మూవీ రివ్యూ: ‘పెళ్లి కాని ప్రసాద్’గా సప్తగిరి మెప్పించాడా?

ఫొటో సోర్స్, X/MeSapthagiri
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
హాస్యనటులు హీరోలు కావడం రేలంగి కాలం నుంచే వుంది. అయితే, ఎవరూ పెద్దగా నిలదొక్కుకోలేదు.
హిందీలో కూడా మెహమూద్, అస్రానీ ప్రయత్నించి విఫలమయ్యారు.
సప్తగిరి మంచి టైమింగ్ ఉన్న హాస్య నటుడు.
హీరో కావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇపుడు పెళ్లి కాని ప్రసాద్‌గా వచ్చాడు.


ఫొటో సోర్స్, X/MeSapthagiri
కథ ఏమంటే...
ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలోని ఒక స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తుంటాడు.
38 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. కారణం అతని తండ్రికి కట్నం మీద ఉన్న ఆశ.
తమ వంశంలో అందరూ కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారని, కొడుక్కి కూడా రూ.2 కోట్లు కట్నం కావాలని పట్టు పట్టి వుంటాడు.
దీనికి తోడు ఆయన వంశస్తులు శాసనాల గ్రంథమని కట్నంపైన ఒక రాజ్యాంగం కూడా రాసి వుంటారు.
హీరోయిన్ ప్రియ (ప్రియాంక శర్మ) అదే ఊళ్లో వుంటుంది. ఆమెకి అమ్మానాన్న, అమ్మమ్మ, పనివాడు వుంటారు.
వీళ్లందరికీ ఫారిన్ పిచ్చి, ఎలాగైనా విదేశాల్లో సెటిల్ అయిపోవాలని కోరిక.
ప్రియకి విదేశీ సంబంధం చేసి అందరూ ఆమెతో ఫారిన్ వెళ్లిపోవాలనుకుంటూ ఉంటారు.
హీరో మలేషియాలో వుంటాడు కాబట్టి, అతన్ని హీరోయిన్ ప్రేమలోకి దించి పెళ్లి చేసుకుంటుంది.
ఫస్ట్ నైట్ ఆమెకో నిజం తెలుస్తుంది. అదేమిటన్నదే సెకండాఫ్.

ఫొటో సోర్స్, X/MeSapthagiri
హాస్య నటులు హీరోలుగా వచ్చే సినిమాలపైన ప్రేక్షకులకి కొన్ని అంచనాలుంటాయి. ఫుల్ కామెడీ వుంటుందనే నమ్మకంతో వస్తారు. అయితే కామెడీ , హీరోయిజం రెండూ మిస్ అయితే నిరాశపడతారు. ఇక్కడ జరిగింది కూడా అదే.
సప్తగిరి నుంచి కామెడీ ఆశిస్తే , హీరో ఇంట్రో సాంగ్, స్టెప్పులు , సీరియస్ డైలాగ్‌లు ఎదురయ్యాయి.
ఈ లోపాన్ని మిగతా నటులైనా చక్కదిద్దారా అంటే అదీ లేదు.
వాళ్లు గట్టిగా అరుస్తూ ఏదోదే మాట్లాడుతూ వుంటారు. కొన్నిసార్లు టీవీ సీరియల్ చూస్తున్నామా? అని అనుమానం వస్తే అది మన తప్పుకాదు.

ఫొటో సోర్స్, X/MeSapthagiri
ఇంకో విషయం ఏమంటే పాత రొటీన్ పద్ధతిలో కథ చెబితే ఇపుడు ఎక్కదు. దానికితోడు సింగిల్ లేయర్ కథలకి కాలం చెల్లిపోయింది.
కథలో అనేక ఉపకథలు, మలుపులను కోరుకుంటున్నారు.
కరోనా తర్వాత ప్రేక్షకుడు మారిపోయాడు. ప్రపంచ సినిమా గురించి తెలుసు. అతన్ని మెప్పించడం సులభం కాదు.
పెళ్లి కాని ప్రసాద్ 1990 నాటి కథ. ఇపుడు వర్కవుట్ కాదు. ఒకసారి పాత్రల పరిచయం తరువాత, కథ అర్థమైపోతుంది.
కొత్తగా జరిగేదేమీ వుండదు. పాత్రలు పదేపదే అవే విషయాలు మాట్లాడి విసుగు తెప్పిస్తూ వుంటాయి.

ఫొటో సోర్స్, X/MeSapthagiri
హీరో కావాలనుకున్న సప్తగిరి, కామెడీకి దూరమయ్యాడు.
కామెడీ నటుడికి రెండు గంటల సినిమాని మోయడం అంత సులభం కాదు. కథలో దమ్ముండాలి. చుట్టూ బలమైన ప్యాడింగ్ వుండాలి.
ఈ వాస్తవాన్ని గుర్తించే అలీ మళ్లీ కామెడీ వైపు వచ్చాడు.
సునీల్ మళ్లీ కామెడీకి రాకుండా రకరకాల పాత్రల్లో స్థిరపడి సక్సెస్ సాధిస్తున్నాడు. వెన్నెల కిశోర్ హీరోగా ప్రయత్నిస్తూ గందరగోళంలో ఉన్నాడు.
నిజానికి సీనియర్ హాస్య నటులు అనేక మంది మృతి చెందడంతో తెలుగులో కామెడీ ఆర్టిస్టుల అవసరం చాలా వుంది.
జబర్దస్త్ ఆర్టిస్టులతో ఈ గ్యాప్ నింపుతున్నారు కానీ, వాళ్లెవరూ రాణించలేకపోతున్నారు.
దీనికి కారణం ఎపిసోడ్ కామెడీ వేరు, సినిమా కామెడీ వేరు. అది పది నిమిషాలు చూసి మరిచిపోతారు. దీన్ని కథలో భాగంగా చూస్తారు. అదీ తేడా.
సప్తగిరి ఇప్పటికైనా హీరోయిజం వదిలి కామెడీని నమ్ముకుంటే సేఫ్.
సినిమా ప్లస్ పాయింట్స్
ఏమీ లేవు
మైనస్ పాయింట్
అన్నీ అవే
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)














