‘ఆకలిగా ఉందని ఇంట్లోకి వచ్చాడు.. చంపేసి శవంపై డ్యాన్స్ చేశాడు’ ఇంతకీ ఈ హత్య విషయం బయటకు ఎలా వచ్చిందంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు
వృద్ధురాలి శవంపై ఓ బాలుడు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయ్యింది.
ఈ హత్య హైదరాబాద్‌లో జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంతకీ ఈ కేసులో ఏం జరిగిందనేది ఒకసారి పరిశీలిస్తే..
ఈ నెల 14న కుషాయిగూడ పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
వృద్ధురాలిని చంపి శవంపై ఒక వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో తీశారంటూ లలిత్ చౌదరి అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ సమాచారం ఆధారంగా కుషాయిగూడ పరిధిలోని హెచ్‌బీ కాలనీకి వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోతున్న స్థితిలో కనిపించింది.
కమలాదేవి అనే మహిళ ఏప్రిల్ 11 రాత్రి హత్యకు గురైనట్లు గుర్తించారు కుషాయిగూడ పోలీసులు.
తమకు సమాచారం అందడానికి రెండు రోజుల ముందే హత్య జరిగి ఉండవచ్చని కేసు వివరాలను బీబీసీకి వివరించారు కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి.

ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం..
రాజస్థాన్‌కు చెందిన రాజ్ చౌదరి, కమలాదేవి (75) దంపతులు చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ కృష్ణానగర్ రోడ్డు నెం.5లో ఉంటున్నారు.
పదేళ్ల క్రితం రాజ్‌చౌదరి చనిపోవడంతో కమలాదేవి ఒంటరిగా ఉంటున్నారు.
మొదటి అంతస్తులో ఆమె ఉంటుండగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని షాపులో ప్రకాష్ చౌదరి అనే వ్యక్తి హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయనది కూడా రాజస్థానే.
అదే షాపులో దాదాపు ఎనిమిది నెలలుగా ఓ యువకుడు (17) పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ యువకుడు మొదట్లో షాపూర్ నగర్లో పనిచేసి అక్కడ మానేసి హెచ్‌బీ కాలనీకి వచ్చి హార్డ్‌వేర్ షాపులో చేరాడు.
''ఈ నెల 11 రాత్రి 10-11 గంటల సమయంలో ఆ యువకుడు కమలాదేవి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలోనే హత్యకు పాల్పడ్డాడని మా విచారణలో తేలింది'' అని చెప్పారు భాస్కర్ రెడ్డి.
అదే రోజు రాత్రి 12.30 గంటల సమయంలో ఆ యువకుడు వృద్ధురాలి ఇంట్లోంచి రావడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Khushaiguda Police
రొట్టెలు చేస్తుండగా.. రాడ్డుతో కొట్టి..
కమలాదేవి ఇంటికి వెళ్లిన యువకుడు , తనకు ఉద్యోగం పోయిందని, ఆ రాత్రికి ఇంట్లో ఉండి వెళ్లిపోతానని ఆమెను నమ్మించాడని పోలీసులు చెబుతున్నారు.
''అతను ఇంట్లోకి వచ్చాక ఆకలిగా ఉందని చెప్పడంతో రొట్టె చేసేందుకు కమలాదేవి పిండి సిద్ధం చేస్తుండగా వెనుక నుంచి రాడ్డుతో మోదాడు. తర్వాత చీరను గొంతుకు బిగించి చంపేశాడు'' అని హత్య జరిగిన తీరును ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి వివరించారు.
ఆ తర్వాత మృతదేహంపై నిలబడి, గొంతును కాలితో తొక్కుతూ డ్యాన్స్ చేస్తూ ఫోన్లో వీడియో రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఫొటో సోర్స్, Getty Images
హత్య గురించి ఎలా తెలిసిందంటే..
నిందితుడు హత్యకు పాల్పడిన మరుసటి రోజు నుంచి యథావిధిగా పనిలోకి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు.
‘‘13వ తేదీన బెంగళూరులో ఉండే మిత్రుడు సురేందర్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. అతను నమ్మకపోవడంతో శవంపై డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశాడు.
ఆ తర్వాత రాజస్థాన్‌లో ఉండే మరొకరికి ఈ వీడియోను పంపించాడు సురేందర్.
హార్డ్‌వేర్ షాపు యజమాని ప్రకాష్ చౌదరితో సురేందర్‌కు పరిచయం ఉంది. దీంతో సురేందర్ ఆయనకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు.
ఆ సమయంలో రాజస్థాన్‌లో ఉన్న ప్రకాష్ చౌదరి హైదరాబాద్లో ఉండే తన సోదరుడు లలిత్ చౌదరికి ఫోన్ చేసి హత్య సమాచారం ఇచ్చారు’’ అని పోలీసులు చెప్పార.
లలిత్ చౌదరి పోలీసులకు తెలియచేయడంతో వారు యువకుడిని అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందే హత్యకు ప్రయత్నం
ఏప్రిల్ 9న కమలాదేవిని హత్య చేసేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని భాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
''9వ తేదీ రాత్రి కూడా వృద్ధురాలిని చంపేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆరోజు ఆమె ఇంటి తలుపు తీయలేదు'' అని వివరించారు.
''వృద్ధురాలు ప్రతి విషయానికి కోపగించుకోవడం, సూటిపోటి మాటలు అంటుండంతో కోపం పెరిగింది. చిన్న పేపర్ ముక్క పడినా ఆమె తిట్టేవారు, అందుకే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నా'' అని నిందితుడు పోలీసు విచారణలో చెప్పినట్లు భాస్కర్ రెడ్డి బీబీసీకి తెలిపారు.
అతనిలో కోపాన్ని అణచుకోలేని తత్వం, విపరీత ఆలోచనలు ఉన్నాయని వివరించారు.
ఆస్తి కోసం చంపి ఉండొచ్చని కమలాదేవి బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు కుషాయిగూడ పోలీసులు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










