అత్యాచారం కేసులో ఎంపీ రేవణ్ణ ప్రైవేటు భాగాల ఫోటోలు ఎందుకు తీశారు, దీని ద్వారా నేరాన్ని ఎలా నిరూపించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు అత్యాచారం కేసులో ఇటీవలే జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను నిరూపించడానికి ఈ కేసును దర్యాప్తు చేసిన బృందం ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించింది.
అదే 'మల్టీ-లెవల్ డిజిటల్ కంపారిజన్ సిస్టమ్'
నిందితుడి శరీరంలోని ఒక భాగంలో ఉన్న ప్రత్యేక గుర్తులు, గొంతు, డీఎన్‌ఏలను పోల్చి గుర్తించడం ఇందులోని ప్రత్యేకత.
తుర్కియేలో పిల్లలపై లైంగిక వేధింపులు, హింసాత్మక కంటెంట్‌కు సంబంధించిన కేసులో మొదటగా ఉపయోగించిన టెక్నాలజీని ప్రజ్వల్ రేవణ్ణ కేసు విచారణలో సిట్ ఉపయోగించింది.
జపాన్‌లోని ఒక రీసెర్చ్ పేపర్‌లో కూడా ఈ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు.
దర్యాప్తు సమయంలో, ఫోరెన్సిక్ బృందం వీడియోలు, ఫోటోలను కూడా తీసింది. తరువాత దర్యాప్తు బృందం ప్రజ్వల్ రేవణ్ణ ప్రైవేట్ భాగాలు, గొంతును, తాము తయారు చేసిన వీడియోతో పోల్చి పరిశీలించింది.
ఇది వేలిముద్రలను పోల్చి చూసే విధానంలా ఉందని ఒక అధికారి అన్నారు.
48 ఏళ్ల వయసున్న పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది.
''ఈ నేరాన్ని స్త్రీలను పూజించే మొత్తం సమాజంపై జరిగిన నేరంగా పరిగణించవచ్చు'' అని తీర్పు ప్రకటిస్తూ కోర్టు వ్యాఖ్యానించింది.


ఫొటో సోర్స్, Getty Images
నాలుగు విషయాల ద్వారా గుర్తించారు
హసన్ జిల్లా హోలెనరసిపూర్‌లోని తన ఫ్యామిలీ ఫామ్‌హౌస్, బెంగళూరు బసవనగుడిలోని తన ఇంట్లో ఆ మహిళపై అత్యాచారానికి సంబంధించి తీసిన వీడియోలలో ప్రజ్వల్ రేవణ్ణ తన ముఖాన్ని కనపడనివ్వలేదు.
కానీ, సిట్ అనుసరించిన దర్యాప్తు పద్ధతి వల్ల ప్రజ్వల్ రేవణ్ణ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
తుర్కియే కేసులో, జపాన్‌లో జరిగిన పరిశోధన అధ్యయనంలో ఉపయోగించిన పద్ధతులను అనుసరించడం ద్వారా సిట్ ఆయన నేరాన్ని నిరూపించింది.
"శరీరంపై ఎన్ని ఎక్కువ గుర్తులు ఉంటే, ఓ వ్యక్తి ముఖం కనిపించకపోయినా, ఫోటోలు, వీడియోల ద్వారా నిర్ధరించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. ప్రజ్వల్ రేవణ్ణ ప్రైవేట్ భాగాలపై గాయాల గుర్తులు ఉన్నాయి" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి తెలిపారు.

