మూవీ రివ్యూ: తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్-2 సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, YRF - Yash Raj Films/FB
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
వార్-2తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో ప్రముఖ బ్యానర్ యష్‌రాజ్ చోప్రా సమర్పణలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా?
ఇది వార్‌కి సీక్వెల్. అక్కడ టైగర్ ష్రాప్ , ఇక్కడ ఎన్టీఆర్. స్పై మిషన్ స్టోరీ.
కథ ఏంటంటే కబీర్ (హృతిక్) రా ఏజెంట్.
కలి అనే ప్రపంచ మాఫియా ముఠాలో చేరుతాడు.
కలి లక్ష్యం భారతదేశాన్ని బలహీనపరచడం, ప్రధానిని తొలగించడం.
దీని కోసం కబీర్ తన బాస్ కల్నల్ లూథ్రాని (అశుతోష్‌రాణా) చంపేస్తాడు.
కబీర్‌ని ఎదుర్కోడానికి విక్రమ్ (ఎన్టీఆర్) అనే కొత్త ఏజెంట్ వస్తాడు.
వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ఎవరు గెలిచారు, సింఫుల్‌గా ఇంతే కథ.


ఫొటో సోర్స్, YRF - Yash Raj Films/FB
ఈ టైప్ సినిమాల్లో కథని పెద్దగా కోరుకోకూడదు. యాక్షన్ సన్నివేశాలే నడిపించేస్తాయి. అయితే ఎమోషన్ అండర్ కరెంట్‌గా వుండాలి.
అపుడే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. లేదంటే వీడియో గేమ్ చూసిన ఫీల్ వస్తుంది.
వార్ విజయానికి కారణం హృతిక్ , టైగర్ ష్రాప్ మధ్య బలమైన సీన్స్ వున్నాయి.
ఒక ఉగ్రవాది కొడుకు దేశభక్తుడిగా మారడం అనే ఆసక్తికర కథనం వుంది.
అన్నిటికి మించి బలమైన విలన్ వున్నాడు.
వార్-2లో లోపించింది ఇదే.
ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నపుడు అంతే బలమైన విలన్ వుండాలి.
కలి అని ముఖాలు కనిపించని సమూహాన్ని చూపించి , హీరోలు ఎవరితో యుద్ధం చేస్తున్నారో కూడా ప్రేక్షకులకి తెలియకపోతే అంతా అయోమయంగా వుంటుంది.
కథ, కథనంలో లోపాలు సినిమా మూడ్‌ని దెబ్బతీశాయి.
ప్రారంభంలో హృతిక్ రోషన్ ఎంట్రీ అదిరిపోతుంది. తర్వాత ఎన్టీఆర్‌కి కూడా అదే రేంజ్ ఎలివేషన్.
తర్వాత రొటీన్ యాక్షన్ సీన్స్‌తో సినిమా డ్రాప్ అయింది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది.
ఫస్టాఫ్ పర్వాలేదు అనుకునేలోగా సెకెండాఫ్ రొడ్డ కొట్టుడు చైల్డ్ ఎపిసోడ్‌తో ప్రారంభమై సహనాన్ని పరీక్షిస్తుంది.
ఇది కాకుండా హృతిక్ రోషన్ లవ్ ప్లాష్‌బ్యాక్. అదో అనవసరం. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర కథలో కీలకంగా ఉంది.
తండ్రిని చంపింది తన ప్రియుడే అని తెలిసి, పగ తీర్చుకునే దిశగా కొంచెం ఎమోషన్ వర్కౌట్ చేయొచ్చు. అది కూడా వదిలేసి దర్శకుడు ఆమెను ఒక పాటకు పరిమితం చేసాడు.
అప్పుడప్పుడు గన్స్ పేల్చడం తప్ప ఆమె చేసిందేమీ లేదు.

ఫొటో సోర్స్, YRF - Yash Raj Films/FB
అనిల్ కపూర్ మంచినటుడు. గట్టిగా నాలుగైదు సన్నివేశాలు కూడా లేవు.
హృతిక్ రోషన్ క్యారెక్టర్ బలంగా ఉండటంతో పాటు స్క్రీన్ స్పేస్ ఎక్కువ.
ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో చాలా గందరగోళం వుంది. సెకండాఫ్‌లో అతను హీరోనా, విలనా అనేది అర్థం కాదు.
ఇద్దరు హీరోలు పోటాపోటీగా డ్యాన్స్ చేసిన పాట బాగుంది. ఫస్టాఫ్‌లో అభిమానుల్ని ఉత్సాహపరిచిన ఎన్టీఆర్, సెకెండాఫ్‌లో నిరాశపరుస్తాడు. మొత్తానికి ఇది జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ తరహాలో యాక్షన్ సన్నివేశాల మధ్య కొంచెం, కొంచెం కథ వస్తూ వుంటుంది.
హీరోలు అనేక దేశాల్లో తిరుగుతూ విమానం, షిప్, రైలు ఇలా దేన్నీ లెక్క చేయకుండా ఎగిరి దూకుతూ వుంటారు. డైరెక్టర్ కంటే స్టంట్ డైరెక్టర్లదే ఎక్కువ శ్రమ. హీరోలకి బుల్లెట్, కత్తి ఇంకా చాలా రకాల పదునైన ఆయుధాలతో రక్తగాయాలు అవుతూ ఉంటాయి, అయినా చలించరు. లాజిక్ అడగడం కరెక్ట్ కూడా కాదు.
సినిమాలో కీలకంగా ఉండాల్సిన వీఎఫ్ఎక్స్ అక్కడక్కడ తేలిపోయినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా ట్రైన్ సీన్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన పని లేదు.
ఖర్చుకి వెనకాడలేదు. కెమెరా, సంగీతం బాగుంది .
171 నిమిషాల నిడివి కొంచెం ఇబ్బందే.
ఎడిటర్ కత్తెర తీసినట్టు లేడు, చైల్డ్ ఎపిసోడ్ తగ్గిస్తే కొంచెం రిలీఫ్‌గా వుండేది.

ఫొటో సోర్స్, YRF - Yash Raj Films
ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే కొన్ని సన్నివేశాల్లో అభిమానులకి గూస్‌బంప్స్ ఖాయం. అయితే ఈ రకమైన బాలీవుడ్ ఎంట్రీ వల్ల పెద్ద ఉపయోగం వుండదు.
కాలర్ ఎగరేసే సినిమా మాత్రం కాదు.
ప్లస్ పాయింట్స్ః
1.హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్
2.యాక్షన్ సన్నివేశాలు
3.కెమెరా, ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ః
1.కథ, కథనాలు
2.బలమైన విలన్ లేకపోవడం
3.సీన్స్ ఎక్కడో చూసినట్టు అనిపించడం
మంచి బిర్యానీ వండాలంటే అద్భుతమైన మసాలా దినుసులుంటే చాలదు. ఎంతోకొంత చికెన్ , నాణ్యమైన బియ్యం వుండాలి. వార్-2లో మసాలాలు దంచి, ఎమోషన్ మరిచిపోయారు.
అభిమానులకి నచ్చవచ్చు. ఒకసారి చూడొచ్చు.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














