అమ్మ ఐపీఎస్, కొడుకు క్రిమినల్.. వీరిద్దరి ఎమోషనల్ డ్రామా వర్కవుట్ అయిందా?

ఫొటో సోర్స్, Ashoka Creations/FB
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
విజయశాంతి తల్లిగా, కళ్యాణ్‌రామ్ కొడుకుగా నటించిన ఎమోషనల్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.
కర్తవ్యం హీరోయిన్ వైజయంతికి ఒక కుమారుడు ఉంటే ఎలా ఉంటుందనే ఊహ ఈ సినిమా.
ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బలమైనవి. కరెక్ట్‌గా తెరమీద చూపిస్తే సక్సెస్.
అందులోనూ తల్లీకొడుకుల అనుబంధం హిట్ ఫార్ములా. కటకటాల రుద్రయ్య, దళపతి, ఛత్రపతి, కేజీఎఫ్.. ఇలా చాలా చెప్పొచ్చు.
వాళ్లిద్దరి మధ్య గట్టి సంఘర్షణ జరిగితే, తల్లి పోలీస్ అధికారి, కొడుకు క్రిమినల్ అయితే కావాల్సినంత డ్రామా.

ఈ సినిమా కథ ఏమంటే..
వైజయంతి పవర్‌ఫుల్ పోలీస్ అధికారి. తన కొడుకు అర్జున్‌ని ఐపీఎస్‌గా చూడాలనుకుంటుంది.
పోలీస్ అధికారి కావాల్సిన అర్జున్ కొన్ని కారణాల వల్ల క్రిమినల్‌గా మారతాడు. తల్లే అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తుంది.
వైజయంతి గతంలో కరుడుగట్టిన క్రిమినల్ పఠాన్‌ని అరెస్ట్ చేస్తుంది.
ఉరిశిక్ష పడిన అతను పగ తీర్చుకోడానికి ఎదురుచూస్తూ ఉంటాడు. అతని నుంచి తల్లిని అర్జున్ కాపాడగలిగాడా, లేదా అనేది మిగతా కథ.
తల్లి కోసం అతను ఏం చేశాడు?

ఫొటో సోర్స్, Ashoka Creations/FB
రొటీన్ ఫ్లాష్‌బ్యాక్
ప్రారంభం బాగానే ఉంటుంది. కానీ, అర్జున్ వైజాగ్ డాన్ ఎందుకయ్యాడు, అతని ఫ్లాష్‌బ్యాక్ పరమ రొటీన్. సుదీర్ఘమైన గ్యాంగ్ వార్ ఆల్రెడీ అనేక సినిమాల్లో చూసేశాం.
విజయశాంతి లాంటి నటి ఉన్నపుడు తల్లీకొడుకుల ఎమోషన్స్ బలంగా చూపించి ఉంటే వర్కౌట్ అయ్యేది.
చివర్లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంది. బహుశా అది సినిమాని కాపాడుతుందని అనుకుని ఉంటారు.
కానీ, ఎమోషన్స్‌తో కట్టి పడేసే సన్నివేశాలు కొన్నైనా ఉంటే ఆ ట్విస్ట్‌కి న్యాయం జరిగేది. ప్రేక్షకుడు ఆశ్చర్యపోయేలోగా సినిమాకి జరగాల్సిన హాని జరిగిపోయింది.
కథలెప్పుడూ పాతవే. ఆ పాత ధోరణిలో తీస్తానంటే ఇప్పుడు కుదరదు. ప్రేక్షకులు మారిపోయారు. ఈ సినిమా ప్రధానంగా తల్లీకొడుకుల సెంటిమెంట్ సినిమా. కానీ, యాక్షన్ ఓవర్‌డోస్ అయ్యింది. అయినా చూద్దామంటే ట్రీట్‌మెంట్ పాతది, డైలాగ్‌లు పాతవి.
1980 నాటి సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తే ప్రేక్షకుడిది తప్పు కాదు.

ఫొటో సోర్స్, Ashoka Creations/YT
ఒక్క క్యారెక్టర్‌లో కూడా డెప్త్ లేకుండా దర్శకుడు రాసుకున్నాడు. హీరోయిన్ ఉన్నా ఎందుకుందో తెలియదు. పైగా పాట ఒకటి.
హీరోకి కుడి భుజంగా ఉన్న పృథ్వీ , శ్రీకాంత్ వేసిన పోలీస్ అధికారి పాత్రల్ని ఎన్ని సినిమాల్లో చూసి ఉంటాం? ఇక హీరో ఒక డాన్‌గా ఎలివేట్ కావాలంటే , అవతల విలన్లు అంతే బలంగా ఉండాలి. దీంట్లో దాదాపు ఐదుగురు విలన్లు ఉన్నట్టు లెక్క.
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పాత ట్రీట్‌మెంట్‌తో మంచి కథని బలహీనం చేశాడు. కళ్యాణ్‌రామ్ , విజయశాంతి ఎంత ఎనర్జిటిక్‌గా చేసినా సంఘర్షణలో బలం లేక ప్రేక్షకుడికి నీరసం వస్తుంది.
ఫస్టాఫ్ ఒకే గానీ, సెకెండాఫ్ మరీ రొటీన్. కాంతారా తర్వాత మ్యూజిక్ కోసం అజనీష్ లోక్‌నాథ్ వద్దకు తెలుగు నిర్మాతలు క్యూ కడుతున్నారు కానీ, మ్యాజిక్ రిపీట్ కావడం లేదు.

ఫొటో సోర్స్, Ashoka Creations/FB
సీనియర్ కెమెరామన్ రామ్‌ప్రసాద్ ఫొటోగ్రఫీ బాగుంది. ఆశ్చర్యం ఏమంటే, ట్రైలర్‌లో ఉన్నదే సినిమా కూడా.
కథని మొత్తం ఊహించేయొచ్చు, క్లైమాక్స్ ట్విస్ట్ కాపాడుతుందని కళ్యాణ్‌రామ్ నమ్మినట్టున్నాడు. కానీ కష్టమే.
ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ లాంటి బ్లాక్‌బస్టర్లు గమనిస్తే విజయశాంతికి బలమైన క్యారెక్టర్ ఉంటుంది.
ఆ సక్సెస్ పాయింట్‌ని జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే సినిమా నెక్ట్స్ లెవెల్. కానీ, హీరో యాక్షన్ తల్లి ప్రేమని తినేసింది.

ఫొటో సోర్స్, Ashoka Creations/YT
ప్లస్ పాయింట్స్
1.కళ్యాణ్‌రామ్, విజయశాంతి నటన
2.క్లైమాక్స్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్
1.రొటీన్ కథనం
2.వీక్ డైలాగ్స్
3.బలమైన విలన్ లేకపోవడం
4.మ్యూజిక్
5.ఎమోషన్ వర్కౌట్ కాకపోవడం
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














