నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్
ఫొటో క్యాప్షన్, మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ నగర ప్రజల నీటి అవసరాలకు ఏలేరు, మేఘాద్రి గెడ్డ, ముడసరలోవ, రైవాడ, తాటిపూడి, గంభీరం రిజర్వాయర్లే ఆధారం.

భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని ఇందులోకే తెచ్చి.. ఆ తరువాత ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా ఉంది.

ఈ సమయంలో మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం విశాఖవాసులను ఆందోళన కలిగిస్తోంది.

క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చేసిన అధ్యయనం ప్రకారం నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న నగరాల్లో విశాఖ కూడా ఒకటి.

పెరుగుతున్న నీటి కాలుష్యాన్ని నివారించకపోతే ఏలూరులో ఇటీవల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లుగా విశాఖలోనూ జరగొచ్చన్న ఆందోళన కనిపిస్తోంది.

ఏలూరు మిస్టరీ వ్యాధితో విశాఖలోనూ భయం

మహా విశాఖ నగర పాలక సంస్థ(జీవీఎంసీ) ద్వారా సరఫరా అవుతున్న నీరు అనేక చోట్ల కలుషితమవుతోందని గతంలో పలుమార్లు రుజువైంది.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తరువాత నగరవాసుల్లోనూ భయం పెరిగింది.

పర్యావరణ నిపుణులూ దీనిపై హెచ్చరిస్తున్నారు.

మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్

"దేశంలోని 26 నగరాల్లో మున్సిపాల్టీలలో... అక్కడ సరఫరా అవుతున్న నీటి వ్యవస్థల్లోని లోపాల కారణంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయనే విషయాన్ని దిల్లీ కేంద్రంగా పని చేస్తున్న వికాస్‌ ఎకో టెక్‌ లిమిటెడ్‌ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

ఇందులో విశాఖ నగరమూ ఉంది. ఇక్కడ నీటి వనరులు సురక్షితంగా లేవు. పారిశ్రామిక కాలుష్యం, నీటి సరఫరా లైన్లు డ్రైనేజీల మధ్య ఉండటం, వ్యర్థాలు రిజర్వాయర్లలోకి వదలడం వల్ల నీరు కలుషితమవుతోంది.

తాగునీటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం తాగే నీటికి పరీక్షలు జరపాలి.

కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పటికే మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ లో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.

విశాఖలో సుమారు 22.5 లక్షల మందికి రోజూ 50 ఎంజీడీలు (మిలియన్స్ ఆఫ్ గాలన్స్ పర్ డే) తాగు నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తోంది.

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి నేపథ్యంలో విశాఖ నీటి సరఫరాపై పరిశోధనలు జరపాలంటూ సీఎంకు లేఖ రాశాను’’ అని మాజీ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ బీబీసీకి తెలిపారు.

మేఘాద్రి గెడ్డ రిజర్వాయరు
ఫొటో క్యాప్షన్, మేఘాద్రి గెడ్డ రిజర్వాయరు

పోలవరం నీరు ఇక్కడికే...

మేఘాద్రి గెడ్డ రిజర్వాయరులో పారిశ్రామిక, రసాయన ఎరువుల, వ్యర్థాలు చేరుతున్నాయి.

మరోవైపు భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీరూ ఇందులోకే తెచ్చి ఇతర రిజర్వాయర్లకు తీసుకెళ్లే ప్రణాళికా నడుస్తోంది.

ఈ నేపథ్యంలో మేఘాద్రిగెడ్డలో పెరుగుతున్న నీటి కాలుష్యం కలవరపెడుతోంది.

మేఘాద్రిగెడ్డ పరిసరాలైన పెందుర్తి, సబ్బవరం, నవర ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలతో కూడిన నీరే ఎక్కువ శాతం ఈ రిజర్వాయర్ కు చేరుతుందని జీవీఎంసీ సర్వేలో తేలింది.

"విశాఖ పరిపాలనా రాజధాని అవుతున్న తరుణంలో నగర విస్తరణ జరగనుంది. భవిష్యత్తు అవసరాల కోసం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖకు గోదావరి జలాలు తరలించి...మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

ప్రస్తుతానికి రోజుకి సరాసరి 50ఎంజీడీల నీటి సరఫరా నగర తాగునీటి అవసరాలకు సరిపోతోంది. కానీ భవిష్యత్తులో ఇది సరిపోదు. వచ్చే 20 నుంచి 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరింత నీటి నిల్వకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని జీవీఎంసీ కమిషనర్ జి.సృజన బీబీసీతో చెప్పారు.

జీవీఎంసీ కమిషనర్ సృజన
ఫొటో క్యాప్షన్, జీవీఎంసీ కమిషనర్ సృజన

‘‘నగర నీటి అవసరాలను తీర్చే మేఘాద్రిగెడ్డ, ముడసరలోవ క్యాచ్‌మెంట్ ఏరియాలలో సర్వే చేశాం. వీటికి నీరు వచ్చే ప్రాంతాల వద్ద వాటర్ క్వాలిటీ టెస్టులను నిర్వహిస్తాం.

అలాగే రిజర్వాయర్లు అన్ని దాదాపు పొలాల మధ్యే ఉంటాయి. దాంతో పంటలకు ఉపయోగించి క్రిమిసంహారక మందుల ప్రభావం ఈ నీటిపై పడే అవకాశం ఉంది.

అందుకే నీటిని ప్రజలకు సరఫరా చేసే ముందు రోజూ పరీక్షలు నిర్వహిస్తారు.

