కరిగిపోని ఐస్ క్రీం.. మీకూ కావాలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వెరోనిక్ గ్రీన్ వుడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐస్ క్రీం చూడగానే చాలా మందికి తినాలనిపిస్తుంది. కానీ, తొందరగా తినకపోతే కరిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
ఐస్ క్రీం రుచిని ఇష్టపడేవారు అది కరిగిపోతూ వేళ్ల వెంబడి కారిపోవడాన్ని మాత్రం ఇష్టపడరు.
ఐస్‌క్రీం కరగకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు.
ఇప్పుడు ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
జపాన్ కంపెనీ కనజావా తయారుచేసిన ఐస్ పాప్స్, ఐస్ క్రీములు బాగా వేడిని కూడా తట్టుకుంటున్నగా చెప్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కొద్దికాలం కిందట వైరల్ అయ్యాయి.
ఈ ఐస్ క్రీములు కరగకపోడానికి కారణం పాలీఫెనోల్స్. పాలీ ఫెనోల్స్ అనేవి చాలా రకాల పండ్లలో సాధారణంగా ఉండే యాంటీఆక్సిడెంట్ అణువులు.
అలాంటి పాలీఫెనోల్స్ మాలెక్యూల్స్‌ను శాస్త్రవేత్తలు ఈ కరిగిపోని ఐస్‌క్రీంల తయారీలో వాడారు.


ఫొటో సోర్స్, Getty Images
సాధారణ ఐస్ క్రీములు ఎలా తయారుచేస్తారు?
ఐస్‌క్రీం ప్రధానంగా క్రీం, చక్కెరతో తయారవుతుంది. ఒక రెఫ్రిజరేటెడ్ డ్రమ్‌లో చక్కెర, క్రీం మిశ్రమాన్ని చిలుకుతారు. ఇది డ్రమ్ లోపల గడ్డకట్టుకుపోయిన పొరలా మారగానే స్క్రేపర్ దాన్ని వేరుచేస్తుంది.
అయితే ఫ్యాక్టరీలో తయారైన ఐస్‌క్రీం, మన ఇంట్లోని ఫ్రిజ్‌కు చేరే క్రమంలో ఎక్కడైనా కాస్త వేడి తగిలినా అది కరిగిపోతుంది.
ఈ కరిగిపోయిన ఐస్‌క్రీంను మళ్ళీ ఫ్రీజ్ చేస్తే, చిన్న చిన్న క్రిస్టల్స్ తయారవుతాయి.
ఐస్‌క్రీం, మొదట ఉంచిన ఫ్రీజర్ నుంచి అనేక ప్రదేశాలు మారుతుండడం, అనేక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడం వల్లా చాలా తరచుగా వచ్చే సమస్యే ఇది.
దీనిని నివారించేందుకు, ఐస్‌క్రీం తయారీదారులు వివిధ రకాల స్టెబిలైజర్‌లు వాడతారు
కామెరన్ విక్స్ ఒక ఆహార శాస్త్రవేత్త.. జెనరల్ మిల్స్ సంస్థలో ఫుడ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు.
ఆమె యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌లో చదువుకుంటున్నప్పుడు కనాజావా ఐస్‌క్రీంల వైరల్ వీడియోలను చూశారు.
ఈ ఐస్‌క్రీంలు కరగకుండా పాలీఫెనోల్స్ స్టెబిలైజింగ్ ఎఫెక్ట్ ఎలా పని చేస్తుందో తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
పాలీఫెనోల్స్‌కు మంచి ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇలా ఇంజనీరింగ్ క్వాలిటీలు ఉంటాయని ఆమె అనుకోలేదు.
అనంతరం కామెరన్ ఒక ప్రయోగం చేశారు. ఐస్ క్రీం మిశ్రమంలో ఒక ప్రత్యేక రకమైన పాలీఫెనోల్- టానిక్ యాసిడ్ మోతాదు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతూ వచ్చే మార్పులను గమనించారు.
ప్రయోగంలో భాగంగా 0.75 శాతం, 1.5 శాతం, 3 శాతం మోతాదులో టానిక్ యాసిడ్‌ను ఉపయోగించి చూశారు.
3 శాతం మోతాదులో టానిక్ ఆసిడ్‌ను వాడినప్పుడు ఐస్ క్రీం మిశ్రమం తొందరగా గట్టిపడడాన్ని గమనించారు.
తరువాత ఈ మిశ్రమాలను 24 గంటల పాటు ఫ్రీజ్ చేసి గమనించి చివరికి 3 శాతం టానిక్ యాసిడ్ ఉన్నది సరైన మిశ్రమంగా తేల్చారు.
3 శాతం టానిక్ యాసిడ్ ఉన్న మిశ్రమాన్ని 24 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన తరువాత కూడా చాకుతో కోయడానికి వీలుగా ఉంది. అంతేకాకుండా దాన్ని కప్‌లో వేసి తలకిందులు చేసినా కూడా కిందపడడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మిశ్రమాలని మైక్రోస్కోప్‌లో పరిశీలించగా.. ఎక్కువ టానిక్ యాసిడ్ ఉన్న మిశ్రమాలలో పెద్ద ఫ్యాట్ కణాలు ఉన్నాయి. క్రీంలోని ప్రోటీన్ల సాయంతో టానిక్ యాసిడ్, ఈ ఫ్యాట్ కణాలు ఒక దానితో మరొకటి కలిసిపోకుండా అడ్డుకుంటున్నాయని కామెరన్ గుర్తించారు.
ఐస్‌క్రీం కరిగిపోకుండా ఉండడానికి ఇదే కారణం కావచ్చని తేల్చారు.
అయితే పాలీఫెనోల్స్ ఉన్న ఐస్‌క్రీంలు సమయం గడిచే కొద్ది పుడ్డింగ్ లాగా రబ్బరు తరహాలోకి మారుతున్నాయి.
మొత్తానికి వేడిని తట్టుకుని, కరిగిపోని ఐస్ క్రీంలు అందరికీ అందుబాటులోకి వచ్చేది మాత్రం ఎప్పుడో!
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














