మహిళా రాఫ్టర్ మేజర్ కవిత : ‘‘ ప్రమాదకర బ్రహ్మపుత్ర ప్రవాహంలో పడిపోయినప్పుడు ఒక్కటే అనుకున్నా...’’

ఫొటో సోర్స్, Major Kavitha V
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
"మనం బతకాలంటే ఓం బ్రహ్మపుత్రా అంటూ ఆ నదిని తలచుకోవడం తప్ప మరో దారి లేదంటూ తోటి రాఫ్టర్లు చెబుతుంటే మేమెంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమైంది" అని ఆర్మీ మేజర్ కవిత వాసుపల్లి బీబీసీతో చెప్పారు.
బ్రహ్మపుత్ర నది నుంచి ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని ఆమె అంటున్నారు
'నదిలో పడిపోయినప్పుడు ఏ మాత్రం నోరు తెరిచినా, చనిపోతామనే పరిస్థితి తలెత్తింది' అని బ్రహ్మపుత్ర నదిపై సాహస యాత్రను కవిత వివరించారు.
బ్రహ్మపుత్ర నదిపై ఇటీవల రాఫ్టింగ్ చేసిన 12 మంది బృందంలో ఏకైక మహిళ, మేజర్ కవిత వాసుపల్లి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెట్టూరు గ్రామంలో మత్స్యకార కుటుంబంలో కవిత వాసుపల్లి జన్మించారు. అక్కడ నుంచి మొదలైన కవిత ప్రయాణం డాక్టరుగా, ఆర్మీ మేజరుగా, పర్వతారోహకురాలిగా, రాఫ్టింగ్ సాహసికురాలిగా సాగింది.
ఈ ప్రయాణాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Major Kavitha V
మెట్టూరు నుంచి ఆర్మీకి
''మాది శ్రీకాకుళం జిల్లాలోని మెట్టూరు గ్రామం. మా నాన్న వాసుపల్లి రామారావు రైల్వే క్లర్క్, అమ్మ రమ్య, గృహిణి.
మత్య్సకార కుటుంబం కావడంతో చిన్నతనం నుంచి సముద్రంతోనే ఎక్కువ స్నేహం ఉండేది. ఇప్పటికీ నీళ్లు నది, సముద్రం ఏ రూపంలో ఉన్నా నాకు భలే ఇష్టం.
విశాఖలో పాఠశాల విద్య, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చేశాను.
మాది ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబం కాదు. దీంతో పీజీ చేసేందుకు ఆర్థిక కారణాలు అడ్డంకిగా మారాయి, ఇక ఉద్యోగం చేయడం తప్పదనుకున్నాను.

ఫొటో సోర్స్, Major Kavitha V
ఉద్యోగం కోసం ఆలోచిస్తున్న సమయంలో ఆర్మీలో చేరితే ఎలా ఉంటుందని అనిపించింది. మెడిసిన్ చదివి, ఇప్పుడు ఆర్మీనా? అంటూ మా నాన్న ఆసక్తి చూపించలేదు. నేను కూడా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోయాను.
ఆ సమయంలోనే అంటే 2021లో మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారి వీడియో సోషల్ మీడియాలో చూశాను. అది చూడగానే నేను వైద్య వృత్తిని వదలకుండానే, ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయవచ్చని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాను. 2021లో ఆర్మీలో చేరాను.
అయితే నాకు అప్పటికే సాహస క్రీడలంటే ఇష్టం. మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచే పర్వతారోహణ చేస్తున్నాను.

ఫొటో సోర్స్, Major Kavitha V
ఆర్మీలో కూడా పర్వతారోహణ (మౌంటెనీరింగ్)కి ప్రత్యేకంగా కోర్సులుంటాయని తెలిసి, వాటిని కూడా పూర్తి చేశాను. దీనివల్ల నాకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ (NIMAS) లో మెడికల్ ఆఫీసర్‌గా పోస్టింగ్ వచ్చింది.
ఆ ఉద్యోగంలో భాగంగా ఏడాదికి ఐదుసార్లు 15 కేజీల బరువుతో 1,800 అడుగులు ఎత్తు వరకూ ఉండే పర్వతాలు ఎక్కించేవారు. ఈ పని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం చూసి, మా ఉన్నతాధికారులు రాఫ్టింగ్ కోర్స్ చేయమని ప్రొత్సహించారు.

