కూలీ మూవీ రివ్యూ: స్టార్ పవర్ బాక్సాఫీసును బద్ధలు కొడుతుందా?

ఫొటో సోర్స్, X/Lokesh Kanagaraj
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
థియేటర్స్‌లో మాస్ జాతర సృష్టించిన కథానాయకుల్లో రజినీకాంత్ అగ్రగణ్యుడు.
ఆయన స్టైల్, స్వాగ్, మేనరిజం ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగుస్తూనే ఉన్నాయి.
రజినీ సినిమా అంటే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా థియేటర్‌లోకి వస్తుందా అని వేచి చూస్తుంటారు.
ఇప్పుడు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన 'కూలీ' సినిమాతో వచ్చేశారు రజినీకాంత్.

రజినీ సోలోగా వస్తేనే ఓ పండగ. అలాంటిది ‘కూలీ’ కోసం నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్… ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఓ స్టార్ తోడయ్యారు.
అన్నింటికీ మించి పాన్ ఇండియాలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు కావడం క్రేజ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
మరి ఇంతలా అంచనాలు రేపిన కూలీ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచింది? ఇంతమంది స్టార్స్ కలిసి వెండితెరపై ఎలాంటి చిత్రాన్ని ఆవిష్కరించారు?

ఫొటో సోర్స్, X/Lokesh Kanagaraj
కూలీ అద్భుతమా ? భ్రమా ?
రాజశేఖర్ (సత్యరాజ్) అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతాడు. స్నేహితుడిని చివరిచూపు చూడడానికి వచ్చిన దేవా (రజినీకాంత్)ని అడ్డుకుంటుంది రాజశేఖర్ కూతురు ప్రీతి (శృతి హాసన్).
ఇంతలో దేవాకు రాజశేఖర్ మరణం గురించి ఓ నిజం తెలుస్తుంది.
ఏమిటా నిజం? ప్రీతి, దేవాను ఎందుకు అడ్డుకుంది? రాజశేఖర్ మరణానికి కారణాలు ఏమిటి? అసలు దేవా గతం ఏమిటి? అనేది తక్కిన కథ.
చాలా సింపుల్ కథ ఇది. తన స్నేహితుడు చావుకు రివెంజ్ తీర్చుకునే హీరో.
కమర్షియల్‌గా అరిగిపోయిన పాయింట్ ఇది. ఈ పాయింట్‌కి ఒక ఆర్గాన్ మాఫియా, క్రిమేషన్ చెయిర్, స్మగ్లింగ్... ఇలా రకరకాల లేయర్లు పెట్టి ఏదో అద్భుతం చూపించబోతున్నారనే భావన కలిగించారు.
అయితే, ఇదంతా ఓ భ్రమే అనే సంగతి సినిమా మొదలైన కాసేపటికి ప్రేక్షకుడికి మెల్లమెల్లగా తెలుస్తుంటుంది.
పోర్ట్‌లో దయాళ్ (సౌబిన్ షాహిర్) పాత్ర పరిచయంతో ఈ కథ మొదలవుతుంది.
నిజానికి ఈ సినిమా బలమైన పాత్ర తనదే. మొదట్నుంచి చివరికీ ఆ పాత్ర చుట్టూనే సన్నివేశాలు నడుస్తుంటాయి.
దేవాగా రజినీ పాత్రని పరిచయం చేసిన తీరు చప్పగా ఉంది.
రజినీ అభిమానులు కోరుకునే ఎంట్రీ కాదిది. ప్రధాన పాత్రలన్నీ పరిచయం అయ్యాక ఇంకా కథ వేగం పుంజుకుంటుందని భావిస్తే పొరపాటే.
రీళ్ళకు రీళ్ళు నడిచిపోతుంటాయి. కానీ, కూలీ కథలో పెద్దగా చలనం ఉండదు.