నార్మల్ రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే నీటి సరఫరా చేస్తాం. నీటి నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం’’ అని ఆమె తెలిపారు.

మేఘాద్రి గెడ్డ రిజర్వాయరు

త్వరలో ప్రమాదం తప్పదు

ఏలేరు, రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి, గంభీరం కాల్వల ద్వారా నగరానికి తాగునీటి అవసరాలకు 80 ఎంజీడీలు అవసరం ఉంటుంది.

అయితే లభ్యత బట్టి కేవలం 67.3 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది.

ఇందులో మేఘాద్రిగెడ్డ నుంచి 8ఎంజీడీల నీటి సరఫరా జరుగుతోంది.

ఇందులో రెండు ఎంజీడీలు తాగునీటి అవసరాల కోసమే వాడతాం. మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో నీటిమట్టం 61అడుగులు.

కానీ అడుగున 15 అడుగుల మేర పూడిక ఉందని జీవీఎంసీ సర్వేల్లో తేలింది.

ఫలితంగా సుమారు 20 శాతం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

సుమారు 600 ఎకరాలున్న ఈ రిజర్వాయరు అడుగున లక్షన్నర ఘనపు మీటర్ల పూడికను తీయాలి.

ఈ విషయంపై డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ తో చర్చలు జరుగుతున్నట్లు జీవీఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఉద్యోగి శ్రీనివాస్ తెలిపారు.

మేఘాద్రి గెడ్డ, నీరు

‘‘సాధారణంగా రిజర్వాయర్ల పర్యవేక్షణ సరిగా లేకపోతే గుర్రపు డెక్క బాగా పెరిగిపోతుంది.

దీని వలన నీటి లోపల ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీంతో నీటిలో మెక్రో అల్గే పెరుగుతుంది.

ఇది నీటిని కలుషితం చేస్తుంది. అలాగే మేఘాద్రిగెడ్డ చుట్టూ పొలాలు ఉండటంతో వాటిలో చల్లే పురుగుమందులు రిజర్వాయర్ ఉపరితల జలాలపై చేరుతాయి.

దీంతో ఆ నీటిలో సల్ఫేట్, నైట్రేట్లు కలిసిపోతాయి. అలాగే విశాఖ చుట్టు పక్కల పరిసరాల్లో ఉన్న పరిశ్రమల నుంచి సీసం, పాదరసం, కాడ్మియం, జింక్ వంటి లోహాలు నీటిలో కలుస్తున్నాయి.

అందుకే ఏ నీటినైతే తాగునీటి అవసరాలకు వాడుతున్నామో దానిని నిరంతరం పరీక్ష చేయాలి. నా పరిశీలనలో ప్రస్తుతం విశాఖలోని రిజర్వాయర్లలో నీరు అంత హానికరం కాదు...అలాగని స్వచ్ఛమైనది అని చెప్పలేం.

కొన్ని జాగ్రతలు తీసుకుని నీటిని తాగాల్సిన పరిస్థితిలో ఉన్నాం.

సరైన చర్యలు చేపట్టకపోతే త్వరలో కచ్చితంగా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి’’ అని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రొఫెసర్ పీవీవీ ప్రసాదరావు బీబీసీతో చెప్పారు.

water testing

63 రకాల పరీక్షలు చేసి తాగాలి

తాగే నీటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించకోవాలని వాటర్ ఎనలిస్టులు అంటున్నారు. వెల్, బోర్, మున్సిపల్ ఇలా ఏ నీరైనా దానిని పరీక్ష చేయాలి.

దాని వలన మనకు వచ్చే నీటిలో ఏదైనా మార్పులు జరిగితే గమనించే అవకాశముంటుంది. లేదంటే మనకి తెలియకుండానే మెల్లమెల్లగా విషపూరిత పదార్థాలు, భార లోహాలు మన శరీరంలో చేరుతాయి.

ఇవి ఒకే సారి ప్రభావం చూపుతాయని అంటున్నారు. దీనికి ఏలూరు సంఘటనే ఒక ఉదాహరణ అని గుర్తు చేస్తున్నారు.

"ISIO-500 నిబంధనల ప్రకారం తాగే నీరు స్వచ్ఛమైనదా...? కాదా...? అని తెలుసుకోవాలంటే 63 రకాల పరీక్షలు చేయాలి.

వాటిలో సాధారణంగా పీహెచ్, టీడీఎస్, హర్డ్ నెస్, అల్కలీనిటీ, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్స్, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్ వంటి పలు రకాలైన పరీక్షలు చేయాలి.

ఈ పరీక్షల్లో పరిమితులకు లోబడి ఫలితాలు వచ్చినప్పుడే ఆ నీటిని తాగునీరుగా సర్టిఫై చేస్తాం. నీటి ఉపరితలంపై వచ్చి చేరే కాలుష్యం కంటే భూగర్భ జలాల ద్వారా వచ్చే కాలుష్యమే ఎక్కువగా ఉంటుంది.

అదే ప్రమాదకరం కూడా. అందుకే రిజర్వాయర్ల చుట్టూ పక్కల ఉండే భూగర్భంలో ఎక్కువ రసాయనాలు, వ్యర్థ పదార్థాలు చేరకుండా నిరంతరం పర్యవేక్షించాలి.

అని వాటర్ టెస్టింగ్ లో 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ కెమిస్ట్ బుద్దా రవిప్రసాద్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)