • రచయిత, వెడేలి చిబేలుషి, ఎడ్ హాబర్‌షన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఖడ్గమృగాల వేటను అరికట్టేందుకు వాటి కొమ్ముల్లో రేడియో ధార్మిక పదార్థాన్ని పెట్టే ప్రాజెక్టును దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ప్రారంభించారు.

ఇలా చేయడం వల్ల ఖడ్గమృగాలకు హాని ఏమీ ఉండదని, విట్‌వాటర్‌స్టాండ్ యూనివర్సిటీకి చెందిన గ్రూప్ తెలిపింది. వాటి కొమ్ములను అక్రమంగా రవాణా చేస్తున్నప్పుడు కస్టమ్స్ అధికారులకు వాటిని గుర్తించడం తేలికవుతుందని వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఖడ్గమృగాలు దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. కానీ, వేటగాళ్లు ఏటా వందల సంఖ్యలో ఖడ్గమృగాలను చట్టవిరుద్ధంగా వేటాడుతున్నారు.

రైనోలను కాపాడే ఈ ప్రయత్నానికి రిసోటోప్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు. 2.9 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్ల 52 లక్షలలు )కు పైగా ఖర్చుతో దీన్ని రూపొందించడానికి ఆరేళ్లు పట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దక్షిణాఫ్రికా, ఖడ్గమృగం
ఫొటో క్యాప్షన్, రేడియో యాక్టివ్ మెటీరియల్‌తో కొమ్ముల అక్రమ రవాణా గుర్తించొచ్చు.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ప్రతిరోజూ ఓ ఖడ్గమృగాన్ని చంపేస్తుంటారని విట్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ లార్కిన్ చెప్పారు.

దీనిపై చర్యలు చేపట్టకపోతే అక్రమ వేట ఇంకా పెరుగుతుందని అన్నారు. దీన్ని ఆపడానికి ఈ కొత్త విధానం పనికొస్తుందని, నేరం జరిగిన తర్వాత స్పందించే తరహాలో కాకుండా నేరం జరగకముందే దీన్ని అడ్డుకోవచ్చని తెలిపారు.

20 ఖడ్గమృగాల మీద వాటిని పరీక్షించారు. రేడియో ధార్మిక పదార్ధం వల్ల వాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అవి సురక్షితంగా ఉన్నాయని తెలిపారు.

అంతర్జాతీయ అణుశక్తి సంస్థతో కూడా శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. 40 అడుగుల షిప్పింగ్ కంటెయినర్లలో ఉన్నప్పటికీ రేడియో ధార్మిక పదార్థం ఉన్న కొమ్ములను గుర్తించగలమని వారు అంటున్నారు.

ఈ ప్రయత్నం వల్ల చాలా ఉపయోగం ఉందని ఖడ్గమృగ పరిరక్షకురాలు, సేవింగ్ ద వైల్డ్ చారిటీ డైరెక్టర్ జామి జోసెఫ్ చెప్పారు. ఇది అక్రమ వేటను పూర్తిగా అరికట్టలేదని, దాని కోసం కఠినమైన చట్టాలు, రాజకీయ ప్రయత్నాలు కావాలని ఆమె అన్నారు. అయితే కొమ్ముల అక్రమరవాణాను గుర్తించి, అరికట్టడానికి అవసరమైన సమాచారం దీని వల్ల లభిస్తుందని తెలిపారు.

దక్షిణాఫ్రికా, ఖడ్గమృగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాలో అత్యధికంగా ఖడ్గమృగాలున్నాయి.

ఖడ్గ మృగాల కొమ్ములను ఏం చేస్తారు?

2021 నుంచి ఏటా 400కు పైగా ఖడ్గ మృగాలను అక్రమంగా వేటాడారని ద సేవ్ రైనో చారిటీ తెలిపింది.

ఖడ్గమృగాలను రక్షించడానికి ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించడం తమ లక్ష్యమని రిసోటోప్ ప్రాజెక్టు హెడ్‌ జెస్సికా బేబిచ్ తెలిపారు.

రైనోలను రక్షించడమంటే ఆఫ్రికా సహజ వారసత్వంలో ప్రధాన భాగాన్ని పరిరక్షించడమేనని ఆమె అన్నారు.

ఖడ్గమృగాల కొమ్ములను తరచుగా ఆసియా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తుంటారు. వాటిని సంప్రదాయ ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు.

ప్రస్తుతం తెల్ల ఖడ్గమృగాలకు ముప్పు పొంచి ఉంది. నల్ల రైనోలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)