మహారాష్ట్ర: రాష్ట్రాలు తిప్పుతూ 12 ఏళ్ల బంగ్లాదేశీ బాలికపై అత్యాచారం, 200 మందికి పైగా అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పిన బాలిక

నేరాలు, బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, దీపాలి జగ్తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(ఈ కథనంలో కలవరపరిచే అంశాలు ఉన్నాయి)

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసైలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి లైంగిక దాడులకు గురైన బాలికను మీరా-భయందర్ పోలీసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు వసైలోని ఒక భవనం నుంచి రక్షించాయి.

తనపై మూడు నెలల కాలంలో 200 మందికి పైగా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత బాలిక చెప్పారు. ఎక్సోడస్ రోడ్ ఇండియా ఫౌండేషన్, హార్మొనీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు బాలికకు అండగా నిలిచాయి.

బాలికను మహారాష్ట్రలోని అహల్యానగర్, ముంబయి, వసై, గుజరాత్‌లోని కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.

మీరా-భయందర్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, కొన్నిస్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 2025 జూలై 26న ఈ ఆపరేషన్ జరిగింది.

బాధిత బాలిక బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. మూడు నెలల కిందట పరీక్షల్లో ఫెయిల్ కావడంతో భయంతో ఇంటి నుంచి పారిపోయి వేరే గ్రామానికి వెళ్లారు. అక్కడి నుంచి ఒక మహిళ తనను భారతదేశానికి తీసుకువచ్చారని బాధితురాలు పోలీసులకు తెలిపారు.

ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో, పీఐటీఏ (ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్) కింద కేసులు నమోదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గ్రాఫికల్ చిత్రం

పరీక్ష తప్పాననే భయంతో..

బంగ్లాదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక పాఠశాల పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో భయపడి ఇంటికి వెళ్లకుండా సమీపంలోని గ్రామానికి పారిపోయారు. అక్కడ ఆమె తన సొంత గ్రామానికి చెందిన మహిళను కలిశారు.

బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో "ఆ మహిళ నన్ను రెండు రోజులు ఇంట్లో పెట్టుకుని, 'నువ్వు ఇంటికి వెళితే, మీవాళ్లు నిన్ను చంపేస్తారని’ చెప్పి, బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా కోల్‌కతాకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి, విమానంలో ముంబయికి తీసుకొచ్చారు. ఇక్కడ, ఐదు నుంచి ఆరుగురు బాలికలు నివసించే ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత, నాకొక ఇంజెక్షన్ ఇచ్చారు. నేను స్పృహలోకి వచ్చేసరికే, నాకు రక్తస్రావమై, కడుపులో నొప్పిగా ఉంది.

ఈ విషయం గురించి ఆమెను అడిగితే.. 'నువ్వు మీ ఊరికి వెళ్లాలనుకుంటే, నువ్వొక పని చేయాల్సి ఉంటుంది' అని నాకు చెప్పారు. పని గురించి అడిగినప్పుడు, పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుందని’ ఆమె చెప్పారు.

‘‘మా నాన్న ఊరికి తిరిగి రావడానికి డబ్బు పంపుతారని, నేనలాంటి పని చేయనని చెప్పాను. కానీ, వారు నాపై కత్తితో దాడి చేశారు, నా చేతులు, వీపుపై కూడా కొట్టారు" అని పేర్కొన్నారు.

తన వీడియోను కూడా తీశారని ఆమె చెప్పారు. ప్రతిరోజూ వేర్వేరు పురుషులతో చెడు పనులు చేయించేవారని, ఈ పనికి చెల్లించిన డబ్బు కూడా తనకు ఇవ్వలేదని బాలిక తెలిపారు.

''నెలరోజుల పాటు జరిగిన ఈ చిత్రహింసలతో అక్కడి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాను. 500 రూపాయలు తీసుకొని, స్టేషన్‌కు చేరుకున్నా. మా నాన్నకు ఫోన్ చేసి, నేను ఇంటికి రావాలనుకుంటున్నా అని చెప్పాను. మా నాన్న ఒక వ్యక్తిని కలవమన్నారు, ఆయనను కలిసిన తర్వాత, ఆయన నన్ను వసైలోని నాయిగావ్‌కు తీసుకువచ్చారు.

ఈ వ్యక్తి కూడా నన్ను అదే పని చేయమని అడిగారు. నన్ను మా ఊరుకు తీసుకువెళ్లనని ఆయన చెప్పారు. నేను పని చేయనంటే నన్ను కొట్టేవారు. పురుషులను గదికి తీసుకువచ్చేవారు. నన్ను ఇతర ప్రదేశాలకు కూడా తీసుకెళ్లేవారు. 10 నుంచి 12 గంటలు రైలులో ప్రయాణం ఉండేది" అని బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన తండ్రి సంబంధిత వ్యక్తికి చాలాసార్లు ఫోన్ చేసి, గ్రామానికి పంపాలని కోరారని బాలిక చెప్పారు. బాలిక తండ్రి కూడా సంబంధిత వ్యక్తిపై బంగ్లాదేశ్‌లోని ఖుల్నా మోడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదే ఆపరేషన్‌లో మరో 21 ఏళ్ల బంగ్లాదేశ్ అమ్మాయిని కూడా పోలీసులు రక్షించారు. ఐదారేళ్ల కిందట బంగ్లాదేశ్ నుంచి వచ్చానని ఆమె చెప్పారు.

