హైదరాబాద్‌లో రజినీకాంత్‌కు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స - BBC Newsreel

రజినీకాంత్

ఫొటో సోర్స్, MIGUEL MEDINA

ఒక సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన నటుడు రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

సినిమా షూటింగ్ బృందంలోని పలువురికి కోవిడ్-19 సోకిందని, దీంతో రజినీకాంత్‌కు కూడా ఈనెల 22వ తేదీన పరీక్షలు జరిపామని, అయితే ఆయనకు నెగెటివ్ వచ్చిందని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.

రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది.

రక్తపోటు అదుపులోకి రాగానే ఆయన్ను డిశ్చార్జి చేస్తామని తెలిపింది.

రక్తపోటు మినహా మిగతా ఆరోగ్య సమస్యలు ఏమీ రజినీకాంత్‌కు లేవని ప్రకటించింది.

ఆయనకు విశ్రాంతి అవసరం అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

తనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని రజినీ కోరారు. ఆయన్ను విశ్రాంతి తీసుకోనివ్వాలని, ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని ఆసుపత్రి వర్గాలు కూడా కోరాయి.

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, EPA

కోవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలలోనూ జిల్లాస్థాయిలో వాక్సినేషన్ శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఇందులో 7,000 మందికి పైగా పాల్గొన్నారు.

ఒక్క లక్షద్వీప్‌లో మాత్రం డిసెంబర్ 29న ఈ శిక్షణ నిర్వహిమనున్నారని కేంద్ర ప్రభుత్వం తెలినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రచురించింది.ఆంధ్ర ప్రదేశ్, అసోం, గుజరాత్, పంజాబ్‌లలో వచ్చేవారం వాక్సినేషన్‌కు సంబంధించిన డ్రై రన్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అంటే మొదటి నుంచీ చివరి వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగే పద్ధతిని పరీక్షిస్తారు.

అలాగే కో-విన్ వ్యాక్సీన్ వాడకాన్ని కూడా తనిఖీ చేయనున్నట్లు ఏఎన్ఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)