ఫొటో సోర్స్, X/Lokesh Kanagaraj
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది, కానీ...
చప్పగా సాగుతున్న కూలీ కథకు ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి జోష్ తీసుకొస్తుంది.
సైమన్, దయాళ్, దేవాతో పాటు మరికొన్ని పాత్రల్లో కీలక మలుపు చోటు చేసుకోవడం మంచి థ్రిల్ ఇస్తుంది.
ఇంటర్వెల్ తర్వాత కూలీకి ఇంక తిరుగుండదని భావిస్తున్న ప్రేక్షకుడికి మళ్లీ నిరాశ ఎదురవుతుంది.
దేవా, దయాళ్ పాత్రల మధ్య నడిచే బ్లాక్ మెయిల్ కిడ్నాప్ డ్రామా వర్కౌట్ కాలేదు.
పవర్ హౌస్ అంటూ దేవా పాత్రకి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అందులో రజినీ డీఏజింగ్ లుక్ బావుంది.
కానీ, ఆ ట్రాక్ మొత్తం వాయిస్ ఓవర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో విజువల్ ఫీల్ రాలేదు. క్లైమాక్స్ కూడా రొటీన్.
స్టార్ పవర్ కాపాడిందా?
దేవాగా రజినీ పాత్రను చాలా సెటిల్డ్‌గా రాసుకున్నాడు లోకేష్.
జైలర్‌లో కూడా ఆయన పాత్ర సెటిల్డ్‌గానే ఉంటుంది. కానీ, మ్యాజికల్ మూమెంట్స్ రాబట్టుకోవడంలో కూలీ లెక్కతప్పింది.
దేవా 'పవర్ హౌస్' బ్యాక్ స్టోరీ తేలిపోయింది. ‘కూలీ’ టైటిల్‌కి ఆ ఎపిసోడ్‌తో జస్టిఫికేషన్ ఇవ్వాలని చూశారు. కానీ, అది రిజిస్టర్ కాలేదు.
రజినీ ఎప్పటిలాగే యాక్షన్ సీన్స్‌లో తన స్వాగ్ చూపించారు.
సైమన్ పాత్రలో నాగార్జున పవర్‌ఫుల్, స్టైలీష్ విలన్‌గా కనిపించారు.
కానీ, ఆ పాత్రను ముగించిన తీరు తేలిపోయింది.
నిజానికి కూలీలో విలన్ క్రెడిట్ దయాళ్ పాత్రకు దక్కుతుంది. దయాళ్‌గా సౌబిన్ షాహిర్ మాత్రం గుర్తుండిపోతారు.
ఆ క్యారెక్టర్ రాయడంలో ఉన్న శ్రద్ధ మరో క్యారెక్టర్‌లో కనిపించలేదు. ఉపేంద్రది ఓ కామియో రోల్‌గానే చూడాలి. సత్యరాజ్ ఎప్పటిలాగే సహజంగా చేశారు.
ఆమిర్ ఖాన్ సౌత్‌లో చేసిన తొలి సినిమా
ఆమిర్ ఖాన్ సౌత్‌లో చేసిన తొలి సినిమా ఇది. ఆయన లాంటి నటుడు ఒప్పుకున్నారంటే ఆ పాత్ర కచ్చితంగా రోలెక్స్‌లా ఓ మార్క్‌ని క్రియేట్ చేస్తుందని అనుకున్నారు.
కానీ, ఆమిర్ పాత్రను చాలా సింపుల్‌గా తేల్చేశారు. ఆయన టాటూలు, కాస్ట్యూమ్స్ డిజైన్‌పై పెట్టిన శ్రద్ధ క్యారెక్టర్ రాయడంపై పెట్టలేదు.
స్టార్ పవర్‌తో కూలీ పోస్టర్ కలర్‌ఫుల్‌గా కనిపించింది. ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కి చేరడానికి అదొక కారణం.
అయితే ఇంత స్టార్ పవర్ ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న కథాకథనాలను కాపాడలేకపోయాయి.

