అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. లక్ష దాటిన తులం బంగారం

అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, బంగారం ధర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆనాబెల్ లియాంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా చైనా మధ్య సుంకాల పోరాటంతో పెట్టుబడిదారులంతా బంగారం వైపు మొగ్గు చూపడంతో పసిడి ధర తాజాగా మరో రికార్డు స్థాయికి చేరింది.

కమోడిటీ మార్కెట్లో బంగారం ధర బుధవారం ఔన్సు 3,357.40 డాలర్లకు(సుమారు రూ. 2,86,813) చేరింది. ఔన్స్ అంటే 28.3495 గ్రాములు. ఈ లెక్కన గ్రాము ధర రూ. 10,117 పలికింది.

అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరినట్లయింది.

గురువారం కూడా బంగారం ధరలు పెరిగాయి.

ఈ ఏడాది ఆరంభంలో ఉన్న ధరతో పోలిస్తే గోల్డ్ రేటు మూడో వంతు పెరిగింది.

అధ్యక్షుడు ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచడం వల్ల వృద్ధి రేటు మందగిస్తుందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ హెడ్ జెరోమ్ పోవెల్ చేసిన వ్యాఖ్యలతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ఆర్థిక అనిశ్చితి ఏర్పడినప్పుడు పెట్టుబడిదారులకు, బంగారం సురక్షితమైనదిగా కనిపిస్తోంది.

ఇటీవల కొన్ని రోజులుగా అమెరికా- చైనా మధ్య సుంకాల పెంపు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని దీని వల్ల అమెరికాలో ఆర్థిక వృద్ధి నిదానిస్తుందని, వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని బుధవారం ఎకనమిక్ క్లబ్ ఆఫ్ షికాగోలో మాట్లాడిన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పోవెల్ అన్నారు.

ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు అమల్లోకి రావడం, అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ సమయంలోనే పోవెల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"వాణిజ్యం గందరగోళంలో పడినప్పుడు బంగారం సురక్షితమైనదిగా భావిస్తున్నారు" అని ఎస్‌పీఐ అసెట్ మేనేజ్‌మెంట్‌లో మార్కెట్ వ్యూహకర్తగా ఉన్న స్టీఫెన్ ఇనెస్ చెప్పారు.

"వాణిజ్య విధానం వల్ల డాలర్ దిగజారుతోంది. రాజకీయపరమైన విధానాలపై పోర్ట్‌ఫోలియో మేనేజర్లు విశ్వాసం కోల్పోయారు" అని ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, బంగారం ధర

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఏడాది బంగారం రేట్ల పెరగడాన్ని నిపుణులు నాలుగు దశాబ్ధాల కిందటి ఇరాన్ విప్లవంతో పోలుస్తున్నారు.

అప్పట్లో, 1979 నవంబర్ నుంచి 1980 జనవరి మధ్య బంగారం ధరలు దాదాపు 120 శాతం పెరిగాయి.

ప్రపంచ వాణిజ్యంలో ఏర్పడిన అస్థిర పరిస్థితుల వల్ల ఈ ఏడాది మార్చ్‌లో ఔన్స్ బంగారం ధర తొలిసారిగా 3 వేల డాలర్లు దాటింది.

"ద్రవ్యోల్బణం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బంగారం నమ్మకమైన రక్షణగా" పెట్టుబడిదారులు భావిస్తున్నారని మోనెక్స్ గ్రూప్‌కు చెందిన జెస్పెర్ కోల్ చెప్పారు.

విదేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపైన ట్రంప్ ప్రభుత్వం సుంకాలను పెంచడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ఏర్పడ్డాయి. ఇది ఇన్వెస్టర్లను బంగారం లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించింది.

చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల మీద ట్రంప్ ప్రభుత్వం సుంకాలను 145 శాతానికి పెంచింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల మీద 125 శాతం పన్నులు విధించింది.

ఇతర దేశాల మీద అమెరికా విధించిన దిగుమతి సుంకాలను ప్రస్తుతం 90 రోజుల పాటు ఆపివేసినప్పటికీ, ఆ తర్వాత వాటిని అమలు చేస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి ఉంది.

తాము తీసుకున్న నిర్ణయాల వల్ల తయారీ సంస్థలు అమెరికాకు తిరిగి వస్తాయని, దీంతో స్థానికంగా ఉద్యోగాలు పెరిగి, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)