జాక్ సినిమా రివ్యూ: 'రా' ఏజెంట్ అయిన హీరోపై హీరోయిన్ నిఘా, థ్రిల్ వర్కౌట్ అయిందా?

జాక్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, FB/svccofficial

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం

హాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్ సినిమాలు మొద‌లైన త‌ర్వాత, తెలుగులో ఆ ఒరవడికి నాంది పలికిన సినిమా గూఢచారి 116( 1966) కృష్ణ‌ని స‌క్సెస్‌ఫుల్ హీరోగా నిల‌బెట్టింది. ఆ త‌ర్వాత ఈ జాన‌ర్‌లో ఎన్నో సినిమాలు వ‌చ్చినా, స‌క్సెస్ రేట్ బాగా త‌క్కువ‌.

వ‌రుస హిట్ల‌తో ఉన్న సిద్దూ, వ‌రుస ఫ్లాప్‌ల‌తో ఉన్న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో రా ఏజెంట్ బ్యాక్‌డ్రాప్‌తో వ‌చ్చిన మూవీ జాక్..

క‌థ ఏమంటే ...

పాబ్లో నెరుడా అలియాస్ జాక్‌కి రా ఏజెంట్ కావాల‌నేది ఆశ‌యం. దీనికో బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. రా ఇంట‌ర్వ్యూకి కూడా వెళ్తాడు. జాబ్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ముందుగానే యాక్టివిటీకి దిగుతాడు. టెర్ర‌రిస్ట్ దాడిని నివారించ‌డం అత‌ని ల‌క్ష్యం. ఒక ఐపీఎస్ అధికారిని (సుబ్బ‌రాజు) తోడుగా క‌లుపుకుంటాడు.

కొడుకు వైఖ‌రి అంతుప‌ట్ట‌ని న‌రేశ్ ఒక డిటెక్టివ్ ఏజెన్సీని సంప్ర‌దిస్తాడు. ఏజెన్సీ య‌జ‌మాని బ్ర‌హ్మాజి కూతురు హీరోయిన్ వైష్ణ‌వి. ఆమె త‌న బృందంతో హీరో మీద నిఘా పెడుతుంది. ఇదో ఉప‌క‌థ‌.

"రా" అధిప‌తి మ‌నోజ్ (ప్ర‌కాశ్‌రాజ్‌). త‌న బృందంతో టెర్ర‌రిస్టుల దాడుల్ని ముందుగా తెలుసుకునే మిష‌న్ మీద ఉంటాడు. త‌న‌కి తెలియ‌కుండానే హీరో అడ్డు త‌గులుతూ ప్ర‌కాశ్‌రాజ్‌ని ఇబ్బంది పెడ‌తుంటాడు.

ఫైన‌ల్‌గా హీరో ల‌క్ష్యం నెర‌వేరిందా? తీవ్ర‌వాద నాయ‌కుడు అతావుర్ రెహ్మాన్ ప్లాన్ ఏంటి? కొంచెం తిక‌మ‌క‌గా అనిపించిందా? సినిమా కూడా అలాగే ఉంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జాక్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, Instagram/svccofficial

లవ్ ట్రాక్, టెర్రరిస్ట్ ఆపరేషన్...

కామెడీ టైమింగ్‌తో సినిమాని మొత్తం భుజాల మీద మోసే శ‌క్తి సిద్దూకి ఉంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌తో అది రుజువైంది. అయితే, ఆ రెండు సినిమాల్లో బ‌ల‌మైన క‌థ, ట్విస్టులున్నాయి. హీరోయిన్‌తో రొమాన్స్ వ‌ర్కౌట్ అయింది. క‌థ‌లో విష‌యం ఉంటే సిద్ధూ సునాయాసంగా లాగేస్తాడు.

క‌థ‌లో విష‌యం లేక, బ‌ల‌హీన‌మైన రైటింగ్‌, టేకింగ్ ఉంటే సిద్ధూ కూడా చేతులెత్తేయాల్సిందే. హీరోయిన్ ఎప్పుడూ సీరియ‌స్‌గా ఉండి (ఆ పాత్ర స్వ‌భావం) రొమాన్స్ కూడా చ‌తికిలప‌డింది. ప్ర‌కాశ్‌రాజ్ మంచి న‌టుడే, ఆ క్యారెక్ట‌ర్ ఏమిటో అర్థం కాక‌పోతే ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు?