ఫొటో సోర్స్, Major Kavitha V
రాఫ్టింగ్ ఎందుకు చేశామంటే?
అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు ప్రొత్సాహం అందించేందుకు, రాఫ్టింగ్‌కు ఊతమిచ్చేందుకుకు భారత సైన్యం బ్రహ్మపుత్ర నదిపై రాఫ్టింగ్ చేపట్టింది.
అందులో భాగంగా మేం ప్రమాదకర ప్రవాహాలకు పేరు పొందిన బ్రహ్మపుత్రపై 1,040 కిలోమీటర్లు రాఫ్టింగ్ చేశాం.
రాఫ్టింగ్ అంటే పెద్ద పెద్ద నదుల్లో నీటి ప్రవాహాం వేగంగా వస్తుంటే గాలి నింపిన రబ్బరు పడవలపై (రాఫ్ట్స్) వెళ్లే సాహస క్రీడ. రాఫ్టింగ్ సాధారణంగా వేగంగా ప్రవహించే నదిలో చేస్తారు.
ఆ ప్రయాణంలో నీరు చాలా వేగంగా,పైకి భారీ అలల్లా నీళ్లు పైకి వస్తుంటాయి. వీటిని "ర్యాపిడ్స్" అంటారు. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఆ సమయంలో బోటు ఊగిపోతూ, నీరు పైకి ఎగజిమ్మినట్లుగా ఉంటుంది. ఇదే రాఫ్టింగ్ అడ్వెంచర్‌లో థ్రిల్ ఇచ్చే అంశం కూడా.
రాఫ్టింగులో ఎదురయ్యే అవరోధాలు కూడా ఎక్కువే. నదిలో రాళ్లు, వేగంగా వచ్చే అలలు, ఆకస్మిక వాతావరణ మార్పులు, తక్కువ లోతులో బోటుకు తగిలే రాళ్లు రాఫ్టింగ్‌కు చాలా ఇబ్బందిని కలిగిస్తుంటాయి.
ఇక ప్రపంచంలోనే పొడవైన నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్రలో రాఫ్టింగ్ అంటే చెప్పేదేముంది. అలాంటి బ్రహ్మపుత్ర నదిలో 28 రోజుల పాటు 12 మందితో కూడిన మా బృందం సాహసం చేసింది.

ఫొటో సోర్స్, Major Kavitha V
'ఇవే ఆఖరి రోజులు కావొచ్చు'
ఇండో-టిబెటిన్ బోర్డర్‌లోని గెల్లింగ్ గ్రామం నుంచి బ్రహ్మపుత్ర నదిపై 2025 జనవరి 14న రాఫ్టింగ్ యాత్ర ప్రారంభించాం. ఆ నదిలో రాఫ్టింగ్ అనుభవమున్న ఇద్దరు స్థానికులను మా బృందంలో చేర్చుకున్నాం.
అయితే మేం రాఫ్టింగ్ కోసం ఎంచుకున్న స్ట్రెచ్ (ఇండో-టిబెటిన్ బోర్డర్‌లోని గెల్లింగ్ గ్రామం నుంచి ఇండో-బంగ్లాదేశ్ బోర్డర్‌లోని హాట్సింగ్ మారి) గురించి విన్న తర్వాత వాళ్లు మాట్లాడుతూ "మేడమ్ మీరు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టండి. ఓం బ్రహ్మపుత్రాయ అని స్టార్ట్ చేయండి. ఇక మన చేతుల్లో ఏం లేదు. మనం బతికొస్తే, అది మన ప్రార్థనల వల్లే అవుతుంది. ఎందుకంటే మీరు ఎంచుకున్న స్ట్రెచ్ అలా ఉంది. గతంలో చేసిన వాళ్లు ఎలా చేశారో అలా చేస్తే మంచిది. కానీ, ఇది పూర్తిగా కొత్తది, పైగా ప్రమాదకరమైనది" అన్నారు.
రాఫ్టింగ్ సర్వీస్ ప్రారంభించినప్పటి నుంచి అక్కడ ఉన్నవాళ్లే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, Major Kavitha V
వాళ్లు చెప్పినట్లుగానే స్టార్టింగ్ పాయింట్ చాలా ప్రమాదకరంగా ఉంది, అక్కడ స్లిప్ అయితే 200 మీటర్లు లోతున్న నీటిలో చిక్కుకుంటాం.
ముందు ఒక ర్యాపిడ్‌ని క్రాస్ చేయగలిగాం కానీ, రెండో ర్యాపిడ్‌కు దొరికిపోయాం. ఇక అంతా చనిపోయినట్లే అనుకున్నాం.
నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ర్యాపిడ్స్ ఎత్తుగా వచ్చి మా పడవను ఢీ కొట్టాయి. దాంతో మేమంతా బాగా రాళ్లున్న చోట పడ్డాం. ఆ రాళ్ల కారణంగా మాకు బాగా దెబ్బలు తగిలాయి.