ఫొటో సోర్స్, ani

ఆధునిక పద్ధతుల్లో దర్యాప్తు
"ఈ కేసును నిరూపించడానికి గుర్తింపుకు సంబంధించి నాలుగు వేర్వేరు విషయాలున్నాయి. మొదటి గుర్తింపు డీఎన్ఏ, రెండోది వాయిస్, మూడోది శరీరంపై గుర్తులు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఇప్పటికే అందుబాటులో ఉంది. అదే ఈ కేసుకు ఇది చాలా ముఖ్యమైనది'' అని సిట్ చీఫ్, అడిషనల్ డీజీపీ బీకే సింగ్ బీబీసీకి చెప్పారు.
జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్య కేసును దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సిట్‌కి కూడా బీకే సింగ్ నాయకత్వం వహించారు.
ఈ దర్యాప్తు గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బుర్గి కేసుల్లో కూడా ఉపయోగపడింది.
స్పష్టమైన దర్యాప్తు కోసం శాస్త్రీయ దర్యాప్తు ఆధునిక పద్ధతులను అవలంబించినందుకు న్యాయమూర్తి సిట్‌ని ప్రశంసించారు.
తుర్కియే కేస్ స్టడీలో, ఇద్దరు నిందితులు 12 ఏళ్ల బాలికపై లైంగిక హింసకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దర్యాప్తులో పుట్టుమచ్చ, ఇతర మచ్చలు, శరీర నిర్మాణం అనుమానితుడి ప్రైవేట్ భాగాలతో సరిపోలుతున్నాయని తేలింది. మిగిలిన పోలికలు ఎలాగూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, FB/Prajwal Revanna
అత్యాచారం జరిగిన సమయంలో మహిళ కట్టుకున్న చీర
రేవణ్ణ కేసు విషయానికొస్తే ఫామ్‌హౌస్‌లోని సర్వెంట్ క్వార్టర్స్‌లో మహిళపై మొదటిసారి అత్యాచారం జరిగినప్పుడు, బాధితురాలు తన దుస్తులలో కొన్నింటిని అక్కడే వదిలేశారు.
ఆ వస్త్రం ఫోరెన్సిక్ బృందానికి కూడా చాలా సహాయపడిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక దర్యాప్తు అధికారి తెలిపారు. దానిపై లభించిన వీర్యం నిందితుడి వీర్యంతో సరిపోలింది.
రేవణ్ణ వేళ్లు, అరచేతులు, పాదాల ఫోటోలు, వీడియోలను యూరాలజిస్ట్, చర్మవ్యాధి నిపుణులు, ఆర్థోపెడిస్ట్‌తో కూడిన బృందానికి పంపారు.
ఆ బృందం దర్యాప్తు చేసి, ఆ వీడియో, ఫోటోలు నిందితుడివేనని నిర్ధరించింది.
నిందితుడి ప్రైవేట్ భాగాల ఫోటోలు తీయాలన్న పోలీసు అధికారుల అభ్యర్థనను వైద్యులు మొదట తిరస్కరించారు.
ఇది వైద్య నీతికి విరుద్ధమని డాక్టర్లు చెప్పారని, కానీ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత వైద్యులు అంగీకరించారని ఒక అధికారి తెలిపారు.
తరువాత రెండు ఫోటోలను పోల్చి పరిశీలించారు. రెండు ఫోటోలు ఒకే వ్యక్తివి అని ఈ ఆధారాలు బలంగా సూచిస్తున్నాయని తన 480 పేజీల తీర్పులో జడ్జి చెప్పారు.
"నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ బలవంతపు లైంగిక దాడిని వీడియో తీశారని ప్రాసిక్యూషన్ నిరూపించింది. మహిళపై ఒత్తిడి తీసుకురావడానికి నిందితుడు ఈ సంఘటనలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారని కూడా నిరూపితమైంది. ప్రాసిక్యూషన్ నిరూపించిన విషయం సందేహానికి అతీతమైనది" అని న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ అన్నారు.
"డిజిటల్ సాక్ష్యంగా కోర్టులో సమర్పించిన వీడియో రికార్డులను ఎడిట్, మార్ఫింగ్ చేయనివని కూడా ప్రాసిక్యూషన్ నిరూపించింది. వీడియోలోని పురుషుడు, స్త్రీల గొంతులు నిందితుడు, బాధితురాలి గొంతు నమూనాలతో సరిపోలుతున్నాయి" అని కోర్టు తెలిపింది.
"మహిళను పదే పదే అత్యాచారం చేయడం హత్యకంటే పెద్ద నేరం" అని కోర్టు వ్యాఖ్యానించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














