ఓదెల 2 మూవీ రివ్యూ: ‘శివశక్తికి, దుష్టశక్తికి మధ్య పోరాటం... నాగసాధువుగా తమన్నా ఊరిని రక్షించిందా?

ఫొటో సోర్స్, Sampath Nandi Team Works/insta
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
తమన్నా లీడ్ రోల్‌లో నటించిన ఓదెల -2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్‌కి ముందే ఈ సినిమాపై అంచనాలున్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో కొంత బజ్ క్రియేట్ అయ్యింది. ఆత్మకి, పరమాత్మకి నడుమ జరిగే సంఘర్షణ ఇతివృత్తం.
2022లో ఓటీటీలో రిలీజ్ అయిన ఓదెల రైల్వేస్టేషన్‌కి ఇది సీక్వెల్.
అది చూడని వాళ్లకి అర్థం కావడానికి కొంచెం టైమ్ పడుతుంది.
ఫస్ట్ పార్ట్ క్రైమ్ థ్రిల్లర్. ఒక సైకో కిల్లర్ కథ. హంతకుడు తిరుపతిని (వశిష్ట సింహ) అతని భార్య రాధ (హెబ్బాపటేల్) తల నరకడంతో సినిమా ముగుస్తుంది.

ఓదెల అనే ఊళ్లో ఫస్ట్ నైట్ జరిగిన మరుసటి రోజే అమ్మాయిలు రేప్ అండ్ మర్డర్‌కి గురవుతుంటారు.
ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసుని దర్యాప్తు చేస్తుంటాడు. అనేక మందిని అనుమానిస్తుంటాడు.
చివరికి హంతకుడి భార్యే తల నరికి, ఆ తలతో స్టేషన్‌కి చేరుకుంటుంది.

ఫొటో సోర్స్, Aditya Music/YT
ముగిసిన దగ్గరి నుంచే కథ ఆరంభం..
ఇక్కడి నుంచి ఓదెల-2 ప్రారంభం అవుతుంది.
పార్ట్-1 లాగే ఒక పదేళ్ల అమ్మాయి చేతిలో తలతో పోలీస్‌స్టేషన్‌కి చేరుకోవడం బిగినింగ్.
ఆ తల ఎవరిదంటే హెబ్బా పటేల్‌ది. ప్లాష్ బ్యాక్‌లోకి వెళితే...
ఓదెలలో అమ్మాయిలని క్రూరంగా చంపిన తిరుపతి మృతదేహానికి సమాధి శిక్ష వేయాలని గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. దీని వల్ల అతని ఆత్మ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.
గ్రామస్తులపై పగ తీర్చుకోడానికి ఆ ఆత్మ ఇతరుల్లో ప్రవేశించి శోభనం రోజు వధువుల్ని చంపుతూ వుంటుంది.

ఫొటో సోర్స్, Sampath Nandi Team Works
ఊరిని రక్షించడానికి భైరవి (తమన్నా) వస్తుంది. ఆమె ఆ ఊరి నుంచి చిన్నప్పుడే వెళ్లిపోయి నాగసాధువుగా మారి ఉంటుంది.
ప్రేతాత్మ నుంచి ఊరిని ఎలా కాపాడిందనేది మిగతా కథ.
ఈ మధ్య హిందీలో గ్రామీణ దెయ్యాల కథలు బాగా ఆడుతున్నాయి.
స్త్రీ పార్ట్ 1, 2 , ముంజా ఆడేసరికి , ఇదో సక్సెస్ ఫార్ములా మాదిరిగా అందరూ దీని వెంటపడుతున్నారు.
కాంతారా తర్వాత కథల్లోకి దేవున్ని లేదా పురాణాల్ని మిక్స్ చేస్తున్నారు.
ఇది కూడా శివశక్తికి , దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటం. తమన్నా అరుంధతిలా, తిరుపతి పశుపతిలా కనిపిస్తే మన తప్పుకాదు.
సెకండాఫ్‌లో అరుంధతి పార్ట్ 2 చూస్తున్నామేమో అని అనుమానం వస్తుంది.
ఊరి చుట్టూ గీత గీయడం విరూపాక్షని గుర్తు తెస్తుంది.

ఫొటో సోర్స్, Sampath Nandi Team Works
ఫస్టాఫ్ అంతా ఆత్మ ప్రతీకార హత్యలతో నడుస్తూ ఉండగా తమన్నాని ఒక ఫైట్‌తో పరిచయం చేసేసరికి, ఇక నుంచి కథ వేగంగా నడుస్తుందని అనిపిస్తుంది.
కానీ, సెకండాఫ్ కూడా ప్రిడిక్ట్‌బుల్ కథనంతో సాగుతుంది.
శివశక్తిగా గ్రామంలోకి వచ్చిన తమన్నా, తన శక్తులతో ఆత్మని కట్టడి చేస్తుందని ప్రేక్షకులు అనుకుంటారు.
ఇద్దరి మధ్య ఎత్తుకి పైఎత్తులతో సీన్స్ నడిస్తే ఎంగేజింగ్‌గా ఉండేది. యాక్షన్ సన్నివేశాలకు బదులు డైలాగ్‌ల యుద్ధమే ఎక్కువ నడుస్తుంది.
గోవు, శివుడి గురించి పెద్దపెద్ద డైలాగ్‌లు బహుశా హిందీ ప్రేక్షకుల కోసం కావొచ్చు.

ఫొటో సోర్స్, Sampath Nandi Team Works
సంపత్ నంది సుదీర్ఘ డైలాగులు
హారర్ సినిమా ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు. భయపడడానికే డబ్బులిస్తారు. ఈ సినిమా ఏ దశలోనూ భయపెట్టదు. ఎందుకంటే, అన్నీ ఆల్రెడీ ఎక్కడో చూసిన సన్నివేశాలుగా అనిపిస్తాయి.
రెండున్నర గంటలు ఓపిగ్గా కూర్చోవాలంటే సన్నివేశాల్లో బలం వుండాలి, నటులుండాలి. తమన్నా తప్ప, మిగతా వాళ్లకి ఎక్కడా నటించే అవకాశం లేదు. మురళిశర్మ వున్నా , ఎందుకు ఉన్నాడో తెలియదు.
గ్రాఫిక్స్ అక్కడక్కడ బాగున్నాయి. అజనీష్ బీజీఎం జస్ట్ ఓకే.
కథ, మాటలు , దర్శకత్వ పర్యవేక్షణ అన్నీ భుజాలపై వేసుకున్న సంపత్ నంది సుదీర్ఘ డైలాగులు సహనానికి పరీక్షే.
స్త్రీ సినిమా హిందీలో హిట్ కావడంతో ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు తప్ప, సీక్వెల్ తీయాల్సిన కథ కాదు.
ఇలాంటి కథల్లో లాజిక్‌లు అడక్కూడదు. చూసినంత సేపు బాగుంటే చాలు. కానీ, అదే కష్టం.
నాగసాధువుగా తమన్నా ఎలివేషన్స్ జాగ్రత్తగా రాసుకుని ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవాళ్లేమో!

ఫొటో సోర్స్, Aditya Music/YT
ప్లస్ పాయింట్స్:
1.తమన్నా
2.కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్:
1.నీరసమైన కథనం
2.అరుంధతి గుర్తుకురావడం
3.యాక్షన్ కంటే డైలాగ్‌లు ఎక్కువ కావడం
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