ఫొటో సోర్స్, Major Kavitha V
'11 అడుగుల ఎత్తులో అలలు'
నీటి లోపల నుంచి పైకి రాలేకపోతున్నాం, ఎందుకా అని అనుమానం వచ్చి, నీటిలోనే కళ్లు తెరిచి లైవ్ జాకెట్ ఉందా అని చూసుకున్నా, ఉంది.
మరి పైకి ఎందుకు వెళ్లడం లేదని చూస్తే, నేను 6 అడుగుల లోతు నీటి లోపల ఉన్నాను. అప్పుడు నాలో నేనే మాట్లాడుకోవడం మొదలు పెట్టాను.
"కవితా నోరు తెరవకు, తెరిస్తే నీరు లోపలికి వెళ్లి చనిపోతావు. బతికే ఛాన్స్ ఒక పర్సెంట్ కంటే తక్కువే" ఇలా అనుకుంటూ ఉండగా, అదృష్టవశాత్తు మా గైడ్ నా దగ్గరికి వచ్చారు. నన్ను పైకి తీశారు. అలా బతికిపోయాను.

ఫొటో సోర్స్, Major Kavitha V
ఇలాంటి ర్యాపిడ్లు ప్రతి రోజు కనీసం మూడు, తొలి రోజైతే ఏకంగా 12 ఎదుర్కొన్నాం. 11 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడేవి. క్షణక్షణం వాతావరణం మారిపోతుండేది. ఇలాగే రాఫ్టింగులో ప్రతి రోజు ఇదే ఆఖరి రోజు అనిపించేంత పరిస్థితులు ఎదురయ్యేవి.
మొత్తం 28 రోజుల్లో 1,040 కిలోమీటర్ల ప్రయాణంలో మా రాఫ్ట్ నాలుగుసార్లు బోల్తా కొట్టింది. అయినప్పటికీ, ధైర్యంగా ముందుకే సాగాం. ఒకరోజైతే ఏకంగా 70 కిలోమీటర్లు, ఏకధాటిగా 12 గంటలపాటు రాఫ్టింగ్ చేశాం.
అలా ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొని బ్రహ్మపుత్ర నదిపై రాఫ్టింగ్‌ను ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేశాం. దీంతో, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మా సాహసయాత్రతో పాటు బ్రహ్మపుత్ర నదిలోని ఆ స్ట్రెచ్‌లో పాల్గొన్న తొలి మహిళ రాఫ్టర్‌గా నాకు చోటు కల్పించారు.

ఫొటో సోర్స్, Major Kavitha V
'అమ్మాయిలు ఏదైనా చేయగలరనే'
నేను ఆర్మీ యూనిఫాం వేసుకున్న ప్రతి క్షణం గర్వంగానే ఫీలవుతుంటాను.
ఎందుకంటే ఈ యూనిఫాం వేసుకుని, దేశానికి సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికే లభిస్తుంది. పైగా ఆర్మీ ద్వారానే అడ్వెంచర్ స్పోర్ట్స్‌లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.
మనదేశంలో అడ్వెంచర్ టూరిజానికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. బ్రహ్మపుత్ర రాఫ్టింగ్ లేదా కయాకింగ్ వాటర్ స్పోర్ట్స్‌కి అత్యుత్తమమైన ప్రదేశం. దీనిని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దితే స్థానికంగా ఉపాధి లభిస్తుందని, అలాగే రాఫ్టింగ్‌కు ఆదరణ పెరుగుతుందని ఆర్మీ ఈ సాహసం చేసింది.
వ్యక్తిగతంగా బ్రహ్మపుత్ర రాఫ్టింగ్ చేసిన తొలి మహిళగా నిలవడం ఆనందంగా ఉంది.

ఫొటో సోర్స్, Major Kavitha V
ప్రస్తుతం 8 వేల మీటర్ల మౌంటనీరింగ్ చేయాలని ఉంది.
మౌంట్ మాకాలు, మౌంట్ కాంచన్ జంగా, ఎవరెస్ట్ ఎక్కాలని ఉంది. అమ్మాయిలు మరింత మంది అడ్వెంచర్ స్పోర్ట్స్ లోకి రావాలనేది నా కోరిక.
మనకు నచ్చింది ఇష్టంగా ప్రయత్నించినప్పుడు గెలిచినా, ఓడినా గెల్చినట్లే'' అని మేజర్ కవిత వాసుపల్లి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఏడాది బ్రహ్మపుత్ర నదిపై విజయవంతంగా రాఫ్టింగ్ చేయడమే కాకుండా, గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని'మౌంట్ గౌరిచెన్' పర్వతం అధిరోహించే యాత్రలో 5,900 మీటర్ల ఎత్తున అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరో మౌంటనీర్‌ను కాపాడినందుకు గుర్తింపుగా కవితకు 'సీఓఏఎస్ కమెండేషన్ అవార్డు' లభించింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమె సాహసాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