పోలీసులు ఏం చెప్పారు?

జూలై 26 ఉదయం వసై-విరార్ పోలీస్ కమిషనరేట్‌లోని 'ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ సెల్‌'కు బాలిక గురించిన సమాచారం అందింది.

వసైలోని ఒక భవనంలో కొంతమంది బ్రోకర్లు బంగ్లాదేశ్‌కు చెందిన బాలికను వ్యభిచారంలోకి దింపారని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. ఇప్పటివరకు, ఈ కేసులో ముగ్గురు బంగ్లాదేశీయులతో సహా పది మందిని అరెస్టు చేశారు. బాధిత బాలికను రిమాండ్ హోమ్‌కు పంపారు.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభిజిత్ మాడ్గే బీబీసీతో మాట్లాడుతూ, "మొత్తం రెండు దాడులు జరిగాయి. మొదటి దాడిలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఇద్దరు బాధితులను రక్షించాం. రెండవ దాడిలో ముగ్గురిని అరెస్టు చేసి, మరో ముగ్గురు బాధితులను రక్షించాం. ఈ బాధితుల్లో ఒకరు 12 ఏళ్ల బాలిక ఉన్నారు. తన ఫోన్‌ను తీసుకున్నారని ఆమె చెప్పారు. బాలికను తీసుకువచ్చిన మహిళ పూర్తి పేరు ఆమెకు తెలియదు" అన్నారు.

అత్యాచారాలు, బంగ్లాదేశీ బాలిక

"సదరు మహిళ ఆమెను వసైకి తీసుకువచ్చారు. ముంబయిలోని ఒక ప్రాంతంలో ఉంచారు. ఆమెపై అత్యాచారం జరిగింది. బాలిక అక్కడి నుంచి తప్పించుకున్నారు, రిక్షావాళ్లు ఆమె తండ్రికి ఫోన్ చేశారు. తండ్రి ఆమెకు బంగ్లాదేశ్ పౌరుడి వివరాలు ఇచ్చారు. అయితే, ఆయన కూడా వ్యభిచార వ్యాపారం నడిపేవారే. దీంతో, డబ్బు అవసరమని చెప్పి ఆమెను ఒక బ్రోకర్ వద్దకు పంపారాయన. మాకు సమాచారం అందడంతో, దాడులు నిర్వహించాం. బాలికను రక్షించాం.

బాలికపై ఎంతమంది లైంగిక దాడి చేశారో ఇంకా తెలియదు. సంఘటన ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరిగి ఉంటే, అది తెలిసి ఉండేది. కానీ, ఒక బ్రోకర్ నుంచి మరో బ్రోకర్ ఇలా వేర్వేరు ప్రదేశాలలో ప్రారంభమైంది. ఆమెను పది రోజుల పాటు గుజరాత్‌కు, తరువాత అహల్యానగర్‌కు తిప్పారు. గుజరాత్‌లో ఇచ్చిన చిరునామాలో అక్కడి నుంచి ఒక మహిళను అరెస్టు చేశారు. అలాగే, అహల్యానగర్‌లో పలువురిని అరెస్టు చేశాం. కొల్హాపూర్‌కు కూడా ఒక బృందాన్ని పంపాం" అని అభిజిత్ మాడ్గే అన్నారు.

"వైద్య పరీక్షలో బాలిక చేతులపై గాయాలు ఉన్నట్లు తేలింది" అని ఆయన తెలిపారు.

'క్రూరత్వాన్ని సహించకూడదు'

బాధిత బాలిక గురించి హార్మొనీ ఫౌండేషన్ అనే ఎన్జీఓ ఒక ప్రకటన విడుదల చేసింది.

హార్మొనీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ అబ్రహం మథాయ్ బీబీసీతో మాట్లాడుతూ "2025 జూలై 26న, వసైలోని నాయిగావ్‌లో 12 ఏళ్ల బాలికను వ్యభిచారం నుంచి రక్షించారు. రిమాండ్ హోమ్‌లో ఉన్న బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆమెను గుజరాత్‌లోని నాడియాద్‌కు అక్రమ రవాణాదారులు తీసుకెళ్లారు. మూడు నెలల్లో వివిధ ప్రదేశాలలో తిప్పుతూ 200 మందికి పైగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు" అని తెలిపారు.

"ఇటువంటి క్రూరత్వాన్ని అస్సలు సహించకూడదు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలి" అని అబ్రహం డిమాండ్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)