ఫొటో సోర్స్, X/Lokesh Kanagaraj
బలమైన స్త్రీ పాత్రలు ఉన్నాయా?
లోకేష్ సినిమాల్లో స్త్రీ పాత్రలకు చోటు తక్కువ అనే అభిప్రాయం ఉంది. అయితే కూలీలో మాత్రం కీలకమైన స్త్రీ పాత్రలు కనిపిస్తాయి.
ప్రీతి (శ్రుతి హాసన్) పాత్ర ఈ కథలో ఎమోషన్. తల్లిదండ్రులను కోల్పోయి, ఇద్దరు చెల్లెళ్ల బాధ్యతని మోసే పాత్రది.
అయితే, లోకేష్ క్రియేట్ చేసుకున్న ఆ డార్క్ వరల్డ్‌కి, ఆ ఎమోషన్‌కి సంధి కుదరలేదు.
విక్రమ్‌లో టీనా పాత్రను పోలి ఉండే ఓ క్యారెక్టర్ ఉంది. అది తెరపై కొంత సర్‌ప్రైజ్ చేయగలిగింది.

ఫొటో సోర్స్, X/Anirudh Ravichander
లోకేష్ మార్క్ ఎక్కడ?
లోకేష్ కథలన్నీ ఒక చిన్న పాయింట్ చుట్టూ తిరుగుతాయి. ఆయన క్రియేట్ చేసుకున్న సినిమాటిక్ వరల్డ్‌కి భిన్నమైన సినిమా ఇది.
ప్రేక్షకులు ఆయన నుంచి కోరుకునే మార్క్ ఇందులో మిస్ అయ్యింది.
ఒక పాయింట్ పట్టుకుని దాని చుట్టూ చాలా లేయర్లు అల్లేశారు. దీంతో కోర్ ఎమోషన్ మిస్ అయ్యింది.
లోకేష్ సినిమాలన్నీ ఒక థ్రిల్లింగ్ హైతో ముగుస్తాయి. ఈ సినిమాకి ఎండ్ కార్డ్ వేసిన తీరు నిరాశగా ఉంటుంది.
దాదాపు తన సినిమాల్లోని పాత స్టైల్స్‌నే ఫాలో అయ్యాడు. కానీ, కొత్తగా ప్రజెంట్ చేసిన సీక్వెన్స్‌లు పెద్దగా కనిపించవు.
అనిరుధ్ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?
మామూలు సీన్స్ కూడా తన బీజీఎంతో ఎలివేట్ చేస్తాడని అనిరుధ్‌కి పేరుంది. లోకేష్ సినిమాకి మరింత శ్రద్ధతో చేస్తాడు.
కానీ కూలీలో అనిరుధ్‌కి అవకాశం ఇవ్వలేదు. అనిరుధ్ బీజీఎంతో ఎలివేట్ చేయడానికి సరిపడా సీన్స్ పడలేదు.
రిలీజ్ ముందు వైరల్ అయిన మోనికా పాట రాంగ్ ప్లేస్‌మెంట్‌తో ఇబ్బంది పడింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. గుర్తుపెట్టుకునే డైలాగులు లేవు.

ఫొటో సోర్స్, X/sunpictures
బాక్సాఫీసు బాధ్యత ఎవరిది ?
మాంచి ఆకలితో ఉన్నప్పుడు బిర్యాని తిందామని ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తుంటే... బ్రెడ్ జామ్ చేతిలో పెడితే ఎలా ఉంటుంది? కూలీ సినిమా కూడా అంతే.
ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ది ఘనమైన ట్రాక్ రికార్డ్.
రజినీ లాంటి పవర్ హౌస్‌తో జతకట్టి, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి మేటి నటులు తోడు తెచ్చుకున్నారు.
ఆ పోస్టర్‌తోనే సూపర్ హిట్ అనే ఫీలింగ్ కలిగించారు. తీరా చూస్తే... ఓ సాదాసీదా కథ, కథనాలు చూపించి ప్రేక్షకుడు నిట్టూర్చేలా చేశారు.
కథ, కథనాలు వీక్‌గా ఉన్నప్పుడు స్టార్ ఎట్రాక్షన్ నింపేయడం ఓ స్ట్రాటజీ.
బహుశా లోకేష్ కనగరాజ్ ఇదే ఫాలో అయ్యాడు. ఆ స్టార్ పవర్ ఎంతలా పని చేస్తుందనే ఫాక్టర్‌పైనే కూలీ బాక్సాఫీస్ సక్సెస్ ఆధారపడి ఉంది.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