ఏజెంట్ క‌థ‌ని కామెడీ చేయాల‌ని అనుకుంటే, మిస్ట‌ర్ బీన్‌లా బిగినింగ్ నుంచి అదే మూడ్ క్యారీ చేయాలి. ల‌వ్ ట్రాక్‌, టెర్ర‌రిస్ట్ ఆప‌రేష‌న్ అన్నీ కామెడీతోనే ట్రావెల్ చేయాలి. కాసేపు కామెడీ, కాసేపు సీరియ‌స్, అద‌నంగా దేశ‌భ‌క్తి అన్నీ క‌లిపి కిచిడీ చేయ‌డంతో ఆల్రెడీ ఎక్క‌డో చూసిన సినిమాలా అనిపిస్తుంటుంది.

జాక్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, FB/svccofficial

బొమ్మరిల్లు భాస్కర్ మెస్మరైజ్ చేశారా?

ఒక‌ప్పుడు బొమ్మ‌రిల్లు సినిమాతో ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేసిన భాస్క‌ర్ అక్క‌డే ఆగిపోయాడు.

కోవిడ్ త‌ర్వాత ప్ర‌పంచంలోని అన్ని ర‌కాల ఏజెంట్ల సినిమాల్ని, సీరిస్‌ను ప్రేక్ష‌కులు చూసేశారు. వాళ్ల‌ని థ్రిల్ చేయాలంటే రైటింగ్ చాలా బ‌లంగా ఉండాలి. ఊహ‌కి అంద‌కూడ‌దని ఆశిస్తారు. అందులోనూ రా అంటే రీసెర్చ్ అండ్ ఎనాల‌సిస్‌. ఈ రెండు ర‌చ‌న‌లో లోపించాయి.

నేపాల్‌లో జ‌రిగే స‌న్నివేశాల‌న్నీ అక్ష‌య్‌కుమార్ బేబీని గుర్తుకు తెస్తే మ‌న త‌ప్పు కాదు. ఒక ఐపీఎస్ ఆఫీస‌ర్ (సుబ్బ‌రాజు) అంత సుల‌భంగా హీరో మాట‌లు న‌మ్మేసి మూర్ఖుడు అయిపోతాడు. రా ఏజెంట్లంతా హీరో ముందు వెర్రివాళ్లు అయిపోతారు. పోనీ ఇదంతా కామెడీ అనుకుంటే, అక్క‌డ‌క్క‌డ సిద్దూ డైలాగ్‌లో త‌ప్ప‌, క్యారెక్ట‌ర్‌తో మిళిత‌మైన కామెడీ ఎక్క‌డుంది?

జాక్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, FB/svccofficial

ఏజెంట్‌గా సిద్ధూ మెప్పించాడా?

సిద్దూ బ‌ల‌మే కామెడీ. అయితే పంచ్ డైలాగ్‌ల‌తో సినిమాని బ‌తికించలేడు. క‌థ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ‌క‌పోతే క్రేజ్ మొత్తం లూజైపోతాడు.

ట్రైలర్‌లో ఉన్న ప‌చ్చి బూతులు సినిమాలో లేవు. సెన్సార్‌కి థాంక్స్ చెప్పాలి. వంట‌వాళ్లు ఎక్కువై కూర చెడ‌గొట్టిన‌ట్టు, ముగ్గురు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేసి ఒక మంచి పాట కానీ, బీజీఎం కానీ లేకుండా చేశారు. మన‌కి ఊర‌ట క‌లిగించే విష‌యం ఏమంటే ర‌న్‌టైమ్ 2 గంట‌ల 16 నిమిషాలు మాత్ర‌మే.

ప్ల‌స్ పాయింట్స్‌

1). సిద్దూ కామెడీ టైమింగ్‌

2) అక్క‌డ‌క్క‌డ పంచ్ డైలాగ్స్‌

మైన‌స్ పాయింట్స్‌

1) పూర్ రైటింగ్‌

2) స్లో నెరేష‌న్‌

3) మ్యూజిక్‌

ఫైన‌ల్‌గా డీజేగా వున్న‌పుడు ప్రేక్ష‌కుల్ని అల‌రించిన సిద్దూ ఏజెంట్‌గా మారి భ‌య‌పెట్టాడు.

రా గురించి తీసిన సినిమా, 'రా' గానే ఉంది.

గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)